కొన్ని నెలల క్రితం, ఒక రోజు ఉదయం, వర్సోవా జెట్టీలో క్రీక్ అంచున ఉన్న రాయిపై కూర్చున్న రామ్‌జీ భాయ్‌ ని ఏం చేస్తున్నాడని నేను ఆరా తీస్తే, "టైంపాస్," అని బదులిచ్చారు. అతను అప్పుడే పట్టుకున్న చిన్న టెంగ్డా ని (ఒక రకమైన క్యాట్ ఫిష్) నాకు చూపిస్తూ, "దీన్ని ఇంటికి తీసుకెళ్లి తింటాను," అన్నారు. ఇంతలో వేరే మత్స్యకారులు ముందు రోజు రాత్రి క్రీక్‌లో విసిరిన తమ వలలను శుభ్రం చేయడం చూశాను - ఆ వలల్లో ప్లాస్టిక్‌ వ్యర్ధాలు ఉన్నాయి కానీ చేపలు లేవు!

" ఖడీ లో (క్రీక్) చేపలు పట్టడం ఇప్పుడు చాలా కష్టంగా మారింది. మా చిన్నప్పుడు ఇక్కడి తీరం మారిషస్‌ తీరంలా ఉండేది. ఒక నాణెం నీటిలోకి విసిరితే అది స్పష్టంగా కనబడేంత స్వచ్ఛంగా ఉండేవి ఇక్కడి నీరు," అని భగవాన్ నామ్‌దేవ్ భాంజీ వాపోయారు. అతను ఉత్తర ముంబై కె-వెస్ట్ వార్డ్‌లోని వర్సోవా కొలివాడ అనే మత్స్యకార గ్రామంలో 70 ఏళ్లకు పైగా నివసిస్తున్నారు.

ఈ జాలర్లు ఇప్పుడు సముద్రపు లోతుల వరకూ వేటకు వెళ్తున్నా, వాళ్ళ వలల్లో తరచూ చిన్న చేపలే చిక్కుకుంటున్నాయి."ఇంతకుముందు మేము పెద్ద పెద్ద పాంఫ్రెట్లని (స్థానికంగా పాప్లెట్ అని కూడా పిలవబడే ఓకే రకమైన చేప; ముంబై వాసులు ఇష్టంగా తింటారు, తెలుగులో వీటిని చందువాయి చేపలు అంటారు) పట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు చిన్నవే దొరుకుతున్నాయి. ఇది మా వ్యాపారంపై చాలా ప్రభావం చూపిస్తోంది, " అని భగవాన్ కోడలు, 48 ఏళ్ళ ప్రియా భాంజీ చెప్పింది. ఆమె 25 సంవత్సరాలుగా ఇక్కడ చేపలు అమ్ముతోంది.

2010 మెరైన్ ఫిషరీస్ సెన్సస్ ప్రకారం, కొలివాడ లో దాదాపు 1,072 కుటుంబాలు ( 4,943 మంది జనాభా) చేపల వేట పైనే ఆధారపడి బతుకుతున్నాయి. కనుమరుగవుతున్న మత్స్య సంపద గురించి ఇక్కడ ఎవరిని అడిగినా, స్థానిక కాలుష్యం, ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న గ్లోబల్ వార్మింగ్ లే మూల కారణాలని చెబుతున్నారు. మొత్తానికి వర్సోవా, అలాగే ముంబైలోని ఇతర తీర ప్రాంతాలపై ఇవి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

Bhagwan Bhanji in a yard where trawlers are repaired, at the southern end of Versova Koliwada
PHOTO • Subuhi Jiwani

వర్సోవా కొలివాడలో దక్షిణపు భాగాన ట్రాలర్‌లను మరమ్మతులు చేసే యార్డ్‌లో భగవాన్ భాంజీ

దాదాపు రెండు దశాబ్దాల క్రితం, మలాడ్ క్రీక్ (వర్సోవా దగ్గర సముద్రంలో కలుస్తుంది) లో, కొలివాడ వాసులు- భీంగ్ (జెయింట్ హెర్రింగ్), పాలా (హిల్సా షాద్), ఇంకా ఇతర చేపలను తీరానికి సమీపంలో ఉన్న నీటిలో సులభంగా పట్టుకునేవారు. కానీ మానవ జోక్యం కారణంగా అంతా తారుమారయ్యింది.

వర్సోవా మరియు మలాడ్ వెస్ట్‌లో ఉన్న రెండు మునిసిపల్ మురుగునీటి శుద్ధి కేంద్రాల నుండి వచ్చే వ్యర్థపదార్థాలు, చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రవహించే పారిశ్రామిక వ్యర్థాలు, సుమారు 12 నల్లాల (ఓపెన్ మురుగు కాలువలు) నుండి ప్రవహించే శుద్ధి చేయని మురుగు-  ప్రస్తుతం భగవాన్ జ్ఞాపకాల్లో మాత్రమే మిగిలిన ఒకప్పటి స్వచ్ఛమైన ఖడీ లోకి ఇప్పుడు నిరంతరం ప్రవహిస్తున్నాయి. "ఈ కాలుష్య కారకాలు సముద్రంలో 20 నాటికల్ మైళ్ల దూరం వరకు వెళ్తాయి. అందుకే సముద్ర జీవాలు అంతరించుకుపోతున్నాయి. ఈ మురుగు, ధూళి, చెత్తా, చెదారం వల్ల నిర్మలమైన క్రీక్ ఇప్పుడు మురుగు గుంటలా మారింది," అని భగవాన్ బాధపడ్డారు. కొలి చరిత్ర, సంస్కృతి, స్థానిక రాజకీయాలపై అత్యంత అవగాహన ఉన్న వ్యక్తిగా అతను చుట్టుపక్కల పేరుపొందారు. కొన్నాళ్ల క్రితం వరకు చేపలను ఎండబెట్టడం, వలలు తయారు చేయడం, చనిపోయిన అతని సోదరుడి రెండు ఫిషింగ్ బోట్‌ల మరమ్మత్తులను పర్యవేక్షించడం వంటి పనులు చేసేవారు.

తీర సమీపంలోని  నీటిలో ఉండాల్సిన దానికన్నా తక్కువ స్థాయిలో ఉన్న ఆక్సిజన్‌ మోతాదులు,  పెద్ద సంఖ్యలో పెరిగే మలపు బాక్టీరియా, ఖడీ లో నీటిని మురికిగా చేస్తుంది. వీటిని చేపలు తట్టుకొని బ్రతకలేవు. నేషనల్ ఎన్వైరన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NEERI) శాస్త్రవేత్తలు 2010 లో చేసిన ఒక పరిశోధన ప్రకారం, "తక్కువ ఆటుపోట్ల సమయంలో, ఉండాల్సిన మోతాదులో Dissolved Oxygen (కరిగిపోయిన ఆక్సిజన్) లేకపోవడంతో మలాడ్ క్రీక్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అధిక ఆటుపోట్ల సమయంలో పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది..."

సముద్ర కాలుష్యానికి వాతావరణ మార్పులు తోడైనపుడు దీర్ఘకాలిక ప్రభావాలకు దారి తీస్తుంది. పెరిగిన అభివృద్ధి కార్యకలాపాలు, తీరప్రాంతంలో సముద్రపు నీటి కాలుష్యం (80 శాతం కంటే ఎక్కువ భూమి ఆధారిత వనరుల వలనే), సముద్ర ప్రవాహాలపై వాతావరణ మార్పుల ప్రభావం సముద్రంలో డెడ్ జోన్ల (ఆక్సిజన్-మృత ప్రాంతాలు) వ్యాప్తిని వేగవంతం చేస్తాయని యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ 2008 లో ప్రచురించిన "ఇన్ డెడ్ వాటర్: మెర్జింగ్ అఫ్ క్లైమేట్ చేంజ్ విత్ పొల్యూషన్, ఓవర్ హార్వెస్ట్ అండ్ ఇన్ఫెస్టేషన్ ఇన్ ది వల్డ్స్ ఫిషింగ్ గ్రౌండ్స్" అనే పుస్తకంలో తెలిపింది. "తీరప్రాంతాలలో జరుగుతున్న వేగవంతమైన నిర్మాణాల కారణంగా, మడ అడవులు, ఇతర ఆవాసాల విధ్వంసం వలన కాలుష్యం యొక్క ప్రభావాలు తీవ్రమవుతున్నాయి..." అని ఆ పుస్తకం చెబుతోంది.

Left: Struggling against a changing tide – fishermen at work at the koliwada. Right: With the fish all but gone from Malad creek and the nearby shorelines, the fishermen of Versova Koliwada have been forced to go deeper into the sea
PHOTO • Subuhi Jiwani
Left: Struggling against a changing tide – fishermen at work at the koliwada. Right: With the fish all but gone from Malad creek and the nearby shorelines, the fishermen of Versova Koliwada have been forced to go deeper into the sea
PHOTO • Subuhi Jiwani

ఎడమవైపు: మారుతున్న ఆటుపోట్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న కొలివాడ మత్స్యకారులు. కుడివైపు: మలాడ్ క్రీక్, ఇంకా సమీపంలోని తీరప్రాంతాల నుండి చేపలన్నీ వెళ్లిపోవడంతో వర్సోవా కొలివాడ జాలర్లు సముద్రపు లోతు జలాల్లో వేటకు వెళ్ళవలసి వస్తోంది

