వంటగదిలో పొయ్యి రాజుకుంది. థియామంలాకు సమయం వృథా చేసేంత తీరిక లేదు. ఆమె ఉదయాన్నే తన తోట నుంచి కోసుకొచ్చిన మిపాం (కంద) ఆకులు, వెల్లుల్లి కాడలు, ఈ రోజే సేకరించిన థోటో మొక్క ఆకులు, పీతల ముద్ద, ఇంకా మరెన్నో వస్తువులను చకచకా తీసుకుంటూ హడావిడిగా పనుల్లో నిమగ్నమయ్యారు.
చంకీకి చెందిన ఈ 55 ఏళ్ళ రైతు మహిళ, మిపాంమిం అనే వంటకాన్ని సిద్ధం చేయబోతున్నారు. ఇది అతిథుల కోసం, లేదా ప్రత్యేక సందర్భాలలో వండే ఒక విశిష్టమైన ఆఉ నాగా (Ao Naga) వంటకం. "మా తెగలో సాధారణంగా వండుకునే, ఎంతో ప్రాచుర్యం పొందిన మిశ్రమ కూరగాయల వంటకమైన రోసుప్ (rosüp) కంటే ఇది పూర్తిగా భిన్నమైన వంటకం," థియామంలా లుంజారి చంకీ భాషలో వివరిస్తున్నారు. ఆమె ఈ మిపాంమింను తన వరి పొలాల్లో పండిన స్థానిక రకం బియ్యంతో వండిన అన్నంతోనూ, పక్క వంటకంగా నాటుకోడి మాంసం వేపుడుతోనూ వడ్డిస్తారు.
మిపాంమింకి దాని విశిష్టమైన రుచిని అందించే ఇతర పదార్థాలలో ఉప్పు, పచ్చిమిర్చి, టమాటాలు, మిశిగన్ (సిచువాన్ మిరియాల) ఆకులు, తేజం లెహ్సున్ (నాటు వెల్లుల్లి కాడలు), అల్లం ఆకులు, జంపంనత్సూ (పులియబెట్టిన పీతల ముద్ద) ఉన్నాయి. ఆమె కాలానుగుణంగా దొరికే తాజా కూరగాయలను కూడా ఉపయోగిస్తారు.
చంకీ గ్రామ జనాభా 2,486 (2011 జనగణన) మంది. వారిలో అధిక భాగం ఆఉ నాగా (షెడ్యూల్డ్ తెగగా జాబితా చేసివుంది) సముదాయానికి చెందినవారు. చంకీ భాష కూడా ఆఉ నాగా భాషల సముదాయానికి చెందిన ప్రమాదస్థితిలో ఉన్న భాష. దీనిని యునెస్కో ప్రమాదస్థితిలో ఉన్న భాషగా వర్గీకరించింది.
చంకీలోని ఇతర మహిళల మాదిరిగానే, థియామంలా కూడా—మిపాం, థోటో వంటి ఇతర స్థానిక వంటకాలకు అవసరమైన పదార్థాలను సేకరించడానికి వరి పొలాల, అటవీ మార్గాల, నీటి వనరుల చుట్టుపక్కల ప్రాంతాల్లోకి నడిచి వెళ్తుంటారు; ఇందుకోసం ఆమె రెండు గంటల వరకు ప్రయాణిస్తారు.
“పాత రోజుల్లో, బయటి నుండి సరుకులు తెచ్చుకోవడం అంత సులభంగా ఉండేది కాదు కాబట్టి, అడవిలో ఆహారం కోసం వెతుక్కోవటమే ముఖ్యంగా ఉండేది," అని ఆమె PARIతో చెప్పారు. ఆమె తరం మహిళలకు స్థానికంగా లభించే పదార్థాలను వంటలో ఉపయోగించడమనేది సహజంగానే తెలిసి ఉంటుంది.“మా ఝూమ్ పొలాల్లో, వరి చేలలో, ఇంటి పెరటి తోటల్లో మేం పండించుకున్నవాటినే తినేవాళ్ళం; ఈ రోజుల్లో మనం దగ్గర్లోని మార్కెట్ల నుండి కూడా సరుకులను కొంటున్నాం."
