తన కడుపులో “గడ్డ” లాంటిదేదో పెరుగుతోందని సునీతా దేవి ఆందోళనపడ్డారు. కడుపు ఉబ్బరంగా అనిపించడంతో ఆమె సరిగ్గా తినలేకపోయేవారు. రెండు నెలలు దాన్ని నిర్లక్ష్యం చేశాక, ఇంటికి దగ్గర్లో ఉన్నఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్ళినప్పుడు, అక్కడ డాక్టర్ చెప్పిన విషయాన్ని ఆమె నమ్మలేకపోయారు: “ ఆప్కో బచ్చా ఠహర్ గయా హై (మీరు గర్భవతి).”

అదెలా సాధ్యమైందో ఆమెకు అర్థం కాలేదు – గర్భం రాకుండా కాపర్-టి పెట్టించుకుని ఇంకా ఆరు నెలలు కూడా గడవలేదు!

2019లో జరిగిన ఆ సంఘటనను వివరిస్తున్నప్పుడు, ఆమె ముఖం ఇంకా పాలిపోయి, అలసటగా కనబడింది. ఆమె జుట్టు వెనక్కి ముడి వేసి ఉంది; ఆమె లోతైన కళ్ళు నిస్తేజంగా, నీరసంగా ఉన్నాయి. ఆమె నుదుటిపై ఉన్న ఎర్రటి బిందీ (బొట్టు) మాత్రమే ప్రకాశవంతంగా కనబడుతోంది.

30 ఏళ్ళ సునీతకు (ఆమె అసలు పేరు కాదు) 4-10 ఏళ్ళ వయసులో ఉన్న నలుగురు పిల్లలున్నారు- ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. మే 2019లో, తన చిన్న బిడ్డకు రెండేళ్ళ వయసున్నప్పుడు, ఇంక పిల్లల్ని కనకూడదని సునీత నిర్ణయించుకున్నారు. ఆ ప్రాంతాన్ని సందర్శించే ఆశా కార్యకర్తను కలిసి, కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి తెలుసుకున్నారు. వివరాలు పరిశీలించాక, మూడు నెలల పాటు గర్భం రాకుండా ఆపుతుందని చెప్పే “అంతర” అనే ఇంజెక్షన్‌ను ఎంచుకున్నారు. “నేను ఇంజెక్షన్ వేయించుకుందామనుకున్నాను.” అని ఆమె అన్నారు.

తన 8x10 అడుగుల గదిలో పరిచిన చాపపై మేం కూర్చున్నాం. ఆ గదికి ఒక మూలన వున్న ఖాళీ గ్యాస్ సిలిండర్‌పై మరిన్ని చాపలు పేర్చివున్నాయి. ప్రక్క గదిలో సునీత బావగారి కుటుంబం నివసిస్తోంది. మూడో గదిలో బావమరిది ఉంటున్నారు: నైరుతి ఢిల్లీ నజాఫ్‌గఢ్‌లోని మహేశ్ గార్డెన్ ప్రాంతంలో ఉంది ఆ ఇల్లు.

సునీత ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో గోపాల్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిఎచ్‌సి) ఉంది. “అంతర” ఇంజక్షన్ వేయించుకునేందుకు ఆశా వర్కర్‌తో కలిసి అక్కడికి వెళ్ళారు సునీత. కానీ,పిఎచ్‌సిలోని డాక్టర్ తనకు మరో సలహా ఇచ్చారు. “ఇంజక్షన్ బదులు నాకు కాపర్-టి గురించి వివరించింది డాక్టర్. అది సురక్షితమైనది కనుక పెట్టించుకోమని కోరింది. కానీ, నేను ఆమెను కాపర్-టి గురించి ఎప్పుడూ అడగలేదు,” సునీత నొక్కి చెప్పారు. “కానీ అది బాగుంటుందని డాక్టర్ పట్టుబట్టింది. “నువ్వు ఎక్కువ మంది పిల్లల్ని కనకూడదనుకుంటున్నావు కదా” అని ఆమె నన్ను అడిగింది!”