అనేక సంవత్సరాలుగా ముంబైలో కూడా రోడ్లు, భవనాలు ఇంకా ఇతర ప్రాజెక్టుల కోసం మడ అడవుల విస్తారమైన ట్రాక్‌లు క్లియర్ చేయబడ్డాయి. మడ అడవులు చేపల సంతానోత్పత్తి కేంద్రాలుగా పని చేస్తాయి. 2005 లో ప్రచురించిన ఒక రీసెర్చ్ పేపర్లో, "మడ అడవులు తీరప్రాంత సముద్ర జీవులకు మద్దతు ఇవ్వడమే కాకుండా, కోత నుండి తీరాన్ని కాపాడతాయి. అలాగే ఎస్టువరైన్  ఇంకా  ఇతర సముద్ర జీవులకు సంతానోత్పత్తి, పోషణ మరియు రక్షణ కేంద్రాలుగా పని చేస్తాయి. కానీ 1990 నుండి 2001 వరకు (కేవలం 11 సంవత్సరాలలో) ముంబై శివారు ప్రాంతంలో మొత్తం 36.54 చదరపు కిలోమీటర్ల మడ అడవులు అంతరించిపోయాయి," అని ఇండియన్ జర్నల్ ఆఫ్ మెరైన్ సైన్సెస్‌ పేర్కొంది.

"ఒకప్పుడు చేపలు గుడ్లు పెట్టడానికి (మడ అడవుల) తీరానికి వచ్చేవి, కానీ అది ఇప్పుడు జరగదు. మనందరం కలిసి వీలైనన్ని మడ అడవులను నాశనం చేసేశాము. ఇప్పుడు కొన్ని మాత్రమే మిగిలాయి. తీరప్రాంతాలు, శివార్లలో (లోఖండ్‌వాలా మరియు ఆదర్శ్ నగర్) ప్రస్తుతం ఉన్న భవనాల బదులు ఒకప్పుడు మడ అడవులు ఉండేవి," అని భగవాన్ గుర్తు చేసుకున్నాడు.

దీని ఫలితంగా, మలాడ్ క్రీక్ మరియు సమీప తీరప్రాంతాల దగ్గర చేపలు తగ్గిపోయాయి. దాంతో కొన్నేళ్లుగా, వర్సోవా కొలివాడ జాలర్లు సముద్రపు లోతు జలాల్లోకి వేటకి వెళ్తున్నారు. కానీ లోతైన సముద్రాలలో కూడా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తుఫానులు, అతిగా చేపలు వేటాడే ట్రాలర్లతో వారి వ్యాపారం దెబ్బతిన్నది.

వర్సోవా కొలివాడలో తీరప్రాంత కాలుష్యం మరియు వాతావరణం యొక్క ప్రభావాలను అధ్యయనం చేసే "బాంబే 61" అనే ఆర్కిటెక్ట్ బృందానికి చెందిన కేతకి భద్గావ్‌కర్ మాట్లాడుతూ, "ఇంతకుముందు, ఈ జాలర్లు సముద్ర తీరం నుండి 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లవలసిన అవసరం ఉండేది కాదు. డీప్ సీ ఫిషింగ్ (లోతైన సముద్రపు చేపలు పట్టడం) ఇప్పుడు లాభదాయకంగా లేదు. ఎందుకంటే ఇందులో పెద్ద పడవలు, సిబ్బంది మొదలైన వాటి కోసం చాలా పెట్టుబడి పెట్టాలి. అలాగే మత్స్యకారులు ఎక్కువ మొత్తంలో పెద్ద చేపలతో తిరిగి వస్తారని కూడా ఖచ్చితంగా చెప్పలేం."

Photos taken by Dinesh Dhanga, a Versova Koliwada fisherman, on August 3, 2019, when boats were thrashed by big waves. The yellow-ish sand is the silt from the creek that fishermen dredge out during the monsoon months, so that boats can move more easily towards the sea. The silt settles on the creek floor because of the waste flowing into it from nallahs and sewage treatment facilities
PHOTO • Dinesh Dhanga
Photos taken by Dinesh Dhanga, a Versova Koliwada fisherman, on August 3, 2019, when boats were thrashed by big waves. The yellow-ish sand is the silt from the creek that fishermen dredge out during the monsoon months, so that boats can move more easily towards the sea. The silt settles on the creek floor because of the waste flowing into it from nallahs and sewage treatment facilities
PHOTO • Dinesh Dhanga

