"రాత్రుళ్లు త్వరగా గడచిపోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఈ గ్రామంలో దాదాపు ఎవరూ నివసించడం లేదు. అందుకే పాములు కూడా సంచరిస్తూ ఉంటాయి" అంటారు కవల శ్రీదేవి. 2016 సంవత్సరం మే నెలలో ప్రభుత్వం విద్యుత్ కనెక్షన్లు తొలగించిన తరువాత శ్రీదేవి, ఆమె కుటుంబ సభ్యులు ఈ గ్రామంలో చీకటి రాత్రులను గడుపుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి నది పక్కనే ఉండే పోలవరం మండలంలోని పైడిపాక గ్రామాన్ని ఖాళీ చేయకుండా అక్కడే వుండిపోయిన పది కుటుంబాలలో శ్రీదేవి కుటుంబం ఒకటి. 2016లో ఒక సాగునీటి ప్రాజెక్టు కోసం ప్రభుత్వం వీరి భూమిని సేకరించినపుడు దాదాపు 429 కుటుంబాలను యిక్కడినుండి బలవంతంగా తరలించారు. జలయజ్ఞం అనే బృహత్ కార్యక్రమంలో భాగంగా 2004లో నిర్మాణం మొదలయిన పోలవరం ప్రాజెక్టు, 2018 నాటికే పూర్తి కావలసి ఉంది. అయితే, యిప్పటి వరకు కేవలం అరవై శాతం (60%) మాత్రమే పూర్తయింది.
"విద్యుత్ సరఫరా నిలిపివేసిన నెల రోజుల తరువాత తాగునీటి సరఫరా కూడా నిలిపివేశారు" అంటారు శ్రీదేవి. ఆమె యిప్పుడు తన భర్త సూర్యచంద్రంతో కలిసి తమ ఆటోరిక్షాలో ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించి పోలవరం పట్టణం చేరుకుని అక్కడ యిరవై రూపాయలు వెచ్చించి యిరవై లీటర్ల త్రాగునీటిని కొనుక్కుంటున్నారు.
యిక్కడినుండి తరలిపోయిన చాలా కుటుంబాలతో పాటు ఈ జంట కూడా తమ ముగ్గురు పిల్లలతో ( పైన కవర్ ఫోటో చూడవచ్చు ) కలిసి గోపాలపురం మండలం లోని హుకుంపేట పునరావాస కాలనీకి వెళ్ళి కొన్నాళ్ళపాటు అక్కడే ఉన్నారు. అయితే, నెలరోజుల తరువాత తిరిగి పైడిపాక గ్రామానికి చేరుకున్నారు. "మేం ప్రభుత్వాధికారులను నమ్మాం. అయితే, ప్రభుత్వం తన హామీలను నిలబెట్టుకుంటుందన్న నమ్మకం కోల్పోయాక తిరిగొచ్చేశాం" అంటారు శ్రీదేవి, ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ.
పోలవరంలో ఒకటి, హుకుంపేటలో ఒకటి, జంగారెడ్డిగూడెంలో రెండు చొప్పున ఏర్పాటు చేసిన పునరావాస కాలనీల్లోకి ఈ కుటుంబాలను తరలించారు. ఈ పునరావాస కాలనీలన్నీ పైడిపాక గ్రామానికి 10 నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ప్రభుత్వం వీరికి భూసేకరణ, పునరావాస, పునర్వ్యవస్థీకరణ చట్టం, 2013 (ఎల్.ఎ.ఆర్.ఆర్.)లో పేర్కొన్న మాదిరిగానే - సొంతభూమి కలిగి ఉన్న వారికి అంతకు సమానమైన భూమి, సొంత భూమి లేని కుటుంబాలకు రెండెకరాల చొప్పున భూమి, ప్రతి కుటుంబానికీ ఒక ఉద్యోగం, పక్కా ఇల్లు, వన్ టైమ్ సెటిల్మెంట్ కింద 6.8 లక్షల రూపాయలు; ఏవైనా నిర్మాణాలు, చెట్లు లేదా జీవాలు ఉన్నట్లయితే వాటికి నష్టపరిహారం చెల్లించడం వంటి ఎన్నో హామీలనిచ్చింది. అయితే, రెండేళ్ళ తరువాత కూడా ప్రభుత్వం తన హామీలలో ఏ ఒక్కదాన్నీ నెరవేర్చలేదని గ్రామస్థులు చెబుతున్నారు. ( దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు ఈ సిరీస్లో భాగంగా వచ్చే కథనాల ద్వారా అందిస్తాం ).
శ్రీదేవి, సూర్యచంద్రంలు దళితులు. వారికి సొంతభూమి లేదు. పైడిపాకలోనే వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ రోజుకి రూ.100-300 సంపాదించుకునేవారు. "యిప్పుడు నాకు పని లేదు. నా భర్త పోలవరం టౌన్లో ఆటో నడిపితే వచ్చే మూడువందల రూపాయలతోనే ఇల్లు గడుస్తోంది," అంటారు శ్రీదేవి. ప్రయివేటు వడ్డీ వ్యాపారుల వద్ద 36 శాతం వడ్డీరేటుకు లక్షరూపాయలు అప్పుచేసి అతను ఈ ఆటోరిక్షా కొన్నారు.
ఒక మధ్యాహ్నంపూట నేను వారి యింటికి వెళ్లినపుడు, వారి ముగ్గురు పిల్లలు స్మైలీ (6), ప్రశాంత్ (8), భరత్ (9)లు తమ పెంపుడుకుక్క స్నూపీతో ఆడుకుంటూ కనిపించారు. పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా వారి జీవితాలను మార్చివేసిందో ఆ పిల్లలకు తెలియదు. "కొన్నాళ్ల క్రితం వరకు నాకు చాలామంది స్నేహితులుండేవారు. వాళ్ళంతా యిప్పుడు వేరే కాలనీకి వెళ్ళిపోయారు" అంటాడు భరత్. ఆ గ్రామంలో మిగిలిపోయిన పిల్లలు వీరు మాత్రమే. రెండేళ్లక్రితం పోలవరం ప్రాజెక్టు అధికారులు ఈ గ్రామంలోని బడిని కూల్చేయడంతో వీరి చదువు ఆగిపోయింది. ఈ పిల్లలను పోలవరం పట్టణంలో ఉన్న బడికి పంపగల స్తోమత వీరి తల్లిదండ్రులకు లేదు.
ఈ గ్రామంలోని చాలా ఇళ్లను కూడా అధికారులు కూల్చేశారు. ఈ కారణంగా, పునరావాస కాలనీల్లో పరిస్థితులు తాము ఊహించినదానికి భిన్నంగా ఉన్నాయని తెలిసివచ్చినప్పటికీ, వాళ్ళు తమ గ్రామానికి తిరిగి రావడానికి వీల్లేకుండా పోయింది. శ్రీదేవి ఇల్లు గ్రామానికి చివర దళితవాడలో ఉన్న కారణంగా కూల్చివేతను తప్పించుకోగలిగింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థలానికి పక్కనే ఉండి, 2016లో బలవంతంగా తరలించబడ్డ ఏడు గ్రామాలలో పైడిపాక ఒకటి. ఈ గ్రామం మొత్తం జనాభా 5,500. నిర్మాణ కార్యకలాపాల కోసం ప్రాజెక్టు అధికారులకు ఈ స్థలం కావలసివచ్చింది. వీటితోపాటు, పోలవరం మండలానికి వాయువ్య దిశలో ఉన్న ఎగువ గోదావరి ప్రాంతంలోని 22 గ్రామాలు, ఆవాసాలు కూడా ముంపునకు గురవుతాయి. యిక్కడ నివసిస్తోన్న దాదాపు 15000 మంది ప్రజలు నిరాశ్రయులవుతారు.
అధికారికంగా, "ఇందిరాసాగర్ బహుళార్థసాధక ప్రాజెక్టు"గా పిలిచే ఈ పోలవరం ప్రాజెక్టు ద్వారా 3 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు, 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి, 540 గ్రామాలకు త్రాగునీరు అందించడం, ఇంకా పరిశ్రమల అవసరాలకు నీరు అందించడం లక్ష్యాలుగా ఉన్నాయి. పర్యావరణ మంత్రిత్వశాఖ విడుదల చేసిన "ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్" లో ఈ వివరాలన్నీ పొందుపరిచివున్నాయి. అయితే ఈ వివరాలకూ, 2005, మే నెలలో రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన జి.వో. నం. 93, అదే సంవత్సరం డిసెంబరు నెలలో హైదరాబాద్లో జరిగిన అఖిలపక్ష సమావేశం నాటి ముఖ్యమంత్రి ప్రకటనలోని వివరాలకూ పొంతనే లేదు..
పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత గోదావరి ఒడ్డున గల ఆంధ్రప్రదేశ్లోని తొమ్మిది మండలాల్లో విస్తరించి ఉన్న కనీసం 462 గ్రామాలు కనుమరుగవబోతున్నాయి. కోయ, కొండరెడ్డి తెగలకు చెందిన ఆదివాసులు ఈ గ్రామాల్లో నివసిస్తున్నారు. ఈ ప్రాంతాలన్నీ రాజ్యాంగంలోని అయిదవ షెడ్యూల్ క్రిందకు వస్తాయి. ఈ షెడ్యూల్ ప్రకారం ఈ ప్రాంతాల్లో నివసిస్తోన్న ఆదివాసీ తెగల ప్రజలకు వారి భూమి, అడవి, సంస్కృతి రక్షణకు సంబంధించిన ప్రత్యేక హక్కులు కల్పించబడ్డాయి.
పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి సమాచార హక్కు చట్టం ద్వారా నేను సేకరించిన సమాచారం ప్రకారం, 10,000 ఎకరాల అటవీభూమి, 121,975 ఎకరాల అటవీయేతర భూమి నుంచి దాదాపు 300000 మంది (అందులో 1.5 లక్షలమంది ఆదివాసులు కాగా 50,000 మంది దళితులు) ఈ ప్రాజెక్టు వల్ల నిరాశ్రయులవబోతున్నారు. దీనికితోడు - కాలువలు, టౌన్ షిప్స్, 'గ్రీన్ బెల్ట్' లాంటి వాటి కోసం మరొక 75,000 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు..
యింత పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులవుతున్నా, ఎల్.ఎ.ఆర్.ఆర్. చట్టం సరిగ్గా అమలు కావడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. అందువలన శ్రీదేవి కుటుంబంలాగే పది కుటుంబాలు పైడిపాక గ్రామాన్ని ఖాళీ చేయడానికి నిరాకరిస్తున్నాయి. దళితుల్ని బలవంతంగా తరలించాల్సివచ్చినపుడు వారికి భూమిని అందించాలని చెప్పే చట్టంలోని ప్రత్యేక నిబంధనను వర్తింపజేయాలని ఆమె కోరుతున్నారు.
ఇక్కడే ఉండిపోయి పోరాటం కొనసాగిస్తున్నది కొన్ని కుటుంబాలే అయినప్పటికీ, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన చాలామంది కూడా గట్టిగానే తమ నిరసనను తెలియజేశారు. నిరసన తెలుపుతోన్న కుటుంబాల మీద రాష్ట్ర రెవెన్యూ, పోలీసు శాఖలవారు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని గ్రామస్థులు చెబుతున్నారు. 2016 వర్షాకాలంలో త్రాగునీరు, విద్యుత్ కనెక్షన్లు తొలగించడంతో పాటు పైడిపాక గ్రామానికి చేరుకునే రహదారి మీద బురదనూ, ఇసుకనూ వెయ్యాలని కొంతమంది కూలీలను అధికారులు అడిగినట్లు ఆరోపణలున్నాయి. దీనివలన గ్రామానికి వెళ్లే మార్గం చిత్తడిగా తయారయింది. "గ్రామంలోకి వెళ్లాలన్నా రావాలన్నా మోకాలిలోతు బురదనీటిని దాటాల్సి వచ్చేది" అంటారు శ్రీదేవి.
పైడిపాకలోనే ఉండిపోయిన మరొక గ్రామస్థుడు బొట్టా త్రిమూర్తులు (42), తాను తీవ్ర వేధింపులకు గురైనట్లు చెబుతున్నారు. 2016 జూన్ 30న, ప్రాజెక్టు అధికారులు కొంతమంది కూలీలను తీసుకొచ్చి ఆయనకు చెందిన రెండున్నరెకరాల అరటి తోటలో రాళ్ళు, యిసక, బురదలను కుమ్మరించారు. "పంట చేతికొస్తోంది. ఒక్క నెల రోజులు ఆగమని ఎమ్మార్వో ( మండల రెవెన్యూ అధికారి )ని ఎంతో వేడుకున్నాను. నేను నాలుగు లక్షల రూపాయల విలువైన పంటను నష్టపోయాను. ఆ రోజు గ్రామంలో 75 ఎకరాల్లో పంటను నాశనం చేశారు." అంటారు త్రిమూర్తులు. ఆయనిప్పుడు పైడిపాకకు 10 కిలోమీటర్ల దూరంలో ఉండే తెల్లవరంలో వ్యవసాయకూలీగా పనిచేస్తూ రోజుకి రూ.250 సంపాదిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయ్యే క్రమంలో ప్రజలు నిరాశ్రయులవబోతోన్న 22 ఆవాసాల్లో తెల్లవరం కూడా ఒకటి..
త్రిమూర్తులు భార్య బొట్టా భాను (39), తమకుండే 10 గేదెలు, 20 మేకలు, 40 గొర్రెలు, 100 కోళ్లను చూసుకుంటుండేవారు. రాళ్లూ ఇసుకా కుమ్మరించినప్పుడు వీటిలో కొన్ని చనిపోయాయి. చనిపోయిన వాటికిగానూ త్రిమూర్తులు కుటుంబానికి ఎటువంటి పరిహారమూ లభించలేదు. మిగిలినవాటిని చూసుకునేందుకు పనివాళ్లు దొరక్క వాటిని అమ్మేశారు. "యింటిపనినీ, పశువులకు సంబంధించిన పనినీ చూసుకునేందుకు మాదగ్గర 10 మంది దాకా పనివాళ్లుండేవారు. యిప్పుడు మేమే ఉపాధి కోసం వేరేవాళ్ళ పొలాల్లో పనిచేయాల్సి వస్తోంది!" అంటారు భాను.
2016 ఏప్రిల్-జులై నాటి భయంకరమైన రోజుల్ని తలచుకుంటూ, "ప్రతిరోజూ 40-50 మంది పోలీసులొచ్చి, మిమ్మల్ని కాళ్లూ చేతులు కట్టేసి పోలీసు జీపుల్లో వేసి పంపించేస్తామంటూ భయపెట్టేవాళ్లు. చాలా కుటుంబాలకు ఖాళీ చేయడం ఇష్టం లేకపోయినా ఆ ఒత్తిడిని ఎక్కువకాలం తట్టుకోలేక వెళ్లిపోయారు" అంటారు భాను.
దీని గురించి పోలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలరాజుని అడిగినప్పుడు, "మీరు చెబుతున్నదంతా శుద్ధ అబద్దం. నిజానికి ఇక్కడినుంచి వెళ్ళిపోయేందుకు మేం గ్రామస్థులకు రవాణాలో సహాయపడ్డాం" అని నాతో చెప్పారు.
మండల రెవెన్యూ అధికారి ముక్కంటి కూడా ఈ అన్ని ఆరోపణలను స్పష్టంగా తిరస్కరించారు. "గ్రామస్థుల్ని తరలించడానికి మేం ఎటువంటి ఒత్తిడినీ ప్రయోగించలేదు. నిజానికి వాళ్ళు తమకు లభించిన ప్యాకేజి, ఆర్&ఆర్ కాలనీల్లో వారికోసం కొత్తగా నిర్మించిన పక్కా ఇళ్ళను చూసి సంతోషంగా యిక్కడి నుంచి ఖాళీచేసి వెళ్లారు" అంటాడాయన. త్రిమూర్తులుకు చెందిన అరటి తోటలో రాళ్లూరప్పలు గుమ్మరించడం గురించి అడిగినప్పుడు, "అలాంటిదేమీ జరగలేదు. అవన్నీ నిరాధారమైన ఆరోపణలు" అన్నాడాయన.
యిదిలా ఉండగా, పైడిపాకలో నిరసన తెలుపుతోన్న కుటుంబాలు ఎల్.ఎ.ఆర్.ఆర్. చట్టాన్ని పక్కా గా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. "ఇలాంటి ఒత్తిడిపెంచే ఎత్తుగడలేవీ పనిచేయవు. మేమిక్కడ రెండేళ్లపాటు చీకటిలో బ్రతికి, అందుకు అలవాటు పడిపోయాం. చట్టప్రకారం మాకు రావాల్సినవాటిని పొందకుండా మా గ్రామం విడిచి వెళ్లేది లేదు" అంటారు త్రిమూర్తులు. "ఇక్కడే చనిపోవడానికైనా సిద్ధమే కానీ చట్టప్రకారం మాకు రావాల్సిన దానిని సాధించకుండా యిక్కడినుంచి కదిలేది లేదు" అంటారు శ్రీదేవి కూడా.
ఒకవైపు గోదావరి ఒడ్డున చట్టబద్ధంగా నిర్మించుకొన్న శ్రీదేవి ఇంటిని ఏ క్షణాన్నైనా కూల్చేసే పరిస్థితి నెలకొని ఉండగానే, మరోవైపు పైడిపాక గ్రామం నుంచి 174 కిలోమీటర్ల దూరంలోని ముంపు ప్రమాదమున్న కృష్ణా నది ఒడ్డున - చట్టవ్యతిరేక నిర్మాణంగా స్థానిక మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందిన - తన యింటిలో కూర్చున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పనుల్ని సమీక్షిస్తున్నారు..
అనువాదం: కె. నవీన్
కుమార్