తెలుపు, పసుపు రంగులు వేసిన ముఖం పైన, మూడు ఎరుపు చుక్కలు - ముక్కుపై ఒకటి, బుగ్గలపై రెండు. తలపై విదూషకుడి టోపీగా మారిన ఆకాశనీలం రంగు ప్లాస్టిక్ సంచి, పెదవులపై ఒక తమాషా పాట, ఒక నిర్లక్ష్యపు లయతో కదిలే అవయవాలు - అతనొక విరగబడే అల్లరి నవ్వులా కనిపిస్తారు. చేసే హల్ చల్ సంగతి మామూలే. జవ్వాజీ కొండల్లోని చిన్న ప్రభుత్వ పాఠశాలలోనైనా, చెన్నైలోని ఆడంబరంగా కనిపించే ప్రైవేట్ పాఠశాలలోనైనా, ఆదివాసీ పిల్లల కోసం సత్యమంగళం అడవుల్లో(ఈరోడ్ జిల్లా) దారీతెన్నూ లేని ప్రదేశంలో ఉన్న బడైనా, లేదా ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం నడిచే బడైనా- ఏదైనా ఎళిల్ అన్న కళా శిబిరాలు(ఆర్ట్ క్యాంపులు) ఇలాగే మొదలవుతాయి. ఒక పాటతోనో, ఒక చిన్న స్కిట్తోనో ఒక్కసారిగా అన్న ప్రవేశించడంతోనే, పిల్లలు తమ సంకోచాలన్నీ వదిలేసి పరిగెత్తుతూ, ఆడుతూ, నవ్వుతూ ఆయనతో కలిసి పాడుతూ వచ్చేస్తారు.
శిక్షణ పొందిన కళాకారుడైన అన్న, పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి ఎన్నడూ ఆందోళన చెందరు. అసలాయన ఏమీ కావాలని - ప్రత్యేక హోటల్ గానీ, బస గానీ ఏర్పాటు చేయలేదనో, ప్రత్యేక పరికరాలు లేవనో - ఇలా ఏమీ అడగరు. ఆయన కరెంటు, లేదా నీరు, ఫాన్సీ క్రాఫ్ట్ పరికరాల్లాంటివి ఏమీ లేకుండా కూడా పని చేసేవారు. అతను పిల్లలను కలవడం, వారితో సంభాషణలు చేయడం, వారితో పని చేయడం వంటివాటి పట్ల మాత్రమే శ్రద్ధ వహిస్తారు. మిగతా వాటికి వేటికీ అంత ప్రాథాన్యం ఉండదు. మీరు అతని జీవితం నుండి పిల్లలను తీసివేయలేరు. పిల్లల విషయానికి వస్తే అతనే ఆకర్షణా, పనితనం కలిగిన వ్యక్తి కూడా.
ఒకసారి సత్యమంగళంలోని ఒక గ్రామంలో ఇంతకు ముందు ఎన్నడూ రంగుల మొహమే ఎరుగని పిల్లలతో కలిసి పనిచేశారు. మొదటిసారిగా వారి ఊహ నుండి వచ్చే దేన్నో సృష్టించడానికి రంగులను ఉపయోగించడంలో, వారొక కొత్త అనుభవాన్ని పొందటంలో, ఆయన వారికి సహాయం చేశారు. తన కళా పాఠశాల కళిమణ్ విరల్గళ్ (ఫింగర్స్ ఆఫ్ క్లే- మట్టి వేళ్ళు)ను ప్రారంభించినప్పటి నుండి గత 22 సంవత్సరాలుగా పిల్లల కోసం అవిశ్రాంతంగా ఈ అనుభవాలను సృష్టిస్తున్నారు. ఆయన అనారోగ్యానికి గురికావడం నేను ఎన్నడూ చూడలేదు. పిల్లలతో కలిసి పనిచేయడం, తనను తానెప్పుడూ వారికోసం సిద్ధంగా ఉంచుకోవడమే ఆయన ఆరోగ్య పరిరక్షణ.
30 సంవత్సరాల క్రితం, అంటే 1992లో చెన్నై ఫైన్ ఆర్ట్స్ కాలేజీ నుండి ఆర్ట్స్ లో తన బ్యాచిలర్ డిగ్రీని అన్న పూర్తి చేశారు. "నా సీనియర్లు, చిత్రకారులు తిరు తమిళ్ సెల్వన్, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీ ప్రభాకరన్, చిత్రకారులు శ్రీ రాజ్మోహన్లు నా కళాశాల జీవితంలో డిగ్రీని పూర్తి చేయడంలో నాకు చాలా సహాయపడ్డారు. టెర్రకోట శిల్పకళలో కోర్సు పూర్తిచేసిన తర్వాత, కళాత్మక కార్యకలాపాలపై ప్రయోగాలు చేయడానికి చెన్నైలోని లలిత కళా అకాడమీలో చేరాను." అంటూ తన కళాశాల రోజులను అన్న గుర్తుచేసుకున్నారు. తన శిల్పకళా స్టూడియోలో కూడా ఆయన కొంతకాలం పనిచేశారు
"కానీ నేను చేసిన కళాకృతులు అమ్ముడుపోవడం ప్రారంభించినప్పుడు, అవి సాధారణ ప్రజలకు చేరడం లేదని నేను గ్రహించాను. అప్పుడే నేను జనాలతో కలిసి కళాత్మక కార్యక్రమాలలో పాల్గొనడం మొదలుపెట్టాను. తమిళనాడులోని ఐదు గ్రామీణ ప్రాంతాలే (కొండలు, సముద్రతీరం, ఎడారి ప్రాంతం, అడవి, పంటపొలాలు) నేను కోరుకునే ఆ ప్రదేశాలు అని నిర్ణయించుకున్నాను. నేను నా పిల్లలతో కలిసి మట్టినీ, హస్తకళలనూ ఉపయోగించి బొమ్మలు తయారు చేయడం ప్రారంభించాను.” అని ఆయన అన్నారు. ఆయన పిల్లలకు కాగితం ముసుగులు, మట్టి ముసుగులు, మట్టి నమూనాలు, డ్రాయింగ్లు, పెయింటింగ్లు, గ్లాస్ పెయింటింగ్లు, ఓరిగామి ఎలా తయారు చేయాలో నేర్పించడం ప్రారంభించారు