"మేం పనిలో ఉన్నప్పుడు సాధారణంగా మధ్యాహ్న భోజనం కోసం గబీని వండుకుంటాం," రైతు అస్సినో మెయ్సిసినో మెయాసే చెబుతున్నారు. తక్కువ మసాలాలతో చేసే ఈ వంటకానికి చాలా కొన్ని పదార్థాలు మాత్రమే అవసరం – అవన్నీ నాగాలాండ్‌లోని ఖొనోమా ప్రాంతంలో స్థానికంగా దొరికేవే. పైగా, తమ పొలాల్లో పని చేసుకునే రైతులకు ఇవి సులభంగా అందుబాటులో ఉంటాయి.
"కొన్నిసార్లు మేం గాల్హో కూడా చేసుకుంటాం," తాజా ఆకుకూరలు, అటవీ కూరగాయలు, స్థానిక సుగంధ ద్రవ్యాలు, స్మోక్డ్ (పొగలో పక్వంచేసిన) పంది మాంసం లేదా గొడ్డు మాంసం వంటి వాటిని కలిపి వండే ఈ పోషకమైన వంటకం గురించి ఆమె వివరిస్తున్నారు. "ఇది అంగామీ తెగ వారి ప్రత్యేక వంటకం," 36 ఏళ్ళ అస్సినో PARIతో చెప్పారు.
ఒక చల్లని శీతాకాలపు ఉదయం, ఖొనోమాలోని ఝూమ్ పొలాలకు దారితీసే ఒక ఇరుకైన దారిలో అస్సినో తన ప్రాణస్నేహితురాలైన ఉత్సనో మేరుతో కలిసి నడుస్తున్నారు. నాగాలాండ్‌లోని కొండవాలు ప్రాంతాలలో ఝూమ్ (పోడు వ్యవసాయం) చేయటం సర్వసాధారణం. మేం అలా నడుస్తుండగా, ఆ ఇద్దరూ అకస్మాత్తుగా కిందకు వంగి, మాట్లాడుకుంటూ నవ్వుకుంటూనే ఆకుకూరలను, మొక్కల భాగాలను ఏరుకోవడం మొదలుపెట్టారు. "మేం నిజానికి ప్రాణ స్నేహితులం," అస్సినో అన్నారు. "మేం కలిసి ఉన్నప్పుడే అత్యంత సంతోషంగా ఉంటాం." అలా, ఈ చిన్ననాటి స్నేహితులు తమ సమయాన్ని సర్దుబాటు చేసుకుని, వారి ఝూమ్ పొలాలలో కలిసి పనిచేస్తారు.
42 ఏళ్ళ ఉత్సనో తన చేతిలో ఉన్న తాజాగా సేకరించిన మూలికల కట్టను చూపిస్తూ, వాటి పేర్లను తెన్యిది (Tenyidie) భాషలో: గాథ [ఫిష్ మింట్ - హోట్టానియా కార్డేటా], గజీ [హిమాలయాల చిమటికూర - కోనెజా పోలీస్టాకియా], ఖమ్హా [అడవి పెరిల్లా- పెరిల్లా ఫ్రూటెసెన్స్], గక్రా [జావా వాటర్ డ్రాప్వోర్ట్ - ఓనాన్తే జవానికా] అని చెప్పారు.
"మేం గబీతో కలిపి తినడానికి గాథను. రాజా మిరపకాయలను కలిపి పచ్చడి చేస్తాం, మిగిలిన ఆకుకూరలను గబీలో వేస్తాం. ఇంకా మిగిలినవాటిని ఆ తర్వాత వండుకోవడానికి ఇంటికి తీసుకువెళ్తాం," ఆమె వివరించారు.






