“ యే బతానా ముష్కిల్ హోగా కి కౌన్ హిందూ హై ఔర్ కౌన్ ముసల్మాన్ [హిందువు ఎవరో ముస్లిమ్ ఎవరో గుర్తించటం కష్టం].”
ఇక్కడ మొహమ్మద్ షబ్బీర్ ఖురేషీ (68) తన గురించి, తన పొరుగున ఉండే అజయ్ సైనీ (52) గురించి మాట్లాడుతున్నారు. ఈ ఇద్దరు అయోధ్యవాసులు రామ్‌కోట్‌లోని దురాహి కుఆఁ ప్రాంతంలో గత 40 సంవత్సరాలుగా ఇరుగుపొరుగున నివసిస్తోన్న స్నేహితులు.
ఎంతో సన్నిహితంగా ఉండే ఈ రెండు కుటుంబాలు, తమ రోజువారీ ఆందోళనలను పరస్పరం పంచుకుంటాయి, ఒకదానిపై మరొకటి ఆధారపడతాయి. “ఒకసారి నేను పనికోసం బయటకు వెళ్ళినప్పుడు, నా కుమార్తెకు ఒంట్లో బాగోలేదని మా ఇంటి నుండి నాకు కాల్ వచ్చింది. నేను త్వరత్వరగా ఇంటికి తిరిగి వచ్చే సమయానికే, ఖురేషీ కుటుంబం మా అమ్మాయిని ఆసుపత్రికి తీసుకువెళ్ళి, మందులు కూడా కొనిచ్చిందని నా భార్య చెప్పింది," అజయ్ సైనీ గుర్తుచేసుకున్నారు.
ఈ ఇద్దరూ కూర్చొని ఉన్న ఆ పెరడంతా బర్రెలు, మేకలు, ఒక అర డజను కోళ్ళతో నిండిపోయివుంది. పరుగులు పెడుతూ, ఆడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ఉన్న ఈ రెండు కుటుంబాలకు చెందిన పిల్లలతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంది.
అది 2024 జనవరి నెల. అట్టహాసంగా జరిగే ప్రారంభోత్సవం కోసం అయోధ్యలోని రామ మందిరం సిద్ధమవుతూ ఉంది. ఆ ఆలయం ఆవరణ నుంచి ఈ ఇద్దరి ఇళ్ళను విడదీస్తూ ఒక కొత్త, భారీ గా ఉన్న రెండంచెల ఇనుప కంచె వుంది.
ఎనభైల ప్రాంతంలో సైనీ యుక్తవయస్సులో ఉండగా అతని కుటుంబం ఖురేషీ ఇంటి పక్కకు మారింది. అప్పటి బాబ్రీ మసీదుగా ఉన్న ఆ ప్రాంగణంలో ఉన్న రాముడి విగ్రహాన్ని సందర్శించేందుకు వచ్చే భక్తులకు సైనీ, రూపాయికి ఒక పూలమాల అమ్మేవాడు.
నిజానికి ఖురేషీలు మాంసం అమ్మేవారు. అయోధ్య పట్టణ శివార్లలో ఆ కుటుంబానికి ఒక మాంసం కొట్టు ఉండేది. 1922 తర్వాత జరిగిన అల్లర్లలో వారి ఇల్లు ధ్వంసం కావటంతో ఆ కుటుంబం వెల్డింగ్ వ్యాపారాన్ని చేపట్టింది.
"ఈ పిల్లలను చూడండి... వాళ్ళు హిందువులు... మేం ముస్లిములం. వాళ్ళంతా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు," అక్కడ ఆడుకుంటోన్న అన్ని వయసులలోని ఇరుగుపొరుగు పిల్లలను చూపిస్తూ అంటారు ఖురేషీ. " అబ్ ఆప్ హమారే రెహెన్ సహెన్ సె పతా కీజియే కి యహా కౌన్ క్యా హై. హమ్ ఏక్ దూసరే కే సాత్ భేద్‌భావ్ నహీ కర్తే [మా రోజువారీ జీవనాన్ని బట్టి ఎవరు ఏ మతానికి చెందినవారనేది మీరు చెప్పలేరు. మా మధ్య ఆ తారతమ్యాలు లేవు]," అంటారాయన. ఇందుకు అంగీకరిస్తూ అజయ్ సైనీ భార్య గుడియా సైనీ, "వాళ్ళు వేర్వేరు మతాలకు చెందినవారైనా మాకు అటువంటి తేడాలేమీ ఉండవు," అన్నారు.
ఒక దశాబ్దం క్రితం ఖురేషీ ఏకైక కుమార్తె నూర్జహాన్ వివాహం జరిగినప్పుడు, “అతిథులను స్వాగతించడం, వారికి సేవలు అందించడం వంటి పనులు చేస్తూ మేం వేడుకలలో భాగమయ్యాం. కుటుంబంలోని వ్యక్తికి ఎంత గౌరవం లభిస్తుందో అంతే గౌరవం మాకూ లభించింది. మేం ఒకరికొకరం ఉన్నామని మాకు తెలుసు,” అంటారు అజయ్ సైనీ.
త్వరలోనే ఈ సంభాషణ వారు కూర్చున్న చోట నుండి కనిపిస్తోన్న రామ మందిరానికి మారింది. ఇప్పటికీ నిర్మాణం పూర్తికాని ఆ గంభీరమైన కట్టడం నిర్మాణం పైపైకి ఆకాశంలోకి పెరిగిపోతోంది. దాని చుట్టూ భారీ క్రేన్‌లు ఉన్నాయి. వీటన్నిటినీ శీతాకాలపు పొగమంచు కప్పేసి ఉంది.
ఖురేషీ ఇటుక, సున్నంతో కట్టిన తన నిరాడంబరమైన ఇంటి నుండి కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉన్న కొత్త ఆలయం గంభీరమైన నిర్మాణం వైపు చూపించారు. “ వో మస్జిద్ థీ, వహాఁ జబ్ మగ్‌రిబ్ కే వక్త్ అజాన్ హోతీ థీ, తో మేరే ఘర్ మే చిరాగ్ జల్తా థా ” [అక్కడ ఒక మసీదు ఉండేది, అజాన్ వినిపించినపుడు మేం మా ఇంట్లో సంధ్యా దీపం వెలిగించేవాళ్ళం],” అంటూ మసీదు నేలమట్టం కావడానికి ముందు కాలం నాటి జ్ఞాపకాలను ఆయన నెమరువేసుకున్నారు.
కానీ 2024 జనవరి ప్రారంభంలో, ఖురేషీని ఆందోళనకు గురిచేస్తున్నది నిశ్శబ్దమైపోయిన అజాన్ మాత్రమే కాదు.
“రామ మందిర ప్రాంగణాన్ని ఆనుకుని ఉన్న ఈ ఇళ్ళన్నింటినీ ఇక్కడి నుండి తొలగించే ఆలోచనలు ఉన్నట్టు మాకు సమాచారం అందింది. ఏప్రిల్-మే [2023] నెలల్లో, భూ ఆదాయ విభాగానికి చెందిన జిల్లా అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇళ్ళ కొలతలను తీసుకున్నారు,” అని సైనీ ఈ విలేఖరితో చెప్పారు. సైనీ, ఖురేషీల ఇళ్ళు ఆలయ ప్రాంగణానికి, రెండంచెల కంచెకు ఆనుకుని ఉన్నాయి.
గుడియా ఇలా జతచేశారు, “ఇంత పెద్ద ఆలయం మా ఇంటి దగ్గరకే రావడం, ఈ జరుగుతోన్న అభివృద్ధి అంతా మాకు సంతోషంగానే ఉంది. కానీ ఈ విషయాలు [తొలగింపు] మాకు ఏ విధంగానూ సహాయపడవు," అని ఆమె అన్నారు. " అయోధ్యా కా కాయాపలట్ హో రహా హై, పర్ హమ్ హీ లోగోఁ కో పలట్ కే [మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేసి వాళ్ళు అయోధ్యను మార్చేస్తున్నారు].”
అక్కడికి కొద్ది దూరంలో, జ్ఞానమతి యాదవ్ అప్పటికే తన ఇంటిని కోల్పోయారు. వారి కుటుంబం ఇప్పుడు ఆవు పేడ, ఎండుగడ్డితో తాత్కాలికంగా నిర్మిచిన ఒక పూరిగుడిసెలో నివాసముంటోంది. "రాముడు తన ఆలయాన్ని పొందాలంటే మేం మా ఇంటిని వదులుకోవలసి వస్తుందని మేమెన్నడూ ఊహించలేదు," అని భర్తను కోల్పోయిన జ్ఞానమతి అన్నారు. ఈ కొత్త పరిసరాలలో తన కుటుంబాన్ని కలిపి ఉంచడానికి ఆమె ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. ఈ యాదవులు పాలు అమ్ముకుని తమ జీవనాన్ని సాగిస్తున్నారు.
ఆరు గదులతో కూడిన ఆమె పక్కా ఇల్లు అహిరానా మొహల్లాలోని ఆలయ ముఖద్వారానికి ఆనుకొని ఉండేది, కానీ డిసెంబర్ 2023లో ఆ ఇంటిని కూల్చివేశారు. “వాళ్ళలా బుల్‌డోజర్‌ను తీసుకొచ్చేసి, ఇలా మా ఇంటిని కూల్చేశారు. మేం వారికి ఇంటి పత్రాలు, ఇంటి పన్ను, విద్యుత్ బిల్లులను చూపించడానికి ప్రయత్నించినప్పుడు, ఆ అధికారులు వాటివల్ల ఏం ప్రయోజనం లేదని చెప్పారు,” అని ఆమె పెద్ద కుమారుడు రాజన్ అన్నాడు. నలుగురు పిల్లలు, వృద్ధుడైన మామగారు, ఆరు పశువులతో కూడిన ఆ కుటుంబం రాత్రంతా తలపై కప్పు లేక ఆ చలిలో వణికిపోతూ గడిపింది. "ఏదైనా తీసుకోవడానికి కూడా మమ్మల్ని అనుమతించలేదు," అని ఆయన చెప్పాడు. టార్పాలిన్ టెంట్ ఏర్పాటు చేయడానికి ముందు ఆ కుటుంబం అప్పటికే రెండుసార్లు తరలిపోవాల్సివచ్చింది.
"ఇది నా భర్త కుటుంబానికి చెందిన ఇల్లు. సుమారు ఐదు దశాబ్దాలకు పూర్వమే ఆయన, ఆయన తోబుట్టువులు ఈ ఇంట్లో పుట్టారు. మేమే ఈ ఇంటి సొంతదారులమని నిరూపించే పత్రాలు ఉన్నప్పటికీ, అధికారులు ఈ భూమిని నజుల్ భూమి (ప్రభుత్వ భూమి) అని చెప్తూ మాకు ఎటువంటి పరిహారం ఇవ్వలేదు," చెప్పారు జ్ఞానమతి.
తగిన పరిహారం అందజేస్తే అయోధ్య నగర పరిధిలో మరో భూమిని పొందగలిగినా, అది సంతోషకరమైన పని మాత్రం కాదని ఖురేషీ, ఆయన కుమారులు చెప్పారు. “ఇక్కడ మేం అందరికీ తెలుసు; మా అందరికీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మేం ఇక్కడి నుండి ఖాళీచేసి [ముస్లింల ఆధిపత్యం ఉన్న] ఫైజాబాద్‌కు వెళితే," షబ్బీర్ కుమారులలో ఒకరైన జమాల్ ఖురేషీ ఇలా అంటారు, “అప్పుడు మేం ఇతర సామాన్య ప్రజలలాగే ఉంటాం. మేం అయోధ్యవాసి [అయోధ్యావాసులు] కాము."
“మా విశ్వాసం ఈ భూమితో ముడిపడి ఉంది. మమ్మల్ని దాదాపు 15 కిలోమీటర్ల దూరం పంపేస్తే, మీరు మా విశ్వాసాన్నీ వ్యాపారాన్నీ కూడా తీసేసుకున్నట్టే," అంటూ అజయ్ సైనీ తన భావాలను పంచుకున్నారు.
సైనీ తన ఇంటిని వదిలి దూరంగా వెళ్ళేందుకు ఇష్టపడకపోవడానికి కారణం కూడా అతని పనితో ముడిపడి ఉంది. “నేను నయా ఘాట్ దగ్గర ఉన్న నాగేశ్వరనాథ్ ఆలయంలో పువ్వులు అమ్మడానికి ఇక్కడి నుండి ప్రతిరోజూ 20 నిమిషాల పాటు సైకిల్‌పై ప్రయాణిస్తాను. పర్యాటకుల రద్దీపై ఆధారపడి రోజుకు 50 నుండి 500 రూపాయల వరకు సంపాదిస్తున్నాను. కుటుంబాన్ని నడపడానికి ఇదే నాకున్న ఏకైక ఆధారం. ఎక్కడికైనా మారడం అంటే ప్రయాణానికి ఎక్కువ సమయం పట్టడంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి," అని ఆయన చెప్పారు.
“ఇంత అద్భుతమైన ఆలయం మా పెరట్లోనే ఉన్నందుకు మేం గర్విస్తున్నాం. విశ్వాసం ఆధారంగా దీన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆమోదించింది. అందుకే దీన్ని వ్యతిరేకించేందుకు ఎలాంటి కారణాలూ లేవు," అంటారు జలాల్.
"కానీ ఇక్కడ జీవించేందుకు మాకు అనుమతి లేదు. మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టేస్తున్నారు," అన్నారతను
సాయుధులైన కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలు (CRPF) ఇప్పటికే సైనికీకరించబడిన ఆ ప్రాంతంలో చుట్టూ తిరుగుతున్నారు. వారి ఇంటికి సమీపంలోనే దేవాలయం వెనుక ఆవరణలో కాపలాగా నిలబడి ఉన్న వాచ్‌టవర్ వలన అక్కడ నివసించే ఈ కుటుంబాలు ఒత్తిడిని అనుభవిస్తున్నాయి. “ఇక్కడ నివసించేవారి ధృవీకరణ కోసం వివిధ ఏజెన్సీలు ప్రతి నెలా నాలుగుసార్లు ఇక్కడకు వస్తుంటాయి. మా అతిథులు గానీ బంధువులు గానీ రాత్రిపూట మా ఇంటిలోనే బస చేస్తే, వారి వివరాలను పోలీసులకు అందించడం తప్పనిసరి,” అని గుడియా చెప్పారు.
మందిరానికి సమీపంలో ఉన్న అహిరానా గల్లీ , ఇంకా మరికొన్ని రహదారులలో స్థానిక ప్రజలను వాహనాలపై వెళ్ళకుండా నిరోధించారు. బదులుగా వారు హనుమాన్ గఢీ కేంద్ర స్థానానికి వెళ్ళాలంటే సుధీర్ఘంగా సాగే చుట్టుదారిన వెళ్ళాల్సివస్తోంది.
దురాహి కుఆఁలోని వారి ఇళ్ళమీదుగా సాగే రహదారి, జనవరి 22, 2024న అట్టహాసంగా జరిగిన రామ మందిర ప్రారంభోత్సవం కోసం తండోపతండాలుగా వచ్చే రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రముఖులకు తరలివెళ్ళే మార్గంగా మారింది.
*****
ఫిబ్రవరి 5, 2024 సోమవారం నాడు, రాష్ట్ర ప్రభుత్వం 2024-25కుగాను బడ్జెట్ ను ఆవిష్కరించి, దానిని రాముడికి అంకితం చేసింది. "బడ్జెట్‌లోని ప్రతి ఆలోచన, ప్రతిజ్ఞ, ప్రతి మాటలో శ్రీరాముడు ఉన్నాడు," అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నాడు. ఈ బడ్జెట్‌లో అయోధ్యలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.1,500 కోట్లకు పైగా కేటాయించారు. ఇందులోనే పర్యాటక అభివృద్ధి కోసం రూ.150 కోట్లు, అంతర్జాతీయ రామాయణ, వేద పరిశోధనా సంస్థకు రూ.10 కోట్లు కేటాయింపులున్నాయి.
మొత్తం ఆలయ సముదాయం 70 ఎకరాల్లో విస్తరించి ఉండగా, ప్రధాన రామ మందిరం 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ మొత్తం ప్రాజెక్ట్ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (SRJTKT) నుండి నిధులు తీసుకుంటుంది. ఈ ట్రస్ట్ విదేశీ పౌరుల నుండి విరాళాలను అనుమతించే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) క్రింద నమోదు చేయబడిన కొన్ని ప్రత్యేక సంస్థలలో ఒకటి; ఈ ట్రస్టుకు విరాళాలు ఇచ్చే భారతీయ పౌరులకు పన్ను మినహాయింపులు ఉంటాయి.
అయోధ్య అభివృద్ధికి కేటాయిస్తోన్న నిధుల వరదలో కేంద్ర ప్రభుత్వ ఉదారతను చూడవచ్చు – రూ. 11,100 కోట్ల విలువైన ‘అభివృద్ధి’ ప్రాజెక్టులతో పాటు రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరించేందుకు రూ. 240 కోట్లు , కొత్త విమానాశ్రయ నిర్మాణానికి రూ.1,450 కోట్లు.
ప్రారంభోత్సవం తర్వాత మరింత ఉత్కంఠ పెరిగే అవకాశం ఉంది. "ఆలయం తెరిచిన తర్వాత అయోధ్యకు ప్రతిరోజూ 3 లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా," అని ముఖేశ్ మెశ్రామ్ చెప్పారు. ఈయన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (పర్యాటకం).
అదనపు సందర్శకుల కోసం మౌలిక సదుపాయాలను సిద్ధం చేయడంలో పాత ఇళ్ళనూ స్నేహాలనూ నిర్మూలించుకుంటూ పోయే నగరవ్యాప్త విస్తరణ ప్రాజెక్టులుంటాయి.
“ఈ వీధి మూలలో నివసిస్తున్న మా బంధువులైన ముస్లిమ్ కుటుంబానికి ఇప్పటికే పరిహారాన్ని చెల్లించారు. వారి ఇల్లు ఆలయ కంచెను తాకుతుండటంతో దాన్ని పాక్షికంగా కూల్చివేశారు,” అని ఖురేషీ కుమారుడు జమాల్ చెప్పారు. ఆలయ ట్రస్ట్ (SRJTKT) ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని యోచిస్తున్నందున, ఆలయానికి సమీపంలోని 70 ఎకరాల ఆవరణలో నివసిస్తున్న 50 ముస్లిం కుటుంబాలతో సహా దాదాపు 200 కుటుంబాలు ఇప్పుడు తొలగింపునకు చేరువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
"ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇళ్ళను ట్రస్టు కొనుగోలు చేసి ప్రజలకు తగిన పరిహారం చెల్లించింది. ఇంతకుమించి అదనంగా స్వాధీనం చేసుకునే ఎలాంటి ప్రణాళిక లేదు," అని విఎచ్‌పి నేత శరద్ శర్మ తెలిపాడు. అయితే నివాస గృహాలను, ఫకీరే రామ మందిర్ , బద్ర్ మసీదు వంటి మతపరమైన ప్రదేశాలతో సహా ఆలయ పరిసరాల్లోని భూమిని ట్రస్ట్ బలవంతంగా స్వాధీనం చేసుకుంటోందని స్థానికులు చెబుతున్నారు.
ఇంతలో ఇప్పటికే నిర్వాసితులైన యాదవులు తమ ప్రవేశ ద్వారం వద్ద రాముడి బొమ్మను వేలాడదీశారు. "మేం ఈ పోస్టర్‌ను ప్రదర్శించకపోతే, వాళ్ళు మమ్మల్ని ఇక్కడ కూడా నివసించనీయరు," అని రాజన్ చెప్పాడు. ఇల్లు కోల్పోయిన తర్వాత వేధింపులకు గురవుతోన్న తన కుటుంబాన్ని ఆదుకునేందుకు ఈ 21 ఏళ్ళ యువకుడు తన మల్లయుద్ధ (రెజ్లింగ్) శిక్షణను మధ్యలోనే వదిలేసి వచ్చేశాడు. “ప్రతి వారం అధికారులు, మరి కొంతమంది ఎవరో తెలియని వ్యక్తులు ఇక్కడకు వచ్చి, మేం గుడిసెను నిర్మించుకున్న స్థలాన్ని ఖాళీ చేయమని బెదిరిస్తారు. ఈ భూమి మా స్వంతమే అయినప్పటికీ, ఎటువంటి పక్కా నిర్మాణాలు చేయడానికి మాకు అనుమతి లేదు,” అని అతను PARIతో చెప్పాడు.
*****
“నా ఇల్లు కాలిపోతోంది. దాన్ని దోచుకున్నారు. మమ్మల్ని [కోపంతో ఉన్న గుంపు] చుట్టుముట్టింది,” డిసెంబర్ 6, 1992లో బాబ్రీ మసీదును హిందూ గుంపులు కూల్చివేసి, అయోధ్యలో ముస్లిములను లక్ష్యంగా చేసుకున్నప్పుడూ, ఆ తర్వాతా జరిగిన సంఘటనలను గురించి ప్రస్తావిస్తూ ఖురేషీ గుర్తుచేసుకున్నారు.
“అటువంటి పరిస్థితులలో, నా పరిసరప్రాంతంలోని వ్యక్తులు నన్ను దాచిపెట్టి రక్షించారు. నిజాయితీగా చెప్తున్నాను, నేను చనిపోయే వరకు దానిని మరచిపోలేను,” అది జరిగిన ముప్పై సంవత్సరాల తర్వాత ఖురేషీ ఇలా అన్నారు.
హిందువులు అధికంగా ఉండే దురాహీ కుఆఁలో నివసిస్తోన్న కొద్దిమంది ముస్లిములలో ఖురేషీ కుటుంబం కూడా ఉంది. "మేమీ ప్రదేశాన్ని విడిచిపెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇది నా పూర్వీకుల ఇల్లు. మా వారసులు ఎంతమంది ఇక్కడ నివసించారో కూడా నాకు లెక్క తెలియదు. నేను కూడా ఇక్కడి హిందువుల మాదిరిగానే స్థానికవాసిని,” తన పెరట్లో ఇనుప మంచం మీద కూర్చొని ఉన్న ఖురేషీ ఈ విలేఖరితో చెప్పారు. ఆయన తన ఇద్దరు సోదరులు, వారి కుటుంబాలతో పాటు తన స్వంత కుమారులు ఎనిమిది మంది, వారి భార్యలు, పిల్లలతో సహా ఉన్న ఉమ్మడి కుటుంబానికి పెద్ద. వెనుకనే ఉండిపోయిన తన కుటుంబానికి చెందిన 18 మందిని వారి ఇరుగుపొరుగువారు దాచిపెట్టారని ఆయన చెప్పారు.
“వారు కూడా మా కుటుంబం లాంటి వారే, ఆనందంలోనూ దుఃఖంలోనూ మాకు అండగా నిలిచారు. హిందువుగా ఉండి సంక్షోభ సమయంలో మనకు సహాయం చేయకపోతే, అలాంటి హిందుత్వాన్ని ఏం చేసుకుంటారు?" అన్నారు గుడియా సైనీ.
ఖురేషీ ఇంకా ఇలా అంటారు: “ఇది అయోధ్య. మీరు ఇక్కడి హిందువులను, ముస్లిములను కూడా అర్థంచేసుకోలేరు. ఇక్కడి ప్రజలు ఒకరితో ఒకరు ఎంత గాఢంగా కలిసిపోయారో మీరు అర్థంచేసుకోలేరు."
తమ ఇంటిని కాల్చివేసిన తరువాత, ఆ కుటుంబం ఇరుకైన ఆ భూమిలో తమ ఇంటి భాగాలను తిరిగి కట్టుకున్నారు. 60 మంది కుటుంబ సభ్యులు నివాసముండే ఆ ఇంటికి, బయలుగా ఉన్న పెరడు చుట్టూ మూడు వేర్వేరు నిర్మాణాలున్నాయి.
ఖురేషీ ఇద్దరు కుమారులు - రెండవ కొడుకైన అబ్దుల్ వాహిద్(45), నాల్గవ కొడుకైన జమాల్(35) - వెల్డింగ్ వ్యాపారాన్ని నడుపుతున్నారు. వారికి కొత్త ఆలయ నిర్మాణం దగ్గరగా కనిపిస్తుంది. "మేం ఈ లోపల 15 సంవత్సరాలు పని చేశాం. చుట్టూ 13 భద్రతా టవర్లు, 23 కంచెలను ఏర్పాటు చేయడంతో సహా అనేక వెల్డింగ్ పనులను నిర్వహిస్తున్నాం," అని జమాల్ చెప్పారు. తాము ఆర్‌ఎస్‌ఎస్, విఎచ్‌పితో పాటు అన్ని హిందూ దేవాలయాలలో కలిసి పనిచేస్తున్నామని, ఆర్‌ఎస్‌ఎస్ భవనం లోపల ఒక వాచ్ టవర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామని వాళ్ళు చెప్పారు. “ యహీ తో అయోధ్యా హై [అయోధ్య అంటే ఇదే]! హిందువులు, ముస్లిములు ఒకరితో ఒకరు కలిసి శాంతియుతంగా జీవిస్తారు, పని చేస్తారు,” అని జమాల్ చెప్పారు
వారి ఇంటి ముందు భాగం నుండే వారి దుకాణం, న్యూ స్టైల్ ఇంజనీరింగ్, పనిచేస్తుంది. తమలాంటి ముస్లిములను టార్గెట్ చేసింది ఈ మితవాద సంస్థల అనుచరులే అనే ఆక్షేపణ ఖురేషీ కుటుంబానికింకా పూర్తిగా పోలేదు. "బయటి వ్యక్తులు వచ్చి వివాదాలు రేకెత్తించినప్పుడే ఇబ్బందులు మొదలవుతాయి," అని జమాల్ పేర్కొన్నారు.
ముఖ్యంగా ఎన్నికల ఏడాదిలో ఉత్పన్నమయ్యే మతపరమైన ఉద్రిక్తతల ప్రమాదాల గురించి ఈ కుటుంబాలకు తెలుసు. "ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితులను మేం చాలాసార్లు చూశాం. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతోందని మాకు తెలుసు. ఈ ఆటలను దిల్లీ, లక్నోలలో కుర్సీ [రాజకీయ స్థానం] కోసం ఆడతారు. అయితే ఇది మా బంధాలను మార్చలేదు,” ఖురేషీ దృఢంగా చెప్పారు.
డిసెంబర్, 1992లో తన ఇంటిని తప్పించి, ఖురేషీ ఇంటిపై దాడి చేసినట్లుగా, హింసాత్మక గుంపుల దాడి నుంచి తన హిందూ గుర్తింపు తనను తాత్కాలికంగా రక్షించగలదని సైనీకి తెలుసు. "వారి ఇంట్లో మంటలు చెలరేగితే ఆ మంటలు నా ఇంటికి కూడా వ్యాపిస్తాయి," అని సైనీ పేర్కొన్నారు. అలాంటప్పుడు, “మేం అదనంగా మరో నాలుగు బకెట్ల నీటిని చల్లి మంటలను ఆర్పేస్తాం. మేం ఒకరికొకరం ఉన్నామని మాకు తెలుసు,” అంటూ ఖురేషీ కుటుంబంతో తమకున్న అనుబంధాన్ని ఆయన మళ్ళీ నొక్కిచెప్పారు.
"మేం ఒకరితో ఒకరం చాలా ప్రేమతోనూ ఆప్యాయతతోనూ జీవిస్తాం," గుడియా ముక్తాయించారు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి