చంగ్కీ మహిళా కుమ్మరులు తయారుచేసే మట్టి పాత్రలు ఒకప్పుడు స్థానికంగా జరిగిన యుద్ధాలలో ఒక వ్యూహాత్మక పాత్రను పోషించాయి. ఆ ప్రాంతంలో వంట చేసుకోవటానికి ఈ కుండలు తప్పనిసరి అవసరం కావటంతో, ఎవరూ తమకు తిండి పెట్టే కుండకు చెరుపు చేసి, ప్రమాదాన్ని కొనితెచ్చుకోవాలని అనుకోరు కదా! మంటలు, ఇతర విపత్తులు ఒక గ్రామాన్ని తగలబెట్టి నేలమట్టం చేసినప్పుడు, చంగ్కీ నుండి కుండలలో ధాన్యం ఆహార సహాయంగా వెళ్ళేది. చంగ్కీ కుండల మన్నిక, ప్రముఖత అటువంటిదని ఆవ్ తెగ మహిళలు నాతో గర్వంగా చెప్పారు.
శతాబ్దాల తర్వాత కూడా ఈ కుండలను సంప్రదాయ పద్ధతిలో చేతితోనే తయారుచేస్తున్నారు. "మేం కుమ్మరి సారెను గానీ, ఇతర యంత్రాలను గానీ ఉపయోగించం. మొదటి నుంచి చివరి వరకూ దీని తయారీ మొత్తం చేతితోనే," అంటారు తియామొంగ్లా లొంగ్చారీ. ఈ కుండలు చేసే మట్టిని మొకొక్చంగ్, ఆ చుట్టుపక్కల ఉండే పొలాలు, కొండలు, అడవి, నదీ తీరాల నుండి మాత్రమే సేకరిస్తారు, ఎందుకంటే ఎత్తులో ఉండే ఈ ప్రాంతం నుండి వచ్చే బంకమట్టి మిశ్రమం మాత్రమే ఈ కుండల తయారీకి అనుకూలంగా ఉంటుంది.
ఈ కుండల తయారీ సంప్రదాయం, "మా అమ్మమ్మలు, ముత్తవ్వలు తయారుచేసిన పద్ధతిలోనే కొనసాగుతూవస్తోంది," 55 ఏళ్ళ తియామొంగ్లా అన్నారు. నాగాలాండ్‌లోని ఈ గ్రామంలో మిగిలి ఉన్న చివరి కుమ్మరులలో ఒకరైన ఆమె, వృద్ధురాలైన తన తల్లితో కలిసి నివసించే తమ ఇంటిలోనే వాటిని తయారుచేస్తారు. గతంలో, ప్రతి ఇంటిలోనూ మహిళలు తమ ఇళ్ళలో వాడుకోవటానికి, అమ్మకానికి ఈ కుండలను తయారుచేసేవారు. కానీ ప్రస్తుతం నాగాలాండ్‌లోని ఈ చంగ్కీ గ్రామంలో, ఇప్పటికీ తమ ఇంట్లో కుండలను తయారుచేసే మహిళలు 15 మంది మాత్రమే ఉన్నారు.
ఈ కథనాన్ని చిత్రీకరించే సమయంలో PARI కలిసిన మహిళలు, తామంతా ఒకచోట కలవడం, నాగాలాండ్‌లోని తమ తెగ మహిళలకు కేంద్రంగా ఉన్న ఈ పురాతన సంప్రదాయాన్ని అభ్యసించడం, ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేయడం వంటివాటిని తాము చాలా ఆనందిస్తుంటామని చెప్పారు. వారు సంపాదించే ఈ అదనపు ఆదాయం వారి పిల్లల చదువుల కోసం, మరిన్ని ఖర్చులు చెల్లించేందుకు ఉపయోగపడుతుంది.








