అదొక చిన్న టీ దుకాణం. నిర్మానుష్యమైన ప్రదేశంలో మట్టి గోడలతో కట్టిన ఒక చిన్న దుకాణం. దుకాణం ముందు తెల్ల కాగితం మీద చేతి రాతతో ఉన్న ఒక బోర్డు ఉంది:

అక్షర ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్

లైబ్రరీ

ఇరుప్పుకళ్ళకుడి

ఈదమలకుడి

గ్రంథాలయమా? ఇదుక్కి జిల్లాలోని ఈ అడవులు, నిర్జన ప్రాంతంలోనా? దేశంలోనే అత్యధిక అక్షరాస్యత కల కేరళ రాష్ట్రంలో కూడా ఇది తక్కువ అక్షరాస్యత ఉన్న ప్రదేశం.  రాష్ట్రంలో మొట్టమొదటి గిరిజన గ్రామమండలి కల ఈ పల్లెటూరులో కేవలం 25 కుటుంబాలు ఉన్నాయి. ఈ ఊరివారు కాక ఇంకెవరన్నా ఈ లైబ్రరీలో పుస్తకం తీసుకోవాలంటే దట్టమైన అడవిలోనుంచి చాలా దూరం నడిచి రావాలి. ఎవరన్నా వస్తారా అసలు?

“వస్తారు మరి,” అంటాడు టీ వ్యాపారి, స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకుడు, లైబ్రేరియన్ అయిన 73 సంవత్సరాల పీ వీ చిన్నతంబి.  “వస్తారు.” ఈదమలకుడి కొండ కూడలిలో ఉన్న ఆయన చిన్న దుకాణంలో టీ, ‘మిక్శ్చర్’,  బిస్కెట్లు, అగ్గిపెట్టెలు, ఇతర సరుకులు అమ్ముతాడు. కేరళలో అతి సుదూర  ప్రాంతంలో ఉన్న ఈ పంచాయత్ కేవలం ముతవాన్ గిరిజనులు మాత్రమే నివసించే ప్రాంతం. అక్కడకి చేరడం అంటే మున్నార్ సమీపంలోని పెట్టిముడి నుంచి 18కిలోమీటర్ల నడక. చిన్నతంబి టీ షాపు-లైబ్రరీ చేరడం అంటే  ఇంకా ఎక్కువ నడక. చిన్నతంబి ఇల్లు మాకు తటస్థపడే సమయంలో ఆయన భార్య లేదు, పనికి వెళ్ళింది. వాళ్ళు కూడా ముతవాన్లే.

“చిన్నతంబి. నేను టీ తాగాను. నువ్వు అమ్మే సరుకులు అనిపిస్తున్నాయి. నీ లైబ్రరీ ఎక్కడయ్యా బాబూ?” నేను కుతూహలంగా అడిగాను. అతను బదులుగా ఒక మంచి చిరునవ్వు నవ్వాడు. మమ్మల్ని దుకాణంలోకి తీసుకుని వెళ్లాడు. ఒక చీకటి మూల నుంచి రెండు జనపనార బస్తాలు తీశాడు. పాతిక కిలోల బియ్యం నింపగలిగేలాంటి సంచులు. వాటిల్లో మొత్తం 160  పుస్తకాలు ఉన్నాయి. రోజూ లైబ్రరీ పని చేసే వేళల్లో అమర్చినట్లు ఆ పుస్తకాలను అతను జాగ్రత్తగా చాప మీద పరచాడు.

మా ఎనిమిది మంది ప్రయాణీకుల బృందం ఆ పుస్తకాలను సంభ్రమంతో పరికించింది. ఒక్కో పుస్తకం ఒక సాహిత్య నిధి. ఒక కళాఖండం. చివరికి రాజకీయ రచనలు కూడా. ఒక సస్పెన్స్ పుస్తకం కానీ, జనాదరణ పొందినవి కానీ, ఆడపిల్లలు ఇష్టపడే ప్రేమ సాహిత్యం కానీ లేవు. తమిళ మహా కావ్యం ‘చిలప్పధికారం’ మలయాళం అనువాదం ఉంది. వైగోం ముహమ్మద్ బషీర్, ఎం టీ వాసుదేవన్ నాయర్, కమలా దాస్ రచనలు ఉన్నాయి. ఎం ముకుందన్, లలితాంబిక అంతర్జనం మొదలైన వారి రచనలు ఉన్నాయి. మహాత్మా గాంధీ రచనలతో పాటు, తోప్పిల్ బసి ‘యు మేడ్ మీ ఏ కమ్యునిస్ట్’ వంటి విప్లవ సాహిత్యం కూడా ఉంది.

“కానీ చిన్నతంబీ, ఇక్కడ జనాలు ఇలాంటి పుస్తకాలు నిజంగా చదువుతారా?” బయటకి వచ్చి కూర్చున్నాక మేము అడిగాం. చాలా ఆదివాసీ తెగల మాదిరిగా ముతవాన్లు కూడా  చాలా పేదరికం, లేమిలో ఉండి, ఇతర భారతీయుల కంటే తరచుగా చదువు మధ్యలో మానేస్తుంటారు.

మా ప్రశ్నకి బదులుగా అతను తన లైబ్రరీ రిజిస్టర్ బయటకు తీశాడు. జనాలు తీసుకుని వెళ్లి తిరిగి ఇచ్చిన పుస్తకాల నమోదు రిజిస్టర్ అది. ఆ కటిక పల్లెటూరులో 25 కుటుంబాలే ఉండచ్చుగాక, కానీ 2013లో 37 పుస్తకాలు పట్టుకెళ్లారు పాఠకులు.  అంటే మొత్తం స్టాక్ అయిన 160లో దాదాపు నాలుగో వంతు అన్నమాట – మంచి నిష్పత్తియే అని చెప్పచ్చు. లైబ్రరీలో సభ్యత్వ రుసుము పాతిక రూపాయలు ఒక సారి చెల్లించాలి. ఆ తర్వాత నెలకి రెండు రూపాయలు కట్టాలి. ఇంక పుస్తకాలకు వేరే చార్జి లేదు. టీ కూడా ఉచితమే. పాలు లేకుండా చక్కర వేసిన టీ డికాక్షన్. “జనాలు పాపం కొండల నుంచి అలసిపోయి వస్తారు.” బిస్కెట్లు, మిక్శ్చర్, మిగిలిన వస్తువులకి మాత్రమే డబ్బు కట్టాలి. కొన్ని సార్లు సందర్శకులకి సాదాసీదా భోజనం కూడా ఉచితంగా లభించవచ్చు.

పుస్తకాలు తీసుకువెళ్ళిన తేదీ, తిరిగి ఇచ్చిన తేదీ, తీసుకున్నవారి పేరు అన్నీ చక్కగా రిజిస్టర్ పుస్తకంలో రాసి ఉన్నాయి. ఇళంగో వ్రాసిన చిలప్పధికారం పుస్తకాన్ని అయితే చాలా మంది తీసుకుని వెళ్లారు. ఈ ఏడాది ఇప్పటికే పాఠకులు 37 పుస్తకాలు తీసుకుని వెళ్ళినట్లు రాసి ఉంది. అణచివేతకు గురైన ఒక ఆదివాసీ సమాజం, అడవుల్లో ఇక్కడ నాణ్యమైన సాహిత్యాన్ని పంచుకుని, చదివి, జీర్ణం చేసుకుంటోంది. ఈ ఎరుక మమ్మల్ని ఆలోచనలో పడేలా చేసింది. నగరాల్లో మా సొంత పుస్తక పఠనం అలవాట్లు గుర్తొచ్చి మాలో కొంత మంది కొంచెం సిగ్గు కూడా పడ్డాం అనుకుంటాను.

మా బృందంలో వ్రాతలు, రచనల ద్వారా పొట్ట పోషించుకునే వాళ్ళమే ఎక్కువ. మేము గొప్ప రచయితలమన్న గర్వాన్ని పటాపంచలు చేసే పుస్తకం ఒకటి మాకు అక్కడ దొరికింది.  కేరళ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో మాతో ప్రయాణిస్తున్న ముగ్గురు జర్నలిజం విద్యార్థుల్లో ఒకరైన విష్ణు ఎస్ కి ఒక ‘భిన్నమైన’ పుస్తకం దొరికింది.  గీతలున్న నోట్ బుక్, అందులో చేతివ్రాతతో నిండిన  అనేక పేజీలు. ఆ పుస్తకానికి ఇంకా శీర్షిక లేదు కానీ, అది చిన్నతంబి ఆత్మకథే. “చాలా ఎక్కువ రాయలేకపోయాను, కానీ ఈ మధ్య ప్రయత్నిస్తున్నాను” – చిన్నతంబి ఏదో క్షమాపణ చెప్తున్న ధోరణిలో చెప్పాడు. “ఏం రాశావో మాకు కొంచెం చదివి వినిపించవా,   చిన్నతంబి.” సుదీర్ఘమైన రచనా కాదు, అసంపూర్తిగా కూడా ఉంది. అయినా అది ఎంతో కుదురుగా చెప్పిన కథ. తనలో తొలి సామాజిక, రాజకీయ స్పందన గురించి ఉంది ఆ కథనంలో. రచయితకు తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు మహాత్మాగాంధి హత్య, ఆ సంఘటన తనపై చూపిన ప్రభావంతో ఆ ఆత్మకథ ప్రారంభమయింది.

ఈదమలకుడికి తిరిగి వచ్చి లైబ్రరీ ఏర్పాటు చేయాలన్నది తనకు మురళి మాష్ (టీచర్ లేదా మాస్టర్) ఇచ్చిన స్ఫూర్తి అని చిన్నతంబి చెప్పాడు. ఈ ప్రాంతాల్లో మురళి మాష్ పేరెన్నికగన్న టీచర్. ఆయన కూడా ఆదివాసియే కానీ వేరే తెగకు చెందినవారు. ఆ తెగవారు ఈ పంచాయత్ వెలుపల మంకులంలో నివసిస్తారు. అయితే ఆయన ముతవాన్లతో కలిసి పని చేయడానికే తన జీవితాన్ని అంకితం చేశారు. “మాష్ నన్ను ఈ దిశాలోముందుకు నడిపించారు,” అంటాడు చిన్నతంబి వినయంగా. తానేది ప్రత్యేకమైనది చేయడం లేదు అనేది చిన్నతంబి భావన. కానీ కనిపిస్తూనే ఉందిగా ఆయన ప్రత్యేకత ఏమిటో.

ఈ చిన్న పల్లెటూరుతో సహా ఇరవై ఎనిమిది పల్లెటూళ్ళు ఉన్న ఈదమలకుడిలో జనాభా 2,500 కంటే తక్కువ. అసలు అది ప్రపంచం మొత్తం మీదా ఉన్న ముతవాన్ జనాభా అని చెప్పవచ్చు ఇరుప్పుకళ్ళకుడిలో మహా అయితే వంద మంది ఉంటారు. వంద చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉండే ఈదమలకుడి, సుమారు పదిహేను వందల ఓట్లతో, రాష్ట్రంలోనే అతి చిన్న పంచాయత్ కూడా.

ఇంతకీ ఆ ఊరు నుంచి బయటకు తమిళనాడులోని వాల్పరైకి వెళ్లేందుకు మేము ఎంచుకున్న దగ్గర మార్గం వదిలేయవలసి వచ్చింది. ఏనుగులు ఆ మార్గాన్ని స్వాధీనం చేసుకున్నాయిట.

అయినప్పటికీ, ఇవేమి పట్టనట్టుగా, ప్రపంచంలోనే అత్యంత నిర్మానుష్యమైన, ఏకాకి లైబ్రరీల్లో ఒకదానిలో చిన్నతంబి కూర్చుని ఉంటాడు. ఆ లైబ్రరీని సజీవంగా ఉంచుతూ, పేదరికంలో మగ్గిపోతుండే తన పాఠకుల సాహితీ దాహాన్ని తీరుస్తుంటాడు. పైపెచ్చు వారికి టీ, మిక్స్చర్, అగ్గిపెట్టెలు సరఫరా చేస్తుంటాడు.

మామూలుగా సందడిగా కబుర్లు చెప్పుకుంటూ ఉండే మా బృందం, చిన్నతంబితో పరిచయంతో సంభ్రమం చెంది, చలించిపోయి మౌనంలో మునిగిపోయి ప్రయాణం సాగించింది.  సుదీర్ఘమైన ఆ నడక ప్రయాణంలో ముందున్న ప్రమాదకరమైన దారి మీద మా కళ్ళు. అసాధారణమైన లైబ్రరియన్ పీవీ చిన్నతంబి మీద మా మనసు. అలా సాగింది మా ప్రయాణం.

వ్యాసం గతంలో : http://psainath.org/the-wilderness-library/ లో ప్రచురితమయింది .

پی سائی ناتھ ’پیپلز آرکائیو آف رورل انڈیا‘ کے بانی ایڈیٹر ہیں۔ وہ کئی دہائیوں تک دیہی ہندوستان کے رپورٹر رہے اور Everybody Loves a Good Drought اور The Last Heroes: Foot Soldiers of Indian Freedom کے مصنف ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز پی۔ سائی ناتھ