గడియారపు ముల్లు తిరిగినంత ఠంచనుగా, ప్రతి నెలా గాయత్రీ కచ్చరబికి భయంకరమైన కడుపు నొప్పి పట్టుకుంటుంది. ఆ మూడు రోజుల నొప్పి ఆమె బహిష్టు అయిందనడానికి ఒకే ఒక సంకేతం. సంవత్సరం క్రితం ఆమెకు బహిష్టు ఆగిపోయింది.

"ఈ విధంగానే నేను బహిస్టునయ్యాననే విషయాన్ని తెలుసుకుంటాను. కానీ నాకు రక్తస్రావం కాదు. బహుశా ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం వల్ల నాకు రుతుస్రావానికి సరిపడా రక్తం లేకుండా పోయినట్టుంది” అని 28 ఏళ్ల గాయత్రి చెప్పింది. అమెనోరియా - ఋతుస్రావం లేకపోవడం - నెలవారీ వచ్చే కడుపులో కండరాలు పట్టేయటాన్నీ, వెన్నునొప్పినీ తగ్గించదు. నొప్పి ఎంత బాధాకరంగా ఉంటుందంటే, పురిటి నొప్పులంత తీవ్రంగా ఉంటాయని గాయత్రి చెప్పింది. "లేచి నిల్చోవడం కూడా కష్టంగా ఉంటుంది."

గాయత్రి పొడవుగా సన్నగా ఉంటుంది. అద్భుతమైన కళ్ళు, కొద్దిగా నత్తి ఉన్నట్టు మాట్లాడే శైలి. కర్నాటకలోని హావేరి జిల్లా, రాణిబెన్నూరు తాలూకా లోని అసుండి గ్రామ శివార్లలోని మాదిగర కేరి - దళిత వర్గానికి చెందిన మాదిగల కాలనీకి - చెందిన వ్యవసాయ కూలీ. ఆమె పంటలకు చేతితో పరాగ సంపర్కం చేయించడంలో నైపుణ్యం కలిగినది.

ఒక సంవత్సరం క్రితం మూత్రవిసర్జన నొప్పిగా అనిపించినప్పుడు, ఆమె తన గ్రామానికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైడగిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వైద్య సహాయం కోసం వెళ్లింది.

Gayathri Kachcharabi and her children in their home in the Dalit colony in Asundi village
PHOTO • S. Senthalir

అసుండి గ్రామంలోని దళిత కాలనీలో ఉన్న తన ఇంటిలో గాయత్రి కచ్చరబి, ఆమె పిల్లలు

"ప్రభుత్వ ఆసుపత్రులలో శ్రద్ధగా చూడరు. నేనక్కడికి వెళ్లను. ఉచితంగా చేసే వైద్య సేవల కోసం అవసరమైన ఆ కార్డు నా దగ్గర లేదు," అని గాయత్రి చెప్పింది. ఆమె ఇక్కడ చెపుతున్నది, ఆయుష్మాన్ భారత్ పథకం కింద లభించే ఆరోగ్య బీమా కార్యక్రమమైన ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన గురించి. ఈ పథకం కింద రెండవ, మూడవ దశ సంరక్షణను అందించే ఆసుపత్రుల్లో చేరేందుకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల వైద్య కవరేజీ అందుతుంది.

ఆ ప్రైవేటు ఆసుపత్రిలోని వైద్యుడు ఆమెను రక్త పరీక్ష, పొత్తికడుపు ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించుకోమని చెప్పారు.

ఒక సంవత్సరం తర్వాత కూడా, గాయత్రి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోలేదు. ఈ పరీక్షల కోసం కనీసం రెండు వేల రూపాయలైనా ఖర్చవుతుంది; అది కూడా పెద్ద ఖర్చు కిందే లెక్క. “నేను పరీక్షలు చేయించుకోలేకపోయాను. ఆ రిపోర్టులు లేకుండా నేను డాక్టర్ దగ్గరకు వెళితే, వాళ్ళు నన్ను తప్పకుండా తిడతారు. అందుకని మళ్ళీ డాక్టరు దగ్గరకు కూడా వెళ్లలేదు,” అని ఆమె చెప్పింది.

బదులుగా ఆమె, నొప్పిని తగ్గించే మందుల కోసం మందుల దుకాణాలలో అడిగింది. అదే మరి చవకైన, శీఘ్రమైన పరిష్కారం. " ఎంతా గుళిగె అదావో గూత్తిల్లా (అవేం మందుబిళ్ళలో నాకు తెలియదు)," అని ఆమె చెప్పింది. “కడుపులో నొప్పి అని చెప్తే చాలు, దుకాణంవాళ్ళు మందులిచ్చేస్తారు."

అసుండిలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వైద్య సేవలు 3,808 మంది జనాభాకు సరిపోవు. గ్రామంలోని వైద్యులెవరికీ ఎమ్‌బిబిఎస్ పట్టా లేదు. గ్రామంలో ప్రైవేట్ ఆసుపత్రి గానీ, నర్సింగ్ హోమ్ గానీ లేవు.

A view of the Madigara keri, colony of the Madiga community, in Asundi.
PHOTO • S. Senthalir
Most of the household chores, like washing clothes, are done in the narrow lanes of this colony because of a lack of space inside the homes here
PHOTO • S. Senthalir

ఎడమ: అసుండిలోని మాదిగ వర్గంవారు నివసించే మాదిగర కేరి. కుడి: ఇళ్ళల్లో తగినంత ఖాళీ స్థలం లేకపోవటం వలన బట్టలుతకటం వంటి ఇంటి పనులన్నింటినీ కాలనీలోని ఈ ఇరుకుసందులలోనే కానిస్తుంటారు

గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాణిబెన్నూర్‌లోని మాతాశిశు ఆసుపత్రి (ఎమ్‌సిఎచ్)లో రెండు పోస్టులు మంజూరైనా, ఒకే ఒక ప్రసూతి - గైనకాలజీ (ఒబిజి) నిపుణులు ఉన్నారు. సమీపంలోని మరో ప్రభుత్వ ఆసుపత్రి అసుండి నుండి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిరెకెరూరులో ఉంది. ఈ ఆసుపత్రికి ఒక మంజూరైన పోస్ట్ ఉన్నప్పటికీ ఒబిజి స్పెషలిస్ట్ లేరు. అక్కడికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న హావేరిలోని జిల్లా ఆసుపత్రిలో మాత్రమే ఆరుగురు ఒబిజి నిపుణులు ఉన్నారు. ఇక్కడ మొత్తం 20 జనరల్ మెడికల్ ఆఫీసర్లు, ఆరు నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి

ఎందుకు తనకు బహిష్టు రావటంలేదో, పదే పదే పొత్తికడుపులో నొప్పి ఎందుకు వస్తోందో, గాయత్రికి ఈరోజు వరకూ తెలియదు. "నా శరీరం నాకు బరువుగా తోస్తోంది. పొత్తి కడుపులోనొప్పి ఈమధ్యనే కుర్చీమీంచి పడిపోయినందుకు వస్తోందో, మూత్రపిండాలలో రాళ్ళు ఉన్నందుకు వస్తోందో, రుతుక్రమంలోని సమస్యల వలన వస్తోందో నాకు తెలియటంలేదు." అంటుంది గాయత్రి.

గాయత్రి హిరెకెరూరు తాలూకా , చిన్నముళగుంద గ్రామంలో పెరిగింది. ఐదవ తరగతిలో ఉండగానే చదువు మానేసింది. ఆమె చేతితో పరాగ సంపర్కం చేయడంలో నైపుణ్యం సాధించింది. దీనివలన ఆమెకు ప్రతి ఆరునెలలకొకసారి 15 నుంచి 20 రోజులపాటు ఖచ్చితమైన ఆదాయంతో పాటు స్థిరమైన పని కూడా దొరుకుతోంది. "ఒక్కసారి చేతితో పరాగ సంపర్కం చేస్తే, రూ. 250 వస్తాయి." అని ఆమె చెప్పింది.

గాయత్రికి 16 సంవత్సరాల వయస్సులో వివాహం అయింది. వ్యవసాయ కూలీగా ఆమె చేసే పని ఎప్పుడూ భద్రతలేనిదే. సమీపంలోని గ్రామాలకు చెందిన భూ యజమానులకు, ప్రత్యేకించి లింగాయత్ వర్గానికి మొక్కజొన్న, వెల్లుల్లి లేదా పత్తిని కోసేందుకు కూలీలు అవసరమైనప్పుడు మాత్రమే ఆమెకు పని దొరుకుతుంది. "మా కూలీ రోజుకు 200 రూపాయలు," అని ఆమె చెప్పింది. మూడు నెలల వ్యవధిలో, ఆమెకు 30 లేదా 36 రోజులు వ్యవసాయ పనులు లభిస్తాయి. “భూ యజమానులు మమ్మల్ని పిలిస్తే మాకు పని ఉంటుంది, లేకపోతే లేదు."

Gayathri and a neighbour sitting in her house. The 7.5 x 10 feet windowless home has no space for a toilet. The absence of one has affected her health and brought on excruciating abdominal pain.
PHOTO • S. Senthalir
The passage in front is the only space where Gayathri can wash vessels
PHOTO • S. Senthalir

ఎడమ: పొరుగింటామెతో కలిసి తన ఇంట్లో కూర్చొని ఉన్న గాయత్రి. ఒక్క కిటికీ కూడా లేని ఆ 7.5X10 అడుగుల ఇంట్లో మరుగుదొడ్డి కట్టేందుకు స్థలం లేదు. అది లేకపోవడంతో ఆమె అరోగ్యం దెబ్బతిని, పొత్తికడుపులో విపరీతమైన నొప్పి వస్తోంది. కుడి: ముందున్న ఆ సన్నటి దారి మాత్రమే గాయత్రి గిన్నెలు కడుక్కునే స్థలం

వ్యవసాయ కూలీగా, చేతితో పరాగ సంపర్కం జరిపే పనిచేస్తూ నెలకు రూ. 2,400-3,750 వరకూ ఆమె సంపాదిస్తుంది. అయితే ఆ మొత్తం ఆమె వైద్య సంరక్షణ అవసరాలకు సరిపోదు. వేసవిలో సాధారణంగా చేసే పనులేవీ లేనప్పుడు, ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రంగా ఉంటుంది.

వ్యవసాయ కూలీ అయిన ఆమె భర్త మద్యానికి బానిస కావడంతో, ఇంటి ఆదాయానికి అతను పెద్దగా జోడించేదేమీ ఉండదు. అతను తరచుగా అనారోగ్యం పాలవుతుంటాడు. గత సంవత్సరం టైఫాయిడ్ జ్వరం, అలసటల కారణంగా ఆరు నెలల కంటే ఎక్కువ పనిచేయలేకపోయాడు. 2022 వేసవిలో, ప్రమాదానికి గురవటంతో ఒక చేయి విరిగింది. అతడిని చూసుకునేందుకు గాయత్రి మూడు నెలల పాటు ఇంటిపట్టునే ఉండిపోయింది. వైద్య ఖర్చు దాదాపు రూ. 20,000 అయింది.

గాయత్రి ఒక ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుడి నుండి 10 శాతం వడ్డీకి డబ్బు అప్పు తీసుకుంది. ఆ తర్వాత ఆ వడ్డీని కట్టేందుకు మరోసారి అప్పు తీసుకుంది. ఇలా మూడు వేర్వేరు మైక్రోఫైనాన్స్ కంపెనీల నుండి దాదాపు లక్ష రూపాయల వరకూ మరో మూడు రుణాలు తీసుకుంది. అలా ఆమె ప్రతి నెలా ఈ రుణాలు తీర్చడం కోసమే పదివేల రూపాయలు చెల్లిస్తుంటుంది.

" కూలీ మాడిద్రాగె జీవన ఆగూల్రి ​​ మత్తె (మేం కేవలం రోజువారీ కూలీ మీదే మా జీవితాలను నడపలేం)," అని ఆమె నొక్కి చెప్పింది. “ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు అప్పు చేయాల్సి వస్తుంది. మేం ఆ అప్పును తిరిగి చెల్లించకుండా ఉండటానికి లేదు. తిండి లేకపోయినా, వారపు సంతకు వెళ్లం. సంఘ (మైక్రోఫైనాన్స్ కంపెనీ)కు వారం వారం డబ్బు చెల్లించాలి. తర్వాత డబ్బులేమైనా మిగిలితేనే కూరగాయలు కొంటాం.”

Gayathri does not know exactly why her periods stopped or why she suffers from recurring abdominal pain.
PHOTO • S. Senthalir
Standing in her kitchen, where the meals she cooks are often short of pulses and vegetables. ‘Only if there is money left [after loan repayments] do we buy vegetables’
PHOTO • S. Senthalir

ఎడమ: తనకు బహిష్టు ఎందుకు ఆగిపోయిందో, పదే పదే పొత్తికడుపులో నొప్పి ఎందుకు వస్తుందో గాయత్రికి సరైన కారణం తెలియదు. కుడి: వంట చేసుకునే ప్రదేశంలో నిలబడివున్న గాయత్రి. ఆమె వండే ఆహారంలో పప్పులూ కూరగాయలూ చాలా తక్కువగా ఉంటుంటాయి. ' డబ్బులేమైనా మిగిలితేనే( అప్పులకు కట్టిన తర్వాత) మేం కూరగాయలు కొనుక్కుంటాం'

గాయత్రి భోజనంలో పప్పులు గానీ, కూరగాయలు గానీ దాదాపు ఉండవు. డబ్బులు లేనప్పుడు ఆమె, పొరుగింటివారి నుండి టమోటాలు, మిరపకాయలు బదులు తీసుకొని కూర వండుతుంది.

ఇది “ఆకలికడుపుల ఆహార పద్ధతి,” అని బెంగుళూరులోని సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజీలోని ప్రసూతి మరియు గైనకాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న డాక్టర్ శైబ్యా సల్దాన్హా అన్నారు. “ఉత్తర కర్ణాటకలోని అనేకమంది మహిళా వ్యవసాయ కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. వారు అన్నం, పలుచని దాల్ సారు (పప్పుచారు) తింటారు. ఈ చారు నీళ్ళనీళ్ళగా, కారంకారంగా ఉంటుంది. దీర్ఘకాలం ఆకలి కడుపులతో ఉండటం వల్ల, వీరిలో దీర్ఘకాలిక రక్తహీనత ఏర్పడుతుంది. ఇది వారిని త్వరగా అలసిపోయేలా చేస్తుంది" అని కౌమారదశలోని పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు పనిచేస్తున్న ఎన్‌ఫోల్డ్ ఇండియా సహ వ్యవస్థాపకురాలైన డాక్టర్ సల్దాన్హా చెప్పారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అవాంఛిత గర్భాశయ శస్త్రచికిత్సలను పరిశీలించేందుకు 2015లో కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన కమిటీలో ఈమె కూడా ఉన్నారు.

గాయత్రికి తల తిరగడం, చేతుల్లో కాళ్లలో తిమ్మిరి, వెన్నునొప్పి, అలసట ఉన్నాయి. ఈ లక్షణాలు దీర్ఘకాలిక పోషకాహార లోపాన్నీ, రక్తహీనతనూ సూచిస్తాయని డాక్టర్ సల్దాన్హా చెప్పారు.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 ( ఎన్ఎఫ్ఎచ్ఎస్ -5 ) ప్రకారం, గత నాలుగేళ్లలో, కర్ణాటకలో రక్తహీనతతో బాధపడుతున్న 15-49 సంవత్సరాల వయస్సు గల మహిళల శాతం 2015-16లో 46.2 నుండి 2019-20లో 50.3 శాతానికి పెరిగింది. హావేరి జిల్లాలో, ఈ వయస్సులో ఉన్న మహిళలలో సగం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు

గాయత్రి బలహీనమైన ఆరోగ్యం కూడా ఆమెకొచ్చే వేతనాలను ప్రభావితం చేస్తుంది. “నాకు అనారోగ్యంగా ఉంది. ఒక రోజు పనికి వెళితే, మరుసటి రోజు వెళ్లలేను,” అని నిట్టూరుస్తూ చెప్పిందామె.

PHOTO • S. Senthalir

మంజుల మహదేవప్ప కచ్చరబి తన భర్తతోపాటు 18 మంది కుటుంబ సభ్యులతో కలిసి అదే కాలనీలోని ఒక రెండు గదుల ఇంటిలో నివసిస్తోంది. రాత్రివేళల్లో ఆమె తన భర్తతో కలిసి నిద్రించే గది, పగటివేళల్లో కుటుంబానికి వంటగదిగా ఉంటుంది

మంజుల మహదేవప్ప కచ్చరబి(25) కూడా ఎప్పుడూ కడుపునొప్పితో బాధపడుతుంటుంది. బహిష్టు సమయంలో ఆమె కడుపులోని కండరాలు పట్టేసిన నొప్పితోనూ, బహిష్టు తర్వాత పొత్తికడుపులో నొప్పితోనూ, యోనిస్రావాలతోనూ బాధపడుతుంటుంది.

రోజుకు రూ. 200 సంపాదించే వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న మంజుల మాట్లాడుతూ, "నేను బహిష్టు అయిన ఐదు రోజులు చాలా బాధాకరంగా ఉంటాయి. మొదటి రెండు మూడు రోజులు నేనసలు లేవలేను. కడుపు కండరాలు పట్టేసి, నడవలేను, పనికి వెళ్లలేను. తిండి కూడా తినలేను. అలా పడుకుని ఉండిపోతాను."

ఈ నొప్పితో పాటు గాయత్రి, మంజులలకు ఉన్న మరో సమస్య: సురక్షితమైన, శుభ్రమైన మరుగుదొడ్డి లేకపోవటం.

12 ఏళ్ల క్రితం వివాహమైన గాయత్రి, అసుండిలోని ఈ దళిత కాలనీలో, కిటికీలు కూడా లేని 7.5 X 10 అడుగుల ఇంట్లో నివాసం ఉంటోంది. ఈ ఇంటి వైశాల్యం టెన్నిస్ కోర్టు విస్తీర్ణంలో కేవలం నాలుగింట ఒక వంతు మాత్రమే ఉంటుంది. రెండు గోడలు ఆ ఇంటిని వంటగది, నివాసం, స్నానం చేసే ప్రదేశంగా విజించాయి. ఇక మరుగుదొడ్డికి స్థలం లేదు.

మంజుల తన భర్తతో పాటు మరో 18 మంది కుటుంబ సభ్యులతో కలిసి అదే కాలనీలోని ఒక రెండు గదుల ఇంట్లో నివసిస్తోంది. మట్టి గోడలు, పాత చీరలు చించి కుట్టిన కర్టెన్లు ఆ రెండు గదులను ఆరు విభాగాలుగా విభజించాయి. “ ఇనుక్కు ఇంబిల్రీ (ఇక్కడింక దేనికీ ఖాళీ లేదు),” అని ఆమె చెప్పింది. "పండుగలకు కుటుంబ సభ్యులందరూ ఇంటికొస్తే, కూర్చోవడానికి కూడా చోటుండదు." అటువంటి రోజుల్లో పురుషులను నిద్రపోవడానికి కమ్యూనిటీ హాల్‌కు పంపిస్తారు.

Manjula standing at the entrance of the bathing area that the women of her house also use as a toilet sometimes. Severe stomach cramps during her periods and abdominal pain afterwards have robbed her limbs of strength. Right: Inside the house, Manjula (at the back) and her relatives cook together and watch over the children
PHOTO • S. Senthalir
Inside the house, Manjula (at the back) and her relatives cook together and watch over the children
PHOTO • S. Senthalir

ఇంట్లోని స్త్రీలు కొన్నిసార్లు మరుగుదొడ్డిగా కూడా ఉపయోగించే స్నానాల ప్రదేశం ప్రవేశద్వారం వద్ద నిలబడి ఉన్న మంజుల. బహిష్టు సమయంలో తీవ్రమైన కడుపు కండరాల నొప్పి, తర్వాత వచ్చే పొత్తికడుపు నొప్పి ఆమె అవయవాలను బలహీనపరిచాయి. కుడి: ఇంటి లోపల. మంజుల, ఆమె బంధువులు కలిసి వంట చేస్తారు, పిల్లలనూ చూసుకుంటారు

ఆమె ఇంటి బయట ఉన్న చిన్న స్నానాల గది ద్వారం చీరతో మూసి ఉంది. మంజుల ఇంటి మహిళలు ఈ స్థలాన్ని మూత్ర విసర్జనకు ఉపయోగిస్తారు, అయితే ఇంట్లో ఎక్కువ మంది మనుషులు ఉన్నప్పుడు మాత్రం కాదు. కాసేపటికే అక్కడి నుంచి దుర్వాసన మొదలవుతుంది. పైపులైన్లు వేయడానికి ఆ కాలనీలోని ఇరుకైన దారులను తవ్వడంతో, ఇక్కడ నీరు నిలిచి గోడలపై ఫంగస్ పెరిగింది. బహిష్టు అయినప్పుడు మంజుల తన శానిటరీ ప్యాడ్‌లను మార్చుకునేది కూడా ఇక్కడే. "నేను రోజుకు రెండుసార్లు మాత్రమే ప్యాడ్‌లను మార్చగలను - ఉదయం పనికి వెళ్ళబోయే ముందు, సాయంత్రం పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత." ఆమె పనిచేసే పొలాల్లో ఉపయోగించుకోవడానికి మరుగుదొడ్లు లేవు.

ప్రాదేశికంగా వేరు చేయబడిన అన్ని దళిత కాలనీల మాదిరిగానే, అసుండి లోని మాదిగర కేరి కూడా గ్రామ పొలిమేరలకే పరిమితం చేయబడింది. ఇక్కడ ఉన్న 67 ఇళ్లలో దాదాపు 600 మంది ప్రజలు నివసిస్తున్నారు. అక్కడున్న ఇళ్ళలో సగంవాటిలో ఒకోదానిలో మూడేసి కుటుంబాలు ఉన్నాయి.

అరవై ఏళ్ల క్రితం అసుండి మాదిగ వర్గానికి కేటాయించిన 1.5 ఎకరాల భూమిలో నిర్మించిన కాలనీలో జనాభా పెరుగుతోంది. అయితే మరిన్ని ఇళ్ళను నిర్మించాలని డిమాండ్ చేస్తూ చేసిన అనేక నిరసనలు ఎక్కడకూ దారితీయలేదు. యువతరానికీ, వారి పెరుగుతున్న కుటుంబాలకూ వసతి కల్పించడం కోసం అందుబాటులో ఉన్న స్థలాన్ని ప్రజలు గోడలు లేదా చీర-కర్టెన్లతో విభజించారు.

ఆ విధంగా 22.5 X 30 అడుగుల పెద్ద గదిగా ఉన్న గాయత్రి ఇల్లు, మూడు చిన్న ఇళ్ళుగా మారిపోయింది. ఆమె, ఆమె భర్త, వారి ఇద్దరు కుమారులు, ఆమె భర్త తల్లిదండ్రులు, ఆ భాగాలలో ఒకదాన్ని ఆక్రమించారు. ఆమె భర్త పెద్ద కుటుంబం మిగిలిన రెండు భాగాలలో నివసిస్తున్నారు. ఇంటి ముందున్న ఇరుకైన, మురికిగా ఉండే మార్గం మాత్రమే ఇరుకైన ఆ ఇంట్లో చేయలేని పనులను చేయడానికి అందుబాటులో ఉన్న ఏకైక స్థలం. బట్టలు ఉతకడం, పాత్రలు శుభ్రం చేయడం, 7, 10 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులకు స్నానం చేయించడం . వారి ఇల్లు చాలా చిన్నది కావడంతో, గాయత్రి తన 6 ఏళ్ల కుమార్తెను చిన్నములగుండ్ గ్రామంలో ఉండే పిల్లల తాతయ్యల వద్ద నివసించడానికి పంపింది.

Permavva Kachcharabi and her husband (left), Gayathri's mother- and father-in-law, at her house in Asundi's Madigara keri.
PHOTO • S. Senthalir
The colony is growing in population, but the space is not enough for the families living there
PHOTO • S. Senthalir

అసుండి, మాదిగర కేరిలోని తమ ఇంటివద్ద గాయత్రి అత్తమామలైన పెర్మవ్వ కచ్చరబి, ఆమె భర్త( ఎడమవైపు ఉన్నవారు). కుడి: కాలనీలో జనాభా పెరిగిపోతున్నారు కానీ అక్కడ నివసిస్తోన్న కుటుంబాలకు స్థలం సరిపోవడంలేదు

