"వాళ్ళను బడిదాకా తీసుకురావడమే పెద్ద సవాలు," అంటారాయన.
అవి ముప్పైనాలుగేళ్ళ అనుభవంలోంచి వచ్చిన మాటలు. 'మాస్టర్జీ' అని పిల్లలంతా పిలుచుకొనే శివ్‌జీ సింగ్ యాదవ్, డావ్‌లీ చపోరీలో ఉన్న ఒకే ఒక్క పాఠశాల నిర్వాహకులు. ఈ డావ్‌లీ చపోరీ అనే బ్రహ్మపుత్ర నదీ ద్వీపపు గ్రామం, అసోమ్ రాష్ట్రంలోని మజూలీ జిల్లాలో ఉంది. అక్కడ ఉండే 63 కుటుంబాలకు చెందిన పిల్లల్లో చాలామంది ఈ పాఠశాలలో చదువుకుంటుంటారు..
ఆ ధొనేఖనా లోయర్ ప్రైమరీ స్కూల్‌లో ఉన్న ఒకే ఒక్క తరగతి గదిలో తన డెస్క్ దగ్గర కూర్చొని చిరునవ్వుతో పిల్లలందర్నీ పరకాయించి చూస్తుంటారు శివ్‌జీ. నలబై ఒక్క కళకళలాడే మొహాలు - ఆరు నుంచి పన్నేండేళ్ళ వయసులు - ఒకటో తరగతి నుండి అయిదో తరగతి దాకా చదివే ఆ విద్యార్థులు మాస్టర్జీ కేసి తేరిపార చూస్తున్నారు. "వీళ్ళకు పాఠాలు బోధించి చదువుచెప్పడమన్నది ఉంది చూశారూ, అది నిజంగా అతి పెద్ద సవాలు... సందు దొరికితే చాలు, పారిపోతారు" చెప్పుకొస్తారు యాదవ్..
భారతీయ విద్యావ్యవస్థ గురించి మాట్లాడటానికి ఉపక్రమించే ముందు మాస్టర్జీ ఓ క్షణం ఆలోచించి పెద్ద తరగతి పిల్లల్ని రమ్మనిపిలిచారు. అసోమ్ ప్రభుత్వ ప్రాథమిక విద్యా సంచాలక కార్యాలయంవారు పంపించిన ఆంగ్లం, అసోమ్ భాషల్లో ఉన్న కథల పుస్తకం పాకెట్‌ని తెరచి చూడమని వాళ్ళకు పురమాయించారు. కొత్త పుస్తకాలు కలిగించే ఉత్తేజంతో పిల్లలంతా కాసేపు ఉబ్బితబ్బిబ్బవుతారనీ, ఆ సమయంలో తాను మాతో ఏ ఆటంకమూ లేకుండా మాటాలడగలరనీ ఆయనకు తెలుసు.
“అసలు కళాశాల అధ్యాపకులకు ఎంత జీతం ఇస్తున్నారో అంతా ప్రాథమిక విద్యను బోధించే ఉపాధ్యాయులకివ్వాలి. పునాదులు వేసేది మా ప్రాథమిక అధ్యాపకులమే కదా," ప్రాథమిక విద్య ప్రాముఖ్యాన్ని నొక్కి వక్కాణిస్తూ ఆయన అన్నారు. అయినా ఈ పిల్లల తలిదండ్రులకే ప్రాథమిక విద్య అంటే లక్ష్యం లేదనీ, ఉన్నత పాఠశాల చదువులే ముఖ్యమనుకుంటారనీ చెపుతారు యాదవ్. వాళ్ళలోని ఈ అనుచిత భావాన్ని సరిదిద్దటం కోసం అవిరళ కృషి చేస్తున్నారాయన.

















