`పీపుల్స్ ఆర్కీవ్ ఆఫ్ రూరల్ ఇండియా`(PARI) ఇవ్వాళ్టికి ఏడేళ్లు పూర్తిచేసుకుంది. కరోనా, లాక్డౌన్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మేము మా బాధ్యతను ఆపకుండా నిర్వర్తించాం.
పోయినేడాది లాక్డౌన్ ప్రారంభమైన తొలి రోజే, భారత ప్రభుత్వం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలను ఒక ముఖ్యమైన సేవకు సాయం కావాలని కోరింది. ప్రభుత్వం నుంచి ఇలాంటి విజ్ఞప్తి రావడం ఆహ్వానించదగ్గ పరిణామమే. భారతీయులు పాత్రికేయులను, పాత్రికేయతనూ ఎప్పుడూ ఒక అవసరంగా భావించలేదు. జర్నలిస్టుల జీవితాలు జనజీవితంతో ఎలా పెనవేసుకుపోయాయి; వారి జీవనోపాథి గురించి చెప్పాలంటే బోలెడు కథలున్నాయి. దేశవ్యాప్తంగా పెద్ద మీడియా సంస్థలు రెండు నుంచి రెండున్నర వేలమంది జర్నలిస్టులు, పదివేలకు పైగా జర్నలిజంతో ముడిపడిలేని మీడియా సంస్థల ఉద్యోగులను వివిధ కారణాలు చెప్తూ తమ సంస్థల నుండి బయటికి పంపాయి. మరి ఈ ప్రశ్నకు ఆ సంస్థలు ఏం జవాబు చెప్పగలవు?
మరి మీడియా సంస్థలు ఇలా ముఖ్యమైన కథల్ని ఎలా ప్రసారం చేయగలవు? వారికున్న `బెస్ట్ జర్నలిస్టు`లను ఉద్యోగాలనుండి తొలగించాయెందుకని? ఒకవేళ తొలిగించక పొతే వారి వేతనాల్లో 40 నుంచి 60 శాతం ఎందుకు కోత విదించాయి? జర్నలిస్టుల ప్రయాణాలపై కూడా చాలా సంస్థలు నిషేధాలు విధించాయి. ఇందుకు కారణం వారి ఆరోగ్యాలను కాపాడడం కోసం కాదు, కేవలం సంస్థలు తమ ఖర్చుల్ని తగ్గించుకోవడమే.
PARI ఏప్రిల్, 2020 నుంచి తన ఉద్యోగుల్లో ఏ ఒక్కరినీ తొలగించలేదు. పైగా మరో పదకొండు మంది ఉద్యోగులను అదనంగా చేర్చుకుంది. ఆగస్ట్ 2020లో దాదాపు తన ఉద్యోగులందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లను అందించింది కూడా.
PARI అద్భుతమైన నివేదికలు అందిస్తూనే, కోవిడ్ విపత్కర పరిస్థితుల సమయంలో 270కి పైగా (వీటిలో ఎక్కువ భాగం మల్టీమీడియావి) కథనాల్ని , ముఖ్యమైన డాక్యూమెంట్లనిప్రచురించింది. ఇవన్నీ లాక్డౌన్ సమయాల్లో గ్రామీణుల జీవన చిత్రాల్ని ప్రతిబింబిస్తూ ప్రచురించినవే. ఈ కథనాలన్నీ 23 రాష్ట్రాలు, దేశంలోని అన్ని ప్రధాన గ్రామాలు, పట్టణాల నుంచి ఎన్నో కష్టాలకోర్చి, వందల కిలోమీటర్లు నడుస్తూ వలసపోతున్న పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని రాసినవే. ఈ కథనాలన్నీ 65 మందికిపైగా విలేకరుల పేర్లతో సహా ప్రచురించినవని మీరు గుర్తించవచ్చు. PARI కరోనా కాలానికి చాలా ఏళ్లకు పూర్వం నుంచే ప్రధానంగా వలస కార్మికుల జీవనోపాథి పై నివేదిస్తోంది. అంతేగాని మార్చి 25, 2020 తర్వాత హఠాత్తుగా వీరిని కనిపెట్టి కథనాలను రాయడం మొదలుపెట్టలేదు.
ఇదంతా మా పాఠకులకు తెలుసు; తెలియనివారి కోసమే ఇదంతా విశదీకరిస్తున్నాం. జర్నలిజాన్ని, జీవనోపాధినీ కేంద్రంగా చేసుకుని గ్రామీణ భారతదేశపు ముఖచిత్రాన్ని పలు కథనాలు, నివేదికలు, ఫొటోలు, వీడియోలతో చూపించిన అతిపెద్ద ఆన్లైన్ సమాచార నిక్షేపం PARI. 83.3 కోట్లమంది గ్రామీణుల జీవితాలను వారి గొంతులు, వారి అనుభవాల నుంచే వినిపించడం ద్వారా ప్రతిరోజూ ప్రజల రోజువారీ జీవితాల్ని, వారి దైనందిన అనుభవాలను నిక్షిప్తం చేయడమే PARI ముఖ్యోద్దేశం.










