గత వారం గణపతి బాల్ యాదవ్, తన సైకిల్ తొక్కుకుంటూ సూర్యాస్తమయంలోకి జారిపోయారు. స్వాతంత్య్ర సమరయోధుడు, విప్లవకారుల భూగర్భ కొరియర్, తన సెంచరీని పూర్తి చేసుకుని 101 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తూ, తన పురాతన సైకిల్‌పై రోజుకు 5-20 కిలోమీటర్లు ప్రయాణం చేసిన వ్యక్తి , కొద్దికాలం అనారోగ్యానికి లోనై , ఆకాశపు దారిలోకి మరలిపోయారు.
2018 లో మేము కలిసిన రోజుకు ఆయన వయసు 97. మమ్మల్ని వెతుకుతూ సైకిల్ పై 30 కిలోమీటర్ల దూరం వచ్చారు. ఇక్కడ ‘మేము’ అంటే ఆలస్యంగా వచ్చిన మా PARI బృందం. కానీ ఆకట్టుకునే అతని కథను వినడానికి మేమందరం ముందున్నాం. మే నెల మధ్యలో, ఆయన గంటలు తరబడి రోడ్డు మీదే ఉన్నారు. ఆయన సైకిల్ ఒక మ్యూజియం లో ఉంచదగినంత పాతదిగా ఉన్నా ఆయనకు ఇబ్బంది ఏమి లేనట్లుంది. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు, కానీ అతని కథ మిగిలి ఉంది: అదే గణపతి యాదవ్ జీవిత చక్రం.
1920 లో జన్మించిన గణపతి బాల్ యాదవ్ తూఫాన్ సేన (వర్ల్విండ్ ఆర్మీ)లో స్వాతంత్య్ర సమర యోధుడిగా పనిచేశారు. తూఫాన్ సేన (వర్ల్విండ్ ఆర్మీ) అంటే - 1943 లో బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్య్రం ప్రకటించిన ప్రతీ సర్కార్ యొక్క సాయుధ విభాగం. లేదా తాత్కాలిక, సతారా యొక్క అండర్ గ్రౌండ్ ప్రభుత్వం అని కూడా అనొచ్చు. ఈ దశలో బాల్ యాదవ్ బ్రిటిష్ రాజుకు జరిపిన వ్యతిరేక చర్యలలో పాల్గొన్నారు. జి. డి. బాపు లాడ్ మరియు ‘కెప్టెన్ భావు నేతృత్వంలో జూన్ 1943 న సతారా జిల్లాలోని షెనోలి వద్ద గొప్ప రైలు దోపిడీ జరిపిన విప్లవాత్మక బృందంలో ‘గణపా దాదా’ కూడా ఉన్నారు.
మాకు చెప్పిన ప్రకారం,“నేను మా నాయకులకు (అడవిలో దాక్కున్న) ఆహారాన్ని అందచేసాను. వాళ్ళను రాత్రుళ్లు కలవడానికి వెళ్తాను. నాయకుడి పాటు 10-20 మంది ఉంటారు.” ఒకవేళ ఆయన బ్రిటిష్ వాళ్ళకి దొరికిపోయి ఉంటే ఆయనని, ఆ 20 మందిని ఉరితీసేవారు. కానీ యాదవ్ కొన్ని సంవత్సరాలు తన సైకిల్ పై ఎవరికీ తెలీకుండా అండర్‌గ్రౌండ్ లో “మీల్స్ ఆన్ వీల్స్” గా ఆహారాన్ని అందించారు. ఆయన ఈ విప్లవ సమూహాల మధ్య అతి ముఖ్యమైన సందేశాలను కూడా చేరవేసేవారు.