Patients waiting outside the Gopal Nagar primary health centre in Delhi, where Sunita got the copper-T inserted
PHOTO • Sanskriti Talwar

సునీత కాపర్-టీ పెట్టించుకున్న ఢిల్లీలోని గోపాల్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బయట వేచి ఉన్న రోగులు

నజాఫ్‌గఢ్‌లో పండ్లు అమ్ముతుండే సునీత భర్త (అతని పేరు వెల్లడించడానికి ఆమె ఇష్టపడలేదు) ఆ సమయంలో బీహార్ రాష్ట్రం, దర్భంగా జిల్లాలోని తన స్వగ్రామమైన కొల్హంతా పటోరికి వెళ్ళారు. “డాక్టర్ పట్టుబట్టింది. నాతో ఇలా వాదించింది: “నీ భర్తకు దీనితో ఏంటి సంబంధం? ఇది నీ చేతుల్లోనే ఉంది. దీన్ని వాడితే ఐదేళ్ళ వరకు నీకు గర్భం రాదు,” అని సునీత గుర్తు చేసుకున్నారు.

దాంతో, గర్భనిరోధక ఇంజెక్షన్ (అంతర)కి బదులు, గర్భసంచి లోపల పెట్టే పరికరం, లేదా కాపర్-టిని ఎంచుకున్నారు సునీత. తన భర్త గ్రామం నుండి తిరిగి వచ్చే వరకూ, అంటే సదరు ప్రక్రియ జరిగిన 10 రోజుల వరకూ, దీని గురించి ఆమె అతనికి చెప్పలేదు. “నేనతనకి చెప్పకుండా రహస్యంగా ఈ పనిచేశాను. దాంతో అతను నాపై కోప్పడ్డాడు. నన్ను ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళినందుకు ఆశా వర్కర్ని కూడా తిట్టాడు.”

అయితే, ఈ ప్రక్రియ తర్వాతి రెండు నెలల్లో, పీరియడ్స్ సమయంలో సునీతకు భారీగా రక్తస్రావం అయ్యింది. కాపర్-టి వల్లే అధిక రక్తస్రావం జరిగిందని భావించిన ఆమె, 2019 జూలైలో దానిని తొలగించుకునేందుకు రెండుసార్లు గోపాల్ నగర్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. కానీ, ప్రతిసారీ ఆమెకు రక్తస్రావాన్ని నియంత్రించేందుకు మందులు ఇచ్చి పంపించేసేవాళ్ళు.

2019 నవంబరులో ఆమెకు నెలసరి రాలేదు. కడుపులో “గడ్డ” లాంటిదేదో ఉన్నట్లనిపించేది. నజాఫ్‌గఢ్‌లోని వికాస్ హాస్పిటల్‌లో చేసిన “బాత్‌రూమ్ జాంచ్ ”, అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్, ఆమె గర్భవతి అనీ, గర్భసంచి లోపల పెట్టే పరికరం (ఇంట్రాయుటిరైన్ కాంట్రసెప్టివ్ డివైస్ - ఐయుసిడి) విఫలమైందనీ నిర్ధారించింది.

కాపర్-టి పెట్టించుకున్నాక గర్భం దాల్చడం అంత మామూలు విషయమేమీ కాదని పశ్చిమ ఢిల్లీ జిల్లాలో ప్రాక్టీస్ చేస్తున్న గైనకాలజిస్ట్ డాక్టర్ పూనమ్ చద్దా అన్నారు. “ఇలాంటివి జరిగే అవకాశం వందలో ఒకరికి ఉంటుంది. ప్రత్యేక కారణమంటూ ఏం ఉండదు. ఏ (గర్భనిరోధక) పద్ధతైనా విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి.” అని ఆమె వివరించారు. ఐయుసిడి సురక్షితమైన, ప్రభావవంతమైన గర్భనిరోధక పద్ధతులలో ఒకటిగా పరిగణించబడుతున్నప్పటికీ, అది విఫలమై అవాంఛిత గర్భాలకూ, ప్రేరేపిత గర్భస్రావాలకూ దారి తీసిన సందర్భాలు ఉన్నాయి.

మై తో ఇసీ భరోసే బైఠీ హుయీ థీ (నేను దీన్నే నమ్ముకున్నాను). కాపర్-టి ఉంది కాబట్టి నాకు గర్భం రాదనే నమ్మకంతో ఉన్నాను. డిస్పెన్సరీ (పిఎహ్‌సి) దగ్గరున్న డాక్టర్ ఇది ఐదేళ్ళపాటు పనిచేస్తుందని హామీ కూడా ఇచ్చింది. కానీ, సంవత్సరం లోపే ఇలా అయ్యింది,” అంటూ సునీత కలతచెందారు.

The room used by Sunita and her husband in the house
PHOTO • Sanskriti Talwar
PHOTO • Sanskriti Talwar

ఎడమ: నైరుతి ఢిల్లీ జిల్లాలో, సునీత కుటుంబం నివసించే ఇల్లున్న వీధి. కుడి: ఆ ఇంటిలో సునీత, ఆమె భర్త ఉండే గది

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 ( NFHS-5 ) ప్రకారం భారతదేశంలో, 15-49 సంవత్సరాల వయసు గల వివాహిత మహిళల్లో, కేవలం 2.1 శాతం మంది మాత్రమే కాపర్- టి వంటి ఐయుసిడిలను ఉపయోగిస్తున్నారు. గర్భనిరోధక పద్ధతులలో అత్యంత సాధారణ పద్ధతైన ట్యూబెక్టమీని – 38 శాతం మంది వివాహిత స్త్రీలు ఎంచుకుంటున్నారు. వివాహిత మహిళల్లో గర్భనిరోధక పద్ధతుల వినియోగం, ఇద్దరు-ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత పెరుగుతుందని ఒక సర్వే నివేదించింది. సునీత ఐదో బిడ్డను కనాలని కోరుకోలేదు.

వికాస్ ఆసుపత్రిలో  గర్భస్రావం చేయడానికి  రూ.30,000 వరకు ఖర్చవుతుంది. కానీ సునీతకు అంత డబ్బు ఖర్చుపెట్టగలిగే స్థోమత లేదు.

సునీత ఒక సాధారణ గృహిణి. 34 ఏళ్ళ వయసున్న ఆమె భర్త పండ్లను అమ్మడం ద్వారా నెలకు సుమారు రూ.10,000 వరకూ సంపాదిస్తారు. అతని సోదరులిద్దరూ, వారి వారి కుటుంబాలతో మూడు పడక గదులున్న ఆ అద్దె ఇంట్లో ఉంటూ, స్థానికంగా ఉండే ఒక  బట్టల షాపులో పనిచేస్తున్నారు. ఇంటి అద్దెలో వారి వాటా కింద, ప్రతి సోదరుడు నెలకు దాదాపు రూ.2,300 అద్దె చెల్లిస్తారు.

ఆకుపచ్చ-పసుపు రంగుల త్రిభుజాలు ముద్రించి, కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నఎరుపు రంగు సల్వార్ కమీజ్ కి సరిపోయేలా, తన సన్నని మణికట్టుపై రంగురంగుల గాజులు వేసుకున్నారు సునీత. మెరుగుమాసిన వెండి పట్టీల కింద, అల్తా (పారాణి) అంటిన ఆమె పాదాలు చిక్కని ఎరుపు రంగులో ఉన్నాయి. మాతో మాట్లాడుతూ, తన కుటుంబం కోసం వంట చేస్తున్నఆమె ఆ రోజు ఉపవాసం చేస్తున్నారు. “నా పెళ్ళై ఆరు నెలలు కూడా కాకముందే నా ముఖంలోని మెరుపంతా పోయింది,”అంటూ ఒకప్పటి తన బొద్దు ముఖాన్ని గుర్తుచేసుకున్నారావిడ. పద్దెనిమిదో ఏట పెళ్ళైనప్పుడు, 5 అడుగుల 1 అంగుళం ఎత్తున్న సునీత దాదాపు 50 కిలోల బరువుండేవారు. ఇప్పుడు ఆమె 40 కిలోల బరువు మాత్రమే ఉన్నారు.

సునీతకు రక్తహీనత ఉంది. అందుకే ఆమె ముఖం పాలిపోయిఉంటుంది; ఆమెకు అలసటగా ఉంటుంది. భారతదేశంలో, 15-49 ఏళ్ళ వయసున్న స్త్రీలలో, రక్తహీనత ఎదుర్కొంటున్న 57 శాతం మందిలో ఆమె కూడా ఒకరు. సెప్టెంబర్ 2021 నుండి ప్రతి 10 రోజులకోసారి, నజాఫ్‌గఢ్‌లోని ఒక ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స తీసుకుంటున్నారామె. డాక్టర్ సంప్రదింపులు, మందుల కోసం ప్రతిసారీ దాదాపు రూ.500 ఖర్చవుతోంది. కోవిడ్-19 భయం ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళకుండా చేసింది.ఇదనే కాకుండా, తన ఇంటి పనంతా పూర్తి చేసుకొని, సాయంత్రం వెళ్ళవచ్చనీ, పెద్ద పెద్ద క్యూలలో నిలబడాల్సిన అవసరం కూడా ఉండదనీ కూడా ఆమె ఇక్కడికి వెళ్ళడానికే మొగ్గుచూపుతారు.

అవతలి గది నుండి వస్తున్నపిల్లల అరుపులు మాకు అంతరాయం కలిగిస్తున్నాయి. “నా రోజంతా ఇలాగే గడిచిపోతుంది,” పిల్లల మధ్య జరిగే గొడవలు తనే తీర్చాలని సూచనప్రాయంగా తెలియజేస్తూ అన్నారు సునీత. “నేను గర్భవతినని తెలిసినప్పుడు చాలా ఒత్తిడికి గురయ్యాను. ఉంచుకోమని నా భర్త చెప్పాడు. జో హోరాహా హై హోనే దో . కానీ భరించాల్సింది నేనే కదా? ఆ బిడ్డని పెంచాల్సింది, ప్రతిదీ చెయ్యాల్సింది నేనేగా,” ఆమె ఉద్రేకపూరిత స్వరంతో చెప్పారు.

The wooden cart that belongs to Sunita's husband, who is a fruit and vegetable seller.
PHOTO • Sanskriti Talwar
Sunita's sewing machine, which she used before for tailoring clothes to earn a little money. She now uses it only to stitch clothes for her family
PHOTO • Sanskriti Talwar

ఎడమ: సునీత భర్త ఈ చెక్క బండిపైనే పండ్లు, కూరగాయలు అమ్ముతారు; కుడి: సునీత కుట్టుమిషన్. ఇంతకుముందు సునీత కుట్టుపని చేసి, కొంత డబ్బులు సంపాదించేవారు. ఇప్పుడామె తన కుటుంబానికి మాత్రమే బట్టలు కుడుతున్నారు

తను గర్భవతినని తెలిసిన కొద్ది రోజులకే సునీత నజాఫ్‌గఢ్-ధన్సా రోడ్‌లోని ఒక ప్రైవేట్ క్లినిక్‌లో రూ.1,000 ఖర్చుపెట్టి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్నారు. ఇక్కడకు ఆమెకు తోడుగా వచ్చిన ఆశా కార్యకర్త, సునీతను ఇంటికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న జాఫర్‌పూర్‌లో, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోన్న రావు తులారామ్ మెమోరియల్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఆక్కడ కాపర్-టిని తొలగించి, గర్భస్రావం చేయించుకోవాలని సునీత అనుకున్నారు. ప్రజారోగ్య కేంద్రంలో ఈ ప్రక్రియను ఉచితంగా చేస్తారు.

“కాపర్-టిని తొలగించలేమనీ, బిడ్డ పుట్టినప్పుడు అదే బయటకు వస్తుందనీ జాఫర్‌పూర్‌లో వాళ్ళు (డాక్టర్) చెప్పారు.” గర్భస్థ శిశువుకు మూడో నెల రావడంతో, అబార్షన్ చేయడం కష్టమనీ, అంతేకాకుండా అది తల్లికి ప్రాణాంతకమని కూడా సునీతతో అక్కడి డాక్టర్ అన్నారు. “వాళ్ళు (వైద్యులు) రిస్క్ తీసుకోడానికి సిద్ధంగా లేరు.”

“నా ప్రాణానికి ప్రమాదమన్న విషయాన్ని నేనసలు పట్టించుకోలేదు. నాకు మరో బిడ్డను కనాలని లేదు,” అని ఆమె నాతో అన్నారు. సునీత ఒక్కరే కాదు, NFHS-5 ప్రకారం, 85 శాతం కంటే ఎక్కువ మంది వివాహిత మహిళలు ఇద్దరు (బతికున్న) పిల్లలు పుట్టాక, మరో బిడ్డను వద్దనుకుంటున్నారు.

గర్భస్రావం చేయించుకోవడం కోసం మరో ప్రభుత్వ ఆస్పత్రిని ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు సునీత. ఫిబ్రవరి 2020లో, దాదాపు నాలుగు నెలల గర్భిణిగా ఉన్న ఆమెను మరొక ఆశా కార్యకర్త నజాఫ్‌గఢ్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న, సెంట్రల్ ఢిల్లీ జిల్లాలోని లేడీ హార్డింగ్ ఆస్పత్రికి తీసుకెళ్ళారు. వారిద్దరూ ఆ రోజు చెరొక రూ.120 ఖర్చు పెట్టి ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. గోపాల్ నగర్ పిఎచ్‌సి డాక్టర్‌తో చర్చించాక, సునీతకి ఆస్పత్రిలోనే గర్భస్రావం చేయాలని లేడీ హార్డింగ్‌లో పనిచేసే డాక్టర్ నిర్ణయించుకున్నారు.

“వాళ్ళేం మాట్లాడారో నాకు తెలీదు. వైద్యులిద్దరూ చర్చించుకొని, నాకు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించుకున్నారు.” మొదట తనకి రక్తపరీక్షలు చేసి, తర్వాత ఏదో మందు పూశారని ఆమె గుర్తు చేసుకున్నారు. “అది ఏ రకమైన మందో నాకు గుర్తులేదు. ఉన్‌హోఁనే కుచ్ దవాయి అందర్ దాల్‌కర్ సఫాయి కియా థా (వారు లోపల ఏదో మందు రాసి మొత్తం శుభ్రం చేశారు). అది లోపల మండుతోంది; నాకు కొంచెం మత్తుగా ఉంది.” ఈ ప్రక్రియ కోసం భర్త ఆమె వెంట వచ్చినప్పటికీ, “అతనిందుకు అంత సుముఖంగా లేడు.”

తాము బయటకు తీసిన విరిగివున్న కాపర్-టిని వైద్యులు సునీతకు చూపించారు. గర్భం నుండి బయటకు తీసిన పిండం వయసు దాదాపు నాలుగు నెలలుంటుందని ఆమెతో పాటు ఆస్పత్రికి వెళ్ళిన ఆశా కార్యకర్త సోని ఝా ధృవీకరించారు. “ఆమెది సున్నితమైన కేసు కావడంతో ‘సాధారణ ప్రసవం’ ద్వారా పిండాన్ని తీసేయాల్సివచ్చింది,” అని ఆవిడ వివరించారు.

Sunita remained determined to get the tubal ligation done, but Covid-19 struck in March 2020.  It was a year before she could undergo the procedure – in Bihar this time
PHOTO • Priyanka Borar

సునీత ట్యూబల్ లైగేషన్ (ట్యూబెక్టమీ) చేయించుకోవాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. అయితే ఈసారి బిహార్‌లో ఈ ప్రక్రియ చేయించుకోడానికి సరిగ్గా ఒక ఏడాది ముందు, మార్చి 2020లో, ఆమెకు కోవిడ్-19 సోకింది

గర్భస్రావం చేయించుకోవడం యుద్ధంలో సగం మాత్రమే. ఆమె కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స లేదా ట్యూబల్ లైగేషన్ – ఫెలోపియన్ ట్యూబ్‌లను (గర్భాశయం నుండి అండాన్ని రవాణా చేసే నాళాలు) ముడి వేయడం/కత్తిరించడం ద్వారా గర్భధారణను నిరోధించే ప్రక్రియ - చేయించుకోవాలనుకున్నారు. గర్భస్రావం చేయించుకున్న ఒక రోజు తర్వాత, అదే ఆస్పత్రిలో ఆమె ఆ శస్త్రచికిత్స చేయించుకోవాలనుకున్నారు. కానీ, ఆ రోజు వైద్యులు చేయలేకపోయారు. “నాకు దగ్గు మొదలయ్యే సమయానికే నేను ఆపరేషన్ దుస్తుల్లో ఉన్నాను. కానీ వాళ్ళు (వైద్యులు) రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు.” గర్భస్రావం చేయించుకున్న నాలుగు రోజుల తర్వాత ఆమెకు “అంతర” ఇంజక్షన్ ఇచ్చి ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.

ట్యూబల్ లైగేషన్ చేయించుకోవాలని సునీత దృఢనిశ్చయంతో ఉన్నప్పటికీ, మార్చి 2020లో ఆమెకు కోవిడ్-19 సోకింది. ఒక ఏడాది తర్వాత ఫిబ్రవరి 2021లో, సునీత కుటుంబం ఆమె మరిది పెళ్ళి కోసం హనుమాన్ నగర్ బ్లాక్‌లోని స్వగ్రామమైన కొల్హంతా పటోరికి వెళ్ళారు. అక్కడ ఆమె ఒక ఆశా కార్యకర్తను సంప్రదించారు. ఆ కార్యకర్త సునీతను దర్భంగాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్ళారు. “ఆ ఆశా వర్కర్ ఇప్పటికీ ఫోన్ చేసి నా బాగోగులు కనుక్కుంటుంది.” అని సునీత చెప్పారు.

“అక్కడ (దర్భంగాలో) మనల్ని పూర్తి అపస్మారక స్థితిలో ఉంచరు. మెలకువగానే ఉంచుతారు. మనం కేకలు పెడుతున్నా ఎవరూ పట్టించుకోరు,” అని ఆమె గుర్తుచేసుకున్నారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్నందుకు సునీతకు ప్రభుత్వం నుండి రూ.2,000 పరిహారం లభించింది  “అయితే, అది నా (బ్యాంక్) ఖాతాలో పడిందో లేదో నాకు తెలీదు. కనుక్కోమని నేను ఎవరినీ అడగలేదు.” అన్నారు సునీత.

తన కథని ముగించేటప్పుడు, ఆమె ముఖంలో కాస్త ఉపశమనం కనబడింది: “చివరికి నేను సజావుగా పూర్తిచేసుకున్నాను. నన్ను నేను కాపాడుకున్నాను. లేదంటే ప్రతిసారీ ఏదో ఒక సమస్య వచ్చేది. చేయించుకొని ఒక సంవత్సరం పైనే అయింది. నేను బాగానే ఉన్నాను. ఇంకో ఇద్దరు పిల్లల్ని కనుంటే మాత్రం నా పని అయిపోయి ఉండేది.” ఇదే సమయంలో ఆవిడ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు: “నేను దీని కోసం ఎన్నో ఆస్పత్రులు, క్లినిక్‌లు తిరిగి, చాలామంది వైద్యులను సంప్రదించాల్సి వచ్చింది. నా పరువు పోలేదా, చెప్పు?”

గ్రామీణ భారతదేశంలో, కౌమారదశలో ఉన్న బాలికలు, యువతులు మొదలైన అట్టడుగు సమూహాల జీవన పరిస్థితులను, అనుభవాలను వారి గొంతులతోనే పదిల పరచాలని, పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ లు ఈ దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్టును చేపట్టాయి.

ఈ కథనాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? అయితే [email protected] కి ఈమెయిల్ చేసి, [email protected] కి కాపీ పెట్టండి.

అనువాదం: వై క్రిష్ణ జ్యోతి

Sanskriti Talwar

সংস্কৃতি তলওয়ার নয়া দিল্লি-ভিত্তিক স্বতন্ত্র সাংবাদিক এবং ২০২৩ সালের পারি-এমএমএফ ফেলোশিপ প্রাপক রিপোর্টার।

Other stories by Sanskriti Talwar
Illustration : Priyanka Borar

নিউ-মিডিয়া শিল্পী প্রিয়াঙ্কা বোরার নতুন প্রযুক্তির সাহায্যে ভাব এবং অভিব্যক্তিকে নতুন রূপে আবিষ্কার করার কাজে নিয়োজিত আছেন । তিনি শেখা তথা খেলার জন্য নতুন নতুন অভিজ্ঞতা তৈরি করছেন; ইন্টারেক্টিভ মিডিয়ায় তাঁর সমান বিচরণ এবং সেই সঙ্গে কলম আর কাগজের চিরাচরিত মাধ্যমেও তিনি একই রকম দক্ষ ।

Other stories by Priyanka Borar
Translator : Y. Krishna Jyothi

Krishna Jyothi has 12 years of experience in journalism as a sub-editor & features writer. Now, she is into blogging.

Other stories by Y. Krishna Jyothi