'ఆహ్...!' అసంతృప్తి, నిరాశతో కూడిన ఒక ఆశ్చర్యం తర్వాత వృత్తాకారంలో కూర్చొని ఉన్న ఆ ఐదుగురి నవ్వులు, వీధిలో నెలకొనివున్న నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టాయి. మమ్మల్ని మేమే వెర్రివాళ్ళను చేసుకుంటున్నామని స్పష్టంగా అర్థమైంది. విసిరిన నాలుగు చింత పిక్కలు నేలపై నాలుగు వైపులా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాటిని లూడో ఆటలో పాచికలలాగా విసిరేయకూడదు. వెంటనే హాలమ్మ రంగంలోకి దిగి సరిగ్గా ఎలా వెయ్యాలో చూపించారు. ఆమె గింజలను దగ్గరకు తీసుకొని, తన మణికట్టును వేగంగా, సున్నితంగా తిప్పుతూ, జాగ్రత్తగా గమనించమని మాతో చెప్పారు. ఆ ఒడుపు సుమారుగా ఒక లెగ్ స్పిన్ బౌలర్ గూగ్లీ వేసినట్టుగా ఉంది.
ఈసారి చింతపిక్కలు ఊహించిన విధంగానే సౌష్ఠవం లేకుండా పడ్డాయి - తమ దంతపు రంగు భాగాన్ని పైకి చూపిస్తూ. దంతపు రంగు భాగం కనిపించే పిక్కల సంఖ్యను బట్టి, హాలమ్మ తన కాయను (ముదురాకుపచ్చ రంగు విరిగిన గాజు ముక్క) కదిలిస్తారు. 'ఏక్ గిర్తా హై తో ఏక్, దో గిర్తా హై తో దో, తీన్ గిర్తా హై తో తీన్, చార్ గిర్తా హై తో చార్ [ఒక చింతపిక్క తెల్లనివైపు పడితే ఒక గడి, రెండు పడితే, రెండు గడులు... ఇలా ముందుకు జరపాల్సి ఉంటుంది],' అని ఆమె వివరించారు. కన్నడ మాట్లాడటం పెద్దగా తెలియని ఇద్దరు బయటి వ్యక్తులకు (మాకు) ఆట అర్థమయ్యేలా చేసే మరో ప్రయత్నంలో, ఆమె తన ముక్కల ముక్కల హిందీలో మాట్లాడటం ప్రారంభించారు. నేలపై గీసిన చతురస్రాకారపు గడులలో 'మా' కాయను ముందుకు జరిపి, మళ్ళీ నేర్పుగా చింతపిక్కలను విసిరారు. ఇప్పుడు ఆడటం ఆమె వంతు.





