"వాళ్ళను బడిదాకా తీసుకురావడమే పెద్ద సవాలు," అంటారాయన.

అవి ముప్పైనాలుగేళ్ళ అనుభవంలోంచి వచ్చిన మాటలు. 'మాస్టర్జీ' అని పిల్లలంతా పిలుచుకొనే శివ్‌జీ సింగ్ యాదవ్, డావ్‌లీ  చపోరీలో ఉన్న ఒకే ఒక్క పాఠశాల నిర్వాహకులు. ఈ డావ్‌లీ  చపోరీ అనే బ్రహ్మపుత్ర నదీ ద్వీపపు గ్రామం, అసోమ్ రాష్ట్రంలోని మజూలీ జిల్లాలో ఉంది. అక్కడ ఉండే 63 కుటుంబాలకు చెందిన పిల్లల్లో చాలామంది ఈ పాఠశాలలో చదువుకుంటుంటారు..

ఆ ధొనేఖనా లోయర్ ప్రైమరీ స్కూల్‌లో ఉన్న ఒకే ఒక్క తరగతి గదిలో తన డెస్క్ దగ్గర కూర్చొని చిరునవ్వుతో పిల్లలందర్నీ పరకాయించి చూస్తుంటారు శివ్‌జీ. నలబై ఒక్క కళకళలాడే మొహాలు - ఆరు నుంచి పన్నేండేళ్ళ వయసులు - ఒకటో తరగతి నుండి అయిదో తరగతి దాకా చదివే ఆ విద్యార్థులు మాస్టర్జీ కేసి తేరిపార చూస్తున్నారు. "వీళ్ళకు పాఠాలు బోధించి చదువుచెప్పడమన్నది ఉంది చూశారూ, అది నిజంగా అతి పెద్ద సవాలు... సందు దొరికితే చాలు, పారిపోతారు" చెప్పుకొస్తారు యాదవ్..

భారతీయ విద్యావ్యవస్థ గురించి మాట్లాడటానికి ఉపక్రమించే ముందు మాస్టర్జీ ఓ క్షణం ఆలోచించి పెద్ద తరగతి పిల్లల్ని రమ్మనిపిలిచారు. అసోమ్ ప్రభుత్వ ప్రాథమిక విద్యా సంచాలక కార్యాలయంవారు పంపించిన ఆంగ్లం, అసోమ్ భాషల్లో ఉన్న కథల పుస్తకం పాకెట్‌ని తెరచి చూడమని వాళ్ళకు పురమాయించారు. కొత్త పుస్తకాలు కలిగించే ఉత్తేజంతో పిల్లలంతా కాసేపు ఉబ్బితబ్బిబ్బవుతారనీ, ఆ సమయంలో తాను మాతో ఏ ఆటంకమూ లేకుండా మాటాలడగలరనీ ఆయనకు తెలుసు.

“అసలు కళాశాల అధ్యాపకులకు ఎంత జీతం ఇస్తున్నారో అంతా ప్రాథమిక విద్యను బోధించే ఉపాధ్యాయులకివ్వాలి. పునాదులు వేసేది మా ప్రాథమిక అధ్యాపకులమే కదా," ప్రాథమిక విద్య ప్రాముఖ్యాన్ని నొక్కి వక్కాణిస్తూ ఆయన అన్నారు. అయినా ఈ పిల్లల తలిదండ్రులకే ప్రాథమిక విద్య అంటే లక్ష్యం లేదనీ, ఉన్నత పాఠశాల చదువులే ముఖ్యమనుకుంటారనీ చెపుతారు యాదవ్. వాళ్ళలోని ఈ అనుచిత భావాన్ని సరిదిద్దటం కోసం అవిరళ కృషి చేస్తున్నారాయన.

