ద్రౌపది సబర్ కన్నీళ్ళను ఆపుకోలేక, చీరకొంగుతో తన కళ్ళను ఒత్తుకుంటూనే ఉన్నారు. ఒడిశాలోని గుడ్భేలీ గ్రామంలోని ఆమె ఇంటి బయట ఆమె మునిమనవళ్లు మూడేళ్ల గిరీశ్, తొమ్మిది నెలల విరాజ్ ఆమెకు సమీపంలోనే నిశ్శబ్దంగా ఆడుకుంటున్నారు. తన మనవరాలు తుల్సా చనిపోయిందని రోదిస్తున్న ఆ 65 ఏళ్ల వృద్ధురాలిని ఓదార్చేందుకు ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.
"ఇప్పుడెవరిని 'నా బిడ్డా' అని పిలిచేది?", ఆమె ప్రత్యేకించి ఎవరినీ అడుగుతున్నట్టులేరు.
నువాపాడా జిల్లాలోని ఖరియార్ బ్లాక్లో సగం కట్టిన తమ ఇటుక ఇంటి ముందు ప్లాస్టిక్ చాపపై సబర్ ఆదివాసీ వర్గానికి చెందిన తుల్సా కుటుంబసభ్యులు కూర్చొని ఉన్నారు. తుల్సా ఆకస్మిక మరణ దుఃఖం నుంచి బయటపడేందుకు ఈ కుటుంబం ప్రయత్నిస్తోంది. తుల్సా తల్లితండ్రులు - తల్లి పద్మిని, తండ్రి దేబానంద్ - పసివాళ్ళైన తమ కుమార్తె పిల్లల గురించి ఆందోళన చెందుతున్నారు. అందులోనూ విరాజ్, తల్లి చనిపోయేనాటికి ఇంకా పాలు మరవని చంటిబిడ్డ. "నా కోడలు పద్మిని, నేనూ ఈ పిల్లలను చూసుకుంటున్నాము" అని ద్రౌపది చెప్పారు.
ఆ పసిపిల్లల తండ్రి, తుల్సా భర్త అయిన 27 ఏళ్ల భోసింధు ఇంటిదగ్గర లేరు. అతను అక్కడికి 500 కిలోమీటర్ల దక్షిణాన ఉన్న తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలోని రంగాపూర్ అనే గ్రామంలో ఒక ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. అతను 2021 డిసెంబర్లో తన తల్లి, తుల్సా చెల్లెలు దీపాంజలితో కలిసి ఆరు నెలలపాటు ఇటుక బట్టీలో పని చేయడానికి అక్కడికి వెళ్లారు. వీరు రోజుకు దాదాపు రూ. 200 సంపాదించాలి.
జనవరి 24, 2022 రాత్రి, 25 ఏళ్ల తుల్సా సబర్ గుడ్భేలీలోని తల్లిదండ్రుల ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చనట్మాల్ గ్రామంలోని తన ఇంట్లో ఉన్నారు. రాత్రి 8 గంటల సమయంలో కడుపునొప్పి తీవ్రంగా ఉందని ఆమె చెప్పారు. "నేనామెను ఖరియార్ [పట్టణం]లోని సబ్-డివిజనల్ ఆసుపత్రికి తీసుకెళ్లాను" అని ఆమె మామ, 57 ఏళ్ల దస్మూ సబర్ చెప్పారు. “అక్కడి వైద్యుడు పరిస్థితి తీవ్రంగా ఉందని, నువాపాడాలోని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తీసుకువెళ్లమని అన్నారు. కానీ మేము అక్కడికి చేరుకునే సమయానికే, తుల్సా చనిపోయింది."








