సునీల్ గుప్త ఇంటి నుంచి పని చేయలేడు. గేట్ వే ఇండియానే అతని ‘ఆఫీస్’. కానీ 15 నెలలుగా లాక్ డౌన్ ఉండడం వలన ఆ ప్రదేశానికి వెళ్ళడానికి అతనికి అనుమతి లేదు.
‘ఇదే మా ఆఫీసు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి?’, అని అతను సౌత్ ముంబై లోని ఆ స్మారక భవనాన్ని చూపిస్తూ అడిగాడు.
లాక్ డౌన్ మొదలయ్యేవరకు సునీల్ తన కెమెరాని పట్టుకుని ఉదయం 9 నుంచి రాత్రి 9 దాకా ప్రసిద్ధి పొందిన ఈ సందర్శకుల స్థలంలో ఉండేవాడు. ప్రజలు చెక్ పాయింట్లను దాటి గేట్ వే వైపు వెళ్తుండగా అతను, అతనిలాంటి ఫొటోగ్రాఫర్లు వారిని పలకరించి క్లిక్ అండ్ ప్రింట్ ఫోటోలు తీసుకొమ్మని గట్టిగా బతిమాలుతుంటారు. ‘ఒక్క నిముషంలో ఫామిలీ ఫోటో, ఒక్క ఫోటో నే, ఓన్లీ 30 రూపీస్’.
ముంబై లో లాక్ డౌన్ పై పరిమితులు తీసేసాక ఏప్రిల్ మధ్యలో ఒక్కసారిగా కేసులు పెరిగిపోయాయి. దాని వలన అందరికి పని అందకుండా పోయింది. “నేను పొద్దున్న ఇక్కడికి వచ్చాను, కానీ నా మొహాన ‘నో ఎంట్రీ’ అచ్చు గుద్ది పంపించేశారు”. అని 39 ఏళ్ళ సునీల్ నాకు ఏప్రిల్ లో చెప్పాడు. “మేము ఇప్పటికే సంపాదనకు కష్టపడుతున్నాము. ఇప్పుడు మా దగ్గర ఉన్న డబ్బు కూడా తగ్గిపోయి, నెగటివ్ లోకి వెళ్ళిపోయాము. నాకిక ఈ నష్టాలను తట్టుకునే ఓపిక లేదు.” అన్నాడు.
వాళ్ళ ‘ఆఫీస్’లో పని ఉన్నప్పుడు, సునీల్ ఇంకా వేరే ఫొటోగ్రాఫర్లు(అందరు మగవాళ్లే) నీట్ గా ఇస్త్రీ చేసిన షర్ట్, నల్లటి ప్యాంటు, నల్లని షూ వేసుకుని ఫార్మల్ గా వస్తారు. వారి కెమెరా వారి మెడ కిందుగా వేలాడుతుంటుంది. వెనక తగిలించుకున్న బాగ్ వీపుకు అతుక్కుని ఉంటుంది. కొంతమంది మంచి సన్ గ్లాసులు షర్ట్ కు తగిలించుకుంటారు- సందర్శకులు ఎవరైనా సరదాగా సన్ గ్లాసులు పెట్టుకుని స్టైల్ గా ఫొటో దిగాలని ఉత్సాహపడవచ్చు.
“ఇప్పుడు మీరు ఎక్కువమంది మా వాళ్ళని(ఫొటోగ్రాఫర్లని) తక్కువ మంది సందర్శకులని చూస్తున్నారు”, అన్నాడు సునీల్ . మార్చ్ 2020 లో మొదటి లాక్ డౌన్ కు ముందు ఇంచుమించుగా 300 ఫొటోగ్రాఫర్లు ఇక్కడ ఇండియా గేట్ వే వద్ద ఉండేవారు. అప్పటి నుంచి ఆ సంఖ్య వంద కన్నా తక్కువైపోయింది. చాలామంది వేరే పనులకు వెళ్లిపోయారు, కొందరు వారి స్వగ్రామాలకు కూడా తిరిగి వెళ్లిపోయారు.
పోయిన ఏడాది ఆగష్టు నుంచి సునీల్ మళ్లీ పని చేయడం మొదలుపెట్టాడు. “మేము వర్షాలలో కూడా రాత్రనక, పగలనక నుంచుని ఎదురు చూసాము కానీ ఏ కస్టమర్లూ రాలేదు. దీపావళి(నవంబర్ లో) పండగ సమయంలో నా దగ్గర పిల్లలకు ఒక స్వీట్ ప్యాకెట్ కొనడానికి కూడా డబ్బులు లేకపోయాయి.” అన్నాడు. తరువాత అతనికి ‘అదృష్టం’ అంది వచ్చి, 130 రూపాయిలు ఆ రోజుకు సంపాదించగలిగాడు. ఆ సమయంలో ఫొటోగ్రఫర్లకు వ్యక్తిగతంగా కొందరు దాతలు కొంచెం ఆర్ధిక సహాయం అందిస్తే, స్వచ్చంద సంస్థలు రేషన్ ఇచ్చాయి.
2008 లో అతను తన పని మొదలుపెట్టినప్పటినుండి సునీల్ సంపాదన దిగజారుతూనే ఉంది. రోజుకు 400-1000 రూపాయిల వరకు(లేదంటే పండగలప్పుడు ఎక్కువలో ఎక్కువ ఇంచుమించుగా 10 మంది ఫోటో తీయించుకుంటే 1500 రూపాయిలు) వచ్చే ఆదాయం, ప్రజలు స్మార్ట్ ఫోన్లు వాడడం మొదలైన దగ్గరనుంచి రోజుకు 200-600 కు దిగిపోయింది.
పోయిన ఏడాది లాక్ డౌన్ మొదలైన దగ్గర నుంచి, రోజుకు 60-100 రూపాయిలకన్నా ఎక్కువ రావడం లేదు.
“బోణి బేరం తగలకుండానే ఇంటికి తిరుగమొఖం పట్టడం మా తలరాత అయింది. అసలే కొద్ది సంవత్సరాలుగా మా వ్యాపారం చాలా తక్కువగా సాగుతోంది. కానీ ఇలా (ఏ ఆదాయమూ లేకుండా) ఇంత తరచుగా ఎప్పుడూ జరగలేదు”. అన్నాడు సునీల్. అతను తన భార్య సింధు, (ఇంట్లో ఉంటుంది, అప్పుడప్పుడు బట్టలు కుట్టడం నేర్పిస్తుంది), తన ముగ్గురు పిల్లలతో సౌత్ బొంబాయి లో కఫ్ పెరేడ్ ప్రాంతంలోని మురికివాడలో ఉంటున్నాడు.
సునీల్ ఈ సిటీ కి తన మామయ్యతో 1991 లో ఉత్తరప్రదేశ్ లో ఫర్సరా ఖుర్ద్ గ్రామం నుంచి వచ్చాడు. అతని కుటుంబం ‘కందు’ సామాజిక వర్గానికి చెందినది(ఓబీసీ). అతని తండ్రి పసుపు, గరమ్ మసాలా వంటి ఇతర మసాలా దినుసులను మావు జిల్లాలో ఉన్న తమ ఊరిలో అమ్మేవాడు. “మా మామ, నేను గేట్ వే దగ్గర, ఒక తేల పెట్టుకుని భేల్ పూరి అమ్మేవాళ్ళం. లేదంటే పాప్ కార్న్, ఐస్ క్రీం, నిమ్మకాయ నీళ్లు అమ్మేవాళ్ళం. నేను ఇక్కడ కొంత మంది ఫొటోగ్రాఫర్లు పని చేయడం చూసాను, నాకు కూడా ఆసక్తి పుట్టి ఈ పని లో చేరాను.” అన్నాడు సునీల్.
నెమ్మదిగా అతను తాను పొదుపు చేసిన డబ్బుతో పాటుగా వారి వద్దా వీరి వద్దా అప్పు చేసి, 2008 లో ఒక సెకను హ్యాండ్ SLR కెమెరా, ప్రింటర్ బోర బజార్ మార్కెట్ లో కొన్నాడు(2019 చివరలో అతను అప్పు చేసి మళ్లీ ఖరీదైన Nikon D 7200 మళ్ళీ కొన్నాడు. ఆ అప్పు ఇంకా తీరుస్తూనే ఉన్నాడు).
అతను తన కెమెరా ని కొన్నప్పుడు సునీల్ వ్యాపారం బాగా సాగుతుంది, అనుకున్నాడు. ఎందుకంటే ప్రింటర్ పక్కనే ఉంటుంది కాబట్టి, ఫోటోలు వెంటనే ఇవ్వొచ్చు కస్టమర్లకి. కానీ ఆ తరవాత స్మార్ట్ ఫోన్లు చాలా తేలికగా అందరికి అందుబాటులోకి వచ్చాయి. అతని ఫోటోలకు డిమాండ్ కూడా హఠాత్తుగా పడిపోయింది. గత పదేళ్లుగా, కొత్తగా ఈ వృత్తిలోకి ఎవరూ రాలేదు అని చెప్పాడు. అతను చివరి బ్యాచ్ లో ఉన్న ఫోటోగ్రాఫర్.
ఇప్పుడు కొందరు పోర్టబుల్ ప్రింటర్లే కాక, స్మార్ట్ ఫోనులతో ఉన్న పోటీని ఎదుర్కోవడానికి USB పోర్టల్ డివైస్ వాడుతున్నారు. వారు తీసిన ఫోటోలు కస్టమర్ల ఫోన్లోకి USB ద్వారా మారుస్తారు. దీనికి వారు 15 రూపాయిలు తీసుకుంటారు. అదే ఒక సాఫ్ట్ కాపి, వెంటనే ఇచ్చే హార్డ్ కాపీకి ఐతే 30 రూపాయిలు తీసుకుంటారు.
సునీల్ పని మొదలు పెట్టక మునుపు గేట్ వే వద్ద ఫొటోగ్రాఫర్లు పోలరాయిడ్ లు వాడేవారు, కానీ అవి చాలా ఖరీదైనవి, పైగా మైంటైన్ చేయడం కష్టం, అని వారు చెబుతారు. తరవాత వారు పాయింట్ అండ్ షూట్ కెమెరాలకు మారిన తరువాత కస్టమర్లకు పోస్టు ద్వారా ఫోటోలు పంపుతారు.
ఈ గేట్ వే ఫోటోగ్రాఫర్లలో, దశాబ్దాల క్రితం పోలరాయిడ్ కెమెరా వాడిన వారిలో గంగారాం చౌదరి ఉన్నారు. “అప్పట్లో సందర్శకులే మా దగ్గరికి వచ్చి ఫోటోలు తీయమని అడిగేవారు.” అని గుర్తుచేసుకున్నారు. “కానీ ఇప్పుడు ఎవరూ మా వైపు చూడరు, మేము అసలు ఇక్కడ ఉన్నట్టే లెక్కించరు.”
గంగారాం తన కౌమార వయసులోనే గేట్ వే దగ్గర పని చేయడం మొదలుపెట్టాడు. అతను బీహార్ రాష్ట్రం లోని మధుబని జిల్లా, డుమ్రి గ్రామాన్నుంచి వచ్చాడు. అతను కెవట్ సామాజిక వర్గానికి చెందిన వాడు(ఓబీసీ). అతను ముందు కలకత్తా వెళ్ళాడు. అక్కడ అతని తండ్రి రిక్షా తొక్కేవాడు. కలకత్తాలో ఒక వంటమనిషి కింద పనిచేయడానికి అతనికి నెలకు 50 రూపాయిలు ఇచ్చేవారు. మరో ఏడాదిలో అతని యజమాని అతనిని వాళ్ల బంధువుల ఇంటిలో పనిమనిషిగా పంపించాడు.
కొంతకాలం తరవాత గంగారాం ఒక దూరపు బంధువును కలిసాడు. అతను గేట్ వే అఫ్ ఇండియాలో ఫోటోగ్రాఫర్ గా పని చేయడం చూసి, “ నేనెందుకు ఆ పని చేయకూడదు అనుకున్నా,” అని ప్రస్తుతం యాభైల్లో ఉన్న అతను చెప్పాడు. ఆ సమయం లో (1980 లలో) ఆ స్మారక భవనం వద్ద 10-15 ఫొటోగ్రాఫర్లు ఉండేవారు. అప్పటికే పనిలో ఆరితేరిన కొందరు వాళ్ల పోలరాయిడ్ కెమెరాను, పాయింట్ అండ్ షూట్ కెమెరాను కొత్తవారికి కమిషన్ మీద ఇచ్చేవారు. గంగారాంని ఫోటో ఆల్బం లు పట్టుకుని వెళ్లి అవి చూపించి, కస్టమర్లను తీసుకురమ్మనేవారు. నెమ్మదిగా అతనికి కెమెరా కూడా ఇచ్చారు. కస్టమర్ల వద్ద తీసుకున్న 20 రూపాయలలో 2 లేదా 3 రూపాయిలు అతను ఉంచుకునేవాడు. అతను, అతను లాంటి మరికొంతమంది, రాత్రుళ్ళు కొలాబా లో పేవ్ మెంట్ల పై పడుకునేవారు, పగలు వారి వద్ద ఫోటోలు తీయించుకునే వారి కోసం వెతికేవారు.
“ఆ వయసులో ఎలాగోలా తిరిగి డబ్బులు సంపాదించే ఉత్సాహం ఉండేది”, నవ్వుతూ అన్నాడు గంగారాం. “మొదట్లో నేను తీసిన ఫోటోలు వంకరగా వచ్చేవి, కానీ మనం పని చేస్తున్న కొద్దీ నేర్చుకుంటాము.”
ప్రతి రీల్ ఖరీదైనది, 36 ఫోటో రీల్ 35-40 రూపాయిల మధ్యలో ఉండేది. “మేము అలా ఫోటోలు తీస్తూ పోలేము. ప్రతి ఫోటో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ తీయవలసి వచ్చేది. ఇప్పటిలాగా ఎన్ని కావాలంటే అన్ని తీసుకునే డిజిటల్ ఫొటోల్లాగా కాదు.” అని గంగారాం అన్నాడు. వాళ్ల కెమెరాల్లో ఫ్లాష్ లైట్లు లేని కారణంగా సూర్యాస్తమయం తరవాత ఫోటోలు తీసుకునే వారు కాదని గుర్తుచేసుకున్నాడు.
ఫోర్ట్ ఏరియా లో 1980 లలో షాపులలో లేదా చిన్న ఫోటో స్టూడియోలలో ఒక ఫోటోని ప్రింట్ చేయడానికి ఒక రోజు పట్టేది. 15 రూపాయిలు ఒక రీల్ డెవలప్ చేయడానికి అయేది, 1.50 రూపాయిలు 4 x 5 ఇంచీల కలర్ ఫోటో ప్రింట్ తీయడానికి అయ్యేది.
“కానీ మేము ఇవన్నీ మోసుకు తిరగాలి”, అన్నాడు గంగారాం. ఈ ఫోటోగ్రాఫర్ లు 6-7 కిలోకు మోసుకుంటూ తిరగాలి - కెమెరా, ప్రింటర్, ఆల్బములు, పేపర్(ఒక 50 పేపర్ల ప్యాకెట్ ఖరీదు 110 రూపాయిలు, అదనంగా కాట్రిడ్జ్ ఖర్చుకూడా ఉంటుంది). “మేము రోజంతా ఇక్కడ నుంచుని వచ్చిన వారిని ఒక్క ఫోటో దిగమని ఒప్పించడానికి కష్టపడతాం. నా వీపంతా నొప్పి వస్తుంది.” అన్నాడు గంగారాం. ప్రస్తుతం ఇతను నారిమన్ పాయింట్ దగ్గర ఉన్న మురికివాడలో తన భార్య కుసుమ్, ముగ్గురు పిల్లలతో ఉంటున్నాడు.
గేట్ వే వద్ద అతను కొత్తగా పని చేస్తున్న రోజుల్లో, ముంబై చూడడానికి వచ్చిన కొన్ని కుటుంబాలు ఫ్టోటోగ్రాఫర్లను, వారితో పాటుగా వారు వెళ్లిన ప్రతి చోటికి తీసుకు వెళ్లేవారు. ఆ ఫోటోలను వారికి పోస్టులో కానీ కొరియర్ ద్వారా కానీ పంపించేవారు. ఒకవేళ ఫోటోలు సరిగ్గా రాకపోతే, ఫొటోగ్రాఫర్లు ఆ డబ్బును వెనక్కి పంపేసి, క్షమాపణ చెబుతూ ఒక ఉత్తరం రాసేవారు.
“అదంతా నమ్మకం పై జరిగేది, మంచి కాలం. రకరకాల రాష్ట్రాల నుంచి మనుషులు వచ్చేవారు, ఫోటోలకు విలువ ఉండేది. వాళ్ళకీ అదొక జ్ణాపకం. ఇంటికి వెళ్ళాక వాళ్ళ కుటుంబాలకు చూపించుకునేవాళ్ళు. వాళ్ళు మమ్మల్ని మా ఫోటోగ్రఫీ ని నమ్మేవారు. మా ప్రత్యేకత ఏంటంటే ఆ ఫోటో తాజ్ హోటల్ గేట్ వే పైన గోపురాన్ని వారు చేతితో తాకినట్టుగా తీసేవాళ్ళం.” అన్నాడు గంగారాం.
ఎంత బాగా జరిగిన రోజుల్లోనైనా అప్పటి కష్టాలు అప్పుడు ఉండేవి, అని గుర్తుకు తెచ్చుకున్నాడు గంగారాం. కొన్నిసార్లు ఎవరైనా కస్టమర్ కంప్లైంట్ ఇచ్చాడని, లేదా కొందరు కోపంగా గేట్ వే కు వచ్చి వారికి ఫోటో అందలేదు, వారికి మోసం జరిగింది అని చెబితే, ఫొటోగ్రాఫర్లనందరిని కొలాబా పోలీస్ స్టేషన్ కు పిలిచేవారు. “నెమ్మదిగా మేము మాతో పాటు ఒక రిజిస్టర్ పట్టుకుని తిరగడం మొదలుపెట్టాము. ఆ రిజిస్టర్ లో అక్కడి పోస్ట్ ఆఫీస్ స్టాంపులు సాక్ష్యం గా ఉంచుకునే వాళ్ళం,” అన్నాడు గంగారాం.
కొన్నిసార్లు సందర్శకుల వద్ద డబ్బులుండవు. అలాంటి సమయాల్లో ధైర్యం చేసి ఫోటోలు పంపి డబ్బుల పంపుతారో లేదో అని ఎదురు చూడవలసి వచ్చేది.
నవంబర్ 26, 2008 లో టెర్రరిస్టుల దాడి జరిగాక కొంతకాలం పని ఆగిపోయిందని గుర్తుచేసుకున్నాడు గంగారాం, కానీ నెమ్మదిగా సందర్శకులు పెరిగారు. “ప్రజలు వచ్చి తాజ్(గేట్ వే అఫ్ ఇండియా కు ఎదురుగా), ఓబ్రయి హోటల్ (దాడి జరిగిన రెండు ప్రదేశాలు) కు వచ్చి ఫోటోలు దిగుతారు. ఇప్పుడు ఆ ప్రదేశాలకు కూడా ఒక కథ ఉంది.” అన్నాడు.
ఇటువంటి కథలను ఫ్రేమ్ చేస్తూ వచ్చిన బైజనాథ్ చౌదరి, గేట్ వే కి కిలోమీటర్ దూరం లో నారిమన్ పాయింట్ వద్ద ఓబ్రయి(ట్రైడెంట్) హోటల్ ముందు పేవ్ మెంట్ల వద్ద పని చేస్తాడు. ప్రస్తుతం యాభయేడేళ్లున్న బైజనాథ్ నాలుగు దశాబ్దాలుగా ఫ్టోటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు. అతని తో పాటు పనిచేసినవారెందరో వేరే పనులకు వెళ్లిపోయారు.
అతను బీహార్ లోని మధుబని జిల్లాలో డుమ్రి గ్రామం నుంచి బొంబాయి కి 15 యేళ్ళ వయసులో అతని మావయ్యతో పాటుగా వచ్చాడు. అతని మావయ్య కోలాబా పేవ్మెంట్ మీద బైనాక్యూలర్స్ అమ్మేవాడు, అతని తల్లిదండ్రులు అతని గ్రామం లో వ్యవసాయ కూలీలుగా పనిచేసేవారు.
బైజనాథ్, గంగారాం కి దూరపు బంధువు. అతను కూడా మొదట్లో పోలరాయిడ్ కెమెరానే వాడేవాడు, తరవాత పాయింట్ అండ్ షూట్ కెమెరాకి మారిపోయాడు. అతను, అతని వంటి కొందరు ఫోటో గ్రాఫర్లు నారిమన్ పాయింట్ వద్ద ఒక దుకాణాదారుడికి రాత్రుళ్ళు వారి కెమెరాలను భద్రపరచడానికి ఇచ్చి తాజ్ హోటల్ వద్ద ఫుట్ పాత్ ల పైన పడుకునేవారు.
దగ్గరగా రోజుకు 6-8 మంది కస్టమర్ల వలన బైజనాథ్ కి 100-200 రుపాయిల వరకు ఆదాయం వచ్చేది. తరవాత అది 300-900 వరకు పెరిగింది - కానీ స్మార్ట్ ఫోన్లు వచ్చాక, అతని ఆదాయం 100-300 కి పడిపోయింది. లాక్డౌన్ మొదలయ్యాక అతనికి రోజుకు 100 రూపాయైలు ఇంకా కొన్నిసార్లైతే 30 రూపాయిలు, లేదా ఒక్కోరోజు అసలు ఏమి రాదు.
2009 వరకు అతను నార్త్ ముంబై, శాంతా క్రజ్ పబ్బుల్లో కూడా ఫోటోగ్రాఫర్ గా పని చేసాడు. అక్కడ అతను ఒక ఫోటో కి 50 రూపాయిలు తీసుకునేవాడు. “నేను పొద్దున్న 9 నుంచి రాత్రి 10 వరకు నారిమన్ పాయింట్ వద్ద పని చేసి, రాత్రి భోజనం తరవాత క్లబ్ కి వెళ్ళేవాడిని”, అన్నాడు బైజనాథ్. అతని పెద్ద కొడుకు 31 ఏళ్ళ విజయ్ కూడా గేట్ వే అఫ్ ఇండియా వద్ద ఫోటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు.
బైజనాథ్, ఇంకా వేరే ఫొటోగ్రాఫర్లు వారు పని చేయడానికి పర్మిట్లు అవసరం లేదని చెప్పారు. కానీ 2014 నుంచి వారికి ముంబై టార్ట్ ట్రస్ట్, మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఐడెంటిఫికేషన్ కార్డులు ఇచ్చారు. ఐతే ఈ ఏర్పాటులో డ్రెస్ కోడ్ కచ్చితంగా పాటించాలి, అంతే కాక స్మారక భవనం వద్ద ఏమైనా వదిలేసిన బ్యాగులు ఉంటే గమనించుకోవాలి, ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టే సంఘటనలు జరిగినప్పుడు వెంటనే అక్కడికి చేరి జోక్యం చేసుకోవడమో లేక రిపోర్ట్ చేయడమో చెయ్యాలి. (కానీ విలేఖరి ఈ విషయాలు నిర్ధారించుకోలేదు.)
ఇంతకూ ముందైతే మునిసిపల్ కార్పొరేషన్ కానీ పోలీసులు కానీ వారిపై ఫైన్ లు వేసి వారు పని చేయకుండా ఆపేసేవారు. 1990 ల లో వారంతా కలిసి వారి ఇబ్బందులు చెప్పుకోవడానికి ఒక వెల్ఫేర్ అసోసియేషన్ గా ఏర్పడ్డారు. “మా పనికి కాస్త గుర్తింపు కావాలనుకున్నాము, మా హక్కుల గురించి పోరాడాలనుకున్నాము”, అన్నాడు బైజనాథ్. 2001 లో 60-70 ఫొటోగ్రాఫర్లు ఆజాద్ మైదాన్ వద్ద నిరసన చేశారు అని గుర్తుచేసుకున్నాడు. వేరే డిమాండ్ల తో పాటుగా పని వేళ పరిమితులు పెట్టకుండా పనిచేసుకొనివ్వడం కూడా ఆ డిమాండ్లలో ఒకటి. 2000లో కొందరు గేట్ వే అఫ్ ఇండియా ఫోటో గ్రాఫర్స్ యూనియన్ అని ఏర్పడి లోకల్ ఎం ఎల్ ఏ ని కూడా కలిసి వారి డిమాండ్లను చెప్పారు. ఈ ప్రయత్నాల వలన వారికి మునిసిపల్ కార్పొరేషన్, పోలీసుల నుండి కాస్త తెరిపి దొరికింది.
బైజనాథ్ తన ఫోటోగ్రఫీ కి విలువ ఉన్న చిన్నప్పటి రోజులని గుర్తు చేసుకున్నాడు. “ఈ రోజు ఎవరిని చూస్తే వారు ఫ్టోటోగ్రఫీలో ఉన్నారు”, అన్నాడు. “కానీ నేను సంవత్సరాల తరబడి రోజూ ఇక్కడికి వచ్చి ఫోటోలు తీస్తూ పని బాగా నేర్చుకున్నాను. మేము ఒక్క ఫోటో తీస్తే చాలు. కానీ ఇప్పటి యువకులు పదుల కొద్దీ ఫోటోలు తీసి అందులో మంచిది ఎంచుకుని మళ్లీ దాన్ని ఎడిట్ చేస్తారు.” అక్కడికి వస్తున్న సందర్శకుల సముదాయాన్ని చూసి తాను కూర్చున్న చోటు నుంచి లేస్తూ అన్నాడు. అతను వాళ్ళను ఫోటోకి ఒప్పించడానికి ప్రయత్నించాడు కానీ ఎవరికి ఫోటో దిగే ఆసక్తి లేదు. అందులో ఒకరు తన జేబులోంచి ఫోన్ తీసి సెల్ఫీలు తీసుకుంటున్నారు.
గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద సునీల్ ఇంకా వేరే ఫొటోగ్రఫర్లు జూన్ మధ్య నుంచి మళ్లీ వాళ్ళ ఆఫీస్ పని మొదలుపెట్టారు. వారిని స్మారక భవనం లోనికి ఇంకా అడుగుపెట్టనివ్వడం లేదు కాబట్టి వాళ్ళు బయట , తాజ్ ఉన్న చోట నుంచుని కస్టమర్లని ఫోటో కోసం ఒప్పిస్తూ ఉంటారు. “మేము మా కెమెరాను, ప్రింటర్ ను, ఫోటో పేపర్లను కాపాడుకోవాలి. ఇదిగాక ఒక గొడుగును కూడా తెరిచి పట్టుకొని, సరైన బాలన్స్ తో నుంచుని మంచి ఫోటో తీయాలి.”
ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ సెల్ఫీల హవా, లాక్ డౌన్లు- ఉన్న ‘ఏక్ మినిట్ మే ఫామిలీ ఫోటో ప్లీజ్’(ఒక్క నిముషంలో ఫ్యామిలీ ఫోటో, ప్లీజ్) అనే కొద్ధి ఫొటోగ్రాఫర్లనూ వెనక్కి తోసేస్తున్నప్పుడు, ఆ ఫొటోగ్రాఫర్లు వారి సంపాదనను బాలన్స్ చేయడమే ఇంకా ఎక్కువ కష్టం.
అతని బాక్ పాక్ లో సునీల్ ఒక వాళ్ళ పిల్లల ఫీజుల రిసీట్ బుక్ ని ఉంచుకుంటాడు. తన పిల్లలు కోలోబా లో ఒక ప్రైవేట్ స్కూల్ లో చదువుతున్నారు. “ నేను స్కూల్ ని నాకు కొంచెం సమయం ఇవ్వమని అడుగుతున్నాను(ఫీజ్ కట్టడానికి) అన్నాడు. పోయిన ఏడాది సునీల్ ఒక చిన్న ఫోన్ కొనుక్కున్నాడు, తన పిల్లలు ఆన్లైన్ క్లాసులకు హాజరుకావచ్చని. “మా జీవితాలు అయిపోయాయి. కనీసం వాళ్ళు నాలాగా ఎండలో మాడకపోతే పొతే చాలు. వాళ్లు ఏసీ ఆఫీసుల్లో పని చెయ్యాలి.” అన్నాడు. “నేను ప్రతీరోజు ఒకరికి ఒక జ్ఞాపకాన్ని బహూకరించి నా పిల్లలకు కాస్త మంచి జీవితాన్నివ్వాలనుకుంటా.” అన్నాడు సునీల్.
అనువాదం : అపర్ణ తోట