పొలానికీ అడవికీ వెళ్ళినప్పుడు మగవాళ్ళు కూడా ఇంటికి కావలసినవి తెస్తారు గానీ, ఆహార పదార్థాలను సేకరించే పనిని ప్రధానంగా మహిళలే చేస్తారు. "ఏవి తినదగినవో, ఏవి తినకూడదో అనే జ్ఞానంతో పాటు ఈ సేకరణ నైపుణ్యాలను కూడా మేం మా తల్లిదండ్రులను, లేదా అనుభవజ్ఞులైన పెద్దలను అనుసరించడం ద్వారా నేర్చుకున్నాం," దిమాపూర్ మార్కెట్ నుండి ఆమె పొరుగువారు తీసుకువచ్చిన ఆయిస్టర్ పుట్టగొడుగులను, ఎంతో విలువైన థోటోను వండటానికి సిద్ధం చేస్తూ చెప్పారామె. "మిపాం [కంద ఆకులు]తో థోటో చాలా అద్భుతంగా జత కలుస్తుంది."
పీతల ముద్ద, ఆఉ నాగా వంటకాల్లో విస్తృతంగా ఉపయోగించే ఒక ముఖ్యమైన పదార్థం. "చంకీలో తయారుచేసే పీతల ముద్దను అత్యుత్తమమైనదిగా పరిగణిస్తారు, అందుకే దానికి గిరాకీ చాలా ఎక్కువ," థియామంలా గర్వంగా చెప్పారు.
ఆమె జాడీ మూత తెరవగానే, గదంతా తియ్యని చేపలు పులిసిన వాసనతో నిండిపోయింది. జంపంనత్సూ అనేది ఆఉ నాగా వారి ప్రత్యేక వంటకం. దీనిని వరి పొలాల పక్కన లోతు తక్కువగా ఉండే నీటి మడుగులలో సాధారణంగా దొరికే పొలం పీతలతో తయారుచేస్తారు. కాల్చి, ఒలిచిన ఈ పీతలను దంచి, నల్ల నువ్వులతో బాగా కలిపి, ఆ తర్వాత అరటి ఆకులలో చుట్టి పొయ్యి దగ్గరగా ఉంచి కొన్ని రోజుల పాటు పులియబెడతారు. ఆఉ నాగా వంటకాలలో రకరకాల చట్నీలు, కూరలు, కలగలుపు కూరలకు ఇది రుచినిచ్చే ఒక ముఖ్యమైన పదార్థం.
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన థియామంలా, ఒక నిష్ణాతురాలైన కుమ్మరి, పూర్తి స్థాయి రైతు కూడా. చదవండి: చంకీ మహిళా కుమ్మరులు
ఈ ఏడాది (2025) వాతావరణం అస్థిరంగా ఉందని, అనేకసార్లు కొండచరియలు విరిగిపడి వరి పొలాలను నాశనం చేశాయని ఆమె చెబుతున్నారు. “ఒక కొండచరియ విరిగిపడటంతో నర్సరీతో సహా నా పొలంలోని కొన్ని భాగాలు నాశనమయ్యాయి, అందుకే నా ఝూమ్ పొలాల్లో ఎక్కువగా అల్లం పండిస్తున్నాను, అమ్మితే దానికి ఎక్కువ విలువ ఉంటుంది.”
ఆమె వంట కోసం తానే తయారుచేసుకున్న చంకీ కుండను ఉపయోగిస్తున్నారు. ఈ వంటకాన్ని ఇలాంటి స్థానికంగా తయారైన కుండలలో వండితేనే రుచిగా ఉంటుందని ఆమె అంటారు. చిటపటలాడే శబ్దం చేస్తోన్న ఘాటైన ఆవనూనె, పులియబెట్టిన పీతల పండు సువాసనతో కలిసి వంటగదిని నింపేస్తున్నాయి. తినడం మొదలుపెట్టడానికి మేం ఆగలేకపోతున్నాం.


