దిల్లీ నుంచి మేం తిరిగివచ్చి ఇప్పటికి రెండేళ్ళవుతోంది. మా డిమాండ్లను తీరుస్తానని చెప్పిన ప్రభుత్వం, వాటిని గురించి చర్చించేందుకు మా రైతులనెవరినీ ఇంతవరకూ పిలవలేదు," పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాకు చెందిన 60 ఏళ్ళ చరణ్‌జిత్ కౌర్ అన్నారు. ఆమె, ఆమె కుటుంబం తమ రెండెకరాల పొలంలో గోధుమ, వరితో పాటు ఇంటి వాడకం కోసం కొన్ని కూరగాయలను పండిస్తుంటారు. "మేం రైతులందరి హక్కుల కోసం పోరాడుతున్నాం," అంటారామె.
చరణ్‌జిత్ కౌర్, తన స్నేహితురాలైన గుర్మీత్ కౌర్‌తో సహా మరి కొంతమంది మహిళల బృందంతో కలిసి పటియాలా జిల్లా, శంభూ సరిహద్దు దగ్గర కూర్చొనివున్నారు. "వాళ్ళు (ప్రభుత్వం) మమ్మల్ని దిల్లీ కూడా వెళ్ళనివ్వడంలేదు," అన్నారు గుర్మీత్. ఆమె ఇక్కడ హరియాణా-పంజాబ్ సరిహద్దు పొడవునా రహదారుల మీద కాంక్రీట్ గోడలు, ఇనుప మేకులు, ముళ్ళ కంచెలతో అంచెలంచలుగా నిర్మించిన అవరోధాలను గురించీ, ఆపైన దిల్లీ-హరియాణా సరిహద్దులలో రైతు నిరసనకారులను దిల్లీలోకి ప్రవేశించనీయకుండా నిరోధిస్తోన్న విషయం గురించీ మాట్లాడుతున్నారు. చదవండి: 'శంభూ సరిహద్దు వద్ద నేను బందీనైనట్టనిపించింది'
కేంద్రం అనేక విషయాలలో విఫలమయిందని ఇక్కడ గుమిగూడిన రైతులు అన్నారు: స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు కనీస మద్దతు ధరకు(ఎమ్ఎస్పి) హామీ; రైతులకు రైతు కూలీలకు అప్పులను పూర్తిగా మాఫీ చేయటం; లఖింపూర్-ఖేరీ మారణకాండలో నష్టపోయిన రైతులకు న్యాయం చేయటం, దోషులను అరెస్టు చేయటం; రైతులకు, కూలీలకు పింఛను పథకం; 2020-2021 నిరసనలో అమరులైన రైతుల కుటుంబాలకు పరిహారం.
కొన్ని వారాల క్రితం ఫిబ్రవరి 13న, తమ డిమాండ్ల సాధన కోసం ఈ రైతులు దేశ రాజధానికి శాంతియుతంగా యాత్రను ప్రారంభించినప్పుడు, వారిని ముందుకు కదలకుండా ఆపడానికి హరియాణా పోలీసులు బాష్పవాయువును, నీటి ఫిరంగులను, పెల్లెట్ గన్ల నుండి రబ్బర్ బుల్లెట్లను వారిపై ప్రయోగించారు.










