మా వాలంటీర్లే మా కార్యకలాపాలకు కేంద్ర బిందువులు. వారు మేం వెలువరించే ప్రతి నివేదికలో 'స్పష్టతను, వాస్తవికతల'ను సంగ్రహంగా రూపొందిస్తారు. మా వద్ద కళాశాల విద్యార్థులు, ఉద్యోగాలు చేస్తున్నవారు, పదవీ విరమణ చేసిన నిపుణులు ఉన్నారు. వారు సాంద్రమైన, విస్తృతమైన అంశాలను సరళంగా చదువుకునే విధంగా తిరిగి రూపొందించడానికి మాతో స్వచ్ఛందంగా కలిసి పనిచేస్తారు. మా ఆర్కైవ్ పరిజ్ఞానాన్ని అందుబాటులోనూ, వైవిధ్యంగానూ ఉండేలా చూసుకుంటూ వారు తమ సమయాన్ని, నైపుణ్యాలను మాకు అందిస్తారు.
ప్రస్తుతం, PARI గ్రంథాలయంలో మా ప్రారంభం నుండి మాతో కలిసి పనిచేస్తోన్న దాదాపు 450 మంది వాలంటీర్లు ఉన్నారు.
2025 సంవత్సరాన్ని ముగిస్తోన్న ఈ సందర్భంలో, మా రెగ్యులర్ వాలంటీర్లలో కొంతమంది అనుభవాలను, వారు నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను మీ ముందుకు తీసుకురావడం మాకు చాలా ఆనందంగా ఉంది.
యాళిని
సత్యమూర్తి
బాంబే ఐఐటిలో ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇంజనీరింగ్లో ఎమ్టెక్ చదువుతున్నారు.
నేను 'స్పష్టత, వాస్తవికతల' కోసం సంకలనం చేసిన ప్రతి నివేదిక నాకు నాలో నిలిచివుండేలా ఒక కొత్త దృక్పథాన్ని అందించింది. ఉదాహరణకు, టెయింటెడ్ కార్పెట్స్: భారతదేశ చేనేత తివాచీల రంగంలో బానిసత్వం, బాల కార్మిక వ్యవస్థ, లేదా క్లైమేట్ ఇండియా 2024: తీవ్ర వాతావరణ సంఘటనలపై ఒక అంచనా వంటి కొన్ని నివేదికలు నన్ను కలచివేశాయి, దానినించి బయటపడటానికి నాకు చాలా రోజులు పట్టింది. అయితే నేను అధ్యయనం చేస్తోన్న దాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ నివేదికలపై పనిచేయడం వల్ల సంబంధిత విషయాలపై నేను మరింత అవగాహనను పెంచుకోవడానికి అవకాశాలు లభించాయి.
అది ఒక్క పేజీ నిడివి ఉన్న పోస్టర్ అయినా, 500 పేజీల గణాంక నివేదిక అయినా, PARI గ్రంథాలయపు నిర్మాణాత్మకమైన 'స్పష్టత, వాస్తవికతల' సమాహారం మిమ్మల్ని సమస్య మూలంలోకి తీసుకువెళ్తుంది. దురదృష్టవశాత్తు, ఈ నివేదికలలో చాలా వరకు ఇంకా ప్రధాన స్రవంతిలోకి రాలేదు.
అబిజార్ షేక్
30 ఏళ్ళకు పైగా అనుభవం ఉన్న కమ్యూనికేషన్స్, ఆర్థిక సేవల నిపుణులు
నాకు తీరిక సమయం ఉండటంతో, ఏదైనా ప్రయోజనకరమైన పని చేయాలనుకున్నాను. PARI గ్రంథాలయంతో స్వచ్ఛందంగా పనిచేయడం ఒక అద్భుతమైన అవకాశం. ఎల్లప్పుడూ నా వ్యక్తిగత ఆసక్తులలో ఒకటిగా ఉన్న PARI చేసే పని నాకు సరిగ్గా సరిపోయింది.
గ్రంథాలయంలోని అంశాల వర్గీకరణ, శోధనా సామర్థ్యం మెరుగుపడాలని ఒక పాఠకుడిగా నేను కోరుకుంటున్నాను.
జెర్రీ జోస్
కేరళలోని కోట్టయంకు చెందిన ఒక పర్యావరణ శాస్త్రవేత్త
PARIతో నా పరిచయం, ఆ వెబ్సైట్ను ప్రారంభించే సమయంలో పి. సాయినాథ్ ఇచ్చిన ఒక ఉపన్యాసం ద్వారా జరిగింది. "ఉపఖండంలోని ఒక ఖండం" వంటి గ్రామీణ భారతదేశాన్ని డాక్యుమెంట్ చేసే ఆ ప్రయత్నం స్ఫూర్తిదాయకంగానూ, అద్వితీయంగానూ ఉంది. నిరంతరం విస్తరిస్తోన్న PARI గ్రంథాలయానికి దూరంగా ఉంటూ కూడా నా వంతు సహకారాన్ని స్వచ్ఛందంగా అందించడమే నా మార్గం.
గ్రంథాలయంలో అందుబాటులో ఉండేలా 'స్పష్టత, వాస్తవికతల'తో కూడిన క్యూరేటెడ్ నివేదికలు ఉండటం ప్రశంసనీయం. విస్తరించిన పరిధి PARI జర్నలిజానికి చాలా పరిపూరకంగా ఉందని నేను భావిస్తున్నాను. పరిశోధనే ఒక అభ్యాసం లాంటిదైన సందర్భంలో, నాకు నైపుణ్యమున్న రంగంలోనూ, దాని వెలుపలా కూడా నివేదికలపై పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది.