ఈ ఏడాది జులైలో, అనేక రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు వరదలుగా ముంచెత్తిన కారణంగా 25,000మందికి పైగా ప్రజలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ నష్టపోయినట్టు ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్-PIL) పేర్కొంది. యమునా నది ప్రాజెక్ట్: కొత్త దిల్లీ పట్టణ ప్రాంత పర్యావరణం ప్రకారం, క్రమేపీ వరద మైదానాన్ని ఆక్రమిస్తుండటం తీవ్ర పరిణామాలను కలిగిస్తుంది, "... వరద మైదానంలోని లోతట్టు ప్రాంతాలలో నిర్మించిన నిర్మాణాలను తుడిచివేస్తుంది, తూర్పు దిల్లీని నీటితో ముంచెత్తుతుంది."
యమునా నది ఒడ్డున సుమారు 24,000 ఎకరాల భూమి సాగులో ఉంది, ఒక శతాబ్ద కాలానికి పైగా రైతులు ఈ భూములను సాగుచేస్తున్నారు. వరద మైదానాల్లో గుడి, మెట్రో స్టేషన్, కామన్వెల్త్ గేమ్స్ (సిడబ్ల్యుజి) విలేజ్ వంటి కాంక్రీట్ కట్టడాల నిర్మాణం వలన వరద నీరు ఇంకిపోయేందుకు అవసరమైన నేల పూర్తిగా తగ్గిపోయింది. చదవండి: పెద్ద నగరం, చిన్నరైతులు; ఎండిపోతున్న ఒక నది
"మనం ఏం చేసినా, ప్రకృతి తన పని తాను చేసుకుపోతుంది. ఇంతకుముందు వానల, వరదల కాలంలో నీరు అంతటా విస్తరించేది. కానీ ఇప్పుడు (వరదమైదానాల్లో) తక్కువ స్థలం ఉన్నందున అది బలవంతంగా పొంగి ప్రవహించాల్సివచ్చి, ఆ క్రమంలో మమ్మల్ని నాశనం చేస్తోంది," ఈ 2023 వరదల్లో అందుకు మూల్యం చెల్లిస్తోన్న బేలా ఎస్టేట్‌కు చెందిన కమల్ అన్నారు. "సాఫ్ కర్నీ థీ యమునా, లేకిన్ హమేఁ హీ సాఫ్ కర్ దియా (వాళ్ళు యమునను శుభ్రం చేయాల్సివుంది, కానీ బదులుగా యమునే మమ్మల్ని తుడిచిపెట్టేసింది)!"
యమునా కే కినారే వికాస్ నహీఁ కర్నా చాహియే. యే డూబ్ క్షేత్ర్ ఘోషిత్ హై. సిడబ్ల్యుజి, అక్షర్ధామ్, మెట్రో, యే సబ్ ప్రకృతి కే సాథ్ ఖిల్వాడ్ హై. ప్రకృతి కో జితనీ జగహ్ చాహియే, వహ్ తో లేగీ. పహలే పానీ ఫైల్కర్ జాతా థా ఔర్ అబ్ క్యోంకి జగహ్ కమ్ హై, తో ఉఠ్కర్ జా రహా హై, జిస్కీ వజహ్ సే నుక్సాన్ హమే హువా హై (యమునకు సమీపంలో ఉన్న వరదమైదాన ప్రాంతాన్ని అభివృద్ధి చేయరాదు. ఆ ప్రాంతం వరదలు వచ్చే ప్రాంతంగా ఇప్పటికే గుర్తింపుపొందింది. వరదమైదానాల్లో సిడబ్ల్యుజి, అక్షర్ధామ్, దేవాలయం, మెట్రో స్టేషన్ వంటివాటిని కట్టడమంటే, ప్రకృతితో ఆటలాడటంవంటిది. ఇంతకుముందు నీరు విస్తరిస్తూ వెళ్ళేది, ఇప్పుడు ఖాళీ స్థలం తక్కువగా ఉన్నందున నీటి మట్టం పెరిగిపోవడంతో అది పొంగి ప్రవహించింది. దీనివల్ల మేం నష్టపోయాం)," అంటారు కమల్.
“దిల్లీ కో కిస్నే దుబాయా (దిల్లీని ముంచేసిందెవరు)? దిల్లీ ప్రభుత్వ నీటిపారుదల మరియు వరద నియంత్రణ విభాగం ప్రతి సంవత్సరం జూన్ 15-25 మధ్య సిద్ధపడి ఉండాల్సింది. వాళ్ళు ఆనకట్ట గేట్లను (సకాలంలో) తెరిచి ఉంటే, నీరు ఇలా వరదలుగా పారేదికాదు. పానీ న్యాయ్ మాంగ్నే సుప్రీమ్ కోర్ట్ గయా (నీరు న్యాయం అడిగేందుకు సుప్రీమ్ కోర్టును చేరుకుంది)," అని రాజేంద్ర సింగ్ అన్నారు. ఆయన ఈ మాటలను సరదాగా అనలేదు.