హరియాణా ప్రభుత్వ యాజమాన్యంలోని రోడ్డు రవాణా శాఖలో గుమాస్తాగా పదవీ విరమణ చేసిన తరువాత, భగత్ రామ్ యాదవ్ విశ్రాంత జీవితాన్ని ఎంచుకొని ఉండవచ్చు. “కానీ నాలో ఒక జునూన్ (అమితోత్సాహం) కలిగింది,” ఆదర్శవంతుడూ, ఎన్నో పతకాలు సాధించిన ఉద్యోగీ అయిన 73 ఏళ్ళ ఈ వృద్ధుడు అన్నారు.
ఈ అమితోత్సాహం ఆయనకు తన చిన్నతనంలో తండ్రి గుగ్గన్ రామ్ యాదవ్ నేర్పించిన చార్‌పాయిలు (నులక మంచాలు), పిడ్డాల (నులక అల్లిన ఎత్తుపీటలు) తయారీ కళను కొనసాగించేలా చేసింది.
అతని ఈ అభ్యాసం అర్ధ శతాబ్దం క్రితం ప్రారంభమైంది. అప్పటికి పదిహేనేళ్ళ వయసున్న భగత్, తన ముగ్గురు సోదరులతో కలిసి కూర్చుని, తమ ఇంటి వాడకం కోసం తండ్రి చాలా నైపుణ్యంతో చార్‌పాయిలు తయారుచేయడాన్ని చూస్తుండేవారు. అతని తండ్రి 125 ఎకరాల భూస్వామి. కానీ ఆయన గోధుమ పంట కోతల తరువాత వచ్చే వేసవికాలాన్నంతా ఈ దృఢమైన నులక మంచాల తయారీకి అంకితం చేసేవారు. చేతితయారీ సన్ (కట్టె) జనపనార (క్రోటలేరియా జన్సియా), సూత్ (పత్తి దారం), సాల్ (గుగ్గిలం చెట్టు/షోరియా రోబస్టా) చెట్టు చెక్క, శీశమ్ (ఇరిడి- ఉత్తరభారత రోజ్‌వుడ్) చెట్ల కలపను వీటి కోసం ఉపయోగించేవారు. జనాలు, పశువులు రోజులో ఎక్కువ భాగం గడిపే బహిరంగ ఆవరణ అయిన వారి బైఠక్ ఆయన పని ప్రదేశంగా ఉండేది.
భగత్ రామ్ తన తండ్రిని ఏక్ నంబర్ కా ఆరీ - గొప్ప నైపుణ్యకళాకారుడు- గానూ, తన పనిముట్ల విషయంలో చాలా శ్రద్ధ తీసుకునేవారిగానూ గుర్తుచేసుకున్నారు. “చార్పాయిల తయారీ నైపుణ్యాన్ని నేర్చుకోమని మా నాన్న మమ్మల్ని ప్రోత్సహించేవారు. 'రండి, ఇది నేర్చుకోండి; ఇది మీకు భవిష్యత్తులో సహాయం చేస్తుంది ' అని ఆయన అనేవారు,” భగత్ రామ్ గుర్తు చేసుకున్నారు.
కానీ దాన్నొక విసుగుపుట్టించే పనిగా భావించిన ఆ అబ్బాయిలంతా ఆ పనిని తప్పించుకుని ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ వంటి ఆటలు ఆడటానికి పరుగులుతీసేవారు. “మా నాన్న మమ్మల్ని తిట్టేవారు, దెబ్బలు కూడా కొట్టేవారు. కానీ మేం పట్టించుకునేవాళ్ళంకాదు,” అన్నారతను. “మేం ఉద్యోగం సంపాదించుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపించాం. మా నాన్నకు భయపడి మాత్రమే ఆ కళను నేర్చుకున్నాం. ఎక్కడయినా తెలియక ఆగిపోయినప్పుడు నులక తాడుతో డిజైన్‌ను ఎలా రూపొందించాలో తరచుగా ఆయన్ని అడిగేవాళ్ళం.”
























