"ఈ పాటలను చదవడానికి ఎవరినైనా తీసుకురండి, ఆపై నేను వాటికి బాణీ కట్టి మీ కోసం మళ్లీ పాడతాను" అని దాదూ సాల్వే మాతో చెప్పారు.
డెబ్బై ఏళ్ళు దాటిన అంకితభావం కలిగిన ఈ అంబేద్కర్‌వాద ఉద్యమ సైనికుడు, అసమానతపై పోరాడటానికి, నిర్ణయాత్మకమైన సామాజిక మార్పుకు నాంది పలికేందుకు తన స్వరాన్ని ఉపయోగించేందుకూ, తన హార్మోనియంను వాయించేందుకూ సిద్ధంగా ఉన్నారు.
అహ్మద్‌నగర్ నగరంలో ఉండే ఈయన ఒంటిగది ఇంటిలో, ఒక జీవితకాలపు సంగీతపు నివాళులు మనముందు ఆవిష్కృతమవుతాయి. అతని గురువు, ప్రసిద్ధ భీమ్ శాహిర్, వామన్‌దాదా కర్డక్ ఫ్రేము కట్టిన ఫొటొ ఒకటి గోడలోనున్న అరమరను అలంకరించి ఉంది. ఆ అరమరలోనే ఆయన నమ్మకమైన సహచరులైన హార్మోనియం, తబలా, ఢోలకీ కూడా ఉన్నాయి.
ఆరు దశాబ్దాలకు పైగా తాను గానం చేస్తోన్న భీమ్ సంగీతం గురించి వివరించేందుకు దాదూ సాల్వే సిద్ధమయ్యారు.
సాల్వే 1952, జనవరి 9న మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ (అహ్మెద్‌నగర్ అని కూడా రాయవచ్చు) జిల్లా, నాలేగాఁవ్ (గౌతమ్‌నగర్ అని కూడా పిలుస్తారు) లో పుట్టారు. ఆయన తండ్రిగారైన నానా యాదవ్ సాల్వే సైన్యంలో పనిచేశారు. ఆయన తల్లిగారైన తులసాబాయి ఇల్లు చూసుకుంటూ కూలి పనులకు వెళ్తుండేవారు.
బ్రిటిష్ సైన్యంలో పనిచేసిన ఆయన తండ్రి లాంటి వ్యక్తులు దళితుల మనస్తత్వంలో మార్పు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. సురక్షితమైన వేతనాలు, సరైన భోజనంతో కూడిన స్థిరమైన ఉద్యోగం క్రమబద్ధమైన విద్యను నేర్చుకొని ప్రపంచానికి ఒక కిటికీగా పనిచేసే సౌకర్యాన్ని వారికి అందించింది. ఇది వారి దృక్పథాన్ని మార్చింది, అణచివేతతో పోరాడటానికీ, ప్రతిఘటించడానికీ మెరుగైన సంసిద్ధతనూ ప్రేరణనూ వారు పొందారు.
దాదూ తండ్రిగారు సైన్యం నుంచి విరమించుకొని భారత తపాలా శాఖలో పోస్ట్‌మాన్‌గా ఉద్యోగంలో చేరారు. ఆ రోజులలో మహా ఉధృతంగా పనిచేస్తోన్న అంబేద్కర్ ఉద్యమంలో ఆయన చాలా చురుకుగా పాల్గొనేవారు. తన తండ్రిగారు చురుకుగా పనిచేస్తుండటం వలన దాదూ ఆ ఉద్యమాన్ని దగ్గరగా చూసి, దాని గురించి బాగా అర్థంచేసుకోగలిగారు.
అతని తల్లిదండ్రులవలనే కాకుండా, కుటుంబంలోని మరొక వ్యక్తి, కడూబాబా అని పిలిచే అతని తాత యాదవ్ సాల్వే ద్వారా కూడా దాదూ ప్రభావితులయ్యారు.
విదేశాల నుండి వచ్చిన ఒక పరిశోధకురాలు "అంత పొడవాటి గడ్డాన్ని ఎందుకు పెంచుతున్నారు?" అని గడ్డంతో ఉన్న ఒక వృద్ధుడిని అడిగిన కథను దాదూ మాకు చెప్పారు. అప్పుడా 80 ఏళ్ల వృద్ధుడు ఏడుపు ప్రారంభించారు; ఆ తరువాత శాంతించిన ఆ వృద్ధుడు తన కథను ఆమెకు చెప్పారు.
“బాబాసాహెబ్ అంబేద్కర్ అహ్మద్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మా గ్రామమైన హరేగాఁవ్‌కి రావాలని నేనాయనను అభ్యర్థించాను. అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయనను చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు." కానీ బాబాసాహెబ్‌కు సమయం లేదు కాబట్టి, తాను మరోసారి వారి గ్రామానికి వస్తానని ఆ వృద్ధుడికి వాగ్దానం చేశారు. బాబాసాహెబ్ తన గ్రామాన్ని సందర్శించినప్పుడు మాత్రమే గడ్డం గీస్తానని ఆ వ్యక్తి ప్రమాణం చేశారు.
ఆయన అనేక సంవత్సరాల పాటు ఎదురుచూస్తూ ఉంటుండగానే, ఆయన గడ్డం కూడా పెరిగిపోయింది. 1956లో బాబాసాహెబ్ మరణించారు. "గడ్డం అలా పెరుగుతూనే ఉంది. నేను చనిపోయేంతవరకూ పెరుగుతూనే ఉంటుంది," అని ఆ వృద్ధుడు చెప్పారు. ఆ పరిశోధకురాలు, అంబేద్కర్ ఉద్యమం గురించి పరిశోధించిన ప్రసిద్ధ విద్యావంతురాలు ఎలెనార్ జెలియట్; ఆ వృద్ధుడే దాదూ సాల్వే తాతగారైన కడూబాబా.
*****
దాదూకు ఐదు రోజుల వయస్సు ఉన్నప్పుడే కంటి చూపు పోయింది. ఎవరో ఆయన రెండు కళ్ళల్లో చుక్కల మందు వేశారు, అది అతని కంటి చూపుకు తీవ్ర నష్టం కలిగించింది. ఏ చికిత్స పనిచేయలేదు, అతను మళ్ళీ చూడలేకపోయారు. ఇంటికే పరిమితమై, పాఠశాల విద్యకు దూరమయ్యారు.
అతను తన చుట్టుపక్కల నివసించే ఏక్‌తారీ భజనల గాయకులతో చేరి, చెక్క, తోలు, లోహంతో తయారుచేసే వాయిద్యమైన దిమ్డీని వాయించేవారు.
"ఎవరో వచ్చి బాబాసాహెబ్ మరణించారని ప్రకటించడాన్ని నేను విన్నాను. ఆయనెవరో నాకు తెలియదు కానీ ప్రజల ఏడుపులు విన్న తర్వాత, ఆ చనిపోయినవారెవరో చాలా గొప్పవారనే సంగతి నాకర్థమయింది," అని దాదూ గుర్తుచేసుకున్నారు.
బాబాసాహెబ్ దీక్షిత్ అహ్మద్‌నగర్‌లో దత్తా గాయన్ మందిర్ అనే సంగీత పాఠశాలను నడిపారు, కానీ దాదూకు అక్కడి ఫీజును భరించే స్తోమత లేదు. ఆ సమయంలో, రిపబ్లికన్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే, ఆర్.డి. పవార్ ఆర్థిక సహాయం అందించడంతో, దాదూ అందులో చేరగలిగారు. పవార్ ఆయనకు సరికొత్త హార్మోనియంను కూడా కొన్నారు. దాదూ 1971లో సంగీత విశారద్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.
ఆ తర్వాత అతను ఆ కాలంలోని ప్రఖ్యాత ఖవ్వాలీ సంగీత విద్వాంసుడు మెహమూద్ ఖవ్వాల్ నిజామీ వద్ద చేరి, ఆయన కార్యక్రమాలలో పాడటం ప్రారంభించారు. అప్పటికి దాదూకి అదే ఆదాయ వనరు. తర్వాత ఆయన సంగమ్‌నేర్‌కు చెందిన కామ్రేడ్ దత్తా దేశ్‌ముఖ్ ప్రారంభించిన కళా పథక్ అనే మరో బృందంలో చేరారు. ఆయన మరొక సహచరుడు భాస్కర్ జాదవ్ దర్శకత్వం వహించిన వాసుదేవచా దౌరా అనే నాటకానికి పాటలు కూడా స్వరపరిచారు.
లోక్ - కవి లేదా ప్రజా కవి అని ప్రసిద్ధి చెందిన కేశవ్ సుఖా అహెర్‌ను కూడా దాదూ వినేవారు. నాసిక్‌లోని కళారామ్ మందిర్‌లోకి వెళ్ళనివ్వకుండా ఉన్న నిషేధానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల బృందానికి అహెర్ తోడుగా ఉన్నారు. అతను తన పాటల ద్వారా అంబేద్కర్ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. భీమ్‌రావ్ కర్డక్ జల్సా విన్న తర్వాత అహెర్, కొన్ని పాటలు రాయడానికి ప్రేరణ పొందారు.
ఆ తరువాతి కాలంలో జల్సా కే అంకితమైపోయిన అహెర్ తన పాటల ద్వారా దళితుల చైతన్యాన్ని పెంపొందించడానికి పూర్తి సమయాన్ని కేటాయించారు.
అంబేద్కర్ 1952లో, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అభ్యర్థిగా బొంబాయి నుంచి సాధారణ ఎన్నికల్లో పోటీ చేశారు. అహెర్ ‘నవ్ భారత్ జల్సా మండల్’ను ప్రారంభించి, జల్సా కోసం కొత్త పాటలు రాసి, డాక్టర్ అంబేద్కర్ కోసం ప్రచారం చేశారు. ఈ మండలి నిర్వహించిన కార్యక్రమాలను గురించి దాదూ సాల్వే విన్నారు.
స్వాతంత్ర్యం వచ్చే సమయంలో అహ్మద్‌నగర్ వామపక్ష ఉద్యమానికి కంచుకోటగా ఉండేది.“అనేకమంది నాయకులు మా ఇంటికి తరచుగా వస్తుండేవారు, మా నాన్న వారితో కలిసి పనిచేశారు. ఆ కాలంలో దాదాసాహెబ్ రూపావతే, ఆర్.డి.పవార్ వంటివారు అంబేద్కర్ ఉద్యమంలో చాలా చురుకుగా ఉన్నారు. వారు అహ్మద్‌నగర్‌లో ఉద్యమానికి నాయకత్వం వహించారు." అంటారు దాదూ సాల్వే.
దాదూ కూడా బహిరంగ సభలకు హాజరయ్యేవారు, బి.సి. కాంబ్లే, దాదాసాహెబ్ రూపావతే ప్రసంగాలను వినేవారు. తరువాత ఈ ఇద్దరు ప్రముఖుల మధ్య వచ్చిన విభేదాలు అంబేద్కర్ ఉద్యమంలో రెండు వర్గాలు ఏర్పడడానికి దారితీశాయి. ఈ రాజకీయ సంఘటన ఎన్నో పాటలు రావడానికి దోహదం చేసింది. దాదూ ఇలా అంటారు, “ కల్గి - తురా లో (ఒక సమూహం పాట రూపంలో ఒక ప్రశ్న లేదా ప్రకటన చేసినప్పుడు, మరో సమూహం దానికి సమాధానం ఇవ్వడమో / ఆ ప్రకటనను తిప్పికొట్టడమో చేసే పాటలు]లో ఈ రెండు వర్గాలు మంచిగా ఉండేవి.”
लालजीच्या घरात घुसली!!
వృద్ధాప్యంలో మతితప్పిన ఆ మహిళ
లాల్జీ ఇంట్లోకి ప్రవేశించింది!
దాదాసాహెబ్ మతిస్థిమితం కోల్పోయి కమ్యూనిస్టులలో చేరారని ఇక్కడ సూచిస్తున్నారు
దాదాసాహెబ్ వర్గంవారు ఇలా జవాబిచ్చారు:
तू पण असली कसली?
पिवळी टिकली लावून बसली!
నిన్ను నువ్వు చూసుకో ఓ మహిళా!
నీ నుదిటిపైనున్న ఆ పసుపు బొట్టు!
దాదూ ఇలా వివరించారు: “బి.సి. కాంబ్లే పార్టీ జెండాపై ఉన్న నీలిరంగు అశోక్ చక్రం స్థానంలో పసుపు రంగులో ఉన్న నిండు పున్నమి చంద్రుడిని పెట్టారు. ఇది దానికి సూచన."
దాదాసాహెబ్ రూపావతే బి.సి. కాంబ్లే వర్గంలో ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనపై కూడా ఒక పాట రూపంలో విమర్శలు గుప్పించారు.
अशी होती एक नार गुलजार
अहमदनगर गाव तिचे मशहूर
टोप्या बदलण्याचा छंद तिला फार
काय वर्तमान घडलं म्होरं S....S....S
ध्यान देऊन ऐका सारं
ఒక చక్కని యువ మహిళ
ప్రసిద్ధ అహ్మద్‌నగర్
పట్టణం నుండి వచ్చినది
ఆమె తన శిబిరాన్ని మార్చేందుకు
ఇష్టపడింది
తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా?
చక్కగా విని అన్నీ తెలుసుకోండి...
"నేను అంబేద్కర్ ఉద్యమపు ఈ కల్గీ - తురా ను వింటూ పెరిగాను" అని దాదూ చెప్పారు.
*****
1970 సంవత్సరం దాదూ సాల్వే జీవితంలో ఒక మూలమలుపు. డాక్టర్ అంబేద్కర్ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ఉద్యమాన్ని మహారాష్ట్రలోని మారుమూల ప్రదేశాలకూ, వెలుపలకూ కూడా తీసుకెళ్తున్న గాయకుడు వామన్‌దాదా కర్దక్‌ను ఆయన కలిశారు. తన చివరి శ్వాస వరకు వామన్‌దాదా అదే పని చేశారు
వామన్‌దాదా కర్డక్‌కు సంబంధించిన విషయసేకరణను చేస్తున్న 75 ఏళ్ళ మాధవరావ్ గైక్వాడ్, దాదూ సాల్వేను వామన్‌దాదా వద్దకు తీసుకువెళ్ళారు. మాధవరావ్, ఆయన భార్య సుమిత్ర (61) వామన్‌దాదా స్వయంగా చేతిరాతతో రాసిన 5,000కు పైగా పాటలను సేకరించారు.
మాధవరావు ఇలా అంటారు, “అతను 1970లో నగర్‌కు వచ్చాడు. అంబేద్కర్ పనినీ, సందేశాన్నీ ప్రచారం చేయడానికి గాయన్ (గానం) బృందాన్ని ప్రారంభించాలని చాలా ఆసక్తిగా ఉన్నాడు. దాదూ సాల్వే అంబేద్కర్ గురించి పాడేవాడు, కానీ ఆయన దగ్గర ఎన్నో మంచి పాటలు లేవు. కాబట్టి, మేం వెళ్ళి వామన్‌దాదాను కలుసుకుని, ‘మాకు మీ పాటలు కావాలి’ అని అడిగాం."
నిజానికి తాను రాసినవేవీ ఒక చోట భద్రపరచలేదని వామన్‌దాదా వీరికి చెప్పారు. "నేను రాస్తాను, ప్రదర్శిస్తాను, దాన్ని అక్కడే వదిలేస్తాను."
"అంత గొప్ప సంపద వ్యర్థంగా పోవటం చూసి మాకు చాలా బాధకలిగింది. ఆయన (వామన్‌దాదా) తన జీవితాన్నంతటినీ అంబేద్కర్ ఉద్యమానికే అంకితం చేశారు." అని మాధవరావ్ గుర్తుచేసుకున్నారు.
అతని పనిని భద్రపరచాలనే ఆసక్తితో మాధవరావు దాదూ సాల్వేని వామన్‌దాదా ప్రదర్శనలు ఇస్తున్న ప్రతిచోటికీ తీసుకెళ్లడం ప్రారంభించారు: “దాదూ హార్మోనియంతో సహకరిస్తుండగా వామన్‌దాదా పాడుతున్న పాటలను నేను రాసేవాడిని. ఇదంతా కార్యక్రమం జరుగుతున్నప్పుడే జరిగిపోయేది."
