ఈ కథనం, 2019 పర్యావరణ రిపోర్టింగ్ విభాగంలో, రామ్‌నాథ్ గోయెంకా అవార్డును గెలుచుకున్న వాతావరణ మార్పులపై PARI ప్రచురించిన కథనాల వరుసలోనిది.

ఒక ఎకరం పొలం నిండా ఉన్న జొన్నలు అంత తక్కువ సమయంలో ఎలా మాయమైపోతాయి? “పంట అందివచ్చే సమయంలో ఒక వారం పాటు ఊరు వదిలిపెట్టి వెళ్ళాను. ఈ రెండేళ్ళలో అలా వెళ్లడం మొదటిసారి.  అంతలోనే మొత్తం తినేశాయి,” అంటారు ఆనంద్ సాల్వి. ఆ జొన్నలను తిన్నది ఒక గౌర్ ల మంద. ‘ఇండియన్ బైసన్’ అని కూడా అనబడే ఈ జంతువులు, ప్రపంచంలోనే అతి భారీ పశువులు. వీటిలో మగవి, ఆరడుగుల పొడవు ఉండి, 500 నుండి 1,000 కిలోల మధ్య బరువు తూగుతాయి.

సాధారణంగా  మహారాష్ట్ర, కొల్హాపూర్ జిల్లాలోని ‘రాధానగరి వన్యప్రాణుల అభయారణ్యం’లో ప్రశాంతంగా బ్రతికే ఈ పశువులకు, ఈ మధ్య రహదారులపైకి రావడం, పొలాల మీద పడి తినడం ఎక్కువైంది.

“పొలానికి కాపలాగా ఉండడానికి ఎవరూ లేకపోతిరి,” అని బాధగా అంటారు, రక్షి గ్రామానికి చెందిన సాల్వి. “అదృష్టవశాత్తూ నా ఎకరం చెరకు తోటని కాపాడుకోగలిగాను (దాదాపు 80 టన్నుల చెరకు).” మరి ఈ వెయ్యి టన్నుల జంతువుల నుంచి దేన్నైనా ఎలా కాపాడుకుంటారు ? టపాకాయలతో.

రెండేళ్ళ క్రితం నుండి సాల్వి రాత్రిళ్ళు పొలంలోనే పడుకోవడం మొదలుపెట్టారు. “రాత్రి ఎనిమిదింటికి వచ్చి, ఉదయం నాలుగింటికి ఈ గవా (గౌర్ లకు స్థానిక పదం) అన్నీ వెళ్ళిపోయాకే ఇంటికి వెళతాము,” అని ఆయన వివరిస్తారు. “అంతేగాక మేము రాత్రుళ్లు పొలాల్లో టపాకాయల్ని పేలుస్తాము. అలా పేల్చడం వల్ల ఆ బైసన్ లు  నా అయిదు ఎకరాల పొలంలోకి చొరబడడానికి భయపడతాయి,” అంటారాయన. ఆయన చుట్టుపక్కల వాళ్ళలో కూడా చాలా మంది అలాగే చేస్తారు. పన్హల తాలూకాలో ఉన్న రక్షి గ్రామం కనీసం రెండేళ్లుగా ఈ బైసన్ ల బారిన పడి తమ పంటను పోగొట్టుకుంటోంది.

PHOTO • Sanket Jain

సవరాయ్ సదా చెరువు, సంరక్షణ కేంద్రంలోని పక్షులకు, జంతువులకు చాలా ముఖ్యమైన నీటివనరు. అది ఇప్పుడు ఇలా ఎండిపోతోంది.

ప్రతి సీజన్ లోనూ టపాకాయలు కొనడానికి రోజుకి 50 రూపాయల దాకా ఖర్చవుతుంది,” అంటారు సాల్వి భార్య సునీత. ఇది పంట ఖర్చును మరింత పెంచుతుంది. “టపాకాయలు దగ్గర ఉన్నా కూడా రైతులు రాత్రిపూట పొలంలో పడుకోవడం ప్రమాదకరమే,” అంటారు ఆవిడ. ఆ సమయంలో పొలంలో పాములతో సహా వేరే జంతువులు కూడా తిరుగుతూ ఉంటాయి.

