ఆర్. కైలాసం బ్యాంకు నుంచి కలవరపడుతూ బయటికి వచ్చాడు. “ప్రతిసారి నా పాస్ బుక్ అప్డేట్ చేయడానికి వెళ్ళినప్పుడు, మెషిన్ రిపేర్ లో ఉందని, మరోసారి రమ్మని పంపించేస్తారు.” అన్నాడు.
తన బ్యాంకు పాస్ బుక్ ని అప్డేట్ చేయించడం కోసం అతను తన కుగ్రామం, బంగాలమేడు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కే జి కండగై గ్రామంలోని బ్యాంకుకి వెళ్ళడానికి రెండు గంటలు నడుస్తాడు. (సంవత్సరం క్రితం వరకు అతని గ్రామానికి కిలోమీటర్ దూరం వరకు ఒక బస్సు నడిచేది, కానీ ఇప్పుడది నిలిపివేశారు.)
అతని అసలు పోరాటం బ్యాంకు వద్ద మొదలవుతుంది. తమిళనాడు తిరువళ్లూరు జిల్లా లో ఉన్నకెనరా బ్యాంకు, కే జి కందిగై బ్రాంచ్ కి స్వయంగా పని చేసే యంత్రం లో పాస్ బుక్ ఎంట్రీలు వేసుకోవచ్చు. కానీ కైలాసం దాన్ని ఎప్పుడూ వాడలేకపోయాడు. “నాకు అది పని చెయ్యదు”, అంటాడు.
ఒక రోజు ఉదయం అతను తన బాంక్ కష్టాల గురించి నా దగ్గర వెళ్ళబోసుకుంటుండగా, అక్కడే ముళ్లతుమ్మ చెట్టు నీడ కింద కూర్చున్న కొంత మంది ఆడవారు కూడా సంభాషణలో మా కలిశారు. “నీ బుక్ లో ఎంట్రీలు వేయించుకోవాలంటే, స్టికర్ పెట్టించుకోవాలి తాత”, అని ఒకరు చెప్పారు. వాళ్లు చెప్పినది నిజమే. కైలాసం పుస్తకం లో బార్ కోడ్ లేదు. అది ఉంటేనే యంత్రం పని చేస్తుంది. “వాళ్ళు నా పుస్తకం లో స్టికర్ ఎందుకు వెయ్యలేదో నాకు తెలీదు. నాకు ఇటువంటి విషయాలు అర్థం కావు.” అని చెప్పాడు. అక్కడున్న ఆడవాళ్లకి కూడా స్పష్టంగా తెలియక రకరకాల సూచనలు ఇచ్చారు. “నీ దగ్గర ATM కార్డు ఉంటే నీకు ఒక స్టికర్ వస్తుంది”, అన్నది ఒకామె. “నువ్వు 500 రూపాయిలు కట్టి ఒక కొత్త అకౌంట్ తెరవాలి”, అన్నది మరొకామె. “ఒకవేళ అది జీరో అకౌంట్ అయితే నీకు అది రాదు”, చెప్పింది మూడో ఆమె. కైలాసానికి మళ్లీ ఏమి అర్థం కాలేదు.
ఈ బాంకు యుద్ధాలు అతనికి మాత్రమే సొంతం కాదు. బంగాలమేడు లో ఉన్న ఎందరికో వారి అకౌంట్లనీ చూసుకోవడం, డబ్బులు డ్రా చేయడం, వారి బాలన్స్ చూసుకోవడం - ఇవన్నీ అంత తేలికైన పనులు ఏమి కావు. ఈ కుగ్రామం - అధికారికంగా దీన్ని చెరుక్కనూర్ ఇరులార్ కాలనీ అని పిలుస్తారు - తిరుత్తణి బ్లాక్‌లోని ఓపెన్ స్క్రబ్‌ల్యాండ్ మధ్యలో ఉన్న ఒకే వీధి. వీధికి ఇరువైపులా చిన్న గుడిసెలు, కొన్ని పక్కా ఇళ్ళు- మొత్తం కలిపి 35 ఇరులా కుటుంబాలు ఉన్నాయి. (ఈ సంఘం పేరు ఇప్పుడు అధికారిక పత్రాలలో ఇరులార్ అని పిలువబడుతుంది.)
అరవైఏళ్ల కైలాసం, నలభై అయిదేళ్ల అతని భార్య సంజయమ్మ మట్టి గోడలున్నపూరింట్లో ఉంటున్నారు. వాళ్లకు నాలుగు మేకలు, వీటిని సంజయమ్మ చూసుకుంటుంది. వీరి నలుగురు పిల్లలు పెద్దయ్యి వాళ్ళ కుటుంబాలతో వేరే ఇళ్లకు మారిపోయారు. రోజు కూలి పని చేసుకునే కైలాసం ఏమంటాడంటే,” నేను రోజంతా పొలం లో ఒంగి పని చెయ్యాలి. దానివలన నాకు తీవ్రమైన వెన్నునొప్పి వస్తుంది, నా ఎముకలు నొప్పి పుడతాయి. నేను చెరువు తవ్వడానికి (MGNREGA పని) వెళ్తే బావుంటుందని అనుకున్నాను.” మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయమెంట్ గారంటీ ఆక్ట్ 2005 లో ప్రతి యొక్క గ్రామీణ కుటుంబానికీ సంవత్సరానికి కనీసం 100 రోజుల పనిని ఇస్తుంది. కానీ ఇలా పని ఇవ్వడం, బంగాలమేడు లో ఎప్పుడో తప్ప జరగదు.
ఇరులాలు - తమిళనాడులో దుర్బలమైన గిరిజన సమూహం (Particularly Vulnerable Tribal Group) గా జాబితా చేయబడినవారు - వారి ఆదాయం కోసం రోజువారీ వేతన పనులపై ఎక్కువగా ఆధారపడతారు. బంగలమేడులోని పురుషులు వరి పొలాలలో, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రదేశాలలో కాలానుగుణంగా పనులు చేసుకుంటారు. వీరు రోజుకు 350-400 రూపాయలు సంపాదిస్తారు. పని దొరకని రోజులలో, వారు సమీపంలోని స్క్రబ్ అడవిలో తినదగిన పండ్లు, దుంపలు ఏరుకుంటారు. ఇక రోజువారీ ఆహారం కోసం ఎలుకలు, కుందేళ్ళు, ఉడుతలు, పక్షులు వంటి చిన్న జంతువులను కూడా వేటాడతారు. (చూడండి: బంగాలమేడులో నిధులను త్రవ్వడం , బంగాలమేడులో- ఎలుకలతో వేరే మార్గంలో )
ఊరిలోని చాలా మంది మహిళలకు, ఇటుక బట్టీల వద్ద అప్పుడప్పుడు దొరికే పని కాకుండా, MGNREGA పని వలన మాత్రమే ఆదాయం వస్తుంది. (చూడండి బంగలమేడు: ‘మహిళలకు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి?’ )
చెరువు గట్లను సరిచేయడానికి, గుంటలు త్రవ్వటానికి లేదా MGNREGA పని ప్రదేశాలలో చెట్లను నాటడానికి, ఇరులాల్లకు సుమారు రోజుకు రూ.175 రూపాయలు వస్తాయి. ఈ డబ్బు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
"నేను ఈ వారం పని చేస్తే, వచ్చే వారం తరువాత నాకు డబ్బు వస్తుంది" అని కైలాసం చెప్పాడు. ఈ నెలాఖరులో అతను ఎంత ఆదా చేస్తాడో అతనికి తెలియదు: “మాకు నెలకు 500 రూపాయలు [ఇంటి ఖర్చుల కోసం] అవసరం పడతాయి,” అని చెప్పాడు. “మిగిలినది బ్యాంకులో ఉంది. ఒకసారి బ్యాంకులో 3,000 ఉన్నాయి, అప్పుడు ఆ డబ్బుని నా కొడుకును ఏదైనా కొనుక్కోమని ఇచ్చాను."
బ్యాంకు వద్ద డబ్బు తీసుకోవటానికి, కైలాసం ఒక ఫారమ్ నింపాలి. “బాంక్ వాళ్ళు నన్ను చలాన్ ఇవ్వమని అడుగుతారు. దీన్ని ఎలా నింపాలో నాకు తెలియదు,” అని అతను చెప్పాడు. అతను, సంజయమ్మ- ఇద్దరూ చదవలేరు, వ్రాయలేరు. "బ్యాంక్ సిబ్బంది వారు మా కోసం చలాన్ నింపలేమని చెబుతారు, ఎవరైనా వచ్చి నాకు సాయం చేస్తారని బ్యాంకు బయట ఎదురుచూస్తాను. నేను వెళ్ళినప్పుడల్లా 1,000 రూపాయలకు మించి డబ్బు తీసుకోను [2-3 నెలలకు ఒకసారి].” అన్నాడు.
అతను సహాయం కోరేవారిలో జి. మణిగందన్ కూడా ఉన్నాడు. అతను కైలాసంకి బ్యాంకు సంబంధిత పనులలో సహాయం చేస్తాడు. ఇతర ఇరులాలకు వారు ఆధార్ కార్డులు వంటి వాటి కోసం దరఖాస్తు చేసినప్పుడు లేదా ప్రభుత్వ పథకాలు, పెన్షన్లను తెచ్చుకునేప్పుడు పని ఎలా పూర్తి చేసుకోవాలో చెప్తాడు.
“నేను [బ్యాంకుకు] వెళ్ళినప్పుడల్లా , సహాయం కోసం 5 లేదా 6 మంది ఎదురుచూస్తూ ఉంటారు. చలాన్లు ఇంగ్లీష్ లో ఉంటాయి. నేను కొంచెం ఇంగ్లీష్ చదవగలను, కాబట్టి నేను వారికి సహాయం చేస్తాను,” అని 36 ఏళ్ల మణిగందన్ చెప్పాడు. అతను 9 వ తరగతిలో చదువు మానేసిన మణిగందన్ పిల్లల కోసం పాఠశాల తర్వాత తరగతులు నిర్వహిస్తున్న స్థానిక లాభాపేక్షలేని సంస్థతో కలిసి పని చేస్తున్నాడు. "మొదట నేను తప్పులు చేస్తానని భయపడేవాడిని," అని చెప్పాడు. "మేము ఏదైనా రాసి మళ్ళీ కొట్టేస్తే, వారు దానిని చించేస్తారు. అప్పుడు మేము మళ్ళీ కొత్త షీట్లో తిరిగి వ్రాయాలి.” కానీ ఇప్పుడు కొన్ని నెలల నుంచి చలాన్లు తమిళ్ లో కూడా ఉంటున్నాయి.
కైలాసం పొరుగునే ఉన్నయాభై అయిదేళ్ళ గోవిందమ్మల్, ఎప్పుడూ పాఠశాలకు వెళ్ళలేదు. ఆమెకు MGNREGA వేతనాలు, వెయ్యిరూపాయిల నెలవారీ పింఛను అందుతాయి. వితంతువైన ఈమె ఒంటరిగా నివసిస్తుంది. ఆమె కూతురు, ఇద్దరు కొడుకులు అదే ఊరిలో తమ సొంత ఇళ్లలో ఉంటున్నారు. “నేను నా వేలిముద్ర వేస్తాను. కాబట్టి వారు [బ్యాంక్ సిబ్బంది] నా చలాన్ తీసుకోవడానికి సాక్షి సంతకం తెమ్మని నన్ను అడుగుతారు. నేను మామూలుగా ఆ ఫారమ్ నింపడానికి సాయం చేసే మనిషినే సాక్షి సంతకం కూడా చెయ్యమని అడుగుతాను,” అని ఆమె చెప్పింది.
