“ఇదంతా దేని కోసం జరుగుతోందో నాకు తెలియదు. కానీ, ఇదేదో మోదీకి సంబంధించిన విషయమని మాత్రం అర్థమైంది. నేనిక్కడికి భోజనం కోసం వచ్చాను. మాకింక పస్తులుండాల్సి వస్తుందనే భయమే లేదు” అని పదహారేళ్ల రేఖ చెప్పింది. (ఈ కథనంలోని మిగతా చాలామందిలాగే ఈమె కూడా తన మొదటి పేరును మాత్రమే చెప్పింది.) సింఘూ నిరసన ప్రదేశానికి 8 కిలోమీటర్ల దూరంలో, ఉత్తర ఢిల్లీలోని అలీపూర్‌లో నివసించే రేఖ చెత్తకుప్పల్లో వ్యర్థాలను రీసైకిల్ చేసే పని చేస్తుంది.
హరియాణా-ఢిల్లీ సరిహద్దులో దిగ్బంధంలో ఉన్న సింఘూ వద్ద రేఖ ఉంది. సెప్టెంబర్ 2000లో ప్రభుత్వం ఆమోదించిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్ 26 నుండి ఇక్కడ రైతులు నిరసనలు చేస్తున్నారు. ఈ నిరసన స్థలాలకు రైతులు, వారి మద్దతుదారులే కాకుండా వేలాది మంది ఔత్సాహికులు, రైతులూ గురుద్వారాలూ నిర్వహించే లంగర్లలో కడుపారా భోజనం చేయాలనుకునే నిరుపేదలు సైతం వస్తున్నారు. ఈ సామాజిక వంటశాలల్లో పనిచేసే వారు అందరినీ భోజనం చేసివెళ్ళమని ఆహ్వానిస్తారు.
వీరిలో చాలా కుటుంబాలు సమీపంలోని పేవ్మెంట్ల మీద, మురికివాడలలో నివసిస్తున్నాయి, వీరు ప్రధానంగా లంగర్లలో లభించే ఉచిత భోజనం కోసమే ఈ నిరసన స్థలానికి వస్తారు. ఇక్కడ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా రోజంతా భోజనం వడ్డిస్తూనే వుంటారు. అన్నం, పప్పు, పకోడీలు, లడ్డూలు, ఆకుకూర, మొక్కజొన్న రొట్టెలు, పండ్లరసాలు, మంచినీళ్లు.. అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్లు అవసరమైనవారికి ఉచితంగా మందులు, దుప్పట్లు, సబ్బులు, చెప్పులు, బట్టలు, తదితర వస్తువులను కూడా అందజేస్తున్నారు.
ఈ వాలంటీర్లలో హర్‌ప్రీత్ సింగ్ అనే 23 ఏళ్ల యువరైతు కూడా వున్నాడు. ప్రస్తుతం బి.ఎస్సి చదువుతున్న ఈ యువకుడు పంజాబ్, గుర్దాస్పూర్ జిల్లాలోని ఘుమన్ కలాన్ అనే ఊరికి చెందినవాడు. “ఇవన్నీ తప్పుడు చట్టాలని మేము నమ్ముతున్నాం. ఈ భూములన్నీ మా తాతముత్తాతలు సాగుచేసినవి, సంపాదించినవి. ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని మా భూముల నుంచి తరిమేయాలని చూస్తోంది. మేము ఈ చట్టాలను సమర్థించం. మాకిష్టం లేదని చెబుతుంటే మమ్మల్ని ఎలా బలవంతపెడతారు? ఈ చట్టాలన్నీ రద్దు కావాల్సిందే” అన్నాడు హర్‌ప్రీత్.
అనువాదం: సురేశ్ వెలుగూరి