మీరు మమ్మల్ని ఏరివేసి నీటిలో ముంచగలరని ఎక్కడో రాశాను. కానీ త్వరలోనే మీ కోసమంటూ నీరు మిగిలి ఉండదు. మీరు మా భూమిని, మా నీటిని దొంగిలించవచ్చు, కానీ మేం మీ భవిష్యత్ తరాల కోసం పోరాడుతూనే చనిపోతాం. నీరు, అడవి, భూమి కోసం మనం చేసే పోరాటాలు మనవి మాత్రమే కాదు, మనం ఎవరం ప్రకృతి నుండి వేరు కాదు. ఆదివాసీ జీవితాలు ప్రకృతితో మమేకమై జీవిస్తున్నాయి. మనల్ని మనం దాని నుండి వేరుగా చూడలేం. దేహవాలీ భీలీలో రాసే చాలా కవితలలో, నేను మన ప్రజల విలువలను కాపాడటానికి ప్రయత్నించాను.
ఆదివాసీ సమాజాల గురించి మన ప్రాపంచిక దృక్పథం ముందుముందు తరాలకు పునాది కాగలదు. అందుకే ఆ జీవన విధానానికీ, దృక్పథానికీ తిరిగి వెళ్ళటం తప్ప వేరే గత్యంతరం లేదు. కానిపక్షంలో సామూహికంగా సమాజం ఆత్మహత్య చేసుకోవడమే మిగిలిన దారి అవుతుంది.