ఎన్ఎఫ్ఎచ్ఎస్ 2019-20 డేటా ప్రకారం కర్ణాటకలో 74.6 శాతం కుటుంబాలు ‘మెరుగైన పారిశుద్ధ్య సదుపాయాన్ని’ ఉపయోగిస్తుండగా, హావేరి జిల్లాలో కేవలం 68.9 శాతం కుటుంబాలు మాత్రమే ఆ సౌకర్యాన్ని ఉపయోగిస్తున్నాయి. ఎన్ఎఫ్ఎచ్ఎస్ ప్రకారం మెరుగైన పారిశుద్ధ్య సదుపాయం అంటే, "పైపుల ద్వారా ప్రవహించే మురుగునీటి వ్యవస్థకు అనుసంధానించబడిన ఫ్లష్ లేదా పోర్-ఫ్లష్ (సెప్టిక్ ట్యాంక్ లేదా పిట్ మరుగుదొడ్డి), మెరుగైన గాలివెలుతురు ప్రసరించే గుంట మరుగుదొడ్డి, మూతలున్న గుంట మరుగుదొడ్డి లేదా కంపోస్టింగ్ టాయిలెట్‌"ను కలిగి ఉండటం. అసుండి మాదిగర కేరి లో అలాంటి సదుపాయం లేదు. " హోలదాగ హోగ్బెక్రి (పొలాలనే మరుగుదొడ్డిగా ఉపయోగించాలి). పొలల యజమానులు తమ పొలాలకు కంచె వేస్తారు, మమ్మల్ని దుర్భాషలాడతారు," అని గాయత్రి చెప్పింది. దీనితో కాలనీ వాసులు తెల్లవారకముందే బయలుకు వెళతారు.

దీనికి పరిష్కారంగా గాయత్రి నీళ్ళు తాగడం తగ్గించింది. భూమి యజమానులు ఆ చుట్టుపక్కలే ఉన్నందున మూత్ర విసర్జన చేయకుండా ఇంటికి తిరిగి వచ్చినప్పుడల్లా గాయత్రికి విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. “కొంతసేపాగి, తిరిగి వెళితే, నాకు మూత్రం పోయడానికి కనీసం అరగంట పడుతుంది. అది కూడా చాలా బాధాకరంగా ఉంటుంది.”

మరోవైపు, యోనిలో ఇన్ఫెక్షన్ కారణంగా మంజుల కడుపునొప్పితో బాధపడుతోంది. ప్రతి నెలా ఆమెకు ఋతుస్రావం ముగిసిన వెంటనే యోని నుంచి ద్రవం కారటం ప్రారంభమవుతుంది. "ఇది మళ్ళీ బహిష్టు అయ్యే వరకు కొనసాగుతుంది. బహిష్టు వచ్చే వరకు కడుపులో, వెన్నులో నొప్పిగా ఉంటుంది. విపరీతమైన బాధగా ఉంటుంది. నా చేతుల్లో, కాళ్ళలో అసలు బలం లేదు.”

ఆమె ఇప్పటివరకు నాలుగైదు ప్రైవేట్ క్లినిక్‌లకు వెళ్ళింది. ఆమె స్కానింగ్ రిపోర్టులు మామూలుగానే ఉన్నాయి. “నాకు ఒక బిడ్డ పుట్టే వరకు (గర్భవతి అయ్యే వరకు) ఎలాంటి పరీక్షలు చేయించుకోవద్దని చెప్పారు. అందుకే ఆ తర్వాత మళ్లీ ఏ ఆస్పత్రికీ వెళ్లలేదు. రక్త పరీక్ష కూడా చేయలేదు.”

వైద్యుల సలహాతో సంతృప్తి చెందని ఆమె సంప్రదాయ మూలికావైద్యాన్ని, స్థానిక ఆలయ పూజారులను ఆశ్రయించింది. కానీ నొప్పి, ద్రవాలు కారటం ఆగలేదు.

With no space for a toilet in their homes, or a public toilet in their colony, the women go to the open fields around. Most of them work on farms as daily wage labourers and hand pollinators, but there too sanitation facilities aren't available to them
PHOTO • S. Senthalir
With no space for a toilet in their homes, or a public toilet in their colony, the women go to the open fields around. Most of them work on farms as daily wage labourers and hand pollinators, but there too sanitation facilities aren't available to them
PHOTO • S. Senthalir

తమ ఇళ్లల్లో మరుగుదొడ్డి కట్టుకునేంత స్థలం లేకపోవటం, కాలనీలో ప్రజా మరుగుదొడ్డి కూడా లేకపోవడంతో, మహిళలు చుట్టుపక్కల ఉండే ఖాళీస్థలాలకు వెళ్తున్నారు. వీరిలో ఎక్కువ మంది పొలాల్లో రోజువారీ కూలీలుగా, చేతితో పరాగ సంపర్కం చేసేవారిగా పని చేస్తారు, కానీ అక్కడ కూడా వారికి పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులో లేవు

