పంజాబ్, హరియాణాల మధ్య శంభూ, ఖనౌరీ సరిహద్దులో నిరసన తెలుపుతోన్న రైతులపై 2024 ఫిబ్రవరిలో బాష్ప వాయు గోళాలను ప్రయోగించడం, లాఠీ ఛార్జీలు చేయటం వంటి ప్రభుత్వ అణచివేత చర్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: 'శంభూ సరిహద్దు వద్ద నేను బందీనైనట్టనిపించింది'
రాజధానిలోకి ప్రవేశించే రైతులపై ప్రభుత్వం విధించిన భౌతిక అడ్డంకులు, ఆంక్షలపై స్పందిస్తూ ఒక వక్త ఒక ఆవేశపూరితమైన పిలుపు ఇచ్చారు: దిల్లీ హమారీ హై, దేశ్ పర్ వహీ రాజ్ కరేగా, జో కిసాన్ మజ్దూర్ కీ బాత్ కరేగా! [దిల్లీ మాకే చెందుతుంది! రైతుల కోసం, కార్మికుల కోసం పనిచేసేవారే దేశాన్ని పరిపాలించగలరు!]
పంజాబ్, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన రైతు, కార్మిక సంఘాల నాయకులు, 'కార్పొరేట్, మతతత్వ, నియంతృత్వ పాలన' సాగిస్తోన్న ప్రస్తుత ప్రభుత్వాన్ని శిక్షించాలని పిలుపునిచ్చారు.
“జనవరి 22, 2021 తర్వాత ప్రభుత్వం రైతు సంఘాలతో మాట్లాడనేలేదు. ఎటువంటి చర్చలూ జరగనప్పుడు, సమస్యలను ఎలా పరిష్కరిస్తారు?" అని రాకేశ్ టికైత్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. టికైత్ భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) జాతీయ అధికార ప్రతినిధి, ఎస్‌కెఎమ్‌లో ఒక నాయకుడు.
“2020-21లో రైతుల పోరాటం చివరలో, C2 + 50 శాతం వద్ద ఎమ్ఎస్‌పి [కనీస మద్దతు ధర]కి చట్టపరమైన హామీ ఉంటుందని నరేంద్ర మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ అది అమలు కాలేదు. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు, ఇంతవరకు అది కూడా చేయలేదు," అని అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్) ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజూ కృష్ణన్ అన్నారు. వ్యవసాయ ఆందోళనల గురించి PARI పూర్తి కవరేజీని చదవండి.
ఏడాదిపాటు జరిగిన రైతుల ఆందోళనల సందర్భంగా 736 మందికి పైగా రైతులు మరణించారని, వారి కుటుంబాలకు పరిహారం, వారిపై ఉన్న అన్ని కేసులను ఎత్తివేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటికీ ఎందుకు నెరవేర్చలేదని, ఉన్నత వేదికపై నుంచి మాట్లాడుతూ కృష్ణన్ ప్రస్తావించారు. “విద్యుత్ చట్టం సవరణలను ఉపసంహరించుకోవాల్సి ఉంది, అది కూడా చేయలేదు,” అని మహాపంచాయత్‌లో PARIతో మాట్లాడుతూ అన్నారు కృష్ణన్