“మేము సెక్స్ వర్క్ చేసి సంపాదిస్తాము కాబట్టి మా శరీరాలతో ఏమైనా చేయవచ్చని అనుకుంటారు,” మీరా (30) భర్త అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడంతో 2012లో తన ముగ్గురు పిల్లలను వెంటబెట్టుకుని ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ నుండి ఢిల్లీకి వచ్చారు. ఆమెలో కోపం, నిస్సత్తువ సమపాళ్లలో రగులుతున్నాయి.
“నా మందులు ఇచ్చేటప్పుడు వాళ్లు ఇలా చేస్తారు” అని అమిత (39) తన మొహంలో అసహ్యాన్ని వెళ్లబుచ్చుతూ చూపించారు. ఆసుపత్రిలోని మగ హెల్పర్లు, వార్డ్ అసిస్టెంట్లు తమ చేతులతో ఆమె ఒంటిని ఎలా తడుముతారో చేసి చూపించారు. ఆ అవమానం సహించలేరానిదైనా చెకప్‌ల కోసం లేదా మందుల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తిరిగి వెళ్తారు.
“మేము ఎచ్. ఐ. వి. పరీక్షలు చేయించుకోవడానికి వెళ్లినప్పుడు, ఒకవేళ మేము సెక్స్ వర్కర్లమని వాళ్లకు తెలిస్తే చాలు, సాయం చేస్తామని ఆశ చూపుతారు. ‘వెనుక వైపు ద్వారం నుండి వచ్చేసేయి, నీ మందులు తెచ్చిస్తాను’ అని అంటారు. ఆ అవకాశాన్ని వాడుకుని మమ్మల్ని అసభ్యంగా తాకుతారు.” ఇలా కుసుమ్ (45) మాట్లాడుతున్నప్పుడు పలు మహిళలు తమకూ ఇలా జరిగిందని అంగీకరిస్తూ తలలూపారు. అఖిల భారతీయ సెక్స్ వర్కర్ల నెట్‌వర్క్ (AINSW) ప్రెసిడెంట్‌గా కుసుమ్ గతంలో పని చేశారు. ఈ ఫెడరేషన్‌లో భాగంగా 16 రాష్ట్రాలకు చెందిన సామూహిక సేవా సంస్థలు 4.5 లక్షల సెక్స్ వర్కర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
ఢిల్లీ వాయువ్య జిల్లాలోని రోహిణి అనే ప్రాంతంలోని ఒక సామూహిక ఆశ్రయ శిబిరం వద్ద PARI సిబ్బంది కొందరు సెక్స్ వర్కర్లను కలిసినప్పుడు, వాళ్లలో దాదాపు అందరికీ కొవిడ్ మహమ్మారి వల్ల పని దొరకడం లేదని చెప్పారు. చలికాలంలో ఆ రోజు మధ్యాహ్నం పూట వారంతా వెచ్చదనం కోసం ఒకరికొకరు దగ్గరగా కూర్చుని తాము ఇంట్లో వండుకుని స్టీల్ డబ్బాలలో తెచ్చుకున్న ఆహారాన్ని పంచుకుని భోంచేస్తున్నారు. ఆ భోజనంలో కూరగాయల కూర, దాల్ (పప్పు), రోటీ (రొట్టె) మాత్రమే తినగలిగే దుస్థితిలో ఉన్నారు.













