విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ లో బెంగళూరు నుండి పాట్నా వెళ్లే సంఘమిత్ర ఎక్స్ప్రెస్ కోసం దాదాపు పదిమంది కార్మికులు ప్లాట్ ఫాం నం 10 పై ఎదురుచూస్తున్నారు. ఈ రైలు,కొన్ని నెలల పాటు అమరావతి నిర్మాణం కోసం పనిచేసిన వారిని బీహార్లో వారి స్వగ్రామమైన బెల్గాచ్చికి తీసుకువెళుతుంది.
"టికెట్ చూపించమని అర్థగంటలో ముగ్గురు వేర్వేరు టికెట్ ఎగ్జామినర్ లు (టిఇలు) మా దగ్గరకు వచ్చారు", అని 24 ఏళ్ల మొహమ్మద్ ఆలం చెప్పాడు. ఆ టిఇల్లో ఒకరు, "ఈ 'లేబర్ జనం' టికెట్లు కొనరు. అందుకే కొన్ని రైళ్ల కోసం అదనపు టిఇలని కేటాయిస్తారు. ప్రత్యేకంగా ఉత్తరాదికి, ఈశాన్యానికి వెళ్లేవాళ్ల పట్ల జాగరూకతతో వ్యవహరిస్తాం" అని నాతో అన్నారు.
పుర్నియా జిల్లా, దగరువా బ్లాక్లోని తమ స్వగ్రామానికి వెళుతున్న కార్మికుల్లో లార్సన్ అండ్ టూబ్రో మరియు షాపూర్జీ పల్లోంజి ప్రైవేట్ లిమిటెడ్ వంటి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల కోసం పనిచేసిన వారున్నారు. మరికొన్నింటితో పాటు ఈ కంపెనీలు అమరావతిలోని జస్టిస్ సిటీ, ఎమ్మెల్యేల ఇళ్ళూ, ఐఏఎస్ ఆఫీసర్ల కాలనీ, ఇంకా మరికొన్ని కట్టడాల నిర్మాణం చేస్తున్నాయి.