ఆయన 5,000 కంటే ఎక్కువ పాటలనే ప్రచురించారు. అయినప్పటికీ, నేటికీ వెలుగు చూడని పాటలు దాదాపు 3,000 వరకూ ఉన్నాయి. "నాకున్న ఆర్థిక పరిమితుల కారణంగా నేనాపని చేయలేకపోయాను. కానీ దాదూ సాల్వే వల్లనే నేను అంబేద్కర్ ఉద్యమానికి సంబంధించిన ఈ జ్ఞానాన్ని, ఎరుకనూ కాపాడుకోగలిగాను,” అని ఆయన చెప్పారు.
దాదూ సాల్వే వామన్‌దాదా పని నుండి చాలా ప్రేరణ పొందారు. అతను కూడా కళా పథక్ అనే పేరుతో కొత్త బృందాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అతను శంకర్ తబాజీ గైక్వాడ్, సంజయ్‌నాథ జాదవ్, రఘు గంగారామ్ సాల్వే, మిళింద్ షిండేలను ఒకచోటకు చేర్చారు. ఈ బృందాన్ని భీమ్ సందేశ్ గాయన్ పార్టీ అని పిలుస్తారు, అంటే అంబేద్కర్ సందేశాన్ని వ్యాప్తి చేసే సంగీత బృందం అని అర్థం.
వారు ఒక లక్ష్యాన్ని నెరవేర్చడానికి పాడేవారు కావడంతో వారి ప్రదర్శనలు ఎవరి పట్ల ఎలాంటి ద్వేషం లేకుండా సూటిగా సాగేవి
దాదూ మాకోసం ఈ పాటను పాడారు:
उभ्या विश्वास ह्या सांगू तुझा संदेश भिमराया
तुझ्या तत्वाकडे वळवू आता हा देश भिमराया || धृ ||
जळूनी विश्व उजळीले असा तू भक्त भूमीचा
आम्ही चढवीला आता तुझा गणवेश भिमराया || १ ||
मनुने माणसाला माणसाचा द्वेष शिकविला
तयाचा ना ठेवू आता लवलेश भिमराया || २ ||
दिला तू मंत्र बुद्धाचा पवित्र बंधुप्रेमाचा
आणू समता हरू दीनांचे क्लेश भिमराया || ३ ||
कुणी होऊ इथे बघती पुन्हा सुलतान ह्या भूचे
तयासी झुंजते राहू आणुनी त्वेष भिमराया || ४ ||
कुणाच्या रागलोभाची आम्हाला ना तमा काही
खऱ्यास्तव आज पत्करला तयांचा रोष भिमराया || ५ ||
करील उत्कर्ष सर्वांचा अशा ह्या लोकशाहीचा
सदा कोटी मुखांनी ह्या करू जयघोष भिमराया || ६ ||
कुणाच्या कच्छपी लागून तुझा वामन खुळा होता
तयाला दाखवित राहू तयाचे दोष भिमराया || ७ ||
నీ సందేశాన్ని ప్రపంచానికి తెలియజేద్దాం భీమరాయా
వారందరినీ నీ సూత్రాలవైపు మళ్ళేలా చేద్దాం భీమరాయా ||1||
ఓ భూమి పుత్రుడా, నీవు ప్రజ్వలించి విశ్వాన్ని ప్రకాశవంతం చేశావు
ఇదిగో మేమిప్పుడు నిన్ను అనుసరించి నీ దుస్తులను ధరించాం (శిష్యులుగా మారాం), భీమరాయా ||2||
ఇతర పురుషులను ద్వేషించమని మనువు మనకు నేర్పించాడు
ఇప్పుడతనినే నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ తీసుకున్నాం భీమరాయా ||3||
మీరు మాకు బుద్ధుని సోదరత్వాన్ని గురించి బోధించారు
మేం సమానత్వాన్ని తెచ్చి పేదలను బాధల నుంచి విముక్తి చేస్తాం భీమరాయా ||4||
ఈ భూమిని మళ్లీ పరిపాలించాలని కొందరు ప్రయత్నిస్తున్నారు
మా శక్తి అంతటితోనూ మేం పోరాడతాం భీమరాయా ||5||
వాళ్ళు సంతోషంగా ఉన్నా కోపంగా ఉన్నా మేం పట్టించుకోం
మా సత్యాన్ని నొక్కిచెప్పడానికి మేం (సిద్ధంగా ఉండి) వారి ఆగ్రహాన్ని ఆహ్వానిస్తాం, భీమరాయా ||6||
వారి మాటల్లో చిక్కుకుపోవడానికి వామన్ (కర్డక్) ఏమైనా మూర్ఖుడా?