Siwjee Singh Yadav taking a lesson in the only classroom of Dhane Khana Mazdur Lower Primary School on Dabli Chapori.
PHOTO • Riya Behl
PHOTO • Riya Behl

ఎడమ: డావ్‌లీ చపోరీలోని ధొనేఖనా లోయర్ ప్రైమరీ స్కూల్‌లోని ఏకైక తరగతి గదిలో పాఠం చెబుతోన్న శివ్‌జీ సింగ్ యాదవ్. కుడి: విద్యా సంచాలక కార్యాలయంవారు పంపిన కథల పుస్తకాలతో పాఠశాల విద్యార్థులు

Siwjee (seated on the chair) with his students Gita Devi, Srirekha Yadav and Rajeev Yadav (left to right) on the school premises
PHOTO • Riya Behl

పాఠశాల ఆవరణలో తన విద్యార్థులు గీతాదేవి, శ్రీరేఖ యాదవ్, రాజీవ్ యాదవ్‌లతో (ఎడమ నుండి కుడికి) శివ్‌జీ (కుర్చీపై కూర్చున్నవారు)

డావ్‌లీ చపోరీ ఎన్‌సి అన్నది సుమారు నాలుగు వందల చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న ఇసుక తిన్నెల ద్వీపం. ఆ ద్వీపంలో 350 మంది స్థిరనివాసులు ఉన్నారన్నది యాదవ్ అంచనా. ఈ చపోరీ గ్రామం రెవెన్యూ రికార్డులకెక్కని ప్రాంతం - అంటే అక్కడి భూమిని సర్వే చెయ్యడం, లెక్కలుగట్టడం ఇంకా జరగలేదన్నమాట. నిన్నమొన్నటిదాకా అది జోర్హట్ జిల్లాకు చెందిన ప్రాంతం. 2016లో జోర్హట్ జిల్లా ఉత్తర భాగంలోంచి కొంత ప్రాంతాన్ని విడదీసి మజూలీ జిల్లాగా రూపొందించాక చపోరీ కూడా జిల్లా మారింది.

ఆ దీవిలో ఒక బడి అంటూ లేని పక్షంలో ఆ ఆరు నుంచి పన్నెండేళ్ళ వయసు పిల్లలంతా కనీసం గంటసేపు ప్రయాణం చేసి ప్రధాన భూభాగంలో ఉన్న శివసాగర్ పట్టణానికి చేరువలో ఉన్న దిసంగ్‌ముఖ్ పాఠశాలకు వెళ్ళవలసివచ్చేది. ముందు ఆ ద్వీపపు పడవరేవు దగ్గరకు ఇరవై నిముషాలు సైకిలు మీద వెళ్ళి, అక్కడ పడవ ఎక్కి ఏభై నిముషాల పాటు ప్రయాణించి నదిని దాటాకే బడికి చేరగలిగేవాళ్ళు.

ఆ ఇసుకతిన్నెలోని ఇళ్ళన్నీ బడికి రెండుమూడు కిలోమీటర్ల వ్యాసార్ధంలోనే ఉన్నాయి. అదో పెద్ద వరం. 2020-21ల్లో కోవిడ్-19 వల్ల బడి మూతపడినపుడు ఇళ్ళన్నీ చేరువలో ఉండటమన్నది బాగా ఉపకరించింది. మాస్టర్జీ పిల్లలందరి ఇళ్ళకూ వెళ్ళి వాళ్ళ చదువుల గురించీ, బాగోగుల గురించీ విచారించి వస్తూ ఉండేవారు. ఆ బడిలో పనిచేసే రెండో టీచరు శివసాగర్ జిల్లాలోని గౌరీసాగర్‌లో నివాసముంటారు- ఇది నది ఒడ్డు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంచేత ఆయనకు కోవిడ్ సమయంలో బడికి రావడం, పిల్లల బాగోగులు చూడటం సాధ్యపడలేదు. "వారానికి కనీసం రెండుసార్లు ప్రతి బిడ్డ దగ్గరకూ వెళ్ళి, వాళ్ళకు హోమ్‌వర్క్ ఇచ్చి, మళ్ళీ ఆ ఇచ్చిన పని అయిందో లేదో తనిఖీ చేసి వస్తూ ఉండేవాడ్ని." శివ్‌జీ చెప్పుకొచ్చారు.