పోషకాహార లోపం, కాల్షియం లోపం, ఎక్కువ గంటలు శారీరక శ్రమ చేయటం - ఇవన్నీ అపరిశుభ్రమైన నీరు తాగటం, బహిరంగ మలవిసర్జన వంటివాటితో కలిసి, దీర్ఘకాలిక వెన్నునొప్పి, పొత్తికడుపు నొప్పి, కటి ప్రదేశంలో వాపుతో పాటు యోని నుంచి ద్రవాలు కారటానికి దారితీయవచ్చునని డాక్టర్ సల్దాన్హా చెప్పారు.

“ఇది హావేరి లేదా కొన్ని ప్రాంతాలకే సంబంధించిన సమస్య కాదు,” అని ఉత్తర కర్ణాటకలో పనిచేసే టీనా జేవియర్ నొక్కిచెప్పారు. 2019లో ఈ ప్రాంతంలో మాతాశిశు మరణాలపై కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసిన కర్ణాటక జనారోగ్య చళవళి (కెజిఎస్)లో ఈమె  కార్యకర్తగా ఉన్నారు. "దుర్బలులైన మహిళలందరూ ప్రైవేట్ ఆరోగ్య రంగానికి బలైపోతున్నారు," అని ఆమె అన్నారు.

కర్ణాటకలోని గ్రామీణప్రాంతంలో ఉండే ఆరోగ్య వసతులలో తగినంతమంది వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది లేకపోవడం వల్ల గాయత్రి, మంజుల వంటి మహిళలు ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణను ఎంపిక చేసుకోవలసి వస్తోంది. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద 2017లో పునరుత్పత్తి మరియు పిల్లల ఆరోగ్యంపై జరిపిన ఆడిట్ , దేశంలోని ఎంపిక చేసిన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను సర్వే చేసింది. కర్ణాటకలో వైద్యుల, నర్సుల, పారామెడికల్ సిబ్బంది కొరత భారీగా ఉన్నట్టు ఈ సర్వే సూచించింది.

ఈ నిర్మాణపరమైన సమస్యల గురించి తెలియక, ఆందోళనపడుతున్న గాయత్రి ఏదో ఒక రోజున తన సమస్య ఏమితో కనుక్కోవాలని భావిస్తోంది. “నాకేం అవబోతుంది? నాకు ఎలాంటి రక్త పరీక్షలు చేయలేదు. అవేమైనా చేసివుంటే, బహుశా నా సమస్య ఏమిటో నాకు తెలిసి ఉండేది. ఎలాగోలా ఎక్కడైనా డబ్బు అప్పు తీసుకునైనా రోగ నిర్ధారణ చేయించుకోవాలి. కనీసం నా ఆరోగ్యానికి ఏమైందో, అదైనా తెలుసుకోవాలి.”

గ్రామీణ భారతదేశంలో, కౌమారదశలో ఉన్న బాలికలు, యువతులు మొదలైన అట్టడుగు సమూహాల జీవన పరిస్థితులను, అనుభవాలను వారి గొంతులతోనే పదిలపరచాలని, పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్‌లు ఈ దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్టును చేపట్టాయి.

ఈ కథనాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? అయితే [email protected] కి ఈమెయిల్ చేసి, [email protected] కి కాపీ పెట్టండి.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

S. Senthalir

S. Senthalir is Senior Editor at People's Archive of Rural India and a 2020 PARI Fellow. She reports on the intersection of gender, caste and labour. Senthalir is a 2023 fellow of the Chevening South Asia Journalism Programme at University of Westminster.

Other stories by S. Senthalir
Illustration : Priyanka Borar

Priyanka Borar is a new media artist experimenting with technology to discover new forms of meaning and expression. She likes to design experiences for learning and play. As much as she enjoys juggling with interactive media she feels at home with the traditional pen and paper.

Other stories by Priyanka Borar
Editor : Kavitha Iyer

Kavitha Iyer has been a journalist for 20 years. She is the author of ‘Landscapes Of Loss: The Story Of An Indian Drought’ (HarperCollins, 2021).

Other stories by Kavitha Iyer
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli