'వారానికి ఆరు రోజులు పనిచేసి రోజుకు 150 రూపాయలు సంపాదించేదాన్ని. ఇప్పుడసలు చేయడానికి పనే లేకుండా పోయింది' అని చెప్పారు, తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన వేమూరి సుజాత (38) అనే మహిళ. భర్తను కోల్పోయిన ఈ దళిత మహిళ మాల సామాజికవర్గానికి చెందినవారు. తమకంటూ సొంత భూమి లేకపోయినా, వ్యవసాయ కూలీగా 2015 జనవరి వరకూ పనిచేశారు.
కొత్త ‘ప్రపంచస్థాయి రాజధాని అమరావతి నిర్మాణం’ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీస్థాయిలో భూముల్ని సేకరించడం ప్రారంభించగానే, రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో వ్యవసాయ పనులు దాదాపుగా ఆగిపోయాయి. 2014లో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలుగా విడిపోయిన తర్వాత, అమరావతి నిర్మాణం పూర్తయేవరకూ, హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలకూ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.
సుజాత భర్త 2008లో మరణించడంతో ఆమె కూలీపనులకు వెళ్తూ, తన పిల్లల్ని కష్టమ్మీద పోషించుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏదో ఒక జీవనోపాధిని సంపాదించడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమె పెద్ద కొడుకు వేమూరి ప్రసాద్ (19) తుళ్లూరు జిల్లా పరిషత్ పాఠశాల నుంచి 2015లో పదవ తరగతి పూర్తయ్యాక చదువు ఆపేశాడు. ఒక ఏడాది తర్వాత అతని తమ్ముడు వేమూరి రాజా (17) కూడా అదే పాఠశాల నుంచి డ్రాపవుట్‌గా బయటికొచ్చాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లలూ కృష్ణానది ఒడ్డున జరుగుతున్న ఇసుక క్వారీ పనుల్లో దినసరి కార్మికులుగా పనిచేస్తూ రోజుకు 200 నుంచి 250 రూపాయల దాకా సంపాదిస్తున్నారు. పని తక్కువగా వుండడం కారణంగా ప్రస్తుతం వారికి వారానికి మూడు రోజులు మాత్రమే పని దొరుకుతోంది.
సుజాత చిన్న కొడుకు రాజా మాట్లాడుతూ 'మేము చేసే పనికి మాకు చాలా శక్తి అవసరమవుతుంది. ఉదయం 6 గంటలకు క్వారీకి వెళ్లి, సాయంత్రం 6 గంటలకు ఇంటికి తిరిగొస్తాం' అని చెప్పాడు. క్వారీ పనుల్లో మహిళల్ని నియోగించకపోవడం, స్థానికంగా వ్యవసాయ పనులు లేకపోవడంతో సుజాత వంటి ఎంతోమంది మహిళా కూలీలు ఇంటికే పరిమితం కావల్సివస్తోంది.










