జబ్ ప్యార్ కియా తో డర్నా క్యా...ప్యార్ కియా కోయి చోరీ నహీ...ఘుట్ ఘుట్ కర్ యూఁ మర్నా క్యా…
ప్రేమలో ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి... ప్రేమ నేరం కాదే... ఇలా ఊపిరాడక ఎందుకు చనిపోవాలి…
60ల నాటి క్లాసిక్ సినిమా మొఘల్-ఎ-ఆజమ్లోని ఈ పాటను కొంత సేపటి నుండి కూని రాగం తీస్తోంది విధి. ఆమె సెంట్రల్ ముంబైలో కొత్తగా అద్దెకు తీసుకున్న గదిలో ఉంది. పాట పాడటం ఆపి, “మేం కూడా ఏ నేరం చేయలేదు. మరి మేమెందుకు భయపడి బ్రతకాలి?” అని ఆమె ప్రశ్నించింది.
అది ఆమె మాట వరసకు వేసిన ప్రశ్న కాదు, ఎంతో ఇబ్బంది పెట్టే ప్రశ్న. చంపేస్తారేమోనన్న ఆమె భయం నిజమైనదే. తన కుటుంబ సభ్యులకు ఎదురు తిరిగి, తను ప్రేమించిన వ్యక్తితో – పాఠశాలలో ఆమె తోటి విద్యార్థిని ఆరుషి – పారిపోయివచ్చినప్పటి నుండి ఆ భయంతోనే ఆమె బతుకుతోంది. వీరిద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు. కానీ వారి బంధానికి చట్టబద్ధత వచ్చే మార్గం మాత్రం సుదీర్ఘమైనది, దుర్భరమైనది, కఠినమైన సవాళ్ళతో నిండి ఉన్నది. వారి కుటుంబాలు వారి సంబంధాన్ని ఆమోదించవని భయపడుతున్నారు. అలాగే, సమాజంలో స్త్రీగా గుర్తించబడిన ఆరుషి, తన లైంగిక గుర్తింపు కోసం చేస్తున్న పోరాటాన్ని కూడా వారు అర్ధం చేసుకోరని తెలుసు. ఆరుషి తనను తాను ఒక ట్రాన్స్ మ్యాన్‌గా గుర్తించుకున్నాడు. ఆరుష్ అనే పేరును ఎంచుకున్నాడు.
మహానగరానికి వచ్చి, తమ కుటుంబాల నుంచి విముక్తి పొందామని వారు భావించారు. విధి కుటుంబం ఠానే జిల్లాలోని ఒక గ్రామంలో నివసిస్తుంది. ఇది పొరుగున ఉన్న పాలఘర్ జిల్లాలోని ఆరుష్ గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. విధి (22), మహారాష్ట్రలో ఇతర వెనుకబడిన తరగతి (ఒబిసి)గా జాబితా చేసిన అగ్రి సముదాయానికి చెందినది. ఆరుష్ (23), కున్భీ సముదాయానికి చెందినవాడు; అంటే ఒబిసి అయినప్పటికీ, సామాజికంగా వారి గ్రామాల్లో ఉన్న కఠినమైన కులాల శ్రేణిలో అగ్రి కంటే కున్భీ ‘నిమ్న’ వర్గం కిందకి వస్తుంది.
ఇద్దరూ తమ ఇళ్ళను వదిలి ముంబయికి వచ్చి ఒక సంవత్సరం అయింది; తిరిగి వెళ్ళే ఉద్దేశ్యం వాళ్ళిద్దరికీ లేదు. తన కుటుంబం గురించి ఆరుష్ అంతగా ఏమీ పంచుకోలేదు కానీ ఇది మాత్రం చెప్పాడు: “నేను ఒక కచ్చా ఇంట్లో (పూరి గుడిసె) నివసించేవాడిని. ఆ విషయమై నేను ఎప్పుడూ సిగ్గుపడేవాడిని. దాని గురించి నేను ఆయి (తల్లి)తో చాలాసార్లు గొడవపడ్డాను కూడా.”












