ఆమె కూర్చున్న ఒక పెద్ద ఎండుగడ్డి మోపు చుట్టూ, దారుణమైన విధ్వంసమేదో జరిగినట్లు కనిపిస్తోంది. విరిగిన వెదురు బొంగులు, చిరిగిన టార్పాలిన్ పట్టాలు, ప్లైవుడ్ పలకలు, తాళ్ళ ముక్కలు, నలిగిపోయిన చీరలు, వంటపాత్రలు, గిన్నెలు, మట్టి గొట్టుకున్న బట్టలు వగైరా రోజువారీ సామగ్రి అంతా చెల్లాచెదరుగా పరచుకొని ఉందక్కడ. వాళ్ళు ఇల్లుగా పిలుచుకున్న ప్రదేశమిదే. ఇప్పటికీ అది ఇల్లే. రెండురోజుల క్రితం దిల్లీ డెవలప్మెంట్ అథారిటీవాళ్ళ బుల్డోజర్లు వాళ్ళ గుడిసెలన్నీటినీ నేలమట్టం చేసేక, ఇక్కడి దృశ్యమంతా మారిపోయింది. చిల్లా సరోదా ఖాదర్ అనే జనాభా లెక్కల పట్టణంలోని ఈ జనావాస ప్రదేశంలో ఉన్న 10-15 ఇళ్ళలో రీతాదేవి గుడిసె కూడా ఒకటి.
కానీ ఆమెను ఈ పరిస్థితులేవీ అంతగా ఇబ్బంది పెడుతున్నట్లు లేదు. సుమారు ఒక అంగుళం వెడల్పున్న బంగారు-గోధుమరంగు గడ్డి ఆకును ఒక చేతిలో పట్టుకుని, మరో చేతిలోని కొడవలితో దాన్ని రెండు మూడు పల్చటి చీలికలుగా చేస్తున్నారు. ప్రభుత్వం దిల్లీలో అభివృద్ధి చేయాలనుకుంటోన్న ఆరు జీవ వైవిధ్య పార్కుల్లో ఒకటైన యమునా క్షేత్ర సమీపంలోని బస్తీలో నివాసముండే ఆమెకు గానీ, మిగిలిన జనానికి గానీ ఇళ్ళ ముందు భూతంలా బుల్డోజర్ నిలబడడం కొత్తా కాదు, అదంటే ఇప్పుడు వాళ్ళకు బెదురూ లేదు. “యహ్ జమీన్ సర్కారీ హై ఇస్ లియే తో ఝుగ్గీ-వుగ్గీ తోడ్ దేతా హై. పట్టే పర్ జమీన్ యహ్ వహీ లోగ్ సాల్ భర్ కే లియే లేతేఁ హై జో ఖేతీ కర్తేఁ హై” [ఇది ప్రభుత్వ భూమి కాబట్టి ఇక్కడ వేసుకున్న గుడిసెలని కూల్చేస్తున్నారు. ఏడాది కాలానికి పట్టా తీసుకున్నవాళ్ళే ఇక్కడ వ్యవసాయం చేస్తారు.]”
“మేం అక్షర్ధామ్ దగ్గర ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగింది,” అన్నారు రీతా. “ఎవరో చేపలను శుభ్రం చేస్తుండగా, ఆ చేపల వ్యర్థాలను ఒక కాకి ఎత్తుకుపోయి గుడిలో పడేసింది. దాంతో వాళ్ళు మొత్తం ఝుగ్గీ [గుడిసెలు]నే పడగొట్టేశారు. అదంతా 2015లో జరిగింది. అప్పుడు చిల్లా ఖాదర్లోని ఈ బస్తీకి వచ్చాం. ఇక్కడ కూడా నాలుగయిదుసార్లు అలానే జరిగింది. అయినా ఇక్కడే ఉంటున్నాం.” నెలకు 500 రూపాయల అద్దెకు తీసుకున్న జాగాలో, ఆమె కుటుంబం ఒక చిన్న 8X10 అడుగుల గదిని కట్టుకుంది.
“ఓ గుజ్జర్ వ్యక్తికి అద్దె కడుతున్నాం. ఆయన పేరు రాజ్వీర్. ఆయన కూడా చిల్లాలోనే ఉంటాడు. ఆయన తాత చాలాకాలం క్రితమే ఈ భూమిని ప్రభుత్వానికి అమ్మేశాడు. అందుకోసం వాళ్ళకి పరిహారం కూడా అందింది. అయినా ఇప్పటికీ ఈ భూమి తనదే అంటాడాయన. మాలాంటి బీదవాళ్ళని కొట్టీ బెదిరించీ డబ్బు గుంజుకుంటాడు,” చెప్పారు రీతా. “తుమ్హారా ఖేత్, తుమ్హారీ జమీన్, తూ జాన్. హమారా తో రెహ్నే సే మతలబ్ హై [నీ పొలం, నీ భూమి, అదంతా నీ ఇష్టం. మాకెందుకు? ఇక్కడ ఉండనిస్తే చాలు మాకు]. మేం ఎప్పుడూ పక్కా ఇళ్ళు కట్టుకోం. వాళ్ళు పడగొట్టినప్పుడల్లా కొత్త ఇల్లు కట్టుకుంటూ కూర్చునేదెవరు?” చీలికలు చేసిన గడ్డిని చిన్న కట్టగా కడుతూ అన్నారామె.
ఈసారి కూల్చివేతలు పూర్తయిన తర్వాత, రీతా కుటుంబం తమ గుడిసె తాలూకు రెండు గోడలను మళ్ళీ నిలబెట్టి, వాటి మీద పైకప్పుగా ఒక ప్లాస్టిక్ పట్టాను పరవగలిగారు. ఆ బస్తీలో చాలామంది ఉత్తరప్రదేశ్, బిహార్ల నుంచి వచ్చిన వలస వచ్చిన దినసరి కూలీలే. రీతా కూడా బిహార్లోని సుపాల్ జిల్లాకు చెందినవారు. ఆమె తల్లిదండ్రులు జీవనోపాధిని వెతుక్కుంటూ బస్బిట్టీ గ్రామం నుంచి 1993లో ఢిల్లీకి వలస వచ్చినప్పటినుంచీ రీతా ఇక్కడే ఉంటోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, దాదాపు 90.3 లక్షలమంది అదే కారణంతో బిహార్ నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళారు. రీతా మల్లాహ్ అనే జాలరి సముదాయానికి చెందినవారు. బిహార్లో నిషాద్, ధీమర్ అని కూడా పిలిచే ఈ కులం ఇప్పుడు షెడ్యూల్డ్ కులంగా నమోదైంది.




















