“ముందుకు వచ్చి నా స్వంత యుద్ధాలను నేనే చేయాలని ఉద్యమం నాకు నేర్పింది. ఇది మాకు గౌరవాన్ని ఇచ్చింది.” ఇక్కడ "మాకు" అంటే, సెప్టెంబర్ 2020లో ప్రవేశపెట్టబడిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న తాను, ఇంకా తన వంటి ఇతర మహిళలు అని రాజిందర్ కౌర్ ఉద్దేశ్యం. పంజాబ్‌లోని పాటియాలా జిల్లాకు చెందిన రాజిందర్ అనే ఈ 49 ఏళ్ళ రైతు, తరచూ 220 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, నిరసనలు జరుగుతున్న సింఘులో ప్రసంగాలు చేసేవారు.
రాజిందర్ స్వగ్రామం దౌణ్ కలాఁ లో, ఆమె పొరుగింటివారైన 50 ఏళ్ళ హర్జీత్ కౌర్, దిల్లీ-హర్యానా సరిహద్దులోని సింఘులో 205 రోజులు గడిపారు. "నేను ఆహారాన్ని పండించని సమయమంటూ నాకు గుర్తు లేదు. పండించిన ప్రతి పంటకూ, నాక్కొంచెం వయసు పెరిగింది." అని ఆమె చెప్పారు. 36 ఏళ్లుగా రైతుగా ఉన్న హర్జీత్, "ఇలాంటి ఉద్యమాన్ని చూడటం, అందులో పాల్గొనడం కూడా నాకు ఇదే మొదటిసారి" అని చెప్పారు. "పిల్లలు, వృద్ధులు, మహిళలు నిరసనలలోకి రావడాన్ని నేను చూశాను." అన్నారామె.
కేంద్ర ప్రభుత్వం చేసిన వివాదాస్పదమైన చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ లక్షలాది మంది రైతులు దేశ రాజధాని శివార్లలో గుమిగూడారు. నవంబర్ 2020 నుండి మొదలుకొని, నవంబర్ 2021లో ఆ చట్టాలు రద్దు చేయబడేవరకు, ఒక సంవత్సరం పాటు, ప్రధానంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన రైతులు అక్కడ క్యాంప్ చేశారు. రైతుల నిరసన చరిత్రాత్మకమైనది; ఇది ఇటీవలి కాలంలో జరిగిన అతిపెద్ద ప్రజా ఉద్యమాలలో ఒకటి.
పంజాబ్ నుండి వచ్చిన మహిళలు ఉద్యమంలో ముందుపీఠిన ఉన్నారు. ఆ సమయంలో వారు చవిచూసిన సంఘీభావం కొనసాగుతుందనీ, అందులో భాగంగా వారిలో ధైర్యం, స్వతంత్య్రభావం మరింత బలపడ్డాయనీ వారు చెప్పారు. "నేను అక్కడ [నిరసనలు జరిగిన దగ్గర] ఉన్నప్పుడు నాకెప్పుడూ ఇంటిపై మనసుపోలేదు. ఇప్పుడు అక్కడినుంచి తిరిగి వచ్చాక, నాకు ఉద్యమం పై బెంగపుడుతోంది” అని మాన్సా జిల్లాకు చెందిన 58 ఏళ్ల కుల్దీప్ కౌర్ చెప్పారు.
అంతకుముందు, బుధ్‌లాడా తహసీల్‌లోని రేలీ గ్రామంలోని తన ఇంట్లో ఉండే పనిభారం ఆమె మానసిక స్థితిని ప్రభావితం చేసేది. “ఇక్కడ నేను ఒకదాని తర్వాత ఒకటిగా పని చేసుకుంటూ పోవాలి, లేదా మనం గౌరవించాల్సిన అతిథులకు మర్యాదలు చేస్తూ వుండాలి. అక్కడైతే నేను చాలా స్వేచ్ఛగా ఉన్నాను” అని కుల్దీప్ చెప్పారు. నిరసనలు జరుగుతున్న ప్రదేశాల్లోని సామాజిక వంటశాలలలో ఆమె స్వచ్ఛందంగా పాల్గొన్నారు. తన జీవితమంతా అక్కడే పని చేయగలనని ఆమె అన్నారు. "అక్కడ వున్న పెద్దలను చూసినపుడల్లా, నేను నా తల్లిదండ్రుల కోసమే వంట చేస్తున్నానని అనుకునేదాన్ని."












