"నేను అనేకసార్లు 108 (అంబులెన్స్ సర్వీస్) కోసం కాల్ చేయటానికి ప్రయత్నించాను. ప్రతిసారీ ఆ లైన్ బిజీగా ఉండటమో లేదా అందుబాటులో లేకపోవటమో జరిగింది." గర్భాశయ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న అతని భార్య, మందులు వాడుతున్నప్పటికీ తీవ్రంగా జబ్బుపడింది. అప్పటికి చీకటిపడిపోయింది, ఆమె నొప్పులు ఎక్కువైపోయాయి. ఆమెకు ఎలాగైనా వైద్యసహాయం అందించాలని గణేశ్ పహారియా తీవ్రంగా కోరుకుంటున్నారు.
"చివరకు నేను సహాయం చేస్తాడనే ఆశతో స్థానిక మంత్రి సహాయకుడు ఒకరిని పట్టుకోగలిగాను. [ఎన్నికల] ప్రచారం సమయంలో అతను మాకు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు," గణేశ్ గుర్తుచేసుకున్నారు. అయితే, తానక్కడ లేనని చెప్పి ఆ సహాయకుడు తప్పించుకున్నాడు. "అతను మాకు సహాయం చేయకుండా తప్పుకున్నాడు."
కలవరపడిన గణేశ్ ఇంకా ఇలా చెప్పారు, "అంబులెన్స్ దొరికినట్టయితే, నేనామెను [పెద్ద నగరాలైన] బొకారోలోనో, రాంచీలోనో ఒక మంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళగలిగేవాడిని." అందుకు మారుగా ఆయన ఒక బంధువు వద్ద రూ. 60,000 అప్పుచేసి, తన భార్యను స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్ళాల్సివచ్చింది.
"ఎన్నికల సమయంలో వాళ్ళు - ఇది జరుగుతుంది, అది జరుగుతుంది... మేం గెలిచేందుకు సహాయపడండి - అంటూ ఎన్నో రకాల మాటలు చెపుతారు. కానీ ఆ తర్వాత, నువ్వు వాళ్ళను కలవటానికి వెళ్ళినప్పుడు వారి దగ్గర నీకోసం సమయమే ఉండదు," చెప్పారు 42 ఏళ్ళ ఆ గ్రామ పెద్ద. తన పహారియా (పహాడియా అని కూడా అంటారు) సముదాయానికి కనీస సదుపాయాలను కూడా ఈ రాజ్యం కల్పించలేదని ఆయన చెప్పారు.
పాకుర్ జిల్లా, హిరణ్‌పుర్ బ్లాక్‌లోని ఒక చిన్న కుగ్రామం ధన్‌ఘరా. ఈ గ్రామంలో పహారియా ఆదివాసీ తెగకు చెందిన 50 కుటుంబాలు నివాసముంటున్నాయి. రాజమహల్ పర్వత శ్రేణిలోని ఒక కొండ పక్కనే ఉన్న ఈ మారుమూల గ్రామానికి చేరుకోవాలంటే, పూర్తిగా పాడైపోయిన రహదారిపై ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి.
"మా ప్రభుత్వ పాఠశాల పాడుబడిపోయింది. మేం ఒక నూతన భవనం కోసం అడిగాం, కానీ అది ఎక్కడ?" గణేశ్ అడుగుతారు. సముదాయానికి చెందిన అనేకమంది పిల్లలు బడిలో చేరకపోవటంతో, రాష్ట్రప్రభుత్వ ఆదేశాల ప్రకారం మధ్యాహ్న భోజన పథకం వీరికి వర్తించదు.