ఇంత శ్రద్ధ తీసుకున్నా పిల్లల చదువులు లాక్‌డౌన్ సమయంలో బాగా కుంటుపడ్డాయంటారు శివ్‌జీ. వాళ్ళకు చదువు అందినా అందకపోయినా పై తరగతుల్లోకి పంపేయాలన్న ప్రభుత్వ విధానం ఆయనకు అంగీకారం కాదు. "ఈ ఏడాదికి పిల్లల్ని ఉన్న తరగతిలోనే ఉండనివ్వండి. అది వాళ్ళకు మేలే చేస్తుంది." అని విద్యాశాఖ అధికారులకు రాశారాయన.

*****

ధొనేఖనా లోయర్ ప్రైమరీ పాఠశాల బయటి గోడమీద ఒక పెద్ద రంగురంగుల అసోమ్ రాష్ట్ర మ్యాపు అతికించి ఉంది. మాకది చూపించి, దాన్లో బ్రహ్మపుత్ర నదిలో ఆ దీవి ఉన్న ప్రాంతం ఉన్న బిందువు దగ్గర వేలుపెట్టి, "చూడండి, ఈ ద్వీపంలో మా చోపరీ (ఇసుక తిన్నె) ఎక్కడ ఉందని చూపిస్తున్నారో! మ్యాపు చూపించే ప్రాంతానికీ మా ఊరు ఉన్న ప్రాంతానికీ సంబంధమే లేదు," అని నవ్వేస్తారు మాస్టర్జీ.

ఆయన డిగ్రీ చదివింది భూగోళ శాస్త్రం కాబట్టి మ్యాప్‌లోని ఆ పొరపాటు శివ్‌జీకి కించిత్తు చిరాకు కలిగించడం సహజం.

బ్రహ్మపుత్రలోని చపోరీలు, చార్‌లు , పదే పదే ఉనికిని మార్చుకునే ఇసుక తీరాలు, ద్వీపాలలో పుట్టిపెరిగిన శివ్‌జీకి ఆ ఉనికి మార్పిళ్ళ వల్ల అక్కడి చిరునామాలు కూడా తరచూ మారిపోతూ ఉంటాయన్న విషయం అందరికంటే బాగా తెలుసు.

A boat from the mainland preparing to set off for Dabli Chapori.
PHOTO • Riya Behl
Headmaster Siwjee pointing out where the sandbank island is marked on the map of Assam
PHOTO • Riya Behl

ఎడమ: ప్రధాన భూభాగం నుండి డావ్‌లీ చపోరీకి బయలుదేరడానికి సిద్ధమవుతున్న పడవ. (కుడి) అసోమ్ చిత్రపటంలో ఇసుకతిన్నెల ద్వీపం ఎక్కడ గుర్తించబడిందో చూపుతున్న ప్రధానోపాధ్యాయులు శివ్‌జీ

The Brahmaputra riverine system, one of the largest in the world, has a catchment area of 194,413 square kilometres in India
PHOTO • Riya Behl

ప్రపంచంలోనే అతిపెద్ద నదీవ్యవస్థలలో ఒకటైన బ్రహ్మపుత్ర నదీవ్యవస్థకు భారతదేశంలో 194,413 చదరపు కిలోమీటర్ల పరీవాహక ప్రాంతం ఉంది

"బాగా వర్షం కురిసినపుడు ప్రవాహం తీవ్ర స్థాయికి చేరుతుందనీ, వరదలు ముంచెత్తుతాయనీ మాకు తెలుసు. అప్పుడు ఉన్న కాస్తంత సొమ్మూ చేతబట్టుకొని, పాడి పశువుల్ని తోలుకుంటూ వెళ్ళి ద్వీపంలో వరదనీరు అందుకోలేనంత ఎత్తయిన ప్రాంతాలకు చేరుకుంటారు ప్రజలు. వరదనీరు తీసేదాకా బడి తెరవడమన్న ప్రసక్తే ఉండదు." అని ప్రతి ఏడాదీ తప్పనిసరిగా ఎదురయ్యే పరిస్థితి గురించి చెప్పుకొచ్చారాయన.

