ఆ ఫిబ్రవరి మధ్యాహ్నం కొల్హాపూర్ జిల్లాలోని రాజారామ్ చక్కెర కర్మాగారం వద్ద వాతావరణం చాలా ఉక్కపోతగా, నిశబ్దంగా ఉంది. ఫ్యాక్టరీ ఆవరణలోని వందలాది ఖోప్యాలు (చెరకు కోత కూలీల గుడిసెలు) చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడికి గంట నడక దూరంలో ఉన్న వడానాగే గ్రామం దగ్గరలో వలస కూలీలు చెరకు పంట కోస్తున్నారు.
దూరం నుంచి వినవస్తోన్న లోహ పాత్రల శబ్దాలు కొంతమంది కార్మికులు ఇంటికి వచ్చి ఉండొచ్చు అని సూచిస్తున్నాయి. ఆ శబ్దాలను అనుసరిస్తూ పోతే, 12 ఏళ్ల స్వాతి మహర్నోర్ తన వాళ్లకు భోజనం తయారు చేయడానికి సిద్ధం కావడం కనిపిస్తుంది. పాలిపోయి, అలసిపోయివున్న ఆ అమ్మాయి, తమ గుడిసెలో ఒంటరిగా కూర్చుని ఉంది. ఆమె చుట్టూ వంట పాత్రలు ఉన్నాయి.
వస్తున్న ఆవలింతను ఆపుకుంటూ, ‘‘నేను తెల్లవారుజామున 3 గంటల నుంచి మేలుకుని ఉన్నా,’’ అంది ఆ అమ్మాయి.
ఈ రోజు తెల్లవారుజామున ఆ అమ్మాయి, మహారాష్ట్రలోని బావాడా తాలూకాలో చెరకు కోతలో సహాయ పడేందుకు తన తల్లిదండ్రులు, తమ్ముడు, తాతయ్యలతో కలిసి ఎద్దుల బండిపై బయలుదేరింది. ఐదుగురు సభ్యులున్న ఆ కుటుంబం రోజుకు 25 మోళీ (కట్టలు) కోయాలనేది ఒప్పందం, ఈ లక్ష్యం పూర్తి కావాలంటే అందరూ పనిచేయాలి. వాళ్లు తమ మధ్యాహ్న భోజనం కోసం ముందు రోజు రాత్రి చేసిన భక్రి (రొట్టెలు), వంకాయ సబ్జీ (కూర)ని కట్టుకుని వెళ్లారు.
తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న తమ గుడిసెకు స్వాతి మాత్రమే ఆరు కిలోమీటర్లు నడిచి మరీ వచ్చింది. "బాబా (తాతయ్య) నన్ను దింపేసి వెళ్ళాడు." 15 గంటలకు పైగా చెరకు కోసి అలసిపోయి, మరి కాసేపట్లో ఆకలితో ఇంటికి తిరిగి వచ్చే కుటుంబ సభ్యుల కోసం రాత్రి భోజనాన్ని సిద్ధం చేయడానికి ఆమె మిగతా వాళ్ల కంటే ముందే ఇంటికి వచ్చింది. "మేం (కుటుంబం) ఉదయం నుండి ఒక కప్పు టీ మాత్రమే తాగాం," చెప్పింది స్వాతి.
ఆమె కుటుంబం 2022 నవంబర్‌లో బీడ్ జిల్లాలోని సకుంద్‌వాడి గ్రామం నుండి కొల్హాపూర్ జిల్లాకు వలస వచ్చినప్పటి నుండి - గత ఐదు నెలలుగా పొలానికీ ఇంటికీ మధ్య తిరుగుతూ, చెరకు కోయడం, వంట చేయడమే స్వాతి నిత్యకృత్యం అయిపోయింది. ఫ్యాక్టరీ ఆవరణలోనే వాళ్ల నివాసం. ఆక్స్‌ఫామ్, 2020లో హ్యూమన్ కాస్ట్ ఆఫ్ షుగర్ పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం, మహారాష్ట్రలోని వలస కార్మికులు టార్పాలిన్ పైకప్పులతో తాత్కాలికంగా నిర్మించిన గుడారాలతో కూడిన పెద్ద కాలనీలలో నివసిస్తారు. ఈ కాలనీలలో తరచుగా నీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు ఉండవు.










