“ఆ రోజు మధ్యాహ్నం నేనూ, నా బిడ్డ బ్రతుకుతామో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. నా ఉమ్మనీటి సంచీ పగిలిపోయింది. కనుచూపు మేరలో ఆసుపత్రి గానీ, అందుబాటులో ఆరోగ్య కార్యకర్త గానీ లేరు. సిమ్లాలోని ఆసుపత్రికి వెళ్లే మార్గంలో కదులుతున్న జీపులో నాకు నొప్పులు వచ్చాయి. నేనింక ఆగే అవకాశం లేదు. అక్కడే బిడ్డను ప్రసవించాను - ఆ బొలెరో లోపల!" ఈ సంఘటన జరిగిన ఆరు నెలల తర్వాత, ఏప్రిల్ 2022లో ఈ రిపోర్టర్ ఆమెను కలిసినప్పుడు, తన పసిబిడ్డను ఒడిలో పెట్టుకుని కూర్చుని ఉన్న అనురాధ మహతో (అసలు పేరు కాదు)కు ఇప్పటికీ ఆ రోజు స్పష్టమైన వివరాలతో గుర్తుంది.
"అప్పుడు మధ్యాహ్నం మూడు గంటలవుతోంది. నా ఉమ్మనీటి సంచి పగిలిపోగానే, నా భర్త ఆశా దీదీకి కబురందించాడు. పావుగంటా, ఇరవై నిముషాల్లోనే ఆమె వచ్చేసింది. వచ్చిన వెంటనే అంబులెన్స్ కోసం ఫోన్ చేసింది. ఆ రోజు వర్షం పడుతోంది. పది నిముషాల్లో బయలుదేరతామని అంబులెన్స్ వాళ్ళు చెప్పారుగానీ, వాళ్ళకు మా ఊరు చేరడానికి మామూలుగా పట్టే సమయం కన్నా ఒక గంట ఎక్కువే పట్టివుంటుంది," వర్షాలు పడినపుడు అక్కడి రోడ్ల మీద ప్రయాణం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో వివరిస్తూ చెప్పింది, దాదాపు ముప్పయ్యేళ్ళ వయసున్న అనురాధ.
ఆమె హిమాచల్ ప్రదేశ్లోని కోటి గ్రామంలోని కొండ ప్రాంతంలో తాత్కాలికంగా ఏర్పాటుచేసుకున్న ఒక డబ్బారేకుల గుడిసెలో తన ముగ్గురు పిల్లలతోనూ, వలస కూలీ అయిన భర్తతోనూ కలిసి నివసిస్తోంది. అయితే ఈ కుటుంబం బిహార్లోని భాగల్పూర్ జిల్లా గోపాల్పూర్ గ్రామం నుంచి ఇక్కడకు వలసవచ్చింది.
సిమ్లా జిల్లాలోని మషోబ్రా బ్లాక్లో ఉన్న కోటి గ్రామంలో 2020లో తన భర్తతో చేరిన అనురాధ, “ఆర్థిక సమస్యల కారణంగా మేం (బిహార్లోని) మా గ్రామం నుండి ఇక్కడికి మారవలసి వచ్చింది. రెండు చోట్లా అద్దెలు చెల్లించడం కష్టమైంది." అని చెప్పింది. 38 ఏళ్ల ఆమె భర్త రామ్ మహతో (అసలు పేరు కాదు), నిర్మాణ స్థలాల్లో మేస్త్రీగా పనిచేస్తున్నారు. ఎక్కడ పనివుంటే అతను అక్కడికి వెళ్లాల్సివుంటుంది. ప్రస్తుతం అతను తాము నివాసముండే రేకుల గుడిసెకు దగ్గరలోనే పని చేస్తున్నారు.
మామూలు రోజుల్లో కూడా అంబులెన్స్ వారి ఇంటిదాకా సులభంగా చేరుకోవడమంటే కష్టమే. ఇక సిమ్లా జిల్లా కేంద్రంలోని కమలా నెహ్రూ ఆస్పత్రి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటికి రావాలంటే ఒకటిన్నర నుంచి 2 గంటల సమయం పడుతుంది. వర్షాలు పడుతున్నప్పుడు, మంచుకురిసే సమయంలోనూ అందుకు రెట్టింపు సమయం పడుతుంది.