భారతదేశంలో 194,413 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన విస్తరించి ఉన్న బ్రహ్మపుత్రా పరీవాహక ప్రాంతంలో - తరచూ దిక్కులు మార్చుకొనే ఇసుకతిన్నెల ద్వీపాలను ఖచ్చితంగా మ్యాపుల్లో  చూపించడమన్నది నిజానికి దాదాపు అసాధ్యం!

ప్రపంచంలోని అతిపెద్ద నదీ పరీవాహక వ్యవస్థలలో ఒకటైన బ్రహ్మపుత్రలో - ముఖ్యంగా వేసవి-ఋతుపవనాల నెలల్లో నిత్యం వరదలు వస్తుంటాయి కాబట్టి డావ్‌లీ ఇసుక తీరంలోని ఇళ్ళన్నీ నేలలో దిట్టంగా పాతిన కాంక్రీటుగానీ చెక్కలుగానీ- వాటి ఆధారాల మీద కడతారు. ఈ కాలం హిమాలయ హిమానీనదాల మంచు కరగడంతో సమానంగా ఉంటుంది. ఇది నదీ పరీవాహక ప్రాంతంలో ఖాళీ అయిపోయి ఉన్న నదులను నింపుతుంది. ఇహ నైరుతీ ఋతుపవనాల సమయంలో మజూలీ ప్రాంతంలో భారీ వర్షాలు పడతాయి. అక్కడ ఏడాదిలో 1870 మిల్లీమీటర్ల వర్షం పడితే అందులో 64 శాతం జూన్-సెప్టెంబర్ నెలల్లోనే కురుస్తుంది.

చపోరి పై స్థిరపడిన కుటుంబాలు ఉత్తరప్రదేశ్‌కు చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందినవి. వారు తమ మూలాలను 1932లో ఘాజీపూర్ జిల్లా నుండి బ్రహ్మపుత్ర ద్వీపాలకు చేరుకున్నట్టుగా గుర్తించారు. ఎవరి అధీనంలోనూ లేని సారవంతమైన భూమికోసం వెతుకులాట వారిని వేలాది కిలోమీటర్లు తూర్పుదిక్కున ఉన్న ఈ బ్రహ్మపుత్ర ద్వీపాలకు చేర్చిందట. "మేం సంప్రదాయకంగా పశుపాలకులం. వాటి కోసం పచ్చికబీళ్ళ వెదుకులాట మా పూర్వీకులను ఇక్కడికి చేర్చింది." అంటారు శివ్‌జీ..

"మా తాతల తరంవాళ్ళు పదిహేను ఇరవై కుటుంబాలవాళ్ళు లఖి చపోరీ ప్రాంతానికి వచ్చారు," అంటారు శివ్‌జీ. 1960లో యాదవ కుటుంబాలు తరలివెళ్ళిన ధనుఖనా చపోరీ ప్రాంతంలో ఆయన పుట్టారు. "ఆ ఊరు ఇంకా నిలిచే ఉంది. కానీ ఇప్పుడు ధనుఖనాలో ఎవరూ ఉండటంలేదు." అంటారు శివ్‌జీ. వరదల కాలంలో తరచుగా తమ ఇళ్ళూవాకిళ్ళూ ఎలా మునిగిపోయేవో ఆయనకింకా బాగా గుర్తే.

Siwjee outside his home in Dabli Chapori.
PHOTO • Riya Behl
Almost everyone on the sandbank island earns their livelihood rearing cattle and growing vegetables
PHOTO • Riya Behl

ఎడమ: డావ్‌లీ చపోరిలోని తన ఇంటి బయట శివ్‌జీ. కుడి: ఇసుకతిన్నెల ద్వీపంలో దాదాపు ప్రతి ఒక్కరూ పశువుల పెంపకం, కూరగాయలు పండించడం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు

Dabli Chapori, seen in the distance, is one of many river islands – called chapori or char – on the Brahmaputra
PHOTO • Riya Behl

దూరంలో కనిపించే డావ్‌లీ చపోరీ - చపోరి లేదా చార్ అని పిలుస్తారు - బ్రహ్మపుత్ర నదిపై ఉన్న అనేక నదీ ద్వీపాలలో ఒకటి

90 ఏళ్ళ క్రితం అసోమ్ చేరిన ఆ యాదవ కుటుంబాలు బ్రహ్మపుత్ర వరదల పుణ్యమా అని ఇప్పటికి నాలుగుసార్లు తమ స్థావరాలను మార్చుకున్నాయి. చివరిగా 1988లో ప్రస్తుత స్థావరమైన డావ్‌లీ చపోరీకి చేరుకున్నారు. ఈ యాదవ కుటుంబాలు నివాసముంటోన్న నాలుగు ఇసుకతిన్నెలూ ఒకదానికొకటి పెద్ద దూరం కాదు- మహా అయితే రెండుమూడు కిలోమీటర్లు. వాళ్ళు ఇప్పుడుంటున్న ఊరు డావ్‌లీ అన్నది డబుల్ అన్న ఆంగ్ల పదంలోంచి వచ్చినమాటని స్థానికులు చెబుతారు. అక్కడ ఉన్న ఇసుక తిన్నెలకు ఇది రెట్టింపు పరిమాణంలో ఉన్నదని సూచించే మాట డావ్‌లీ.

డావ్‌లీలో ఉన్న కుటుంబాలన్నిటికీ భూవసతి ఉంది. అందులో వారు వరి, గోధుమ, కాయగూరలు పండిస్తారు. వాళ్ళ పూర్వీకుల అడుగుజాడల్లో నడుస్తూ పశుపాలనను కూడా కొనసాగిస్తున్నారు. వాళ్ళంతా అసోమీ భాష మాట్లాడగలరు. కానీ వాళ్ళల్లో వాళ్ళు, తమ ఇళ్ళల్లో కూడా వాళ్ళు హిందీలోనే మాట్లాడుకుంటారు. "మా ఆహారపు అలవాట్లు కూడా మారలేదు. కానీ ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న మా దాయాదులతో పోలిస్తే మేం అన్నం ఎక్కువ తింటూ ఉంటాం." అని చెపుతారు శివ్‌జీ.

శివ్‌జీ విద్యార్థులు ఇంకా కొత్త కథల పుస్తకాలలోనే నిమగ్నమై ఉన్నారు. "నాకు అసోమీ పుస్తకాలంటే ఇష్టం," అంటాడు పదకొండేళ్ళ రాజీవ్ యాదవ్. వాళ్ళ అమ్మానాన్నా వ్యవసాయం చేస్తారు. పశువుల్ని పెంచుతారు. వాళ్ళిద్దరూ ఏడో తరగతి తర్వాత చదువుకు రామ్‌రామ్ చెప్పారు. "నేను వాళ్ళకన్నా ఎక్కువ చదువుకుంటాను," అంటూ రాజీవ్ అసోమీ సంగీతశిఖామణి భూపేన్ హజారికా గీతమొకటి అందుకొంటాడు. "అసోమ్ అమర్ రుపహీ దేశ్..." పాట సాగేకొద్దీ అతని కంఠం గంభీరమవుతోంది. మాస్టర్‌జీ అతనికేసి ఆపేక్షగా చూస్తారు.

*****

మాటిమాటికీ తమ ఉనికిని మార్చుకొనే నదీద్వీపపు ఇసుక తిన్నెల మీద ప్రతి ఏడాదీ వరదలనెదుర్కొంటూ జీవనం సాగించడం ఎంతో పెద్ద సవాలు. అక్కడి ప్రతి కుటుంబానికీ తెడ్లతో నడిపించే పడవలుంటాయి. అవిగాక ఆ ద్వీపంలో అత్యవసర సమయాల కోసం నడిచే రెండు మర పడవలు కూడా ఉన్నాయి. ఇళ్ళమధ్య ఉండే చేతి పంపులు అక్కడివాళ్ళ నీటి అవసరాలు తీరుస్తూ ఉంటాయి. వరదలు ముంచెత్తినపుడు జిల్లా విపత్తు నిర్వహణ విభాగం వాళ్ళూ, కొన్ని ఎంజీవోలూ వారికి మంచినీళ్ళు సరఫరా చేస్తారు. ప్రభుత్వం ప్రతి ఇంటికీ అందించిన సోలార్ పేనళ్ళు విద్యుశ్చక్తిని అందిస్తుంటాయి. పక్కన మజూలీ ద్వీపంలోని గెజెరా గ్రామంలోని రేషన్ దుకాణం వీళ్ళకు నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేస్తూ ఉంటుంది. ఆ దుకాణానికి వెళ్ళాలంటే నాలుగు గంటలు పడుతుంది. ముందు పడవలో దిసంగ్‌ముఖ్ వెళ్లాలి. అక్కడ్నించి మరబోటులో మజూలీ, అక్కడ్నించి ఆ ద్వీపంలోని గెజెరా గ్రామం!

వారికి అతి చేరువలో ఉన్న ప్రాథమిక వైద్య కేంద్రం, అక్కడికి మూడునాలుగు గంటల దూరంలోని మజూలీ ద్వీపంపై ఉన్న రతన్‌పురి గ్రామంలో ఉంది."వైద్య వసతి అన్నది ఇక్కడ అతి పెద్ద సమస్య," అంటారు శివ్‌జీ. "ఎవరైనా జబ్బుపడితే మర పడవలో ఆసుపత్రికి తీసుకెళ్ళొచ్చు. కానీ వర్షాకాలంలో నదిలో పడవ నడపడం ఎంతో కష్టం." అంటారాయన. మా డావ్‌లీకి అంబులెన్స్ పడవలు రావు. ఒకోసారి నదిలో కాస్తంత నీరు తక్కువున్న ప్రాంతం చూసుకొని ట్రాక్టర్లమీద దాటేస్తూ ఉంటాం." అన్నారాయన.

Ranjeet Yadav and his family, outside their home: wife Chinta (right), son Manish, and sister-in-law Parvati (behind).
PHOTO • Riya Behl
Parvati Yadav with her son Rajeev
PHOTO • Riya Behl

ఎడమ: తమ ఇంటి బయట రంజిత్ యాదవ్, అతని కుటుంబం. అతని భార్య చింత (కుడి), కొడుకు మనీశ్, వదిన పార్వతి (వెనుక). కుడి: తన కొడుకు రాజీవ్‌తో పార్వతి యాదవ్

Ramvachan Yadav and his daughter, Puja, inside their house.
PHOTO • Riya Behl
Puja and her brother, Dipanjay (left)
PHOTO • Riya Behl

ఎడమ: తమ ఇంటిలోపల రామ్‌వచన్ యాదవ్, ఆయన కుమార్తె పూజ. కుడి: పూజ, ఆమె సోదరుడు దీపాంజయ్ (ఎడమవైపు)

"మాకిక్కడ ఒక ప్రాథమికోన్నత పాఠశాల(ఏడవ తరగతి వరకు) ఎంతో అవసరం. ఇప్పుడు ఐదో తరగతి అయిపోగానే ఆ మరీ చిన్నపిల్లలు నది దాటి దిసంగ్‌ముఖ్ దాకా చదువుకోసం వెళ్ళాల్సి వస్తోంది. మామూలు రోజుల్లో ఫరవాలేదు కానీ జూలై సెప్టెంబర్ నెలల్లో వరదలు ముంచెత్తినపుడు వాళ్ళ చదువులు కుంటుపడతాయి," అన్నారు శివ్‌జీ. "ఇహ మా బడి విషయానికొస్తే ఇక్కడ నియమించబడే ఉపాధ్యాయులు ఇక్కడ ఉండటానికి ఇష్టపడరు. వచ్చి నాలుగు రోజులు ఉంటారేమో- ఇహ ఆపైన కనబడరు. దాంతో మా పిల్లలు చదువుల్లో వెనకబడిపోతున్నారు." అని వాపోయారాయన.

నలబై ఏళ్ళ రామ్‌వచన్ యాదవ్‌కు నాలుగేళ్ళ నుంచి పదకొండేళ్ళ వయసున్న ముగ్గురు పిల్లలు ఉన్నారు. "ఏదేమైనా మా పిల్లల్ని నది అవతలి పాఠశాలకు పంపితీరతాను. వాళ్ళు చదువుకుంటేనే కదా ఉద్యోగాలు దొరికేదీ," అంటారాయన. ఆయనకు ఒక ఎకరానికి పైగా పొలముంది. మార్కెట్లో అమ్మడం కోసం అందులో సొరకాయలు, వంకాయలు, ముల్లంగి, మిరపకాయలు, పుదీనా పండిస్తారాయన. దానికితోడు ఇరవై పాడి ఆవులు- ఆ పాలు అమ్ముతారు. ఆయన భార్య కుసుమ్ (35) అక్కడే పుట్టిపెరిగారు. నాలుగో తరగతి దాకా చదువుకున్నారు. ఆ రోజుల్లో ఆడపిల్లలు చదువుకోసం తమ ద్వీపాన్ని వదిలివెళ్ళడమన్న ప్రసక్తే లేకపోవడం వల్ల నాలుగో తరగతి దగ్గరే తన చదువాగిపోయిందని చెపుతారు కుసుమ్.

రంజిత్ యాదవ్ తన ఆరేళ్ళ అబ్బాయిని నది అవతల ఉన్న ప్రైవేటు స్కూలుకు పంపిస్తున్నారు- అంటే రోజూ నదిని రెండుసార్లు దాటడమన్నమాట. "నేను రోజూ మావాడిని బైక్ మీద తీసుకెళ్ళి బైక్ మీద తీసుకొస్తాను. ఒకోసారి శివసాగర్ పట్నంలో చదువుకుంటోన్న మా తమ్ముడు తీసుకెళతాడు." అంటారు రంజిత్ యాదవ్.

అతని సోదరుని భార్య పార్వతీ యాదవ్ అసలు బడి మొహమే చూడలేదు. ఆమె పదహారేళ్ళ కూతురు చింతామణి దిసంగ్‌ముఖ్‌లోని ఉన్నత పాఠశాలలో చదువుకోవటం ఆమెకు చాలా ఆనందాన్నిస్తోంది. పాఠశాలకు వెళ్ళడమంటే చింతామణికి రోజూ రెండు గంటల నడక. అందులో కొంతభాగం మళ్ళీ నదీ జలాల్లో ప్రయాణం. "దారిలో ఏనుగులుంటాయన్న భయం నాకుంది." అంటారు పార్వతి. ప్రధాన భూభాగంలో చదువుకోడానికి మా పన్నెండేళ్ళ సుమన్, పదకొండేళ్ళ రాజీవ్ వరుసలో ఉన్నారని చెపుతారావిడ.

Students lined up in front of the school at the end of day and singing the national anthem.
PHOTO • Riya Behl
Walking out of the school, towards home
PHOTO • Priti David

ఎడమ: బడివేళ అయిపోయాక, పాఠశాల ముందువైపు వరుసగా నిలబడి జాతీయ గీతం ఆలపిస్తోన్న విద్యార్థులు. కుడి: పాఠశాల నుండి ఇంటి వైపుకు పయనం

ఇన్ని ఇబ్బందులున్నా వాళ్ళెవరూ డావ్‌లీ చపోరీని వదిలివెళ్ళడానికి ఇష్టపడరు. ఈమధ్యనే జిల్లా కమీషనర్ 'మీరంతా శివసాగర్ పట్నంలో స్థిరపడతారా?' అని వాకబు చేశారు. ఎవరూ ముందుకు రాలేదు. "ఇదే మా ఇల్లు. దీన్ని వదిలి ఎక్కడికీ వెళ్ళం." అంటారు శివ్‌జీ.

ప్రధానోపాధ్యాయులు శివ్‌జీ యాదవ్‌కూ ఆయన భార్య ఫూల్‌మతికీ తమ పిల్లలు చదువుల్లో సాధించిన పురోభివృద్ధిని చూస్తే ఎంతో సంతోషం. వాళ్ళ పెద్దబ్బాయి సరిహద్దు భద్రతాదళం ఉద్యోగి. ఇరవై ఆరేళ్ళ పెద్దమ్మాయి రీతా డిగ్రీ చేసింది. చిన్నమ్మాయి గీత (25) పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. చిన్నబ్బాయి రాజేశ్ (23) వారణాసిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిఎచ్‌యు)లో చదువుకుంటున్నాడు..

బడి గంట మోగింది. పిల్లలంతా జాతీయ గీతాలాపనకు వరుసలు తీరి నిలుచున్నారు. అది ముగిశాక శివ్‌జీ గేటు తెరిచారు. పిల్లలంతా మెల్లగా గేటు దాటారు. దాటీదాటగానే పరుగులు పెట్టారు. ఆ రోజుకు పాఠశాల కార్యక్రమం ముగిసింది. అంతా శుభ్రంగా ఉండేలా చూసి తాళాలు వెయ్యడం ప్రధానోపాధ్యాయుని పని. "మిగతావాళ్ళ సంపాదన ఎక్కువగా ఉండొచ్చు. ఉపాధ్యాయునిగా నా జీతం తక్కువే కావచ్చు. కానీ కుటుంబం నడుస్తోంది. నా పని నాకు సంతృప్తి కలిగిస్తోంది- అది ముఖ్యం. మా ఊరు, మా జిల్లా, మా అసోమ్ పురోభివృద్ధి సాధిస్తాయి." అని ఎంతో సంతోషంగా చెప్తుంటారు శివ్‌జీ యాదవ్.

ఈ కథనాన్ని నివేదించడంలో సహాయం చేసినందుకు అయాంగ్ ట్రస్ట్‌కు చెందిన బిపిన్ ధానే, కృష్ణకాంత్ పెగోలకు రచయిత ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

అనువాదం: అమరేంద్ర దాసరి

Priti David

প্রীতি ডেভিড পারি-র কার্যনির্বাহী সম্পাদক। তিনি জঙ্গল, আদিবাসী জীবন, এবং জীবিকাসন্ধান বিষয়ে লেখেন। প্রীতি পারি-র শিক্ষা বিভাগের পুরোভাগে আছেন, এবং নানা স্কুল-কলেজের সঙ্গে যৌথ উদ্যোগে শ্রেণিকক্ষ ও পাঠক্রমে গ্রামীণ জীবন ও সমস্যা তুলে আনার কাজ করেন।

Other stories by Priti David
Photographs : Riya Behl

রিয়া বেহ্‌ল পিপলস্‌ আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ায় (পারি) কর্মরত বরিষ্ঠ সহকারী সম্পাদক। মাল্টিমিডিয়া সাংবাদিক রিয়া লিঙ্গ এবং শিক্ষা বিষয়ে লেখালিখি করেন। এছাড়া তিনি পারির সঙ্গে কাজে আগ্রহী পড়ুয়াদের মধ্যে কাজ করেন, অন্যান্য শিক্ষাবিদের সঙ্গে পারির কাহিনি স্কুল-কলেজের শিক্ষাক্রমে অন্তর্ভুক্তির জন্যও রিয়া প্রয়াসী।

Other stories by Riya Behl
Editor : Vinutha Mallya

বিনুতা মাল্য একজন সাংবাদিক এবং সম্পাদক। তিনি জানুয়ারি, ২০২২ থেকে ডিসেম্বর, ২০২২ সময়কালে পিপলস আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার সম্পাদকীয় প্রধান ছিলেন।

Other stories by Vinutha Mallya
Translator : Amarendra Dasari

Amarendra Dasari worked in Bharath Electronics Limited. He loves reading and travelling. Quite a number of his travel experiences are documented and published as travelogues.

Other stories by Amarendra Dasari