చలాన్ నింపే వ్యక్తి వారి స్వంత ఖాతా నంబర్‌ను కూడా పేర్కొనాలి. మణిగందన్ ఒక సంఘటనను నవ్వుతూ గుర్తుచేసుకున్నాడు: “నేను ఒకరికి సాక్షిగా సంతకం చేసి నా ఖాతా నంబర్ రాశాను. బ్యాంక్ నా ఖాతా నుండి డబ్బును తీసివేసింది. అదృష్టవశాత్తూ, వారు జరిగిన పొరపాటును గమనించారు, నా డబ్బు నాకు తిరిగి వచ్చింది.”
తన సొంత బ్యాంక్ పని కోసం, మణిగందన్ ఒక ATM కార్డును ఉపయోగిస్తాడు, తమిళాన్ని తెరపై లావాదేవీలకు తన భాషగా ఎంచుకుంటాడు. అతనికి మూడేళ్ల క్రితమే కార్డు వచ్చినా దానిని వాడడం అలవాటు చేసుకోడానికి సమయం పట్టింది. "డబ్బును ఎలా తీసుకోవాలో, నా ఖాతా బ్యాలెన్స్‌ను ఎలా చూసుకోవాలో ఇరవై సార్లు ప్రయత్నిస్తే తప్ప నాకు అర్ధం కాలేదు." అన్నాడు మణిగందన్.
కైలాసం లేదా గోవిందమ్మల్ ATM కార్డును ఎందుకు ఉపయోగించరు? వేలిముద్ర వేసేవారికి ATM కార్డులు ఇవ్వడం లేదని మణిగందన్ చెప్పారు. కానీ కె.జి.కండిగై పట్టణంలోని కెనరా బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ బి. లింగామయ్య, ఇంతకుముందు అలా ఇవ్వనప్పటికీ ఇప్పుడు దాని కోసం దరఖాస్తు చేసుకున్నఎవరికైనా ATM కార్డులు వస్తాయని, ‘ఇది జన్ ధన్ [ఖాతా] లేదా వారు వేలిముద్ర ఉపయోగించేవారు కూడా తీసుకోవచ్చ’ని చెప్పారు. కానీ బంగలమేడులో చాలా మందికి ఈ సౌకర్యం ఉందని తెలియదు.
'నేను వేలిముద్ర వేస్తాను. కాబట్టి వారు [బ్యాంక్ సిబ్బంది] నా చలాన్ ఇవ్వడానికి సాక్షి సంతకం తెమ్మని నన్ను అడుగుతారు. నేను సాధారణంగా ఆ ఫారమ్ నింపే పెట్టే మనిషినే సాక్షి సంతకం కూడా పెట్టమని అడుగుతాను' అని గోవిందమ్మల్ చెప్పారు
బాంకింగ్ లావాదేవీలు తేలిక పరచడానికి కెనరా బ్యాంకు ఒక “ ఆల్ట్రా స్మాల్ బ్యాంకు” ని బంగాలమేడు కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరుక్కనూర్ లో ఏర్పరిచింది. ‘మినీ బ్యాంకు’గా పిలవబడే ఈ ఏర్పాటు లో ఒక మనిషికి కాంట్రాక్టు కు ఉద్యోగం ఇచ్చి, కమీషన్ పై పని చేసే బాధ్యతను అప్పజెప్పారు. వీరిని బిజినెస్ కరెస్పాండెంట్(BC) అంటారు.
నలభై రెండేళ్ల ఇ.కృష్ణదేవి BC గా పనిచేస్తోంది. ఆమె పోర్టబుల్ బయోమెట్రిక్ పరికరాన్ని తన ఫోన్‌తో ఇంటర్నెట్కు కలుపుతుంది. ఆమె కస్టమర్ యొక్క ఆధార్ నంబర్‌ను టైప్ చేస్తుంది. పరికరం వారి వేలిముద్రను బట్టి లావాదేవీని ఆమోదిస్తుంది. “ఇలా జరగాలంటే వారి ఆధార్ తప్పనిసరిగా బ్యాంకు ఖాతాతో అనుసంధానించబడి ఉండాలి. ఎవరైనా వారి ఖాతా నుండి డబ్బులు తీసుకోవాలనుకోవచ్చు, అందుకే నేను చేతిలో డబ్బు ఉంచుకుంటాను.” కానీ ఆమె మధ్యాహ్నం 3:30 గంటలకు బ్యాంకులో రోజు ఖాతాలను సెటిల్ చేసుకోవాలి.