ఈ టపాకాయలు తమని ఏమీ చేయలేవని బైసన్ లు త్వరలోనే గ్రహించేస్తాయి అని ప్రజల విశ్వాసం. దానితో రాధానగరి తాలూకాలోని కొందరు రైతులు తమ పొలాలకి విద్యుత్ కంచెలు అడ్డం పెట్టేశారు. “కానీ బైసన్ లు ఆ కంచెలకు కూడా అలవాటు పడిపోతున్నాయి,” అంటారు బైసన్ నేచర్ క్లబ్ సహ-వ్యవస్థాపకులు సామ్రాట్ కేర్కర్. బైసన్ నేచర్ క్లబ్, రాధానగరి కేంద్రంగా పనిచేసే ఒక వన్యప్రాణుల ఎన్జీవో. “షాక్ కొడుతుందో లేదో అని బైసన్ లు నెమ్మదిగా తమ గిట్టలను కంచె మీద పెట్టి పరీక్షించడాన్ని కూడా మేము చూశాం. ఇంతకుముందు అవి మనుషులకు భయపడేవి, కానీ ఇప్పుడు మమ్మల్ని చూసి అవి అంత సులభంగా పరిగెత్తి పారిపోయే పరిస్థితి లేదు.”

“మేము గవాని కూడా నిందించము,” అంటారు సునీత. “ఇది అటవీ శాఖ వాళ్ళ పొరపాటు. అడవులను జాగ్రత్తగా పరిరక్షించకపోతే జంతువులు బయటికే వస్తాయి.”

గౌర్ గేదెలు ఆహారం కోసం, నీటి కోసం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుండి బయటకి రావడం క్రమ క్రమంగా పెరుగుతోంది. అవి ముఖ్యంగా ఎండిపోతున్న అడవులలో వాడిపోతున్న కర్వి ఆకులను వెతుక్కుంటూ బయటకు వస్తున్నాయి. సంరక్షణ కేంద్రంలోని చెరువులు ఆవిరయిపోవడం మరొక కారణం. అక్కడి పచ్చిక బయళ్ళు తగ్గిపోవడం కూడా ఇందుకు కారణమేనని ఫారెస్టు గార్డులు, పరిశోధకుల అభిప్రాయం.

Anand Salvi lost an acre of jowar to a bison raid.
PHOTO • Sanket Jain
Sunita Salvi says she blames the forest department.
PHOTO • Sanket Jain
Metallic cots farmers sleep on in the fields, through the night.
PHOTO • Sanket Jain

ఎడమ: ఆనంద్ సాల్వి ఒక ఎకరం నిండా పెంచిన జొన్నలను బైసన్ లు తినేశాయి. తప్పంతా  అటవీశాఖ వారిదే  అంటారు సునీత సాల్వి. కుడి: రైతులు తమ పంటలకు కాపలా ఉండడం కోసం ఈ ఇనుప మంచాలు వేసుకుని రాత్రంతా పొలంలోనే పడుకుంటారు.

కేంద్ర భూగర్భ జలాల బోర్డు గణాంకాల ప్రకారం రాధానగరి తాలూకా, 2004లో 3,510 మి.మీలు, 2008లో 3,684 మి.మీలు, 2012లో 3,072 మి.మీల వర్షపాతాన్ని అందుకుంది. కానీ 2018 లో ఆ సంఖ్య 2,120 మి.మీలకు పడిపోయింది. గత దశాబ్దంలో కొల్హాపూర్ జిల్లాలో వర్షపాతం ఒక క్రమం లేకుండా కురిసింది. నిజానికి మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలలో పరిస్థితి ఇలానే ఉంది.

పశువుల కాపరి అయిన రాజు పాటిల్, పదేళ్ళ క్రితం దేవగడ్-నిపాని రాష్ట్ర రహదారి పై ఒక డజను బైసన్ లను చూశారు. అంతకుముందు ఆయన వాళ్ళ ఊరు రాధానగరిని ఆనుకుని ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉందని విన్నారు కానీ తన యాభై యేళ్ళ జీవితంలో గవాను చూడడం ఆయనకు అదే మొదటిసారి.

“గత దశాబ్దకాలం గానే అవి అడవిని దాటి బయటికి రావడాన్ని గమనిస్తున్నా,” అంటారాయన. అప్పటినుండి ఆ భారీ పశువులు రోడ్డు దాటుతుండగా చూడడం రాధానగరి గ్రామస్తులకు సర్వసాధారణం అయిపోయింది. కొందరు గ్రామస్తులు తమ సెల్ ఫోన్లలో ఆ జంతువుల వీడియోలు కూడా తీశారు. అలా బైసన్ లు కొల్హాపూర్ జిల్లాలోని రాధానగరి, షాహువాడి, కర్వీర్ ఇంకా పన్హల తాలూకాలకు చెందిన పొలాల్లో చేరి చెరకు, జొన్న, మొక్కజొన్న, వరి వంటి పంటలను తినడం మొదలుపెట్టాయి.

అడవిలో చాలా వేగంగా తరిగిపోతున్న నీటి కోసం కూడా వాటికి అడవి దాటడం అవసరమైంది.

గత పది-పదిహేను సంవత్సరాల కాలంగానే గవా అడవిని దాటి గ్రామాలలోకి రావడం చూస్తున్నామని రాధానగరి తాలూకా ప్రజలు చాలా బలంగా చెప్తారు. పన్హల తాలూకాలో అయితే ఈ పరిణామం ఇటీవలి కాలంలోనే ప్రారంభమయింది. “మేము గవాని చూసింది గత రెండేళ్ళలోనే. అంతకుముందు మా పంటలను అడవి పందులు నాశనం చేసేవి,” అంటారు 42 ఏళ్ల యువరాజ్ నిరుఖే. రక్షి గ్రామంలో అడవికి దగ్గరగా ఆయనకి ఒక ముప్పావు ఎకరం పొలం ఉంది. జనవరి నుండి ఒక డజను బైసన్ లు కలిగిన మంద ఆ పొలంలోకి మూడు సార్లు చొరబడింది. “దాదాపు నాలుగు క్వింటాళ్ళ జొన్న నష్టపోయాను. ఇప్పుడు వర్షాకాలంలో వరి పంట వేయాలంటే భయం వేస్తోంది,” అన్నారు యువరాజ్.

రాధానగరి తాలూకాలోని ప్రజలు, గౌర్ లు సంరక్షణ కేంద్రం దాటి రోడ్లు, రహదారులు దాటే దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో రికార్డు చేశారు.

“ఇక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది,” అంటారు రాధానగరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అయిన ప్రశాంత్ టెండూల్కర్. “ఇంతకుముందు మార్చి, ఏప్రిల్ నెలల్లో కనీసం ఒక్కసారన్నా వర్షం కురిసేది. దానితో అడవిలో వేసవికి ఎండుతున్న  చెరువులలోకి ఎంతో కొంత నీరు చేరేది. మనం ప్రకృతికి వ్యతిరేకంగా వెళుతుంటే ఎవరిని నిందించాలి? 50-60 ఏళ్ల క్రితం అడవులని ఆనుకుని పశువులు మేత మేసే పచ్చిక బయళ్ళు, వాటిని ఆనుకుని పొలాలు, ఆపై గ్రామాలు ఉండేవి. ఇవాళ ప్రజలు ఆ భూముల్లో నివాసాలు ఏర్పరచుకుని, నెమ్మదిగా అడవి దాకా వెళ్ళిపోతున్నారు. అడవులకి గ్రామాలకి మధ్య ఉన్న భూములు ఆక్రమణకు గురవుతున్నాయి.” అని చెప్పారు.

బాక్సైట్ తవ్వకాల రూపంలో మరింత విధ్వంసకరమైన ఆక్రమణ జరుగుతోంది. కొన్ని దశాబ్దాలుగా ఈ తవ్వకాలు నడుస్తూ ఆగుతూ కొనసాగుతున్నాయి.

“చాలా సంవత్సరాలుగా సాగుతున్న ఓపెన్ క్యాస్ట్ బాక్సైట్ కార్యకలాపాలు మైనింగ్ రాధానగరిని నాశనం చేశాయి,” అంటారు శాంక్చువరీ ఏషియా వ్యవస్థాపక ఎడిటర్ బిట్టు సెహగల్. “మైనింగ్ కి వ్యతిరేకంగా చాలా తీవ్రమైన నిరసన వ్యక్తమైంది. కానీ INDAL (ఇది తరువాత HINDALCOలో విలీనం చేయబడింది) వంటి మైనింగ్ కంపెనీలకి నిరసనకారులతో పోలిస్తే అధికారుల వద్ద పలుకుబడి ఎక్కువ కదా. నిజానికి ప్రభుత్వ ఆఫీసులలో ఈ కంపెనీలే పాలసీలు రాశాయి. మైనింగ్ వల్ల పచ్చిక బయళ్ళు, నీటి వనరులకు చెప్పలేనంత హాని జరిగింది.” అన్నారు.

1998 నుండి మొదలై బాంబే హైకోర్టు, సుప్రీం కోర్టు మైనింగ్ కార్యకలాపాలపై అనేకమార్లు విరుచుకుపడ్డాయి. 2018లో కూడా సుప్రీం కోర్టు, ఈ వ్యవహారం పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం చూపిన ‘పూర్తి నిర్లక్ష్యం’ వల్ల ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.

PHOTO • Sanket Jain

పైన ఎడమ: ఈ సారి వరి పండించేందుకు యువరాజ్ నిరుఖే భయపడుతున్నారు. కుడి: రాజు పాటిల్ ముప్పావు ఎకరంలో పండించిన చెరుకు పంటను బైసన్ లు తినేశాయి. కింద: మారుతి నికమ్ అరెకరంలో పండించిన ఎలిఫెంట్ గ్రాస్ ను కూడా బైసన్ లు తినేశాయి.

కొల్హాపూర్ లోని శివాజీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు 2012లో అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి, “కొల్హాపూర్ జిల్లాలోని పర్యావరణంపై బాక్సైట్ మైనింగ్ కార్యకలాపాల ప్రభావంపై అధ్యయనం” అనే పేరుతో ఒక పరిశోధనా పత్రం తయారు చేశారు. మైనింగ్ వల్ల ఆ ప్రాంతంలో కలిగే దీర్ఘకాలిక సమస్యల ప్రస్తావన అందులో ఉంది. “అక్రమంగా జరిగే తవ్వకాలతో పాటు, చట్టానుసారం జరిగే మైనింగ్ కూడా ఈ ప్రాంతంలో పర్యావరణానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తోంది. మొదట్లో మైనింగ్ వల్ల దగ్గరలో ఉన్న కొందరికి ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుదల వంటి లాభాలు తాత్కాలికంగా అందుతాయి. కానీ అది భూమి వాడుకను మార్చి చుట్టుపక్కల జీవావరణానికి కలిగించే నష్టం శాశ్వతంగా ఉండిపోతుంది,” అని పరిశోధకులు వారి పరిశోధనా పత్రంలో రాశారు.

రత్నగిరికి 24 కిలోమీటర్ల దూరంలోనే దాజీపూర్ రూపంలో మరొక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. 1980ల వరకు ఒకే కేంద్రంగా ఉన్న వాటిని ఆ తర్వాత వేర్వేరు సంరక్షణ కేంద్రాలుగా విడదీశారు. ఇవి రెండూ కలిపి 351.16 చదరపు కి.మీ ల వైశాల్యంలో ఉంటాయి. దాజీపూర్ లో సవరాయ్ సదా అని పిలవబడే లేటరైట్ పీఠభూమి ఉంది. ఒక సరస్సు కూడా కలిగి ఉన్న ఆ పీఠభూమి, ఆ ప్రాంతంలోని పక్షులకి, జంతువులకి ఆహారం ఇంకా నీటి అవసరాలకి ఒక ముఖ్యమైన ఆధారం. కానీ ఈ యేడు మే నెల వచ్చేసరికి అక్కడి సరస్సులో చాలా భాగం ఎండిపోయింది.

“పోయిన పదేళ్ళ కాలంలోనే ఈ అడవిలో చెట్లు చాలావరకు కొట్టేశారు. ఇది ఋతువుల మార్పు పై ప్రభావం చూపింది,” అంటారు అమిత్ సయ్యద్. ఆయన వైల్డ్ లైఫ్ పరిశోధకులు, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అండ్ రీసర్చ్ సొసైటీ అధ్యక్షులు.

జంతువుల కోసం అటవీశాఖ వారు ఏర్పాటు చేసిన మానవనిర్మిత ‘సాల్ట్ లిక్స్’లో సవరాయ్ సదా ఒకటి. సాల్ట్ లేదా మినరల్ లిక్ అనే ప్రదేశాలు జంతువుల తమకు అవసరమైన పోషకాలను అందుకునేందుకు ఉద్దేశించినవి. రాధానగరి ఇంకా దాజీపూర్ లలో కొన్నిచోట్ల ఉప్పు, తవుడు, ఊక వంటి వాటిని ఈ విధంగా ఏర్పాటు చేశారు.

సాల్ట్ లిక్స్ లా ఉపయోగపడే విధంగా కాక మనుషుల జోక్యం హానికరంగా మారిన సందర్భం ఒకటి ఉంది - అదే చెరకు తోటల వ్యాప్తి. కొల్హాపూర్ లోని కొన్ని తాలూకాలలో కురిసే అధిక వర్షాల కారణంగా ఆ ప్రాంతం కొన్ని దశాబ్దాల పాటు చెరుకు తోటల పెంపకానికి అనువుగా ఉండింది. కానీ విపరీతంగా పెరుగుతున్న ఈ తోటల పెంపకం ఆందోళన కలిగించే విషయంగా మారింది. మహారాష్ట్ర పంచదార కమిషనరేట్ అండ్ గజెటీర్స్ ప్రకారం, 1971-72ల మధ్య, కొల్హాపూర్ జిల్లాలో చెరకు తోటల పెంపకం 40,000 హెక్టార్లలో వ్యాపించి ఉండేది. గతేడాది, 2018-19లో, ఆ సంఖ్య 287 శాతం పెరిగి, 155,000 హెక్టార్లకు చేరుకుంది. (మహారాష్ట్రలో ఒక ఎకరం చెరకు పెంచడానికి 18-20 మిలియన్ లీటర్ల నీరు అవసరం అవుతుంది.)

PHOTO • Sanket Jain

పై వరుసలో ఎడమ: మంద నుంచి వేరుపడిన గౌర్. కుడి: లేటరైట్ పీఠభూమి, తరిగిపోతున్న అడవి. కింద వరుసలో ఎడమ: జంతువుల కోసం సవరాయ్ సదాలో ఉప్పు, తవుడు రూపంలో ఉంచిన మినరల్ లిక్. కుడి: సంరక్షణ కేంద్రం దగ్గరలోని చెరుకు తోట

ఈ మార్పులన్నీ భూమిపై, నీటివనరులపై, అడవులపై, ఇక్కడి జీవరాశులపై, వాతావరణంపై ఎంతో ప్రభావం చూపించాయి. ఈ సంరక్షణ కేంద్రంలోని అడవులు, సదరన్ సెమీ-ఎవర్ గ్రీన్, సదరన్ మాయిస్ట్-మిక్స్డ్ డెసిడ్యువస్ ఇంకా సదరన్ ఎవర్ గ్రీన్ రకాల అడవులు. పైన ప్రస్తావించిన మార్పుల ప్రభావం ఈ సంరక్షణ కేంద్రాల మీదనే కాక దూరప్రాంతాలపై కూడా పడుతుంది. కానీ వీటివల్ల అత్యంత భారీ సమస్యలను  ఎదుర్కొనేది మాత్రం అడవులలో నివసించే పశుజాతులే. ఇక్కడ మానవ సంచారం, కార్యకలాపాలు మాత్రమే పెరుగుతున్నాయి కానీ, గౌర్ మందల సంఖ్య కాదు.

కొన్ని దశాబ్దాల క్రితం, రాధానగరి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఈ భారీ పశువులు వెయ్యి వరకు ఉండేవని ఒక అంచనా. ఇప్పుడు మహారాష్ట్ర అటవీశాఖ లెక్కల ప్రకారం, ఆ సంఖ్య 500. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రశాంత్ టెండూల్కర్ వ్యక్తిగత అంచనా ప్రకారం 700. భారతదేశంలో గౌర్ లు, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని షెడ్యూల్ 1 కింద పూర్తి రక్షణ పొందాల్సిన ప్రాణుల జాబితాలో ఉన్నాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ వారి అపాయంలో ఉన్న జీవుల రెడ్ లిస్ట్ లో కూడా గౌర్ ల పేరు ఉంది. దీని అర్ధం వాటి సంఖ్య నెమ్మదిగా తరిగిపోయే  అవకాశం ఉంది  అని.

గౌర్ లు వలస పోతున్నాయి, కానీ, “ప్రభుత్వం వద్ద ఈ వలసలకు సంబంధించిన గణాంకాలు ఏవీ లేవు,” అంటారు అమిత్ సయ్యద్. “గౌర్ లు ఎక్కడికి వెళుతున్నాయి? ఏ మార్గాన వెళుతున్నాయి? ఎలాంటి మందలలో వెళుతున్నాయి? ఒక్కొక మందలో ఎన్ని పశువులు ఉంటున్నాయి? వాళ్ళు గౌర్ ల గుంపులను మానిటర్ చేస్తుంటే ఇలాంటి సమస్యలు ఉండవు. గౌర్ లు వెళ్ళే మార్గాలలో నీటివనరులు ఏర్పాటు చేయాలి.”

భారత వాతావరణ శాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం, కొల్హాపూర్ జిల్లాలో జూన్ 2014 లో నమోదైన వర్షపాతం, ఆ నెలలో సాధారణంగా నమోదయ్యే వర్షపాతం కంటే 64 శాతం తక్కువ. 2016 లో అదే నెలలో 39 శాతం తక్కువ వర్షం కురిసింది. 2018లో ఆ సంఖ్య సాధారణం కంటే 1 శాతం ఎక్కువ నమోదైంది. 2014 జులై నెలలో వర్షపాతం సాధారణం కంటే 5 శాతం ఎక్కువగా నమోదైంది. ఆ తరువాతి సంవత్సరం సాధారణం కంటే 76 శాతం తక్కువ వర్షం కురిసింది. ఈ యేడు జులై 1 నుండి 10వ తారీఖు మధ్యలో సాధారణం కంటే 21 శాతం అధిక వర్షపాతం నమోదైంది. చాలా మంది ప్రకారం ఈ యేడు ఏప్రిల్, మే నెలల్లో ఋతుపవనాలు వచ్చేముందు పడే వర్షాలు అసలు పడలేదు. “గత దశాబ్దకాలంలో వర్షాలు అస్తవ్యస్తంగా, ఒక క్రమం లేకుండా కురుస్తున్నాయి,” అంటారు కేర్కర్. ఏడాది పొడవునా అందుబాటులో ఉండే నీటివనరులు చాలా తక్కువగా ఉన్న కారణం చేత ఏప్రిల్-మే వర్షాల లేమి నీటి సమస్యను ఇంకా తీవ్రతరం చేసింది.

PHOTO • Rohan Bhate ,  Sanket Jain

పైన ఎడమ: దాజీపూర్ అడవిలో. కుడి: తన దూడలతో గౌర్ గేదె. (ఫోటో: రోహన్ భాటే). కింద ఎడమ: బైసన్ కోసం ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ చెరువు పక్కనే త్రవ్విన కృత్రిమ చెరువు. కుడి: 3,000 లీటర్ల ట్యాంకర్ సాయంతో చెరువును నింపుతున్న సామ్రాట్ కేర్కర్

పోయిన ఏడాది, 2017, ఏప్రిల్-మే నెలల్లో రాధానగరి, దాజీపూర్ అడవులలో కొన్ని చెరువులను నీటి ట్యాంకర్ల సాయంతో నింపారు. కేర్కర్ గారి బైసన్ నేచర్ క్లబ్ సౌజన్యంతో ఈ అడవులలోని మూడు ప్రాంతాలకు మొత్తం 20,000 లీటర్ల నీటిని సరఫరా చేశారు. 2018 లో 24,000 లీటర్లు అవసరం అయ్యాయి. (అటవీశాఖ వారు నిర్వహించే చెరువులు, ఈ అడవిలో మరిన్ని ఉన్నాయి.)

కానీ, “ఈ సంవత్సరం ఏ కారణం చేతనో మరి అటవీశాఖ వారు నీటిని ఒక చెరువుకు మాత్రమే సరఫరా చేసేందుకు అనుమతినిచ్చారు,” అంటారు కేర్కర్. ఈ సంవత్సరం, వారి ఎన్జీవో మొత్తం 54,000 లీటర్ల నీటిని సరఫరా చేసింది. ఏ పరిస్థితుల్లో అయినా, “జూన్ లో మొదటి రెండు వర్షాల తర్వాత నీటి సరఫరా ఆపేస్తాము,” అంటారాయన.

అడవులు నరికివేయడం, మైనింగ్, సాగుచేసే పంటలలో మార్పులు, కరువు, ఎండిపోతున్న అడవులు, కలుషితం అవుతున్న నీరు, భూగర్భ జలాల దుర్వినియోగం – ఈ ప్రక్రియలన్నీ రాధానగరి, దాని చుట్టుప్రక్కల ప్రాంతాలలోని అడవులు, పొలాలు, మట్టి, వాతావరణంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి.

ఇక్కడ జరుగుతున్నది ప్రకృతి వనరుల నాశనం మాత్రమే కాదు.

మనుషులు-గౌర్ ల మధ్య ఘర్షణ కూడా పెరుగుతోంది. “20 గుంటల (సుమారు అరెకరం) భూమిలో పెంచిన నా ఎలిఫెంట్ గ్రాస్ మొత్తాన్ని గవా తినేశాయి,” అంటారు నిరాశలో ఉన్న మారుతి నికమ్. 40 ఏళ్ల నికమ్ కు పన్హల తాలూకాలోని నికంవాడి గ్రామంలో ఆరు ఎకరాల పొలం ఉంది. “ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ మధ్యలో 30 గుంటల్లో పెంచిన మొక్కజొన్న కూడా తినేశాయి. “ అన్నారు నికమ్.

“వర్షాకాలంలో అడవిలో నీళ్లు పుష్కలంగా ఉంటాయి కానీ, వాటికి ఆహారం దొరకకపోతే మళ్ళీ మా పొలాల మీదికే వస్తాయి.”

కవర్ ఫోటో: రోహన్ భాటే. తన ఫోటోలు ఉపయోగించుకునేందుకు అనుమతించినందుకు రోహన్ భాటేకు, శాంక్చువరీ ఏషియాకు ప్రత్యేక కృతజ్ఞతలు.

వాతావరణ మార్పుల గురించి ప్రజల అనుభవాలను వారి గొంతులతోనే రికార్డు చేయాలని PARI దేశవ్యాపిత వాతావరణ మార్పులపై రిపోర్టింగ్ ప్రాజెక్టును UNDP సహకారంతో చేపట్టింది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా ?  అయితే [email protected] కు మెయిల్ చేసి [email protected] కు కాపీ పెట్టండి.

అనువాదం: సుజన్ ఎన్

Reporter : Sanket Jain

মহারাষ্ট্রের কোলাপুর নিবাসী সংকেত জৈন পেশায় সাংবাদিক; ২০১৯ সালে তিনি পারি ফেলোশিপ পান। ২০২২ সালে তিনি পারি’র সিনিয়র ফেলো নির্বাচিত হয়েছেন।

Other stories by Sanket Jain
Editor : P. Sainath

পি. সাইনাথ পিপলস আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার প্রতিষ্ঠাতা সম্পাদক। বিগত কয়েক দশক ধরে তিনি গ্রামীণ ভারতবর্ষের অবস্থা নিয়ে সাংবাদিকতা করেছেন। তাঁর লেখা বিখ্যাত দুটি বই ‘এভরিবডি লাভস্ আ গুড ড্রাউট’ এবং 'দ্য লাস্ট হিরোজ: ফুট সোলজার্স অফ ইন্ডিয়ান ফ্রিডম'।

Other stories by পি. সাইনাথ
Series Editors : P. Sainath

পি. সাইনাথ পিপলস আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার প্রতিষ্ঠাতা সম্পাদক। বিগত কয়েক দশক ধরে তিনি গ্রামীণ ভারতবর্ষের অবস্থা নিয়ে সাংবাদিকতা করেছেন। তাঁর লেখা বিখ্যাত দুটি বই ‘এভরিবডি লাভস্ আ গুড ড্রাউট’ এবং 'দ্য লাস্ট হিরোজ: ফুট সোলজার্স অফ ইন্ডিয়ান ফ্রিডম'।

Other stories by পি. সাইনাথ
Series Editors : Sharmila Joshi

শর্মিলা জোশী পিপলস আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার (পারি) পূর্বতন প্রধান সম্পাদক। তিনি লেখালিখি, গবেষণা এবং শিক্ষকতার সঙ্গে যুক্ত।

Other stories by শর্মিলা জোশী
Translator : Sujan Nallapaneni

Sujan is a freelance journalist based in Guntur. He is a translation enthusiast.

Other stories by Sujan Nallapaneni