వారికి మేం ప్రతిఫలనాన్ని చూపిస్తూనే ఉంటాం భీమరాయా ||7||
దాదూను ప్రదర్శనకు పిలిచినప్పుడల్లా వామన్‌దాదా పాటలు పాడతారు. పిల్లలు పుట్టడం నుంచి వృద్ధులు లేదా అస్వస్థతతో ఉన్నవారు మరణించడం వరకూ- అన్ని కుటుంబ కార్యక్రమాలు, సంఘటనల సమయంలో అంబేద్కర్ ఉద్యమ పాటలు పాడటానికి ప్రజలు ఆయన బృందమైన కళా పథక్‌ను పిలుస్తారు.
దాదూ లాంటి వారు అంబేద్కర్ ఉద్యమానికి దోహదపడేందుకే పాటలు పాడారు. ఈ గానబృందం ఎలాంటి డబ్బుల కోసం ఆశించలేదు. ప్రశంసాపూర్వకంగా ప్రజలు ప్రధాన ప్రదర్శకుడికి కొబ్బరికాయను ఇచ్చి, కళాకారులందరికీ టీ అందిస్తారు. అంతే! "నేను పాడగలను కాబట్టే పాటను ఈ ఉద్యమానికి నా సహకారంగా నేను ఎంచుకున్నాను. నేను వామన్‌దాదా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికే ప్రయత్నిస్తాను,” అని దాదూ చెప్పారు.
*****
వామన్‌దాదా మహారాష్ట్రలోని అనేకమంది గాయకులకు గురువు, కానీ దాదూ జీవితంలో ఆయనకొక ప్రత్యేక స్థానం ఉంది. కంటిచూపు లేని దాదూకి ఆయన పాటలను భద్రపరచడానికున్న ఏకైక మార్గం- వాటిని వినడం, వాటిని గుర్తు ఉండేలా కంఠస్తం చేయటం. అతనికి 2,000 కంటే ఎక్కువే పాటలు తెలుసు. పాట మాత్రమే కాదు, ఆ పాట గురించిన ప్రతి వివరం- అది ఎప్పుడు రాసినది, దాని సందర్భం, దాని అసలు బాణీ... దాదూ మీకు ప్రతిదీ చెప్పగలరు. మహారాష్ట్రలో విస్తృతంగా పాడుతుండే వామన్‌దాదా కుల వ్యతిరేక పాటలను కూడా ఆయన స్వరపరిచారు.
సంగీతంలో శిక్షణ పొంది ఉండటం వలన దాదూ వామన్‌దాదా కంటే ఒక అడుగు ముందే ఉన్నారు. అతనికి పద్యం లేదా పాటకు సంబంధించిన బాణీలు, లయ, తాళం, వృత్తాలు వంటి సాంకేతికతలు తెలుసు. అతను తరచుగా వీటి గురించి తన గురువుతో చర్చించేవారు; తన గురువు మరణం తర్వాత చాలా పాటలకు బాణీలు కట్టారు, కొన్ని పాత బాణీలను తిరిగి రూపొందించారు కూడా.
ఆ రెండిటి మధ్య ఉన్న తేడాను చూపించేందుకు ఆయన ముందు వామన్‌దాదా కూర్చిన అసలు బాణీలో పాడి, ఆ తర్వాత తాను కూర్చిన బాణీలో పాడి మాకు వినిపించారు.
भीमा तुझ्या मताचे जरी पाच लोक असते
तलवारीचे तयांच्या न्यारेच टोक असते
ఓ భీమ్! మీతో ఏకీభవించేవారు ఐదుగురు మాత్రమే ఉన్నా
వారి ఆయుధాగారం మిగిలిన వారి కంటే కూడా చాలా పదునుగా ఉంటుంది
అతను వామన్‌దాదాకు ఎంత నమ్మకమైన శిష్యుడంటే, అతని గురువు తన స్వంత మరణం గురించి దాదూకు ఒక పాటను కూడా ఇచ్చారు.
राहील विश्व सारे, जाईन मी उद्याला
निर्वाण गौतमाचे, पाहीन मी उद्याला
ప్రపంచం ఇక్కడే ఉంటుంది, నేను మాత్రం వెళ్ళిపోతాను
గౌతముని నిర్వాణానికి నేను సాక్షినవుతాను
దాదూ దీనికి సాంత్వన కలిగించే బాణీ కూర్చి, తన జల్సాలో ప్రదర్శించారు.
*****
దాదూ జీవితంలోనూ రాజకీయాలలోనూ సంగీతం ఒక అంతర్గత భాగం.
అంబేద్కర్‌పై ప్రజాదరణ పొందిన జానపద సాహిత్యం, పాటలు పుంజుకుంటున్న కాలంలో ఆయన పాడారు. భీమ్‌రావ్ కర్డక్, లోక్ - కవి అర్జున్ భలేరావ్, బుల్‌ఢాణాకు చెందిన కేదార్ సోదరులు, పుణే నుండి రాజానంద్ గడ్‌పాయలే, శ్రవణ్ యశ్వంతే, వామన్‌దాదా కర్డక్ ఈ ప్రసిద్ధి చెందిన పాటల దిగ్గజాలు.
దాదూ తన సంగీత ప్రతిభను, స్వరాన్ని అనేక పాటలకు అందించడంతోపాటు ఆ సంగీత నిధితో గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించారు. అంబేద్కర్ గతించిన తర్వాత పుట్టిన తరాలు ఈ పాటల ద్వారానే ఆయన జీవితం, ఆయన కృషి, సందేశం గురించి తెలుసుకున్నారు. ఈ తరంలో ఉద్యమాన్ని అభివృద్ధి చేయటంలోనూ, వారి నిబద్ధతను పెంపొందించడంలోనూ దాదూ గణనీయమైన పాత్రను పోషించారు.
పొలాల్లో అణగారిపోతున్న రైతు పోరాటాలను, గౌరవప్రదమైన బతుకు కోసం దళితులు చేస్తోన్న పోరాటాలను ఎందరో కవులు మౌఖికంగా వినిపించారు. తథాగత బుద్ధుడు, కబీర్, జోతిబా ఫూలే, డాక్టర్ అంబేద్కర్‌ల జీవితాల గురించి, వ్యక్తిత్వం గురించిన సందేశాలను తెలియజేసే పాటలు రాయడానికి వారు కృషి చేశారు. చదవడం, రాయడం రానివారికి ఈ పాటలే విద్య. దాదూ సాల్వే తన సంగీతంతోనూ, హార్మోనియంతోనూ వీటిని మరింత ఎక్కువమందికి చేరువగా తీసుకెళ్లారు. ఈ పాటలు ప్రజల చైతన్యంలో అంతర్భాగమయ్యాయి.
ఈ పాటల్లోని సందేశాలు, వాటిని శక్తివంతంగా పాడే శాయిరీలు కుల వ్యతిరేక ఉద్యమాన్ని గ్రామీణ ప్రాంతాలకు వ్యాప్తి చేయడంలో సహాయపడ్డారు. ఈ పాటలు అంబేద్కర్ ఉద్యమానికి సానుకూలమైన జీవశక్తి వంటివి. సమానత్వం కోసం జరిగే ఈ పోరాటంలో దాదూ తనను తాను ఒక చిన్న సైనికుడిగా భావిస్తారు.