ఆగస్ట్ 3, 2019 న పెద్ద కెరటాల తాకిడికి పడవలు కొట్టుకుపోయినప్పుడు వర్సోవా కొలివాడ వాస్తవ్యుడైన దినేష్ ధన్గా తీసిన ఫోటోలు. పసుపు వర్ణపు ఇసుక అనేది వర్షాకాలంలో క్రీక్ నుండి వచ్చే సిల్ట్. పడవలు సముద్రంలోకి సులభంగా వెళ్ళడం కోసం దీన్ని జాలర్లు త్రవ్వి తీస్తుంటారు. నల్లాలు, మురుగునీటి శుద్ధి సౌకర్యాల నుండి వ్యర్థాలు ప్రవహించడం వల్ల ఈ సిల్ట్, క్రీక్ ఫ్లోర్‌లో స్థిరపడుతుంది

అరేబియా సముద్రం వేడెక్కడం వల్ల కూడా డీప్ సీ ఫిషింగ్ అనిశ్చితంగా మారింది. దాని ఉపరితల ఉష్ణోగ్రత 1992, 2013 మధ్య కాలంలో సగటున దశాబ్దానికి 0.13 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ చెప్పింది. "ఇది సముద్ర జీవులపై ప్రభావం చూపింది. దాని కారణంగానే దక్షిణ భారతదేశంలో ప్రధానమైన చేపలలో ఒకటైన సార్డీన్ ఉత్తరం వైపు (తీరం వెంబడి) కదలడం ప్రారంభించింది. అలాగే దక్షిణ భారతంలో దొరికే మరొక చేప, మ్యాక్రెల్,  లోతైన నీటిలోకి (20 మీటర్ల దిగువకి) వెళ్లడం ప్రారంభించింది.” అని నాలుగు దశాబ్దాలకు పైగా సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CMFRI)-ముంబైలో పనిచేసిన డాక్టర్ వినయ్ దేష్ముఖ్ విశ్లేషించారు. అక్కడి నీటి తో పోలిస్తే, ఉత్తర అరేబియా సముద్రంలో  లోతైన సముద్ర జలాలు చల్లగా ఉంటాయి.

ముంబై, మహారాష్ట్ర సముద్ర జలాలు వేడెక్కడం అనేది భౌగోళికంగా జరుగుతున్న ప్రక్రియలతో అనుసంధానించబడి ఉన్నది.  1971-2010 మధ్య కాలంలో, ప్రపంచ మహాసముద్రాల ఎగువ 75 మీటర్లు, ప్రతి దశాబ్దానికి 0.09 నుండి 0.13 డిగ్రీల సెల్సియస్‌ చొప్పున వేడెక్కినట్లు ఇంటర్‌ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) 2014లో అంచనా వేసింది.

ఈ పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రత కొన్ని చేపల జీవశాస్త్రాన్ని మార్చివేసింది. "ఇది ఒక ముఖ్యమైన, ఏమాత్రం  తిరుగులేని మార్పు," అని డాక్టర్ దేష్ముఖ్ చెప్పారు. "సముద్ర జలాలు చల్లగా ఉన్నప్పుడు, అంటే ఉష్ణోగ్రత దాదాపు 27 డిగ్రీలు ఉన్నప్పుడు, చేపలు ఆలస్యంగా పరిపక్వం చెందుతాయి. నీరు వెచ్చగా మారడంతో, చేపలు ముందుగానే పరిపక్వతకు వస్తాయి. అంటే అవి వాటి జీవితచక్ర ప్రారంభంలోనే గుడ్లు, వీర్య కణాలను ఉత్పత్తి చేస్తాయి. అలా జరిగినప్పుడు, చేపల శరీర పెరుగుదల మందగిస్తుంది. ఈ మార్పును మేము బాంబే డక్ మరియు పాంఫ్రెట్‌ చేపలలో స్పష్టంగా చూశాము." డాక్టర్ దేష్ముఖ్ ఇంకా స్థానిక జాలర్ల అంచనా ప్రకారం, వేడి మరియు ఇతర శక్తుల కారణంగా, మూడు దశాబ్దాల క్రితం సుమారుగా 350-500 గ్రాములు ఉన్న ఒక పరిపక్వ పాంఫ్రెట్ ఇప్పుడు 200-280 గ్రాములకు తగ్గిపోయింది.

మూడు దశాబ్దాల క్రితం సుమారుగా 350-500 గ్రాములు ఉన్న ఒక పరిపక్వ పాంఫ్రెట్, వేడి, ఇతర శక్తుల కారణంగా నేడు 200-280 గ్రాములకు కుంచించుకుపోయింది

వీడియో: వ్యర్థాలతో నిండిన వాగులో చేపలు పట్టడం

డాక్టర్ దేష్ముఖ్ దృష్టిలో అతిగా చేపలు పట్టడమే అతి పెద్ద కారణం. ఈ మధ్య బోట్ల సంఖ్య బాగా పెరిగింది. అలాగే ట్రాలర్లు (కొన్ని కొలివాడ స్థానిక యజమానులవి), పెద్ద పడవలు సముద్రంలో గడిపే సమయం కూడా పెరిగింది. 2000 సంవత్సరంలో ఈ పడవలు సముద్రంలో 6-8 రోజులు గడిపేవి. ఆ సమయం నెమ్మదిగా 10-15 రోజులకు, ఇప్పుడు 16-20 రోజులకు పెరిగింది. దీంతో సముద్రంలో ప్రస్తుతం ఉన్న మత్స్య సంపదపై ఒత్తిడి పెరిగింది. "ట్రాలింగ్ కారణంగా నేల జీవావరణం (floor ecology) క్షీణించింది. ఇది సముద్రపు నేలను చిత్తు చేస్తుంది. మొక్కలను వేరు చేసి, జీవులు సహజంగా పెరగడానికి అనుమతించదు," అని ఆయన వివరించారు.

మహారాష్ట్రలోని మత్స్యకారులు 2003 లో అత్యధికంగా 4.5 లక్షల టన్నుల చేపలు పట్టారు. 1950 నుండి చూస్తే ఇదే అత్యంత గరిష్ట స్థాయి క్యాచ్. ఆ తర్వాత ప్రతి సంవత్సరం, అతిగా చేపలు పట్టడం వలన క్యాచ్ తగ్గుతూ వచ్చింది. 2017 లో దాదాపు 3.81 లక్షల టన్నుల చేపలు పట్టారు.

"అధికంగా చేపలు పట్టడం, దిగువ ట్రాలింగ్ పద్ధతి చేపల నివాసాలను మరియు సముద్ర జీవవైవిధ్య ప్రదేశాల ఉత్పత్తిని పతనం చేస్తాయి. తద్వారా వాతావరణ మార్పుల ప్రభావానికి త్వరగా లోబడేలా చేస్తాయి.  మానవ కార్యకలాపాలు (కాలుష్యం, మడ అడవుల విధ్వంసంతో సహా) సముద్ర మట్టం పెరగడం,  తరచూ వచ్చే తుఫానులు, వాటి తీవ్రత కూడా వీటికి ఆజ్యం పోస్తున్నాయి," అని " ఇన్ డెడ్ వాటర్ " అనే పుస్తకం చెబుతోంది.

ఓవర్ హార్వెస్టింగ్, దిగువ ట్రాలింగ్ రెండూ అరేబియా సముద్రంలో(వర్సోవా కొలివాడలో) కనబడతాయి. 2017లో నేచర్ క్లైమేట్ చేంజ్‌ లో ప్రచురితమైన ఒక పేపర్‌ "... ఆంథ్రోపోజెనిక్ ఫోర్సింగ్ (మానవ ఆర్థిక కార్యకలాపాల కారణంగా భూమి యొక్క శక్తి సమతుల్యతలో మార్పు) అకాలంలో ఏర్పడే అత్యంత తీవ్రమైన తుఫానుల (late-season ECSCs) సంభావ్యతను పెంచింది," అని తెలిపింది.

Extensive land reclamation and construction along the shore have decimated mangroves, altered water patterns and severely impacted Mumbai's fishing communities
PHOTO • Subuhi Jiwani

తీరం వెంబడి జరిగిన విస్తృతమైన భూసేకరణ మరియు నిర్మాణాలు, మడ అడవులను నాశనం చేశాయి, నీటి నమూనాలను మార్చాయి మరియు ముంబై యొక్క మత్స్యకార సంఘాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి

ఈ తుఫానులు మత్స్యకార వర్గాలను తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయని ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వాతావరణ అధ్యయనాల విభాగం కన్వీనర్ ప్రొఫెసర్ డి. పార్థసారథి అభిప్రాయపడ్డారు. "చేపల సంఖ్య తగ్గడం వల్ల జాలర్లు సముద్రం లోతుకి వెళ్ళవలసి వస్తోంది. కానీ వారి చిన్న చిన్న పడవలు లోతైన సముద్ర జలాల్లోకి వెళ్లే సామర్ధ్యం కలిగి ఉండవు. అందుకే అవి తుఫానులు మరియు వాయుగుండాలు ఏర్పడినప్పుడు ఎక్కువగా ప్రభావితమవుతాయి. ఈ కారణంతోనే చేపలు పట్టడం చాలా అనిశ్చితంగా, మరింత ప్రమాదకరంగా మారుతోంది."

ఇదిలా ఉంటే, సముద్ర మట్టాలు పెరగడం మరొక తీవ్ర సమస్య. గత 50 ఏళ్లలో, భారత తీరం వెంబడి సముద్ర మట్టాలు 8.5 సెంటీమీటర్లకు పెరిగాయి - అంటే సంవత్సరానికి దాదాపు 1.7 మిల్లీమీటర్లు (అని నవంబర్ 2019 లో రాజ్యసభలో లేవనెత్తిన ఒక ప్రశ్నకు ప్రభుత్వం సమాధానంగా చెప్పింది). గత 25 సంవత్సరాలలో, ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు ఏడాదికి 3 నుండి 3.6 మిమీ వరకు పెరుగుతున్నాయని IPCC డేటా మరియు "ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (USA)" అనే జర్నల్‌లో 2018 లో పేర్కొనబడింది. ఈ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు 2100 నాటికి దాదాపు 65 సెంటీమీటర్లు పెరగవచ్చు. అయితే ఈ పెరుగుదల,  ఆటుపోట్లు, గురుత్వాకర్షణ, భూమి యొక్క భ్రమణం మొదలైన అంశాల సంక్లిష్ట పరస్పర చర్యపై ఆధారపడి ప్రాంతీయంగా మారుతూ ఉంటుంది.

"సముద్ర మట్టం పెరగడం వర్సోవాకు చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇది క్రీక్ ముఖద్వారం దగ్గర ఉంది. అలాగే మత్స్యకారులు తమ పడవలను ఎక్కడ ఉంచినా, అవి తుఫానుల ప్రభావాలకు అవి గురవుతాయి," అని డాక్టర్ దేష్ముఖ్ హెచ్చరిస్తున్నారు.

వర్సోవా కొలివాడ లో చాలామంది ఈ పెరుగుతున్న సముద్ర మట్టాలను గమనించారు. "చేపల పెంపకం తగ్గడంతో, బిల్డర్లు మరియు స్థానికులు మేము చేపలను ఎండబెట్టే భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఇళ్ళ నిర్మాణం కూడా ప్రారంభించారు,” అని 30 ఏళ్లుగా చేపలు విక్రయిస్తున్న హర్ష రాజహన్స్ తాప్కే చెప్పింది. “ఈ పునరుద్ధరణతో ఖడీ లో నీటి మట్టం పెరుగుతోందన్న విషయం తీరం వెంబడి నుండే ఎవరైనా గమనించవచ్చు.”

Harsha Tapke (left), who has been selling fish for 30 years, speaks of the changes she has seen. With her is helper Yashoda Dhangar, from Kurnool district of Andhra Pradesh
PHOTO • Subuhi Jiwani

30 ఏళ్లుగా చేపలు అమ్ముతున్న హర్ష తాప్కే (ఎడమ) తాను చూసిన మార్పుల గురించి చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాకు చెందిన యశోదా ధన్‌గర్‌ ఆమెకు సహాయకురాలిగా పని చేస్తోంది

ఎక్కువ వర్షపాతం నమోదైన ప్రతిసారి, కనుమరుగైన మడ అడవులు, తీరప్రాంతంలో నిర్మాణ పనులు మరియు పెరుగుతున్న సముద్ర మట్టాల యొక్క మిశ్రమ ప్రభావం మత్స్యకార సంఘాలపై భారీగా చూపిస్తోంది. ఉదాహరణకు ఆగస్ట్ 3, 2019 న ముంబైలో 204 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది గత దశాబ్ద కాలంలో, ఆగస్టు నెలలో 24 గంటల్లో కురిసిన మూడవ అత్యధిక వర్షపాతం. ఆ సమయంలో 4.9 మీటర్ల (సుమారు 16 అడుగులు) అధిక ఆటుపోట్లు కూడా నమోదయ్యాయి. ఆ రోజు వర్సోవా కొలివాడ దగ్గర కట్టివేయబడ్డ అనేక చిన్న చిన్న పడవలు బలమైన అలల తాకిడికి విరిగిపోయాయి. దాంతో జాలర్ల సమాజం భారీ నష్టాన్ని చవిచూసింది.

" కొలివాడ లో పడవలు కట్టివేసే ప్రాంతాన్ని పునరుద్ధరించారు. గత ఏడు సంవత్సరాలుగా ఆ రోజు వచ్చినంత నీళ్లు మళ్ళీ రాలేదు," అని వర్సోవా మాషెమారి లఘు నౌకా సంఘటనా ఛైర్మన్ దినేష్ ధన్గా చెప్పారు. ఇది 148 చిన్న పడవలపై పనిచేసే 250 మంది మత్స్యకారుల సంస్థ. ఆ తుఫాను అధిక ఆటుపోట్ల సమయంలో వచ్చింది కాబట్టి నీటి మట్టం రెండింతలు పెరిగింది. కొన్ని పడవలు మునిగిపోయాయి, కొన్ని విరిగిపోయాయి. జాలర్లు తమ వలలను కోల్పోయారు. కొన్ని పడవల ఇంజిన్లలో నీరు చేరింది. ఒక్కో బోటు ధర 45,000 రూపాయిలు, ఒక్కో వల ధర 2,500 రూపాయిలు వరకు ఉంటుందని దినేష్ చెప్పారు.

ఇవన్నీ వర్సోవా యొక్క మత్స్యకార సంఘం జీవనోపాధిపై భారీ ప్రభావాన్ని చూపాయి. "మేము క్యాచ్‌లో 65-70 శాతం వ్యత్యాసాన్ని చూశాము. ఇప్పుడు మార్కెట్‌కి 10 టోక్రీ లను (బుట్టలను) తీసుకెళ్తుంటే, సుమారు రెండు దశాబ్దాల క్రితం 20 టోక్రీ లను తీసుకు వెళ్ళేవాళ్లం. ఎంత తేడానో గమనించారా," అని ప్రియా భంజీ బాధపడింది.

క్యాచ్ పరిమాణం తగ్గడంతో పాటు, సమీపంలోని హోల్‌సేల్ మార్కెట్‌లో మహిళలు చేపలను కొనుగోలు చేసే ధర పెరగడంతో మత్స్యకారుల లాభాలు క్రమంగా పడిపోయాయి. "ఇంతకుముందు మేము ఒక అడుగు పొడవు ఉండే పాంఫ్రెట్ ముక్కను  500 రూపాయలకు విక్రయించాం. ఇప్పుడు ఆ ధరకు, మేము ఆరు అంగుళాల పాంఫ్రెట్‌ను విక్రయిస్తున్నాం. పాంఫ్రెట్ పరిమాణం చిన్నదయింది. ధరలు తగ్గాయి," అని ప్రియా చెప్పింది. ఆమె మూడు రోజులకోసారి చేపలు అమ్ముకుంటుంది. రోజుకి 500-600  రూపాయిల వరకు సంపాదించుకుంటుంది.

Left: Dinesh Dhanga (on the right right) heads an organisation of around 250 fishermen operating small boats; its members include Sunil Kapatil (left) and Rakesh Sukacha (centre). Dinesh and Sunil now have a Ganapati idol-making workshop to supplement their dwindling income from fishing
PHOTO • Subuhi Jiwani
Left: Dinesh Dhanga (on the right right) heads an organisation of around 250 fishermen operating small boats; its members include Sunil Kapatil (left) and Rakesh Sukacha (centre). Dinesh and Sunil now have a Ganapati idol-making workshop to supplement their dwindling income from fishing
PHOTO • Subuhi Jiwani

దినేష్ ధన్గా (కుడివైపు) చిన్న పడవలు (కుడివైపున్న ఫోటో) నడుపుతున్న దాదాపు 250 మంది మత్స్యకారుల సంస్థకు నాయకత్వం వహిస్తున్నారు; దాని సభ్యులలో సునీల్ కపాటిల్ (ఎడమ), రాకేష్ సుకచా (మధ్యలో) ఉన్నారు. చేపల వేటలో వస్తున్న నష్టాలను పూడ్చుకోడానికి దినేష్, సునీల్ ఇప్పుడు గణపతి విగ్రహాలు తయారు చేస్తున్నారు

ఆర్థిక భారాన్ని అధిగమించేందుకు మత్స్యకార కుటుంబాల్లోని చాలామంది ఇతర పనులు చేసుకుంటున్నారు. ప్రియా భర్త విద్యుత్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో అకౌంట్స్ విభాగంలో పని చేసి ఈ మధ్యనే స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అతని సోదరుడు గౌతమ్ ఎయిర్ ఇండియాలో స్టోర్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. అతని భార్య అంధేరీ మార్కెట్‌లో చేపలు విక్రయిస్తుంది. "చేపలు పట్టడం కష్టమవుతోందని ఇప్పుడు వాళ్ళు ఆఫీసుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. నేను దీనికి అలవాటు పడ్డాను కాబట్టి వేరే ఏమీ చేయడం లేదు," అని ప్రియ చెప్పింది.

43 ఏళ్ళ సునీల్ కపాటిల్ కు  ఒక చిన్న పడవ ఉంది. కానీ అతనూ ఆదాయం పెంచుకోడానికి ఇతర మార్గాలను అన్వేషించాడు. కొన్ని నెలల క్రితం తన స్నేహితుడు దినేష్‌ ధన్గాతో కలిసి గణపతి విగ్రహాల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించాడు. "ఇంతకుముందు మేము ఒక గంట సేపు... సమీప ప్రాంతాలకు చేపలు పట్టడానికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు 2-3 గంటలు ప్రయాణించాలి. ఒక రోజులో 2-3 పేటీ ల (బుట్టలు) చేపలతో తిరిగి వచ్చేవాళ్ళం ఒకప్పుడు. కానీ ఇప్పుడు  ఒక్క పేటీ ని కూడా పట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాం. కొన్నిసార్లు మేము రోజుకి 1,000 రూపాయిలు సంపాదిస్తాం, కాని కొన్నిసార్లు 50 రూపాయిలు కూడా రావు, " అని సునీల్ వివరించారు.

అయినప్పటికీ, వర్సోవా కొలివాడలో చాలామంది పూర్తి సమయం మత్స్యకారులు, చేపల విక్రయదారులుగా ఉన్నారు. పెరుగుతున్న సముద్ర మట్టం, ఉష్ణోగ్రతలు, అధిక చేపల వేట, కాలుష్యం, మాయమైపోతున్న మడ అడవులు, తగ్గిపోతున్న క్యాచ్, చిన్న చేపలు లాంటి ఎన్నో సమస్యలతో పోరాడుతూనే ఉన్నారు. 28 ఏళ్ల రాకేష్ సుకచా ఆర్థిక ఇబ్బందుల వల్ల 8వ తరగతి తర్వాత చదువు మానేయవలసి వచ్చింది. కేవలం చేపల వేటపై ఆధారపడి బ్రతుకుతున్న వారిలో అతనూ ఒకరు. "చిన్నప్పుడు మా తాతయ్య ఒక కథ చెప్పేవారు. అడవిలో సింహం ఎదురైనప్పుడు, నువ్వు దానితో పోరాడాలి. పారిపోవడానికి ప్రయత్నిస్తే అది వేటాడి మరీ  నిన్ను చంపేస్తుంది. ఒకవేళ గెలిస్తే నువ్వు ధైర్యవంతుడివిగా నిలుస్తావు. అదే విధంగా సముద్రాన్ని కూడా ఎదుర్కోవడం నేర్చుకోవాలి అని!"

ఈ కథ రాసేందుకు సహకరించిన నారాయణ్ కోలి, జై భద్గాంకర్, నిఖిల్ ఆనంద్, స్టాలిన్ దయానంద్, గిరీష్ జాతర్‌లకు రచయిత తన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

వాతావరణ మార్పుల గురించి ప్రజల అనుభవాలను వారి గొంతులతోనే పదిల పరచాలని PARI దేశవ్యాపిత వాతావరణ మార్పులపై రిపోర్టింగ్ ప్రాజెక్టును UNDP సహకారంతో చేపట్టింది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? అయితే [email protected]కి ఈమెయిల్ చేసి అందులో [email protected]కి కాపీ చేయండి.

అనువాదం: వై క్రిష్ణ జ్యోతి

Reporter : Subuhi Jiwani

मुंबई में रहने वाली सुबुही जिवानी एक लेखक और वीडियो-मेकर हैं. साल 2017 से 2019 के बीच, वह पारी के लिए बतौर सीनियर एडिटर काम कर चुकी हैं.

की अन्य स्टोरी सुबुही जिवानी
Editor : Sharmila Joshi

शर्मिला जोशी, पूर्व में पीपल्स आर्काइव ऑफ़ रूरल इंडिया के लिए बतौर कार्यकारी संपादक काम कर चुकी हैं. वह एक लेखक व रिसर्चर हैं और कई दफ़ा शिक्षक की भूमिका में भी होती हैं.

की अन्य स्टोरी शर्मिला जोशी
Series Editors : P. Sainath

पी. साईनाथ, पीपल्स ऑर्काइव ऑफ़ रूरल इंडिया के संस्थापक संपादक हैं. वह दशकों से ग्रामीण भारत की समस्याओं की रिपोर्टिंग करते रहे हैं और उन्होंने ‘एवरीबडी लव्स अ गुड ड्रॉट’ तथा 'द लास्ट हीरोज़: फ़ुट सोल्ज़र्स ऑफ़ इंडियन फ़्रीडम' नामक किताबें भी लिखी हैं.

की अन्य स्टोरी पी. साईनाथ
Series Editors : Sharmila Joshi

शर्मिला जोशी, पूर्व में पीपल्स आर्काइव ऑफ़ रूरल इंडिया के लिए बतौर कार्यकारी संपादक काम कर चुकी हैं. वह एक लेखक व रिसर्चर हैं और कई दफ़ा शिक्षक की भूमिका में भी होती हैं.

की अन्य स्टोरी शर्मिला जोशी
Translator : Y. Krishna Jyothi

Krishna Jyothi has 12 years of experience in journalism as a sub-editor & features writer. Now, she is into blogging.

की अन्य स्टोरी Y. Krishna Jyothi