జమిల్‌కు సన్నని జరీ (బంగారం) దారాన్ని ఉపయోగించి చేసే ఎంబ్రాయిడరీలో నైపుణ్యం ఉంది. హౌరా జిల్లాకు చెందిన ఈ 27 ఏళ్ళ కార్మికుడు ఖరీదైన వస్త్రాలకు మెరుగులు, మెరుపులూ అద్దుతూ గంటల తరబడి నేలపై కాళ్ళు ముడుచుకుని కూర్చునేవాడు. కానీ, అతను తన ఇరవైల వయసులోనే ఎముకల క్షయవ్యాధి బారిన పడడంతో, ఈ సూదీదారాలను దూరం పెట్టాల్సి వచ్చింది. ఈ వ్యాధి అతని ఎముకలను బలహీనం చేసినందువల్ల అతను ఎక్కువ సేపు కాళ్ళను మడత పెట్టుకుని కూర్చోలేడు.
“ఇది నేను పని చేయాల్సిన వయస్సు, [నా] తల్లిదండ్రులు ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. కానీ దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. నా వైద్యం కోసం వాళ్ళు పనిచేయాల్సివస్తోంది,” అని హౌరా జిల్లాలోని చెంగైల్ ప్రాంతంలో నివసిస్తూ, చికిత్స కోసం తరచూ కొల్‌కతాకు వెళ్ళే ఈ యువకుడు వాపోయాడు.
ఇదే జిల్లాలో అవిక్, తన కుటుంబంతో కలిసి హౌరాలోని పిల్‌ఖానా మురికివాడలో నివసిస్తున్నాడు. ఈ టీనేజ్ బాలునికి కూడా ఎముకల క్షయవ్యాధి ఉంది. దీనివలన అతను 2022 మధ్య నుంచి పాఠశాలకు వెళ్ళకుండా ఆగిపోవాల్సి వచ్చింది. అతనిప్పుడు కోలుకుంటున్నా, ఇప్పటికీ పాఠశాలకు వెళ్ళలేకపోతున్నాడు.
నేను 2022లో ఈ కథనాన్ని చేయడం ప్రారంభించినప్పుడు జమిల్, అవిక్, ఇంకా కొంతమందిని మొదటిసారి కలిశాను. వారి రోజువారీ జీవితం గురించి ఫొటోలు తీస్తున్న క్రమంలో వారి గురించి తెలుసుకోవడం కోసం పిల్‌ఖానా మురికివాడల్లోని వాళ్ళ ఇళ్ళకు తరచూ వెళ్ళేవాడ్ని.
ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్ళే స్తోమత లేని జమిల్, అవిక్‌లు మొదట దక్షిణ 24 పరగణాలు, హౌరా జిల్లాలలోని గ్రామీణ ప్రాంతాలలో ఒక ప్రభుత్వేతర సంస్థ రోగుల కోసం నిర్వహించే సంచార క్షయవ్యాధి వైద్యశాలకు పరీక్షల కోసం వచ్చారు. వాళ్ళలాగా చాలామంది ఇలా పరీక్షల కోసం వస్తుంటారు.






