కానీ వేలిముద్రను నమోదు చేయడంలో ఇబ్బంది పడినవారు, ఆధార్ కార్డులు లేని వారు, లేదా వారి పాస్‌బుక్‌లను అప్డేట్ చేయించాలనుకున్నవారు, కె. జి. కండిగై వద్ద ఉన్న బ్యాంకుకే వెళ్ళాలి.
“కొన్నిసార్లు ఆమె [BC] తన దగ్గర డబ్బు అయిపోయిందని చెప్తుంది. ఆమె మాకు ఒక చీటీ ఇస్తుంది. తరువాత లేదా మరుసటి రోజు మా డబ్బులు తీసుకోడానికి ఆమె ఇంటికి రమ్మని చెబుతుంది. అప్పుడు మేము మళ్ళీ వెళ్తాము,” అని గోవిందమ్మల్, కొంతమంది స్నేహితులతో చెరుక్కనూర్ బయలుదేరింది. ఆమె అక్కడ తన ఊరిలో ఉన్న సరస్సు అంచున మూడు కిలోమీటర్లు నడవాలి. “మేము ఆఫీసు బయట ఎదురు చూస్తాము. ఒకవేళ ఆమె ఆఫీసుకి రాకపోతే, అప్పుడు ఆమె ఇంటికి వెళ్తాము.” అంది.
సాధారణంగా, BC లు తమ ఇళ్ల నుండే పనిచేస్తారు. కానీ కృష్ణదేవి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల మధ్య తమ ఊరి పాత లైబ్రరీలో కూర్చుంటుంది. MGNREGA లేదా పెన్షన్ల కోసం నగదు పంపిణీ ఉన్న రోజులలో, ఆమె అక్కడ ఎక్కువసేపు ఉంటుంది. ఆ గంటలు మాత్రమే కాకుండా, రోజులో ఎప్పుడైనా ఆమె అందుబాటులోనే ఉండాలని ఆమె నొక్కి చెబుతుంది. "బయట పని కోసం వెళ్లినవారు నా ఇంటికి వచ్చి నన్ను కలుస్తారు" అని ఆమె చెప్పింది.
ప్రతి మంగళవారం, కృష్ణదేవి తన బయోమెట్రిక్ పరికరాన్ని కె.జి. కండిగై యొక్క ప్రధాన శాఖకు తీసుకువస్తుంది. మరో నాలుగు పంచాయతీలకు చెందిన BC లు వారంలోని ఇతర రోజులలో ఒక్కొక్కరు ఒక్కో రోజు చొప్పున బయోమెట్రిక్ పరికరాన్ని తీసుకుంటారు. ఈ పరికరం పై మధ్యాహ్నం 2 గంటల వరకు, వారి ఆధార్ కార్డుల ద్వారా వినియోగదారులకు లావాదేవీలు చేయవచ్చు. అయితే కైలాసం మంగళవారం మాత్రమే ఆ యంత్రాన్ని వాడొచ్చు, మిగిలిన రోజులు పనిచేయదు అనుకుంటాడు. “మంగళవారాలే, చెరుక్కనూర్ BC ఇక్కడికి వచ్చేది," అని చెప్పాడు.
కైలాసం లానే, చాలా ఇరులా కుటుంబాలకు కెనరా బ్యాంక్‌లో ఖాతాలు ఉన్నాయి - ఇది ఇక్కడ ఒక దశాబ్దంగా ఉన్న ఏకైక బ్యాంకు. (రెండు సంవత్సరాల క్రితం, ఆంధ్ర బ్యాంక్ కె. జి. కందిగైలో ఒక శాఖను ఏర్పాటు చేసింది, ఇప్పుడు ఆ పట్టణంలో నాలుగు వేర్వేరు బ్యాంకుల ATM లు ఉన్నాయి). కొంతమందికి సాధారణ పొదుపు ఖాతాలు ఉంటాయి. ఇంకొందరికి, కనీస బ్యాలెన్స్ అవసరం లేని ‘జీరో బ్యాలెన్స్’ లేదా జన్ ధన్ ఖాతాలు ఉన్నాయి.
అయితే, నేను మాట్లాడిన చాలామంది ప్రజలు కొంత డబ్బును జీరో బ్యాలెన్స్ ఖాతాల్లో ఉంచమని అడిగారు. అటువంటి ఖాతా ఉన్న గోవిందమ్మల్ ఇలా అంటాడు, “కె. జి. కండిగై బాంక్ అధికారులు ఎప్పుడూ బ్యాంకు లో కనీసం 500-1,000 రూపాయలు ఉంచమని చెబుతారు. అప్పుడే ఎరి వేలై [MGNREGA work] డబ్బు వస్తుంది. అందుకే నేను చెరుక్కనూర్ [మినీ బ్యాంక్] కి వెళ్తాను. అక్కడ నేను ఖాతాలో 200-300 రూపాయలు మాత్రమే ఉంచుతాను. ”
2020 చివరినాటికి, నేను కె.జి. కండిగై శాఖ లో అప్పుడు పని చేస్తున్న మేనేజర్ కె. ప్రశాంత్‌తో చర్చించినప్పుడు., జన్ ధన్ ఖాతాలకు కనీస బ్యాలెన్స్ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. "వారికి అన్ని రకాల లావాదేవీలతో KYC తో అనుసంధానించిన ఖాతా అవసరమైతే, వారు రెగ్యులర్ ఖాతాను తెరవాలి, దీనికి కనీసం రూ. 500 బ్యాలెన్స్ అవసరం" అని ఆయన చెప్పారు.
జన్ ధన్ ఖాతాదారులు అవసరం లేకపోయినా, కనీస బాలన్స్ ను వారి ఖాతాలో ఉంచమని బ్యాంక్ సిబ్బంది చెబుతారని ప్రస్తుత మేనేజర్ బి. లింగామయ్య అంగీకరిస్తారు. ఖాతాదారులు జన్ ధన్ లేదా జీరో బ్యాలెన్స్ ఖాతా కోసం ప్రత్యేకంగా అడగకపోతే, బ్యాంక్ సాధారణ ఖాతాను మాత్రమే ఇస్తుంది.
గోవిందమ్మల్ మరొక సమస్య గురించి చెబుతుంది. "ముందేమో వారు [బ్యాంక్] నేను ఖాతా కోసం ఏమి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదని చెప్పారు. ఇప్పుడేమో ప్రతి సంవత్సరం వారు రూ. 500 లేదా 1000 తీసుకుంటారు. ఎప్పుడూ బ్యాంకులో నేను అనుకున్న దానికన్నా తక్కువ డబ్బులే ఉంటాయి" అని ఆమె చెప్పింది.
కె. ప్రశాంత్ అసలు ఈ గందరగోళానికి కారణం జన్ ధన్ అకౌంట్లకు కూడా ఫీజు తీసుకుని ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాలు అందించడమే అన్నారు. “ఒకవేళ ఖాతాదారుల వద్ద రూ. 2,000 ఖాతాలో మిగిలి ఉన్నాయి అనుకోండి, వారు తెలియక రూ. 3,000 తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు, సిస్టమ్ కొంతమందిని ఆ మొత్తాన్ని తీసుకోవడానికి అనుమతిస్తుంది. మళ్ళీ కొత్తగా డిపాజిట్ పడినప్పుడు ఆ మిగిలిన వెయ్యిరూపాయిల తేడాను సర్దుబాటు చేస్తుంది. కానీ వారికి తాము ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఉపయోగిస్తున్నామని తెలియదనిపిస్తుంది.”
గోవిందమ్మల్ ఇంటి నుండి వీధికి అడ్డంగా నివసిస్తున్న 28 ఏళ్ళ ఎస్. సుమతి, గత సంవత్సరం ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోయింది: “ఎవరన్నా దీని గురించి మాకు చెప్పి ఉండొచ్చు కదా. బ్యాంక్ మా డబ్బు తీసుకుంటుందని మేము అనుకున్నాము. "
SMS సేవల వలన కూడా డబ్బు పోతుంది, దీని కోసం బ్యాంక్ మూడునెలలు ఒకసారి 18 రూపాయలు తీసుకుంటుంది. కానీ ఇక్కడ అందరికి ఫోన్లు ఉండవు. అందువలన బాలన్స్ అయిపోయినా ఆ విషయం కొందరికి తెలీదు. పైగా డబ్బులు విత్ డ్రా చేసినప్పుడు మాత్రమే SMS వస్తుందని సుమతి చెప్పింది. “మా అకౌంట్ లో డబ్బులో పడినప్పుడు వాళ్ళు SMS ఎందుకు పంపరు? ఇది మాకు బోల్డంత ఇబ్బందిని తగ్గిస్తుంది.”
డిజిటలైజేషన్ ను పెంచడం వలన దాని నిర్వహణలో ఇతర సవాళ్లు కూడా పెరుగుతున్నాయి. నవంబర్ 2020 లో, 23 ఏళ్ళ మణిగందన్ మేనల్లుడు ఆర్. జాన్సన్, రూ. 1,500 రూపాయలు పోగొట్టుకున్నాడు. అతని 22 ఏళ్ల భార్య ఆర్. వనజ బ్యాంక్ ఖాతాలో MGNREGA వేతనాల నుండి ఆదా చేయబడిన రూ. 2,000కూడా పోయాయి. వీరిద్దరికి ఉన్న ఒకే ఒక్క బ్యాంకు అకౌంట్ వివరాలు, కార్డు వివరాలను బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తున్న తెలియని కాలర్‌కు వెల్లడించాడు. "అతను బ్యాంకు అధికారి లాగానే మాట్లాడాడు. కార్డు లాక్ అయిందని, అన్‌లాక్ చేయడానికి నేను అతనికి నంబర్ ఇవ్వాల్సి ఉందని చెప్పాడు. నాకు తెలిసిన అన్ని నంబర్లని అతనికి ఇచ్చాను. OTP కూడా చెప్పాను. ఇప్పుడు మా అకౌంట్ లో 500 రూపాయిలు మాత్రమే ఉన్నాయి.” అన్నాడు.
అంతేగాక ఆ కాలర్ జాన్సన్ కార్డును "అన్‌లాక్" చేయడానికి జాన్సన్ తన మామ మణిగందన్ కార్డు వివరాలను చెప్పమన్నాడు. కానీ చాలా అనుమానిత లావాదేవీల అవుతున్నాయని బ్యాంక్ మణిగందన్‌ను అప్రమత్తం చేసింది. కానీ అప్పటికే అతను హౌసింగ్ స్కీమ్ కింద కొత్త ఇల్లు కట్టుకోడానికి దాచుకున్న మొత్తం లో రూ. 17,000 పోయాయి.
జాన్సన్ మరియు ఇతర ఇరులాలు వారి బాంకింగ్ లోని ఈ డిజిటల్ ప్రపంచాన్ని చేరడానికి కష్టపడుతూనే ఉన్నారు. కానీ వారి ఇబ్బందులు తీరే మార్గం దొరకట్లేదు. కైలాసం పాస్ బుక్ ఇంకా అప్డేట్ కాలేదు. "కై రెగై [బయోమెట్రిక్] యంత్రాన్ని ఉపయోగించడానికి చలాన్లు నింపే అవసరం లేదు." అని కొంత ఉపశమనం పొందుతాడు.
అనువాదం - అపర్ణ తోట