అతను ఈ పాటలను డబ్బు సంపాదించే మార్గంగా ఎన్నడూ చూడలేదు. అతనికి అది అతని లక్ష్యం. కానీ, ఇప్పుడు ఈ 72 ఏళ్ల వయస్సులో, ఆయన ఆ శక్తినీ ఉత్సాహాన్నీ కోల్పోయారు. 2005లో ఆయన ఒక్కగానొక్క కొడుకు ప్రమాదంలో మరణించిన తర్వాత ఆయనే తన కోడల్నీ, ముగ్గురు మనవసంతానాన్నీ చూసుకుంటున్నారు. కోడలు మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, దాదూ ఆమె కోరికను గౌరవించారు, తన భార్య దేవబాయితో కలిసి ఈ చిన్న ఒంటిగది ఇంటికి మారారు. దేవబాయికి 65 ఏళ్లు, అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టారు. జానపద కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కొద్దిపాటి పింఛన్‌తోనే ఈ దంపతులు జీవనం సాగిస్తున్నారు. ఇన్ని కష్టాలు ఎదురైనా అంబేద్కర్ ఉద్యమం పట్ల, సంగీతం పట్ల ఆయనకున్న నిబద్ధత ఇప్పటికీ అలాగే ఉంది.
ప్రస్తుతం వస్తున్న పాటల జోరును దాదూ ఒప్పుకోవడం లేదు. “నేటి కళాకారులు ఈ పాటలను అమ్మకానికి పెట్టారు. వారు తమ బిడగి (గౌరవ వేతనం), కీర్తిపై ఎక్కువ ఆసక్తితో ఉన్నారు. ఇది చూస్తుంటే బాధగా ఉంది," అన్నారాయన విచారంగా.
అంబేద్కర్ గురించీ వామన్‌దాదా గురించీ మాట్లాడుతూ దాదూ సాల్వే తనకు కంఠోపాఠమైన పాటలను గుర్తుచేసుకుని, వాటిని తన హార్మోనియంపై వాయించడాన్ని చూసినపుడు అవి మనలో ఒక ఆశను నింపుతాయి; వ్యాకులతనూ, నిరాశనూ అధిగమించడంలో సహాయపడతాయి.
శాహీర్ల అమర పదాలు, తన సొంత బాణీల ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ తెచ్చిన కొత్త చైతన్యాన్ని దాదూ ఆవిష్కరించారు. రానున్న సంవత్సరాలలో ఇదే దళిత శాహిరీ అనేక ఇతర సామాజిక దురాచారాలకు, అన్యాయాలకు, పక్షపాతాలకూ వ్యతిరేకంగా పోరాడుతారు. వీటన్నింటి ద్వారా దాదూ సాల్వే స్వరం ప్రకాశిస్తుంది.
మేం మా ఇంటర్వ్యూ ముగించే సమయానికి, దాదూ అలసిపోయినట్టుగా కనిపించి తన పడకపై వాలిపోయారు. నేను ఏదైనా కొత్త పాటల గురించి ఆరా తీసినప్పుడు మాత్రం శ్రద్ధగా విని, "ఈ పాటలను ఎవరిచేతనైనా చదివిస్తే, నేను బాణీ కట్టి మళ్ళీ మీ కోసం పాడతాను," అని చెప్పారు.
అంబేద్కర్ ఉద్యమానికి చెందిన ఈ సైనికుడు ఇప్పటికీ తన స్వరంతోనూ, హార్మోనియంతోనూ అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి శాశ్వత సామాజిక మార్పును తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు.
రచయిత మరాఠీలో రాసిన ఈ కథనాన్ని మేధా కాలే ఆంగ్లంలోకి అనువదించారు
ఈ మల్టీ మీడియా కథనం 'ఇన్‌ఫ్లుయెన్షియల్ శాహిర్స్, నరేటివ్స్ ఫ్రమ్ మరాఠ్వాడా' అనే ప్రాజెక్ట్‌లో భాగం. ఈ ప్రాజెక్ట్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా సహకారంతో ఇండియా ఫౌండేషన్ ఫర్ ఆర్ట్స్ ద్వారా వారి ఆర్కైవ్స్ అండ్ మ్యూజియమ్స్ ప్రోగ్రామ్ కింద చేయబడినది. ఈ ప్రాజెక్ట్‌కు న్యూ ఢిల్లీలోని గోట (Goethe) ఇన్‌స్టిట్యూట్ /మాక్స్ ముల్లర్ భవన్ నుండి పాక్షిక మద్దతు కూడా లభించింది
అనువాదం: సుధామయి సత్తెనపల్లి