అయితే, అధికార తెలుగుదేశం పార్టీకి గట్టి మద్దతుదారుడైన శంకరరావు తనకు కేటాయించిన ప్లాట్‌ను 2 కోట్లకి అమ్మేశాక పని చేయటం మానేశారు . నేను సేఠ్ లా బతుకుతున్నాను. నేను ఇప్పుడు ఆనందంగా ఉన్నాను. నేను వ్యవసాయం నుండి పదవీ విరమణ చేశాను. ఏ ప్రభుత్వోద్యోగి కంటే కూడా 10 ఏళ్ళు ముందుగా నేను పదవీ విరమణ చేశాను ", అని ఆయన సంతోషంగా చెప్పారు. "ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి అద్భుతంగా ఉంది." అని అన్నారు.
‘ప్లాట్ డెవలప్మెంట్ను అర్థం చేసుకోవడానికి’, ఎ పి సి ఆర్ డి ఎ రాజధాని కోసం తమ భూములను ఇచ్చిన కొంతమంది రైతులను సింగపూర్‌కు వరుస పర్యటనలకు తీసుకువెళ్లిందని స్థానిక వార్తాపత్రికలు ప్రచురించాయి. ఇలా వెళ్ళినవారిలో ఉద్దండరాయునిపాలెంలో 15 ఎకరాల పొలం ఉన్న కమ్మ రైతు బత్తుల నాగమల్లేశ్వరరావు (59) ఉన్నారు. ఈయన 2017 సెప్టెంబర్‌లో ఆరు రోజుల పాటు సింగపూర్‌కు వెళ్లారు. "అమరావతి అభివృద్ధి గురించి నాకు సందేహం ఉండేది. కానీ సింగపూర్ ఎలా అభివృద్ధి చెందిందో చూసి వచ్చిన తర్వాత, అమరావతి కూడా అదే తరహాలో అభివృద్ధి చెందుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను" అని ఆయన చెప్పారు.
ఆయన కుమారుడైన బత్తుల తిరుపతి రావు (35) ఒక ఐ టి ప్రొఫెషనల్. ఒక దశాబ్దం తర్వాత అమెరికా నుండి తిరిగి వచ్చిన ఆయన ఇక్కడ పరిస్థితి అంత ఆశాజనకంగా ఉందని అనుకోటం లేదని అన్నారు. “నేను అమరావతిలో వ్యాపారం ప్రారంభించడానికి 2017 మేలో అమెరికా నుండి తిరిగి వచ్చాను. కానీ ఇక్కడ నిర్మాణ పనులు ప్రారంభించి నాలుగేళ్లయినా సరైన మౌలిక సదుపాయాలు లేవు. అధ్వాన్నమైన రోడ్లు, విద్యుత్తు అంతరాయాలు, బలహీనమైన మొబైల్ సిగ్నల్స్. పరిస్థితి ఇలా ఉంటే, ఈ ప్రాంతంలో కంపెనీలు తమ శాఖలను ఎందుకు ఏర్పాటు చేస్తాయి?” అని ఆయన అడిగారు. “ప్రస్తుతం 'మెగా వరల్డ్ క్లాస్' అమరావతి కేవలం పేపర్ మీద, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లలో మాత్రమే ఉంది. మనం అక్కడికి చేరుకునే ముందు చాలా చేయాల్సినది ఉంది. ఇక్కడ స్థానిక పరిస్థితులలో మార్పులు చేయకుండా సింగపూర్ మోడల్ని అమరావతికి తీసుకురావాలనుకోటం ఉత్త తెలివితక్కువతనమే అవుతుంది.” అని ఆయన అన్నారు.
2014 డిసెంబరులో నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్ బృందం రాజధాని ప్రాంతంలోని గ్రామాలను సందర్శించింది. ఈ బృందానికి ఎం.జి. దేవసహాయం నాయకత్వం వహించారు. మాజీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారి కూడా అయిన ఈయన 1960లో చండీగఢ్ క్యాపిటల్ సిటీ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశారు. ఆయన ఇలా అన్నారు, “రియల్ ఎస్టేట్ ఆర్థిక వ్యవస్థ కోసం రైతు ఆర్థిక వ్యవస్థను చేస్తున్న ఈ విధ్వంసాన్ని చూస్తుంటే నాకు 1770లలో గ్రామీణ జీవనం గురించి ఆలివర్ గోల్డ్‌స్మిత్ రాసిన కవిత, ది డెసర్టెడ్ విలేజ్ గుర్తువస్తోంది. ఈ కవితలోని ఈ పంక్తులు – “ఇల్ ఫేర్స్ ది ల్యాండ్, టు హాజనింగ్ ఇల్స్ ఎ ప్రే/ వేర్ వెల్త్ అక్యుమిలేట్స్, అండ్ మెన్ డికే (సంపద పోగుపడినప్పుడు మనుషులు క్షీణిస్తారు. గ్రామీణ ప్రాంతాలు అన్ని రకాల ఇబ్బందులకు గురవుతాయి)” – అమరావతిలో ఎం జరుగుతోందో ఈ పంక్తులే సంక్షిప్తంగా చెపుతున్నాయి.”
ఈ వరసలో ఇంకొన్ని శీర్షికలు:
‘This is not a people’s capital’
New capital city, old mechanisms of division
‘Let the state give us the jobs it promised’
A wasteland of lost farm work
Mega capital city, underpaid migrant workers
అనువాదం: కె. పుష్ప వల్లి