రక్తంతో తడిసిన స్ట్రెచర్‌ను చూడగానే శ్రీకృష్ణ బాజ్‌పేయి భయాందోళనలకు గురయ్యారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని సీతాపుర్ జిల్లాలో, ఫిబ్రవరి నెల, చలి తీవ్రంగా ఉన్నఒక రోజు మధ్యాహ్నం తన ఇంటి బయట చలి కాచుకుంటూ, 70 ఏళ్ళ శ్రీకృష్ణ ఇలా గుర్తు చేసుకున్నారు: “మా కోడలి ప్రసవం కష్టమవుతుందని, ఎంతో ప్రమాదంతో కూడుకున్నదని ఆశా కార్యకర్త మమ్మల్ని ముందే హెచ్చరించింది.”
ఈ సంఘటన సెప్టెంబర్ 2019 లో జరిగినా, అది నిన్ననే జరిగినంత బాగా గుర్తుంది శ్రీకృష్ణకు. “(వరద) నీరు అప్పుడే తగ్గుముఖం పట్టింది కానీ, రోడ్లు బాగా దెబ్బ తిన్నాయి. అందువల్ల అంబులెన్స్ మా ఇంటి వరకు రాలేదు.” శ్రీకృష్ణ నివసించే టాండా ఖర్ద్ కుగ్రామం, లహర్పుర్ బ్లాక్ లో, శారదా-ఘాఘ్రా నదీ తీరాల దగ్గర్లో ఉంది. ఈ చుట్టుపక్కల గ్రామాలలో తరచుగా ఆకస్మిక వరదలు సంభవిస్తుండడంతో, అత్యవసర పరిస్థితుల్లో రవాణాను ఏర్పాటు చేసుకోవడం ఇక్కడి ప్రజలకు కష్టతరంగా మారింది.
ప్రసవ వేదనలో ఉన్న ఏ స్త్రీకైనా, టాండా ఖర్ద్ నుండి సీతాపుర్ లోని జిల్లా ఆసుపత్రికి, అంటే 42 కిలోమీటర్లు ప్రయాణం చేయడం ఎంతో కష్టంతో కూడుకున్న పని; అటువంటిది, ద్విచక్ర వాహనంపై కూర్చొని, ఐదు కిలోమీటర్ల దూరం జారే రోడ్లపై ప్రయాణించాల్సి రావడం ఊహాతీతం. “అంబులెన్స్ వరకు వెళ్ళడానికి మేము అలా ప్రయాణించాల్సి వచ్చింది. కానీ, మేము జిల్లా ఆసుపత్రికి చేరుకునే సమయానికి తీవ్ర సమస్యలు తలెత్తాయి,” అని శ్రీకృష్ణ వివరించారు.
శ్రీకృష్ణ కోడలు మమత ఆడపిల్లకు జన్మనిచ్చింది. కానీ ప్రసవం అయిన తరువాత కూడా ఆమెకు రక్తస్రావం ఆగలేదు. అయినా, అంతా మంచే జరుగుతుందని అతను ఆశించారు. “ఇది ఊహించనిదేమీ కాదు. సమస్యలు తలెత్తుతాయని మాకు తెలుసు. కానీ వైద్యులు ఆమెను కాపాడతారని అనుకున్నాము.”
అయితే, మమతను వార్డుకు తరలిస్తుండగా, స్ట్రెచర్ పై ఉండే తెల్లటి దుప్పటి శ్రీకృష్ణకు కనిపించలేదు. “ఆ దుప్పటి రక్తంతో తడిసిపోయింది. అది చూసిన నాకు కడుపంతా తిప్పుతున్నట్లు అనిపించింది. రక్తం ఏర్పాటు చేసుకోమని డాక్టర్లు మాకు చెప్పారు. మేము త్వరత్వరగా బ్లడ్ బ్యాంక్ కు వెళ్ళి, రక్తం తీసుకొని ఆస్పత్రికి తిరిగి వచ్చే సరికి మమత మరణించింది.”
ఆమె వయసు కేవలం 25 సంవత్సరాలు!
చనిపోయే ముందు రోజు చేసిన వైద్యపరీక్షలలో, మమత బరువు 43 కిలోలు మాత్రమే ఉన్నట్లు, ఆమెకు ప్రోటీన్ లోపం ఉన్నట్లు తేలింది. అలాగే, ఆమె హీమొగ్లోబిన్ శాతం 8 g/dl గా ఉంది – అంటే తీవ్రమైన రక్తహీనత ఉందని (గర్భిణీ స్త్రీలలో హీమొగ్లోబిన్ శాతం తప్పనిసరిగా 11 g/dl లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి) కూడా తెలిసింది.
ఉత్తర్ ప్రదేశ్‌లో రక్తహీనత ఒక ప్రధానమైన ప్రజారోగ్య సమస్య – ముఖ్యంగా మహిళలు, పిల్లల్లో – అని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 ( NFHS-5 ) పేర్కొంది. రాష్ట్రంలో, 15-49 ఏళ్ళ మధ్య ఉన్న మహిళల్లో, 50 శాతానికి పైగా రక్తహీనతతో బాధపడుతున్నారు.
రక్తహీనత ఏర్పడడానికి పౌష్టికాహార లోపం ఒక సాధారణ కారణం. అయితే, ప్రపంచంలో నమోదయ్యే రక్తహీనత కేసులలో, దాదాపు సగం మందిలో ఐరన్ లోపం, ఫోలేట్ (విటమిన్ B9), విటమిన్ B12 లోపం, అంటు వ్యాధులు, ఇంకా జన్యుపరమైన అపసవ్యాలు కూదా ఇతర కారణాలుగా ఉన్నాయి.
యూపీలో కేవలం 22.3 శాతం మంది తల్లులు తమ గర్భధారణ సమయంలో కనీసంగా 100 రోజుల పాటు ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను తీసుకున్నారని NFHS-5 అధ్యయనం తెలిపింది. 2019-21 మధ్యకాలంలో, దేశవ్యాప్తంగా 44.1 శాతం (దాదాపు రెట్టింపు) మంది సప్లిమెంట్లు తీసుకోగా, సీతాపుర్ జిల్లాలో కేవలం 18 శాతం మంది మాత్రమే తీసుకున్నారు.
రక్తహీనత మాతాశిశు ఆరోగ్యంపై దీర్ఘకాలంలో ప్రతికూల పరిణామాలను కలిగిస్తుంది. ఇది అకాల ప్రసవం జరగడానికి, బరువు తక్కువ పిల్లలు పుట్టడానికి కారణమవుతుంది. అన్నింటినీ మించి, ప్రసూతి మరణాలు, పెరినాటల్ (గర్భాశయ పిండం లేదా నవజాత శిశువు) మరణాలతో నేరుగా ముడిపడి ఉంది.
2017-19 మధ్యకాలంలో, భారతదేశ ప్రసూతి మరణాల నిష్పత్తి లేదా MMR (మెటర్నల్ మోర్టాలిటీ రేట్) ప్రతి లక్ష జననాలకు 103 మరణాలుగా ఉంది. అదే కాలంలో, యూపీలో MMR ప్రతి లక్ష జననాలకు 167 గా ఉంది. 2019 లో, రాష్ట్ర శిశు మరణాల రేటు జాతీయ రేటు (30 మరణాలు) కన్నా 36 శాతం ఎక్కువ – అంటే 1,000 జననాలకు 41 మరణాలుగా ఉంది.
బాజ్‌పేయి కుటుంబంలో మమత మరణించడం మాత్రమే విషాదం కాదు. ఆమె మరణించిన 25 రోజులకు ఆమె పాప కూడా చనిపోయింది. “ఒక విషాదం నుండి కోలుకోక ముందే మా కుటుంబంలో మరొక విషాదం చోటు చేసుకుంది. అది మేము తట్టుకోలేకపోయాము,” అని శ్రీకృష్ణ బాధపడ్డారు.
మమత, ఆమె బిడ్డ రోజుల వ్యవధిలో మరణించిన ఆరు నెలల తరువాత కొరోనా మొదలైంది. కోవిడ్-19 ప్రబలినప్పుడు, దేశవ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవస్థ కుంటుపడింది. ఇది ప్రసూతి ఆరోగ్య సూచికలపై గణనీయమైన ప్రభావం చూపింది.
హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నుంచి తీసుకున్న డేటాపై పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా చేసిన విశ్లేషణ ప్రకారం, ఏప్రిల్-జూన్ 2019 తో పోలిస్తే, ఏప్రిల్-జూన్ 2020 మధ్యకాలంలో గర్భిణీ స్త్రీలకు లభించిన ప్రసవానంతర సేవలు 27 శాతానికి పడిపోగా, జనన పూర్వ రక్షణ సేవలు 22 శాతానికి పడిపోయాయి. “తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణలో అంతరాయం, ఆరోగ్యం కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలలో నిర్లక్ష్యం, ఆరోగ్య ప్రదాతల నుండి వ్యాధిబారిన పడవచ్చనే భయం వంటి కారణాలు గర్భధారణ సమయంలో ప్రమాదాలకు దారితీశాయి; అలాగే, మాతాశిశు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపాయి,” అని PFI అధ్యయనం తెలిపింది.
పప్పూ, అతని కుటుంబం కొరోనా ప్రాబల్యం ప్రభావాలను ప్రత్యక్షంగా అనుభవించారు.
కోవిడ్-19 రెండవ తరంగం ప్రబలి ఉన్నప్పుడు, అతని భార్య సరితాదేవి ఐదు నెలల గర్భవతి. ఆమెకు రక్తహీనత ఉంది. జూన్ 2021లో ఒక సాయంత్రం ఆమెకు ఊపిరి అందక ఇంట్లోనే కుప్పకూలిపోయింది. హీమొగ్లోబిన్ శాతం తక్కువగా ఉందనడానికి ఇదొక సూచన. “ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. నేను పని కోసం వెతుక్కుంటూ బయటకు వెళ్ళాను. మా అమ్మ కూడా బయటికి వెళ్ళింది,” అని 32 ఏళ్ళ పప్పూ చెప్పారు.
ఆ ఉదయం సరిత బాగానే ఉందని పప్పూ, ఆయన తల్లి 70 ఏళ్ళ మాలతి. “ఆమె ఆ మధ్యాహ్నం పిల్లల కోసం ఖిచిడీ కూడా చేసింది.”
పప్పూ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి, 20 ఏళ్ళ సరిత పాలిపోయి, బలహీనంగా కనిపించారు. “ఆమె ఊపిరి తీసుకోవడానికి చాలాఇబ్బంది పడింది,” అని అతను గుర్తు చేసుకున్నారు. దాంతో, అతను వెంటనే వారణాసి జిల్లా బారాగాఁవ్ బ్లాక్ లో ఉన్న తమ గ్రామం దల్లీపుర్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న భదోహీకి వెళ్ళడానికి ఒక ఆటోరిక్షాను అద్దెకు తీసుకున్నారు. “ఇక్కడ (బారాగాఁవ్ లోని) ఆస్పత్రులన్నీ జనాలతో కిక్కిరిసిపోయి ఉన్నాయి; ప్రాథమిక వైద్యశాలలో ఎలాంటి సౌకర్యాలు లేవు. అందుకే, సరైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము.”
సమర్థత కొరవడిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, కోవిడ్‌ను తట్టుకొని నిలబడలేని పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. మార్చి 2021 లో, ది లాన్సెట్ లో ప్రచురించబడిన 17 దేశాలకు సంబంధించిన అధ్యయనాల మెటా-విశ్లేషణ , తల్లి, గర్భస్థ శిశువు, ఇంకా నవజాత శిశువులపై కొరోనా ప్రభావం గురించి సమీక్షించింది.“సాధారణంగా నివారించగలిగిన మాతాశిశు మరణాలను తప్పించలేకపోవడానికి కోవిడ్ దారితీసింది”. సదుపాయాలు సరిగా లేని ప్రదేశాలలో, తల్లీబిడ్డల మరణాలను తగ్గించడానికి దశాబ్దాలుగా పెట్టిన పెట్టుబడి అంతా వృథా కాకుండా ఉండాలంటే, తక్షణ చర్యలు చేపట్టడం అవసరం,” అని ఆ మెటా-విశ్లేషణ పేర్కొంది.
కానీ, తల్లులు కాబోతున్న మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోలేదు.
ఆస్పత్రికి వెళ్ళేలోపే సరిత ఆటోరిక్షాలోనే మృతి చెందింది. “లాక్డౌన్ కారణంగా దారిలో చాలా చెక్ పోస్టుల దగ్గర ట్రాఫిక్ నిలిచిపోయి ఉంది. దాంతో మేము సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేకపోయాము,” అని పప్పూ కన్నీళ్ళ పర్యంతం అయ్యారు.
సరిత చనిపోయిందని పప్పూకు అర్థమవగానే, భార్యను పోగొట్టుకున్న దుఃఖాన్ని పోలీసులంటే ఉన్న భయం అధిగమించింది. మృతదేహంతో ప్రయాణిస్తున్నందుకు పోలీసులకు దొరికితే ఏం చేస్తారోనన్న భయంతో, ఆటో డ్రైవర్‌ను తిరిగి తమ గ్రామానికి తీసుకువెళ్ళమని పప్పూ అడిగారు. “దారిలో వచ్ఛే చెక్ పోస్టుల దగ్గర, సరిత శరీరం నిటారుగా కూర్చుని ఉన్నట్టు కనిపించేలా నేను జాగ్రత్తపడ్డాను. అదృష్టవశాత్తూ మమ్మల్ని పోలీసులు ఆపలేదు, ప్రశ్నించలేదు.”
అంత్యక్రియల నిమిత్తం, సరిత మృతదేహాన్ని దల్లీపుర్ సమీపంలోని ఘాట్ (నదీ తీరం) కి తీసుకెళ్ళారు పప్పూ, మాలతిలు. ఇందుకోసం బంధువుల దగ్గర రూ.2,000 అప్పు చేయాల్సివచ్చింది. “నేను ఒక ఇటుక బట్టీలో పని చేసేవాడిని. లాక్డౌన్ తరువాత (మార్చి 2020 లో) అది మూతబడింది,” అని ముశహర్ కులానికి చెందిన పప్పూ తెలిపారు; యూపీలో అట్టడుగున ఉన్న షెడ్యూల్డ్ కులాలలో ముశహర్ ఒకటి.
లాక్‌డౌన్‌కు ముందు, అతను ఇటుక బట్టీల్లో పని చేస్తూ నెలకు రూ.6,000 వరకు సంపాదించేవారు. “ఇటుక బట్టీలు మళ్ళీ తెరిచారు కానీ, నా భార్య మరణం తరువాత ఆ పనికి వెళ్ళడం మానేశాను. ఇప్పుడు నేను ఒకప్పటిలా బైట పని చేయలేను. నా పిల్లల్ని చూసుకోవాలి.”
పప్పూ తివాచీ తయారుజేయడానికి కూర్చున్నప్పుడు (అతని కొత్త ఆదాయ వనరు), అతను తడబడటం అతని పిల్లలు – 3 ఏళ్ళ జ్యోతి, 2 ఏళ్ళ రాణి – చూశారు. “నేను కొన్ని నెలల క్రితమే ఈ పని ప్రారంభించాను. ముందు ముందు ఎలా సాగుతుందో చూడాలి. దీని వల్ల ఇంట్లోనే ఉండి నా పిల్లలను చూసుకోవడం కుదురుతోంది. నా తల్లి ముసలిదైపోయింది; వాళ్ళిద్దరినీ చూసుకోలేదు. సరిత బ్రతికున్నపుడు అమ్మను, పిల్లలను చూసుకునేది. తను గర్భవతిగా ఉన్నప్పుడు, ఆమెను చూసుకోవడానికి మేము ఏమి చేసి ఉండాల్సిందో నాకు తెలియదు. ఆ పరిస్థితుల్లో తనను ఒంటరిగా వదలకుండా ఉండాల్సింది,” అని బాధపడ్డారు.
కోవిడ్-19 వ్యాప్తి చెందినప్పటి నుండి, బారాగాఁవ్ బ్లాక్‌లో ప్రసూతి సంరక్షణ మరింత నిర్లక్ష్యం చేయబడిందని వారణాసిలో ఉన్న పీపుల్స్ విజిలెన్స్ కమిటీ ఆన్ హ్యూమన్ రైట్స్ కార్యకర్త మంగళా రాజ్‌భర్ తెలిపారు. “ఈ బ్లాక్‌లో చాలా మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. వారికి అదనపు సంరక్షణ, విశ్రాంతి అవసరం. కానీ పేదరికం కారణంగా పురుషులు తమ ఇళ్లను వదిలి, (మరెక్కడో) పని వెతుక్కోవలసి వస్తోంది. దాంతో మహిళలు ఇంట్లో, పొలాల్లో కష్టపడుతున్నారు.” బారాగాఁవ్ లోని స్థానిక సంఘాలతో రెండు దశాబ్దాలకు పైగా రాజ్‌భర్ పని చేస్తున్నారు.
ఆహారంలో ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్ ల అవసరం మహిళలకు ఎంతగానో ఉన్నా, ప్రజా పంపిణీ వ్యవస్థల ద్వారా నెలవారీ లభించే బియ్యం, పప్పులను మాత్రమే వారు వండుకోగలుగుతున్నారు; కూరగాయలు కొనే స్థోమత వారికి లేనే లేదు. “వారికి అధునాతన ఆరోగ్య సంరక్షణ కూడా అందుబాటులో లేదు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నారు వాళ్ళు,” అని రాజ్‌భర్ అన్నారు.
సీతాపుర్ టాండా ఖర్ద్ లో పని చేసే ఆశా కార్యకర్త ఆర్తీదేవి మాట్లాడుతూ, చాలా మంది మహిళలు రక్తహీనతతో, తక్కువ బరువుతో బాధపడుతున్నారని, ఇవి గర్భధారణ సమయంలో తీవ్ర సమస్యలను సృష్టిస్తున్నాయని తెలిపారు. “ఇక్కడ ప్రజలు పప్పు, అన్నం మాత్రమే తింటారు. అందుకే ఆడామగా అందరిలో పౌష్టికాహార లోపం ఉంది. (వారి ఆహారంలో) కూరగాయలు దాదాపు ఉండవు. ఎవరి దగ్గరా తగినంత డబ్బు ఉండదు మరి!”
శ్రీకృష్ణ భార్య 55 ఏళ్ళ కాంతి మాట్లాడుతూ, “మాకు కేవలం రెండు ఎకరాల భూమి ఉంది. ఇందులో వరి, గోధుమలను పండిస్తున్నాము. మా పంటలు తరచూ వరదలకు కొట్టుకుపోతుంటాయి. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం దాదాపు శూన్యం,” అని చెప్పారు.
కాంతి కుమారుడు-మమత భర్త అయిన 33 ఏళ్ళ విజయ్, కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవించడాన్ని తప్పించేందుకు, సీతాపుర్ లో ఉద్యోగం చూసుకున్నారు. కానీ కోవిడ్-19 వల్ల దానిని కోల్పోయారు. అయితే, 2021 చివరలో దానిని తిరిగి సంపాదించారు. “అతని జీతం నెలకు రూ. 5,000. లాక్‌డౌన్‌కు ముందు అదే మమ్మల్ని నిలబెట్టింది. కానీ, ఇప్పుడు కూరగాయల ఖర్చును తగ్గించాల్సివచ్చింది.లాక్‌డౌన్‌కు ముందు కూడా పప్పు , బియ్యం తప్ప మరేదైనా కొనాలంటే ఇబ్బందిగా ఉండేది. కోవిడ్ తరువాత, ఆ ఆలోచనే లేదు మాకు,” అని కాంతి నిట్టూర్చారు.
2020 లో, కోవిడ్-19 వ్యాప్తి మొదలైన వెంటనే, ఆదాయంలో క్షీణత భారతదేశంలోని 84 శాతం కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపిందని ఒక అధ్యయనం పేర్కొంది. ఇది క్రమంగా వారి ఆహారం, పోషణలను ప్రభావితం చేసింది.
పెరుగుతున్న పేదరికం, గర్భవతుల సంరక్షణలో అసమతుల్యతలు, ఐరన్-ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను సక్రమంగా తీసుకోకపోవడం వల్ల హై రిస్క్ ప్రసవాలను తగ్గించడం కష్టతరం అవుతుంది. ముఖ్యంగా, ప్రజారోగ్య సౌకర్యాలు సరిగా లేని గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఇంకా కష్టమని రాజ్‌భర్, ఆర్తీదేవీలు నమ్ముతున్నారు.
మమత చనిపోయిన ఏడాదిన్నర తరువాత, విజయ్ మళ్లీ పెళ్ళి చేసుకున్నారు. 2021 ప్రారంభంలో, అతని రెండవ భార్య ప్రియ గర్భం దాల్చింది. ఆమెకూ రక్తహీనత ఉండడంతో, తనది కూడా హై రిస్క్ ప్రసవంగా నమోదు చేయబడింది. నవంబర్ 2021 లో, టాండా ఖర్ద్ లో వరద నీరు తగ్గుముఖం పడుతుండగా, ఆమెకు నొప్పులు మొదలయ్యాయి.
మమతను ఆస్పత్రికి తీసుకెళ్ళిన రోజుకి, ప్రియ ప్రసవ వేదనతో ఉన్న రోజుకి ఒక అసాధారణ పోలిక ఉన్నట్లు శ్రీకృష్ణకు అనిపించింది. కానీ, ఈసారి వరద బీభత్సం పెద్దగా లేకపోవడంతో, అంబులెన్స్ వారి ఇంటికే వచ్చింది. దాంతో ప్రియను 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్ళాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. అదృష్టవశాత్తూ, ఆమె స్వాతిక అనే ఆరోగ్యకరమైన పాపకి జన్మనిచ్చింది. ఈసారి పరిస్థితులు వీరికి అనుకూలంగానే ఉన్నాయి!
పార్ధ్ ఎం.ఎన్., ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి లభించే స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ ద్వారా ప్రజారోగ్యం మరియు పౌర హక్కులపై నివేదికలు రాస్తారు. ఈ నివేదికలోని విషయాలపై ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఎలాంటి సంపాదకీయ ఆంక్షలు పెట్టలేదు.
అనువాదం: వై క్రిష్ణ జ్యోతి