జమ్మూ కశ్మీర్‌లలోని ఎత్తైన పర్వతాలపై ఒంటరి బకర్‌వాల్(గొర్రెల కాపరి)లు చాలా అరుదుగా మాత్రమే మనకు కనిపిస్తారు.
ఈ పశుపోషకుల సముదాయం హిమాలయాలంతటా పెద్ద పెద్ద సమూహాలుగా తమ పశువుల మేత కోసం వెతుకుతూ తిరుగుతుంది. "ముగ్గురు నుండి నలుగురు సోదరులు వారి వారి కుటుంబాలతో కలిసి ప్రయాణిస్తారు," అని ప్రతి సంవత్సరం ఒక ఎత్తైన పచ్చికభూమి లేదా బహక్ కు వెళ్ళే మొహమ్మద్ లతీఫ్ అన్నారు. "మేకలనూ, గొర్రెలనూ కలిపేయడం వలన మందను నిర్వహించడం చాలా సులువవుతుంది," ప్రతి సంవత్సరం తమతోపాటు ప్రయాణించే దాదాపు 5,000 గొర్రెలు, మేకలు, గుర్రాలు, వాటితో పాటు రెండు సాహసులైన బకర్‌వాల్ కుక్కల గురించి ప్రస్తావిస్తూ చెప్పారాయన.
జమ్మూ మైదానాల నుండి పీర్ పంజాల్, ఇంకా ఇతర హిమాలయ శ్రేణులలోని ఎత్తైన పచ్చికబయళ్ళ వరకు సాగే బకర్‌వాల్‌ల ప్రయాణాలు క్రమంగా దాదాపు 3,000 మీటర్ల ఎత్తు వరకూ చేరుకుంటాయి. వారు వేసవి ప్రారంభానికి ముందు మార్చి నెల చివరిలో పైకి వెళతారు; శీతాకాలం ప్రారంభమయ్యే ముందు సెప్టెంబర్ నెల వచ్చేవరకు కిందికి దిగేందుకు తమ తిరుగు ప్రయాణాన్ని ప్రారంభిస్తారు.
ప్రతి యాత్రకు దాదాపు 6-8 వారాలు పడుతుంది; మహిళలు, పిల్లలు, కొంతమంది పురుషులు ముందుగా వెళ్ళే బృందం. "వాళ్ళు మాకంటే ముందే ముఖ్యమైన పచ్చికబయళ్ళ వద్దకు చేరుకుని, జీవాల మంద రాక కోసం డేరా (శిబిరం) వేసి సిద్ధంగా ఉంచుతారు," అని మొహమ్మద్ లతీఫ్ చెప్పారు. అతని బృందం రాజౌరి సమీపంలోని మైదానాల నుండి బయలుదేరి లడఖ్‌లోని జోజి లా పాస్ సమీపంలో ఉన్న మీనామర్గ్ వరకు ప్రయాణిస్తుంది.
దాదాపు 40 ఏళ్ళ వయసున్న షౌకత్ అలీ కందల్ జమ్మూలోని కఠువా జిల్లాకు చెందిన 20 బకర్‌వాల్ కుటుంబాలతో కలిసివున్న మరొక సమూహంలో భాగం. అది 2022, సెప్టెంబర్ నెల. అతని బృందం అనేక తరాలుగా వారి వేసవి నివాసంగా ఉన్న కిశ్త్‌వార్ జిల్లాలోని డొద్ధయీ బహక్ (ఎత్తైన ప్రాంతంలో ఉన్న పచ్చికబయలు) నుండి తిరిగి కిందికి వస్తోంది. వారు వార్వన్ లోయలోని మంచు కనుమల గుండా వచ్చారు. “మేము మరో నెలలో కఠువా చేరుకుంటాం. దారిలో ఇంకా నాలుగైదు చోట్ల ఆగవలసి ఉంటుంది,” అని షౌకత్ చెప్పారు.
బకర్‌వాల్‌లు తమ గొర్రెలకు కొట్టంలో మేత పెట్టలేరు కాబట్టి సంవత్సరంలో ఎక్కువ సమయం తిరుగుతూ ఉంటారు; అవి బహిరంగ ప్రదేశంలో మేత మేయాలి. పశువులు వారి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నందున, మంద సౌకర్యంగా ఉండటం, వాటి ఆహారం చాలా ముఖ్యమైన విషయాలు. అన్ని కశ్మీరీ విందులలో మేక, గొర్రెల మాంసం అత్యంత విలువైనది. “మా గొర్రెలు, మేకలే మాకు ముఖ్యం. (స్థానిక) కశ్మీరీలకు (ఆదాయం సంపాదించడానికి) అక్రోటు, యాపిల్ వంటి చెట్లున్నాయి,” అని షౌకత్ బంధువులలోని వృద్ధుడొకరు అభిప్రాయపడ్డారు. వారి ప్రయాణాలలో గుర్రాలు, కంచర గాడిదలు కూడా ముఖ్యమైనవే: అప్పుడప్పుడు వచ్చే పర్యాటకుల కోసం మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు, గొర్రె పిల్లలు, ఉన్ని, నీరు, రోజువారీ అవసరమైన వస్తువులను వీటిపైనే చేరవేస్తారు.
ఆ రోజు ముందుగా మేం షౌకత్ భార్య షామా బానోతో కలిసి వారి శిబిరానికి చేరుకోవడానికి ఏటవాలుగా ఉన్న పర్వతం పైకి నడిచాం. ఆమె తలపై నది వద్ద నింపుకున్న పెద్ద నీటి కుండ ఉంది. నీరు తీసుకురావాల్సిన పని తరచుగా మహిళా పశువుల కాపరులపై పడుతోంది, వారు ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ప్రతిరోజూ తప్పనిసరిగా ఈ పని చేస్తారు.
పశుపోషక సముదాయానికి చెందిన బకర్‌వాల్‌లను రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగగా జాబితా చేశారు. 2013లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం వారి జనాభా 1,13,198. వారు జమ్మూ కశ్మీర్ రాష్ట్రం అంతటా ప్రయాణిస్తున్నప్పుడు కూడా కాలానుగుణంగా తోటలలో పనిచేసే అవకాశాలను ఉపయోగించుకుంటారు. వారు ప్రతి ఏడాదీ ఒకే ప్రదేశాలకు వలసపోతుండటం వలన అక్కడ స్థానికంగా నివాసముండే కశ్మీరీలతో బలమైన స్నేహాన్ని నెలకొల్పుకుంటారు. చుట్టుపక్కల గ్రామాల నుండి తమ పశువులను మేపుకోవడానికి వచ్చే మహిళలు తమ గుడారాలలో ఈ సందర్శకులతో కబుర్లాడుకోవడానికి ఇష్టపడతారు.
"మాకు ఒక చిన్న మంద ఉంది, కానీ మా మగవాళ్ళకు (మేం ప్రయాణించేటప్పుడు) కొంత అదనపు పని లభింస్తుండడంతో మేం ఇప్పటికీ ప్రతి సంవత్సరం వలసపోతుంటాం. యువకులు కలపను కోయడానికో, లేదా స్థానిక కశ్మీరీల కోసం అక్రోట్‌లను, ఆపిల్ పండ్లను కోయడానికో వెళతారు,” అని జోహ్రా చెప్పారు. 70 ఏళ్ళ వయసున్న ఆమె, కొంతమంది బకర్‌వాల్ మహిళలు ధరించే విధంగా, చేతితో ఎంబ్రాయిడరీ చేసిన సంప్రదాయక టోపీని ధరించారు. ఆమె తన మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి జమ్మూలోని వారి ఇళ్లకు తిరిగి వెళ్లే మార్గంలో ఉన్న కొండల ప్రాంతమైన గాందర్‌బల్ జిల్లాలోని కంగన్ అనే గ్రామంలో ఒక కాలువ ప్రక్కన ఉంటున్నారు. “ఏమీ లేకపోయినా వలసపోతాం, ఎందుకో మీకు తెలుసా? వేసవికాలంలో మైదానప్రాంతాలలో నాకు చాలా వేడిగా ఉంటుంది!" అని ఆమె నవ్వుతూ చెప్పారు.
*****
"ఆ కంచెలవైపు చూడండి!"
ఆవిరి చిమ్ముతోన్న మీగడ గులాబీ వన్నె మేక పాల తేనీటిని తాగుతూ గులామ్ నబీ కందల్, "పాత రోజులు పోయాయి," అన్నారు. అప్పటి రోజుల్లోని కంచెలు లేని పచ్చని పచ్చికబయళ్ళను గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు వారు ఆ పచ్చికభూములనూ, తాత్కాలిక శిబిరాల ప్రదేశాలకూ చేరుకోవడం గురించి అనిశ్చితితో కూడిన అసౌకర్యాన్ని అనుభవిస్తున్నారు.
"వచ్చే సంవత్సరం సైన్యం ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోబోతోందని మేం విన్నాం," ఆ పక్కనే ఉన్న పర్వతంపై కొత్తగా ఏర్పాటుచేసిన కంచెల వైపు చూపిస్తూ చెప్పారతను. మా చుట్టూ కూర్చునివున్న ఇతర బకర్‌వాల్‌లు ఈ సంఘ పెద్ద చెప్పేది వింటున్నారు, వారి ముఖాలు కూడా ఆందోళన నిండి ఉన్నాయి.
అంతే కాదు. అనేక పచ్చికభూములను పర్యాటకం కోసం మళ్ళిస్తున్నారు; సోనామార్గ్, పహల్‌గామ్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఈ సంవత్సరం పర్యాటకులతో క్రిక్కిరిసిపోయాయి. ఈ మైదానాలు తమ పశువులకు అతిముఖ్యమైన వేసవికాలపు పచ్చిక బయళ్ళని వారు పేర్కొన్నారు.
“వారు (రాజ్యం) సొరంగాలపైనా రహదారులపైనా ఎంత పెట్టుబడి పెడుతున్నారో చూడండి. ఇప్పుడు ప్రతిచోటా మెరుగైన రహదారులు ఉండబోతున్నాయి. ఇది పర్యాటకులకూ ప్రయాణీకులకూ మంచిదే కానీ మాకు కాదు,” అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సంఘ పెద్ద మాకు చెప్పారు.
మోటారు వాహనాలు నడవగలిగే రహదారులు లేని ప్రాంతాల్లో తమ గుర్రాలను అద్దెకు ఇవ్వడం ద్వారా బకర్‌వాల్‌లు ఆదాయాన్ని పొందుతారనే విషయాన్ని ఆయనిక్కడ ప్రస్తావిస్తున్నారు. "ఇది పర్యాటకులు వచ్చే కాలంలో మా ప్రధాన ఆదాయ వనరులలో ఒకటి," అని ఆయన చెప్పారు. కానీ వారు గుర్రాలను అద్దెకు ఇవ్వడంలో మాత్రమే కాకుండా, పర్యాటక లేదా పర్వతారోహకులకు గైడ్‌లుగానూ, స్థానిక రెస్టారెంట్‌లలో పని చేయాలనుకున్నప్పుడు కూడా మధ్యవర్తులతోనూ, స్థానికులతోనూ పోటీ పడాల్సివుంటుంది. 2013 నాటి ఈ నివేదిక ప్రకారం బకర్‌వాల్‌ల సగటు అక్షరాస్యత 32 శాతం మాత్రమే ఉండటంతో, వీరికి ఇతర ఉద్యోగాలు కూడా ఎక్కువగా అందుబాటులో ఉండవు.
ఈ సముదాయం కూడా కశ్మీరీ శాలువాలు, తివాచీలు తయారుచేసే ఉన్నితో వ్యాపారం చేస్తుంది. కొన్నేళ్లుగా, నాణ్యతను మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా కశ్మీర్ వ్యాలీ, గురేజీ వంటి స్థానిక గొర్రెల జాతులను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు చెందిన మెరినో వంటి జాతులతో సాంకర్యం చేస్తున్నారు. ఇక్కడ కూడా బకర్‌వాల్‌లు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. “కొన్ని సంవత్సరాల క్రితం ఉన్ని ధర కిలో 100 రూపాయలుండేది. ఇప్పుడు మాకు 30 రూపాయలు కూడా రావడం లేదు," అని మాకు చాలామంది చెప్పారు.
రాజ్యం ఉదాసీనతతో పాటు సులువుగా అందుబాటులో ఉండే ఉన్ని కత్తిరించే యూనిట్లు లేకపోవడం వల్లనే ధరలు భారీగా తగ్గాయని వారు చెబుతున్నారు. వారు విక్రయించే సహజసిద్ధమైన ఉన్ని, యాక్రిలిక్ ఉన్ని వంటి చౌకైన సింథటిక్ ప్రత్యామ్నాయాల నుండి ప్రమాదాన్ని ఎదుర్కొంటూ ఉంది. అనేక పచ్చికబయళ్ళలోకి వ్యాపారులకుగానీ, దుకాణాలకుగానీ ప్రవేశం ఉండదు కాబట్టి, బకర్‌వాల్‌లు తమ ప్రయాణంలో కొంత దూరం వరకూ గుర్రాల మీదనో, కంచర గాడిదల మీదనో ఉన్నిని మోసుకెళ్తారు. ఆపైన దానిని మార్కెట్‌కు తీసుకెళ్లడానికి వాహనాన్ని అద్దెకు తీసుకుంటారు. ఈ సంవత్సరం, చాలామంది బకర్‌వాల్‌లు తమ గొర్రెల ఉన్నిని కత్తిరించి, దానిని అలాగే పచ్చికబయళ్ళలో వదిలేశారు. ఎందుకంటే ఆ ఉన్నిని వాహనంలో మోసుకుపోవడానికి అయ్యే ఖర్చు, వాళ్ళు మార్కెట్‌లో ఉన్నిని అమ్మి సంపాదించే దానికంటే ఎక్కువగా ఉంటోంది..
మరోవైపు మేక వెంట్రుకలను వాళ్ళు గుడారాలనూ, తాళ్ళనూ తయారుచేయడానికి ఉపయోగిస్తారు. అతనికీ, అతని సోదరుడు షౌకత్‌కీ మధ్య పేనుతూ ఉన్న తాడును సాగలాగుతూ, "కాగనీ మేకలు దీనికి మంచివి. వాటికి పొడవాటి జుట్టు ఉంటుంది," అని మాకు చెప్పారు. కాగనీ అత్యంత విలువైన కశ్మీరీ ఉన్నిని ఇచ్చే మేక జాతి.
బకర్‌వాల్‌లు తమ గమ్యస్థానాలకు వేగంగా చేరుకోవడంలో సహాయపడటానికి, 2022లో ప్రభుత్వం వారినీ, వారి జంతువులనూ వేసవికాలపు పచ్చిక బయళ్ళకు చేర్చడానికి ముందుకొచ్చింది. దీనివల్ల వారాలు పట్టే ప్రయాణం ఒక్కరోజులో ముగుస్తుంది. కానీ చాలా తక్కువ ట్రక్కులు ఉన్నందున ట్రక్కుల కోసం నమోదుచేసుకున్న చాలా మందికి అవి దొరకలేదు. మరికొంతమందికి వారు అప్పటికే బయలుదేరి వెళ్ళిన తర్వాత అవకాశం వచ్చింది. “బకర్‌వాల్ కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి, ట్రక్కులు మాత్రం కొన్నే ఉన్నాయి. అందువలన చాలామంది ఈ సేవలను పొందలేకపోతున్నారు," అని ఒక గొర్రెల పెంపకం అధికారి అంగీకరించారు.
*****
"ఇరవై రోజుల క్రితమే వాడు నాకు పుట్టాడు!"
మీనా అక్తర్ గుడారం మూలన ఉన్న చిన్న బట్టల మూటను చూపుతూ అన్నది. ఏడవడం ప్రారంభించేంత వరకూ ఆ బట్టల మూటలో ఒక నవజాత శిశువు ఉన్నట్టు మనకు తెలియనే తెలియదు. మీనా ఆ బిడ్డను ఆ పర్వతాల దిగువన ఉన్న ఆసుపత్రిలో ప్రసవించింది. బిడ్డ పుట్టవలసిన గడువు తేదీ దాటిపోయి, పురిటి నొప్పులు రాకపోవడం వలన ఆమెను అక్కడికి తీసుకెళ్లాల్సి వచ్చింది.
"నాకు బలహీనంగా ఉంటోంది. నా బలాన్ని తిరిగి పొందడానికి నేను హల్వా (రవ్వ పాయసం) తింటున్నాను. గత రెండు రోజుల నుండి రోటీలు తినడం మొదలుపెట్టాను" అని ఆమె చెప్పింది. మీనా భర్త చుట్టుపక్కల గ్రామాల్లో కట్టెలు కొట్టే పని చేస్తారు. అలా అతను సంపాదించిన డబ్బు వారి రోజువారీ అవసరాలకు ఆసరాగా ఉంటుంది.
తేనీరు తయారుచేయడం కోసం ప్లాస్టిక్ ప్యాకెట్‌లోంచి పాలు పోస్తూ, “ఇప్పుడు మాకు పాలు దొరకడం లేదు. మేకలు గర్భంతో ఉన్నాయి. మేకపిల్లలు పుట్టాక మాకు మళ్ళీ పాలు వస్తాయి," అన్నది మీనా. నెయ్యి, పాలు, చీజ్- బకర్‌వాల్‌కు, ముఖ్యంగా మహిళలకూ పిల్లలకూ అవసరమైన పోషకాహార వనరులు.
ఎత్తైన పర్వతాలలో కేవలం గుడారాల నీడలో నివసించే పసిపిల్లలను ఆహారం వండేందుకు వెలిగించే పొయ్యి మంటలు, దుప్పట్ల సహాయంతో గుడారం లోపలే వెచ్చగా ఉంచుతారు. బయటకు వెళ్లగలిగే వయసున్న పిల్లలు శిబిరం చుట్టూ స్వేచ్ఛగా తిరుగుతూ ఆడుకుంటుంటారు. కుక్కలను చూసుకోవడం, లేదా కట్టెలు, నీరు తీసుకురావడం వంటి చిన్నచిన్న పనులను పిల్లలకు అప్పగిస్తుంటారు. "పిల్లలు రోజంతా పర్వతాల నీటి బుగ్గలలో ఆడుకుంటారు" అని మీనా చెప్పింది. లడఖ్ సరిహద్దుకు ఏమంత దూరం లేని మీనామర్గ్‌లోని వారి శీతాకాలపు బహక్ ను విడిచిపెట్టడం తనకు బాధగా ఉంటుందని ఆమె చెప్పింది: "అక్కడ జీవితం బాగుంటుంది."
షౌకత్ డేరాకు చెందిన ఖాల్దా బేగమ్ కూడా తన చిన్న పిల్లలతో కలిసి ప్రయాణిస్తారు. కానీ యుక్తవయసులో ఉన్న ఆమె కుమార్తె పాఠశాలకు వెళ్ళడం కోసం జమ్మూలోని బంధువుతో ఉంటుంది. "అక్కడైతే నా కూతురు బాగా చదువుకోగలుగుతుంది," ఆ ఆలోచనకే నవ్వుతూ చెప్పారామె. చాలామంది పిల్లలకు ఆ అవకాశం లేదు. వారు వారి కుటుంబాలతో కలిసి వలస వెళ్ళవలసిందే. సంచార పాఠశాలలను నిర్వహించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు, కొంతమంది బకర్‌వాల్‌లకు మాత్రమే వీటికి వెళ్ళగలిగే అవకాశం ఉన్నందున, విజయవంతం కాలేదు.
సంచార పాఠశాలల్లో ప్రభుత్వం నియమించిన ఉపాధ్యాయులు ఎప్పుడూ కనిపించరు. "వారు ఇక్కడికి రారు, కానీ వారికి జీతం మాత్రం వస్తుంది," అని 30ల వయస్సులో ఉన్న ఖాదిమ్ హుస్సేన్ విసుగ్గా చెప్పారు. అతను కశ్మీర్‌ను లడఖ్‌ను కలిపే జోజి లా పాస్‌కు సమీపంలో డేరాలు వేసుకునే బకర్‌వాల్‌ల బృందానికి చెందినవారు.
“నేటి తరం మెరుగైన విద్యను పొందుతోంది. సంచార జీవితానికి భిన్నమైన అవకాశాలను వారు ఎంచుకుంటున్నారు. వారు ఈ (సంచార) జీవితాన్ని కష్టమైనదిగా భావిస్తున్నారు,” అని ఫైసల్ రజా బోక్డా ఎత్తి చూపారు. అతను జమ్మూలోని గుజ్జర్ బకర్‌వాల్ యూత్ వెల్ఫేర్ కాన్ఫరెన్స్ ప్రాంతీయ అధ్యక్షుడు. బహిష్కరణకూ, అన్యాయానికీ వ్యతిరేకంగా గళం విప్పేందుకు పీర్ పంజాల్ శ్రేణుల వరకు పాదయాత్ర చేపట్టాలని అతను యోచిస్తున్నారు. “మా యువతకు ఇది అంత సులభం కాదు. నేటికీ ప్రజలు మాతో వ్యవహరించడంలో వివక్ష చూపుతారు; ముఖ్యంగా పట్టణాల్లో. ఇది (వివక్ష) మాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది." అని ఆయన చెప్పారు. షెడ్యూల్డ్ తెగలకు చెందిన గుజ్జర్, బకర్‌వాల్‌లకు వారి హక్కుల గురించి మరింత అవగాహన కల్పించేందుకు బోక్డా కృషి చేస్తున్నారు.
శ్రీనగర్ నగర శివార్లలో జకురా అనే ప్రాంతంలో 12 బకర్‌వాల్ కుటుంబాలు నివసిస్తున్నాయి. వారి శీతాకాలపు బహక్‌లు జలవిద్యుత్ ఆనకట్ట ప్రాజెక్ట్ వలన స్థానభ్రంశం చెందడంతో వారిక్కడ స్థిరపడ్డారు. ఇక్కడే పుట్టిన అల్తాఫ్ (అసలు పేరు కాదు) శ్రీనగర్‌లో ఒక పాఠశాల బస్సును నడుపుతున్నాడు. "వృద్ధులూ, అనారోగ్యంతో ఉన్న నా తల్లిదండ్రుల కోసం, పిల్లల కోసం నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను," అంటూ అతను తన సముదాయంలోని ఇతరుల వలె ఎందుకు వలస వెళ్లలేదో వివరిస్తూ చెప్పాడు.
సముదాయపు అనిశ్చిత భవిష్యత్తు, కంచెలు వేయడం, పర్యాటకం, మారుతున్న జీవనశైలి వంటివి కలిగిస్తున్న అనేక భయాలను మదింపుచేస్తూ, తన జీవితమంతా పర్వతాల మీద స్వేచ్ఛగా తిరుగుతూ గడిపిన గులామ్ నబీ ఇలా అంటారు: “నా బాధ మీకెలా తెలుస్తుంది?”
ఉదారమైన సహాయం, ఆతిథ్యం అందించినందుకు ఫైసల్ బోక్డా, షౌకత్ కందల్, ఇష్ఫాక్ కందల్‌లకు రిపోర్టర్లు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
సెంటర్ ఫర్ పాస్టొరాలిజం మంజూరు చేసిన ఇండిపెండెంట్ ట్రావెల్ గ్రాంట్ ద్వారా రితాయన్ ముఖర్జీ పాస్టోరల్ మరియు సంచార కమ్యూనిటీల గురించి నివేదిస్తున్నారు. ఈ నివేదికలోని కంటెంట్‌పై ఈ కేంద్రం ఎటువంటి సంపాదకీయ నియంత్రణను పాటించలేదు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి