"అవసరమైన కార్యకలాపాలు మినహా వ్యక్తుల కదలికలు రాత్రి 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు ‘ఖచ్చితంగా నిషేధించబడతాయి'."
- హోం మంత్రిత్వ శాఖ సర్క్యులర్ (ఇండియా టుడే, మే 17 నివేదించిన ప్రకారం)
సర్క్యులర్ లో 'ప్రయాణీకుల వాహనాలు మరియు అంతరాష్ట్ర బస్సుల కదలికను అనుమతించడం ద్వారా వలస కార్మికులకు ఉపశమనం' (రెండు పొరుగు రాష్ట్రాలు అంగీకరిస్తేనే) అని ఉండే. కానీ హైవేలపై లక్షలాది మంది నడక బాట పడ్తారని ఎక్కడా లేదు.
ఆ కర్ఫ్యూ నియమాలు వారిని ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల మధ్య నడిచేలా శాసించాయి. కాబట్టి వారి యాత్ర వేసవిలో అత్యంత వేడిగా ఉండే దశలో, 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలవద్ద జరిగింది.
ఒక నెల ముందు, తెలంగాణ మిరప పొలాల్లో పని చేసే జామ్లో మద్కం అనే 12 ఏళ్ల ఆదివాసి అమ్మాయి, లాక్డౌన్లో పని, ఆదాయం నిలిపివేసిన తరువాత ఛత్తీస్‌గఢ్‌లోని తన ఇంటికి చేరుకోవడానికి కాలినడకన బయలుదేరింది. ఈ అమ్మాయి మూడు రోజుల్లో 140 కిలోమీటర్లు నడిచి, తర్వాత ఆమె ఇంటికి 60 కిలోమీటర్ల దూరంలో అలసట వలన, శరీరం లో నీరు తగ్గిపోవడం(డీహైడ్రేషన్), కండరాల అలసట వలన చనిపోయింది. ఇలాంటి కర్ఫ్యూ ఉత్తర్వుల వలన ఇంకా ఎంత మంది జమ్లోలు ఉద్భావించాలి?
మొదటగా, ప్రధాన మంత్రి మార్చి 24 ప్రకటన 1.3 బిలియన్ మనుషులలో భయాందోళనలను రేకెత్తించింది. నాలుగు గంటలలో దేశం మూతపడబోతుంది అని తెలసి, ప్రతిచోటా వలస కార్మికులు కాలినడకన ఇంటికి వెళ్ళడం ప్రారంభించారు. తరువాత, పోలీసులు ఎవరినైతే లాఠీలతో కొట్టి సిటీ లోపలికి పంపలేకపోయరో, వారిని రాష్ట్ర సరిహద్దుల వద్ద అడ్డుకున్నారు. తరువాత ప్రజలపై క్రిమిసంహారక మందును పిచికారీ చేశారు. చాలామందిని 'రిలీఫ్ క్యాంప్'ల్లోకి పంపారు. ఇది ఎవరికి రిలీఫో చెప్పడం కష్టం.
ముంబై-నాసిక్ హైవే సాధారణ సమయాల్లో కంటే లాక్‌డౌన్‌లో రద్దీగా అనిపించింది. ప్రజలు ఏ ఎలా వీలయితే అలా ప్రయాణించారు. సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదంలో ఒక కాలును కోల్పోయిన బిమలేష్ జైస్వాల్ తన భార్య మరియు మూడేళ్ల కుమార్తెతో పాటు గేర్‌లెస్ స్కూటర్ పైన మహారాష్ట్రలోని పన్వెల్ నుండి మధ్యప్రదేశ్‌లోని రేవా వరకు 1,200 కిలోమీటర్లు ప్రయాణించాడు. "నాలుగు గంటల నోటీసుతో దేశాన్ని ఎవరు మూసివేస్తారు?" అని అతను అడుగుతాడు బిమలేష్, దానికి సమాధానం మీకు తెలుసుగా.










