నేను అలసిపోయాను. నా శరీరం, మనసూ భారంగా ఉన్నాయి. నా కళ్ళు మరణాల బాధతో - నా చుట్టూ ఉన్న పీడితుల మరణాలు - నిండిపోయాయి. నేను పని చేసిన చాలా కథనాలను రాయలేకపోతున్నాను. నాకు మొద్దుబారిపోయినట్టు అనిపిస్తోంది. నేను ఈ కథనాన్ని రాయడం మొదలుపెడుతుండగానే చెన్నైలోని అణగాపుత్తూరులో దళితుల ఇళ్ళను ప్రభుత్వం కూల్చివేస్తోంది. నేను మరింతగా కొయ్యబారిపోయాను.
తమిళనాడులోని హోసూర్‌లో అక్టోబరు 7, 2023న బాణాసంచా గిడ్డంగులలో జరిగిన కార్మికుల మరణాల నుండి నేను ఇప్పటికీ దూరం జరగలేకపోతున్నాను. నేను ఇప్పటి వరకు 22 మరణాలను నమోదు చేసాను. వీరిలో ఎనిమిది మంది 17 నుంచి 21 ఏళ్ళ మధ్య వయస్సు గల విద్యార్థులు ఉన్నారు. వీరంతా బాణాసంచాను నిలవచేసే గిడ్డంగులలో పనిచేశారు. ఈ ఎనిమిది మంది విద్యార్థులు ఒకే పట్టణానికి చెందినవారు, సన్నిహిత స్నేహితులు కూడా.
నేను ఫోటోగ్రఫీ నేర్చుకోవడం మొదలుపెట్టినప్పటి నుండి, బాణసంచా కర్మాగారాలలో, గిడ్డంగులలో, దుకాణాల్లో పనిచేసే వ్యక్తుల గురించి నాకు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. నేను ఎంతగా ప్రయత్నించినా ఆ గిడ్డంగులను చూడటానికి అవసరమైన అనుమతులను పొందలేకపోయాను. నేను చేసిన వాకబులన్నిటిలో, వాటిని చూసేందుకు ఎప్పటికీ అనుమతి ఇవ్వరనేదే నాకు తెలిసింది. ఫోటోలు తీయడం అటుంచి, లోపలికి వెళ్లడమే సాధ్యం కాదు.
మా అమ్మానాన్న దీపావళి పండుగ కోసమని మాకు ఎన్నడూ కొత్త బట్టలు కానీ టపాకాయలు కానీ కొనలేదు. వారికి ఆ స్తోమత లేదు. మా పెదనాన్న మాకు కొత్త బట్టలు కొనేవారు. మేమెప్పుడూ దీపావళి పండుగను జరుపుకోవటానికి ఆయన ఇంటికే వెళ్ళేవాళ్ళం. ఆయన మాకే కాక మిగిలిన చిన్నాన్నల పిల్లలందరికీ టపాకాయలు కొనేవారు, మేమందరం కలిసి వాటిని కాల్చేవాళ్ళం.
అయితే నాకు టపాసులు కాల్చటంలో పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. నేను పెరిగి పెద్దవుతున్న క్రమంలో వాటిని కాల్చడాన్ని పూర్తిగా మానేశాను. దీపావళితో సహా పండుగలను జరుపుకోవడం కూడా మానేశాను. నేను ఫొటోగ్రఫీలోకి ప్రవేశించిన తర్వాత మాత్రమే శ్రామికవర్గ జీవితాల గురించి అర్థంచేసుకోవటం మొదలుపెట్టాను.
ఫొటోగ్రఫీ ద్వారా నేను అనేక విషయాలు నేర్చుకున్నాను. ప్రతి ఏటా దీపావళి సమయంలో బాణాసంచా గిడ్డంగులలో మంటలు చెలరేగటం, ప్రమాదాలు జరుగుతుంటాయి. అటువంటి ప్రమాదాలను అంతగా పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో నేనుండేవాడ్ని.
ఎలాగైతేనేం, ఈ ఏడాది [2023] ఆ ప్రమాదాలను కనీసం డాక్యుమెంట్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలోనే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులోని క్రిష్ణగిరి దగ్గర ఒక గ్రామంలో ఎనిమిదిమంది పిల్లలు బాణాసంచా పేలుడులో మరణించిన వార్తను విన్నాను. నేను చాలా విషయాలను ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల ద్వారా తెలుసుకున్నట్టే ఈ విషయాన్ని, ఈ సంఘటన పట్ల వెల్లువెత్తిన నిరసనల గురించి కూడా కూడా సామాజిక మాధ్యమాల ద్వారానే తెలుసుకున్నాను.
ఈ వార్తను కూడా నేను అలాగే తీసుకున్నాను. నా సహచరులను కొంతమందిని వాకబు చేసినప్పుడు, చనిపోయినవారంతా ఒకే పట్టణానికి చెందినవారనీ, దీపావళి పండుగ కాలంలో పనుల కోసం అక్కడికి వెళ్ళారనీ తెలిసింది. ఇది నన్ను తీవ్రంగా బాధపెట్టింది. ఎందుకంటే ఇలాంటి కాలానుగుణమైన (సీజనల్) పనులు చేయటానికి మేం కూడా వెళ్ళేవాళ్ళం. వినాయగర్ చతుర్థి సమయంలో అరుగంపుల్ (గరిక పోచలు), ఎరుక్కమ్పుల్ (జిల్లేడు)తో దండలు కట్టి అమ్మేవాళ్ళం. పెళ్ళిళ్ళ కాలంలో పెళ్ళి వంటిళ్ళలో పనిచేసి, వడ్డన చేసేవాళ్ళం. మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వలన నేను కూడా ఇటువంటి కాలానుగుణమైన పనులు చేసిన అబ్బాయినే.
నా వంటివాడే ఒక అబ్బాయి ఒక సీజనల్ పని కోసం వెళ్ళి, ప్రమాదం బారిన పడి చనిపోయాడు. ఇది నన్ను అమిత తీవ్రంగా కలవరపెట్టింది.
నేను తప్పకుండా దీనిని డాక్యుమెంట్ చేయాల్సివచ్చింది. తమిళనాడు రాష్ట్రం, ధర్మపురి జిల్లా ఆమూర్ తాలూకాలోని అమ్మాపేట్టై గ్రామంతో మొదలుపెట్టాను. ఈ గ్రామం ధర్మపురికీ తిరువణ్ణామలైకీ మధ్యగా పారే తెన్‌పెణ్ణై నది ఒడ్డున ఉంది. ఈ నదిని దాటగానే తిరువణ్ణామలైలో ఉంటాం.
ఆ గ్రామాన్ని చేరటానికి నేను మూడు బస్సులు మారాల్సి వచ్చింది. బస్సు ప్రయాణ సమయమంతా అక్కడి పరిస్థితుల గురించి నా సహచరులతో మాట్లాడుతూనే ఉన్నాను. ఆమూర్ నుంచి వచ్చిన ఒక సహచరుడు నన్ను అమ్మాపేట్టై వెళ్ళే బస్ ఎక్కించి, బస్‌స్టాండ్ దగ్గర ఇంకొంతమంది సహచరులు ఎదురుచూస్తూ ఉంటారని నాకు మాటిచ్చాడు. అమ్మాపేట్టైలో బస్ ప్రవేశించగానే మొదటగా నేను చూసింది, ఒక బోనులో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని. ఆ విగ్రహం చుట్టూ అపారమైన నిశ్శబ్దం ఆవరించివుంది. ఊరు కూడా నిశ్శబ్దంగా ఉంది. అది శ్మశానంలో ఉండే నిశ్శబ్దంలా ఉంది. అది నా దేహంలోకి కూడా వ్యాపించి నన్ను వణికించింది. ఏ ఇంటి నుంచి కూడా - ప్రతి ప్రాంతాన్నీ చీకటి చుట్టుముట్టినట్టు - రవ్వంత చప్పుడు లేదు.
ఈ పనిమీద బయలుదేరినప్పటి నుంచి నాకేమీ తినాలనిపించలేదు. అంబేద్కర్ విగ్రహం ఎదురుగా ఉన్న ఒక టీ దుకాణంలో రెండు వడలు , ఒక టీ తాగి, రావల్సిన సహచరునికోసం ఎదురుచూస్తున్నాను.
ఆ వచ్చిన కామ్రేడ్ ఒక కొడుకును పోగొట్టుకున్న మొదటి ఇంటికి తీసుకువెళ్ళాడు. రేకుల కప్పు ఉన్న ఆ ఇంటికి ఒకవైపు మాత్రమే గిలాబా (ప్లాస్టరింగ్) చేసివుంది.
కొన్ని నిముషాల పాటు మూసివున్న తలుపుల మీద తట్టిన తర్వాత ఒక మహిళ వచ్చారు. ఆమెను చూస్తే చాలా రోజులుగా నిద్రపోనట్టుగా కనిపించింది. నాతో వచ్చిన కామ్రేడ్ ఆమెను వి. సెల్వి అని చెప్పాడు. 37 ఏళ్ళ వయసున్న ఆమె పేలుడులో మరణించిన 17 ఏళ్ళ వి. గిరికి తల్లి. ఆమెను నిద్రలేపినందుకు నాకు బాధకలిగింది.
మేం ఇంటి లోపలికి అడుగుపెట్టేటపుడు యూనిఫామ్ వేసుకునివున్న ఒక అబ్బాయి ఫొటో కనిపించింది. గిలాబా లేని గోడకు తగిలించివున్న ఆ ఫొటోకు దండ వేసి ఉంది. ఆ ఫొటోను చూస్తే నాకు నా తమ్ముడిని చూసినట్లు అనిపించింది.
లాక్డౌన్ ఎత్తివేసిన వెంటనే, నా సొంత సోదరుడు ఒక టపాసుల దుకాణంలో పని చేయడానికి వెళ్ళాడు. వెళ్ళొద్దని నేను ఎంత చెప్పినా వినలేదు. అతను తిరిగి వచ్చేదాకా మా అమ్మ నిరంతరం ఆదుర్దా పడుతూనే ఉండేది.
గిరివాళ్ళమ్మ మాట్లాడలేకపోయారు. తన కొడుకును గురించి నేను అడిగిన వెంటనే ఆమె ఆ గదిలోనే ఒక మూలన నేలమీద కూర్చొని ఏడవటం మొదలుపెట్టారు. గిరి అన్న కోసం ఎదురుచూద్దామని నాతో వచ్చిన కామ్రేడ్ అన్నాడు. ఇంతలో గిరి రెండో అన్న వచ్చి తన తమ్ముడెలా చనిపోయాడో వివరించటం మొదలుపెట్టాడు.
"నా పేరు సూర్య. నాకు 20 ఏళ్ళు. మా నాన్న పేరు వెడియప్పన్. ఆయన గుండె నొప్పితో చనిపోయి ఇప్పటికి ఎనిమిదేళ్ళవుతోంది."
సూర్య మాట్లాడాక, వాళ్ళమ్మ కూడా రుద్ధమైన గొంతుతో ఆగి ఆగి మాట్లాడారు. "వాడు చనిపోయాక జీవితం చాలా కష్టంగా ఉంది. నా పెద్ద కొడుకు 12 వ తరగతి పూర్తవగానే ఈ పట్టణం విడిచివెళ్ళి ఏదైనా ఉద్యోగం చూసుకొని ఇంటికి డబ్బు పంపించాలని నిర్ణయించుకున్నాడు. మేం మాకున్న అప్పులను తీర్చటం మొదలుపెట్టాం, అతని తమ్ముళ్ళు పెరుగుతున్నారు. మేం అతనికి పెళ్ళి చేయాలనుకున్నాం. తనకు పెళ్ళై ఇప్పటికి మూడు నెలలే అయింది. ఇంత కష్టమైన పరిస్థితులలో కూడా నేను పిల్లల్ని చదివించుకోగలిగాను. ఇలా జరుగుతుందని నేనెన్నడూ అనుకోలేదు.
"ఒక ఏడాది కాలేజీకి వెళ్ళలేకపోయినందుకే వాడు ఒక రెండు నెలలు బట్టల దుకాణంలో పనికి వెళ్ళాడు. మరో రెండు నెలలు ఇంట్లోనే ఉన్నాడు. వాడి స్నేహితులు కూడా వెళ్తున్నారని ఆ టపాసుల దుకాణానికి పని కోసం వెళ్ళాడు. ఆ తర్వాత ఇలా జరిగింది," అని చెప్పారామె
"ఈ సీజన్లో తంబి (తమ్ముడు) బట్టల దుకాణాల్లో ఉద్యోగానికే వెళ్తాడు. ఈ ఏడాదే ఈ పనికి (టపాసుల దుకాణం) వెళ్ళాలనుకున్నాడు. వాడు 12వ తరగతి పరీక్షల్లో పాసై, పారామెడికల్ కోర్సుకి దరఖాస్తు చేసుకున్నాడు. కానీ మార్కులు తక్కువగా వచ్చినందువలన వాడికి సీటు రాలేదు. అప్పుడే బట్టల దుకాణాల్లో పనికి పోవటం మొదలుపెట్టాడు. ఒకసారి ఆడి (జులై మధ్య నుంచి ఆగస్ట్ మధ్య వరకూ వచ్చే ఆషాఢ మాసం. ఈ నెలలో బట్టల దుకాణాలలో ప్రత్యేక అమ్మకాలు, తగ్గింపులు ఉంటాయి) నెలలో వాడు రూ. 25000 సంపాదించాడు. అందులో రూ. 20,000తో కుటుంబం అప్పును తీర్చాడు.
“ఎనిమిదేళ్ళ క్రితం మా నాన్న చనిపోయిన తర్వాత, మేమిద్దరం బట్టల దుకాణాల్లో పనిచేసి, అలా సంపాదించిన డబ్బుతో మా అప్పులను తీర్చేవాళ్ళం. మా అన్నయ్యకు పెళ్ళయింది. ఈ క్రమంలో మాకు రూ. 30,000 అప్పు అయింది.
"అందుకని మేం అన్ని రకాల ఉద్యోగాలూ చేశాం. మాలో చాలామందిమి, పరిస్థితులు సరిగ్గా లేకపోతే ఇళ్ళకు తిరిగి వచ్చేవాళ్ళం. టపాసుల దుకాణం యజమాని మా ప్రాంతంలోని ఒక అబ్బాయితో మాట్లాడి, వాళ్ళ దుకాణంలో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పాడు. మొదటి విడత కొంతమంది వెళ్ళారు. రెండో విడత వెళ్ళిన వాళ్ళతో మా తమ్ముడు కూడా వెళ్ళాడు.
"కానీ అక్కడకు వెళ్ళిన పిల్లల్లో ఏవో గొడవలు వచ్చాయి. దాంతో మా తమ్ముడు గిరి వెనక్కి తిరిగివచ్చి మా అన్న దగ్గర ఉన్నాడు. అక్కడ మా అన్నతో కలిసి పనిచేసేవాడు. ఇంతలో మా అన్న గుడిని దర్శించడానికి ఇక్కడికి వచ్చాడు.
"అప్పుడే టపాసుల దుకాణంలో పనిచేస్తోన్న అబ్బాయిల దగ్గర్నుంచి మళ్ళీ పనికి రమ్మని మా తమ్ముడికి కాల్ వచ్చింది. మా తమ్ముడు 2023, అక్టోబర్ 7న పనికి వెళ్ళాడు. ఆ రోజునే ఈ ప్రమాదం జరిగింది.
వాడు ఒక్క రోజు మాత్రమే పనిచేశాడు.
మా తమ్ముడు 2006, అక్టోబర్ 3న పుట్టాడు. మేం అప్పుడే వాడి పుట్టినరోజు పండుగను జరిపాం. అక్టోబర్ 7న ఇది జరిగింది.
ఏం జరిగిందో మాకెవరికీ (ఊళ్ళోవాళ్ళకు) తెలియదు. మా ఊర్నించి వెళ్ళి ఈ ప్రమాదం నుంచి బయటపడిన ఇద్దరు అబ్బాయిలు మాకు సమాచారం ఇచ్చారు. అప్పుడు మేం ఏం జరిగిందో ఆరా తీసి మా ఊర్నించి వెళ్ళిన ఏడుగురు పిల్లలు చనిపోయినట్టుగా తెలుసుకున్నాం. ఒక కారుని అద్దెకు తీసుకుని మా తమ్ముడి శరీరాన్ని గుర్తించడానికి వెళ్ళాం.
కేసు నమోదు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి, మంత్రి కె.పి. అంబళగన్, ఒక శాసన సభ్యుడు, ఒక పార్లమెంటు సభ్యుడు, ఇంకా ఎంతోమంది వచ్చారు. కలెక్టర్ మూడు లక్షల రూపాయల చెక్కును అందించాడు. తమిళనాడు ముఖ్యమంత్రి కూడా వస్తారని వాళ్ళు చెప్పారు కానీ ఆయన రాలేదు.
మా డిమాండ్ ఏమిటంటే వారి వారి చదువుల స్థాయిని బట్టి ప్రతి కుటుంబానికీ ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి."
తమ కుటుంబంలో మిగిలిన ఇద్దరు కొడుకులలో ఎవరికో ఒకరికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారని ఆశించినట్టు గిరి కుటుంబం చెప్పింది. "మాది రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. వారిలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వస్తే మాకు కొంత సాయంగా ఉంటుంది."
వాళ్ళమ్మ మాట్లాడటం ముగించాక నేను గిరి ఫొటో కోసం అడిగాను. చనిపోయిన తన తండ్రి ఫొటో ఉన్నవైపు చూపించాడు సూర్య. ఆ ఫొటో ఫ్రేముకి ఒక మూలన, పసివాడుగా ఉన్న గిరి నిల్చొని ఉన్న ఒక చిన్న ఫొటో పెట్టివుంది. అది చాలా అందమైన ఫొటో.
కరూర్‌లో ఉన్నట్టు SIPCOT (State Industries Promotion Corporation of Tamil Nadu Limited) లాంటివి ఉండి ఉంటే, మా అబ్బాయిలు పని కోసం ఇంత దూరం వెళ్ళేవారు కారు. పోయినసారి, పిల్లలకు బ్రెయిన్ వాష్ చేశారు. వాళ్ళు తిరిగి రాగానే వాళ్ళ కోసం కొత్త ఫోన్ వస్తుందని చెప్పారు. గిడ్డంగిలో టపాసులు పేలినట్లు ఎవరికీ తెలియలేదు. మొత్తం ఎనిమిది మంది అబ్బాయిలు ఊపిరాడక చనిపోయారు. మేం అక్కడ తనిఖీ చేస్తే తెలిసింది, వారంతా కలిసి బయటకు రావడానికి ఆ మార్గం చాలా చిన్నదని. ఈ అబ్బాయిలు టపాసుల దుకాణంలో పనిచేయడం ఇదే మొదటిసారి,” అని కామ్రేడ్ బాలా అన్నారు.
కామ్రేడ్ బాలా అలా అన్నప్పుడు నాకు నా సొంత సోదరుడు బాలా గుర్తొచ్చాడు. ఆ ప్రదేశం మరింత కలవరపరిచేదిగా మారింది. నాకు ఊపిరాడనట్లనిపించి గుండె పట్టేసినట్టయింది.
మరణించిన మొత్తం ఎనిమిదిమందికి చెందిన కుటుంబాలు తమకు ప్రియమైన వారి చిత్రాలకు పటం కట్టించాయి. ప్రతి ఇల్లు ఒక శ్మశానంలా ఉంది. జనం వస్తూ పోతూనే ఉన్నారు. ప్రమాదం జరిగి వారం రోజులు దాటినా బాధ, కన్నీళ్ళు అలాగే మిగిలాయి. అక్కడంతా బంధువులు చుట్టుముట్టారు.
మరో మృతుడు 19 ఏళ్ళ ఆకాశ్ ఫొటోకు పూలమాల వేసి ఇంటి ముందున్న కుర్చీలో ఉంచారు. అతని తండ్రి ఫోటో ముందు పడుకునివున్నారు. వాళ్ళది రెండు గదులు మాత్రమే ఉన్న ఇల్లు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మరొక కుర్చీలో పెట్టి ఉన్న ఆకాశ్ తల్లి ఫోటోను చూశాను.
నేను ఆకాశ్ తండ్రితో మాట్లాడటం ప్రారంభించగానే, అతను ఆపుకోలేకుండా ఏడుస్తున్నారు. ఆయన కొంత మద్యం మత్తులో కూడా ఉన్నారు. నన్ను అక్కడికి తీసుకెళ్ళిన నా సహచరుడు అతడిని శాంతింపజేసి, మాట్లాడేలా చేశాడు.
"నా పేరు ఎమ్. రాజా (47). నేనొక టీ దుకాణంలో గ్లాసులు కడుగుతాను. తన స్నేహితులు కూడా వెళ్ళారనే నా కొడుకు ఆ టపాసుల దుకాణంలో పనిచేయటానికి వెళ్ళాడు. వాడు చాలా మంచి పిల్లాడు, తెలివైనవాడు కూడా. వాడు పనికోసం వెళ్తూ నాకు రూ. 200 ఇచ్చి, నన్ను తాగొద్దని సలహా ఇచ్చాడు. ఒక పది రోజుల్లో తిరిగి వస్తాననీ, వచ్చాక నా బాగోగులు చూసుకుంటాననీ చెప్పివెళ్ళాడు. ఇలాంటి పనికి వెళ్ళటం వాడికి ఇదే మొదటిసారి. నేనెప్పుడూ వాడ్ని పనికి వెళ్ళమని చెప్పలేదు.”
ఆకాశ్‌కి అంబేద్కర్ అంటే ఎంత ఇష్టమో రాజా ఇలా చెప్పారు, “వాడు నిద్రలేవగానే మొదటగా చూడటం కోసం ఆయన [అంబేద్కర్] చిత్రపటాన్ని వేలాడదీశాడు. మా పిల్లలు జీవితంలో ఎలా పైకి రావడం మొదలుపెట్టారో నేను ఆలోచిస్తున్నాను. ఇది నా స్వంత కొడుకుకు జరిగింది. మొదట్లో పని నిమిత్తం ఓ బట్టల దుకాణానికి వెళ్ళేవాడు. వాడీసారి పని కోసం టపాసుల దుకాణానికి వెళ్తున్నాడని కూడా నాకు తెలియదు. అతను రెండు సంవత్సరాలు చదివిన తర్వాత తన కళాశాల చదువును నిలిపివేశాడు, కానీ మేం వాడు పని చేయాలని ఎప్పుడూ కోరుకోలేదు. నేను టీ దుకాణంలో రోజుకు 400 రూపాయలకు పని చేస్తాను. నాకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. నేను నా పిల్లల కోసమే జీవిస్తున్నాను. నా భార్య చనిపోయి 12 ఏళ్ళు అయింది.”
ఆ తర్వాత మేం వేడప్పన్ (21) ఇంటికి వెళ్ళాం. అంబేద్కర్ చిత్రపటం పక్కనే కోట్ సూట్లో ఉన్న అతని ఫోటో అతని మరణవార్తను మనకు తెలియజేస్తూ గోడకు వేలాడుతూ ఉంది. చనిపోయిన ఎనిమిది మందిలో పెళ్ళయినవాడు అతనొక్కడే. అప్పటికి అతనికి పెళ్ళయి 21 రోజులే అయింది. అతని తండ్రి తప్ప అక్కడ ఎవరూ మాట్లాడే స్థితిలో లేరు. వేడప్పన్ భార్య షాక్ నుండి ఇంకా తేరుకోలేదు.
“మాది ధర్మపురి జిల్లాలోని టి.అమ్మపట్టి గ్రామం. మాదేమీ బాగా జరుగుబాటున్న కుటుంబం కాదు. మా జిల్లా నుంచి 10 మంది, మా గ్రామం నుంచి కనీసం ఏడుగురు వెళ్ళారు. ఎక్కడా ఉపాధి దొరకకపోవడంతో వాళ్ళు ఈ పనులకు వెళ్ళారు. ఇది జరిగేనాటికి వాళ్ళు కేవలం రెండు మూడు రోజుల నుంచే ఈ పని చేస్తున్నారు.
“ఈ ప్రమాదానికి గల కారణాలను కర్ణాటక ప్రభుత్వం గానీ తమిళనాడు ప్రభుత్వం గానీ ప్రకటించలేదు. మరణ ధృవీకరణ పత్రం పొందడం కూడా కష్టంగా మారింది. తమిళనాడు ప్రభుత్వం మాకు మరణ ధృవీకరణ పత్రం, నష్టపరిహారం ఇవ్వాలి; ప్రతి కుటుంబానికి వారి చదువును బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.”
కృష్ణవేణి ఆర్.కేశవన్ తల్లి. తన కొడుకు టపాసుల దుకాణంలో పనికి వెళ్ళిన విషయం తనకు తెలియదని ఆమె చెప్పారు. "వాడు తన స్నేహితులతో కలిసి వెళ్ళాడు. మేం ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఏమీ వినలేదు, కానీ వాళ్ళు మాకు ఉద్యోగం ఇస్తారని ఆశిస్తున్నాం.”
ప్రమాదంలో కొడుకును కోల్పోయిన ముప్పై ఐదేళ్ళ కుమారి, ప్రమాదం జరిగిన రోజు తన కొడుకు తనకు పంపించిన సెల్ఫీల గురించి చెప్పారు. "దీపావళి సమయానికి మాకు సమకూర్చిపెట్టాలనే ఉద్దేశ్యంతో వాళ్ళు అలాంటి ప్రమాదకరమైన పనులకు వెళతారు. తద్వారా వాళ్ళకు కొత్త బట్టలు, లేదా బహుమతులు వస్తాయి. టపాసుల దుకాణంలో పనిచేస్తే వాళ్ళు 1,200 రూపాయలు సంపాదిస్తారు, అదే బట్టల దుకాణంలో చేస్తే 700-800 రూపాయలు మాత్రమే సంపాదిస్తారు.
“మధ్యాహ్నం భోజనం చేస్తూ పంపిన సెల్ఫీలను చూసిన వెంటనే వారి శవాలను చూడటం నాకెలా ఉంటుందో ఊహించండి..."
“మా కుటుంబం అనుభవించిన విధంగా మరే కుటుంబమూ బాధపడకూడదు. టపాసుల దుకాణాల్లో ఎలాంటి ప్రమాదాలూ జరగకూడదు. ఒక వేళ జరిగినా దుకాణంలో ఉన్నవాళ్ళు తప్పించుకోవడానికి ఏదో ఒక మార్గం ఉండాలి. అలాంటివి లేకపోతే, ఆ దుకాణాన్ని పని చేయడానికి అనుమతించకూడదు. ఇలాంటి నష్టాన్ని అనుభవించేది మా కుటుంబమే చివరిది కావాలి," అన్నారు కుమారి
మేము 18 ఏళ్ళ టి. విజయరాఘవన్ ఇంటికి వెళ్ళినప్పుడు, చాలా అనారోగ్యంతో ఉన్న అతని తల్లి ఆసుపత్రికి వెళ్ళివున్నారు. ఆమె తిరిగి వచ్చిన తర్వాత, ఆమె చాలా అలసిపోయి ఉండటాన్ని నేను గమనించాను. అయితే, విజయరాఘవన్ సోదరి మాకు అందించిన మజ్జిగను తాగిన తర్వాత మాత్రమే ఆమె మాతో మాట్లాడారు.
“తాను బట్టల దుకాణానికి వెళ్తున్నట్టుగా వాడు నాతో చెప్పాడు. కానీ టపాసుల దుకాణానికి ఎందుకు వెళ్లాడో నాకు ఖచ్చితంగా తెలియదు. వాడు కాలేజీకి ఫీజులు చెల్లించాలనుకుంటున్నాడని, మాపై భారం పడకూడదని అనుకుంటున్నాడనీ నాకు తెలుసు. ఎందుకంటే మేం మాకున్నదంతా మా కుమార్తె ఆరోగ్యం కోసమే ఖర్చు చేస్తున్నాం. ప్రభుత్వం మాకు ఏదైనా ఉద్యోగం ఇస్తే మేం కృతజ్ఞులమై ఉంటాం,” అని 55 ఏళ్ళ సరిత చెప్పారు.
కొంతమంది సహచరులతో పాటు విజయరాఘవన్ తండ్రితో కలిసి మేం ఆ ఎనిమిది మంది అబ్బాయిలకు అంత్యక్రియలు జరిగిన స్థలం దగ్గరకు వెళ్ళాం. “అవి అప్పటికే గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. అందరికీ కలిపి అంత్యక్రియలు జరిపించాం," అని విజయరాఘవన్ తండ్రి చెప్పారు.
తెన్‌పెణ్ణై నది, ఒకప్పుడు భవిష్యత్తుపై ఆశ, ప్రేమ కలిగి ఉన్న ఎనిమిది యువ జీవితాల అంత్యక్రియలకు సాక్ష్యంగా నిశ్చలంగా ప్రవహిస్తూ ఉంది.
బరువెక్కిపోయిన హృదయంతో నేను తిరిగివచ్చాను.
రెండు రోజుల తర్వాత, బాణసంచా తయారీకి ప్రధాన కేంద్రమైన శివకాశిలో 14 మంది చనిపోయారనే వార్తతో నేను మేల్కొన్నాను.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి