ప్రియమైన PARI పాఠకులకు,
ఇది www. ruralindiaonline.org లో పనిలో తీరికలేకుండా ఉన్న సంవత్సరం.
2023 ముగియబోతోన్న సందర్భంగా PARI బృందం ఒక అద్భుత దృశ్యమానమైన సంవత్సరాంతపు సమీక్షల వరుసను రూపొందించింది: రాబోయే తొమ్మిది రోజులలో ప్రతి రోజూ మేం మా సంపాదకులు ఎంపికచేసిన ఉత్తమమైన PARI – కథనాలు, కవితలు, సంగీతం, వ్యాఖ్యాచిత్రాలు, చలనచిత్రాలు, ఛాయాచిత్రాలు, అనువాదాలు, గ్రంథాలయం, ముఖాలు, సోషల్ మీడియా, విద్యార్థులతో కలిసి పనిచేయటం - ప్రచురణలను అందించబోతున్నాం.
మేం దేశవ్యాప్త కథనాలను ప్రచురించడాన్ని కొనసాగించాం. ఈ సంవత్సరం ఈశాన్య ప్రాంతాలతో సహా అనేక కొత్త ప్రదేశాల కథనాలను కూడా జోడించాం. వ్యవసాయానికి సంబంధించి మేం ప్రచురించిన వార్తాకథనాలలో ఇప్పుడు మల్లెలు, నువ్వులు, ఎండు చేపలు, ఇంకా మరి కొన్నింటిపై అపర్ణ కార్తికేయన్ నిశితంగా పరిశోధించి నివేదించిన ధారావాహిక ఉంది. మానవ-జంతు సంఘర్షణల పతనం, అభయారణ్యాల సమీపంలో నివసించే ప్రజలపై దాని అణిచివేత ప్రభావం గురించి జైదీప్ హర్దీకర్ అవిరామంగా జరిపిన అన్వేషణ ఫలితమైన, వ్యవసాయంపై ఒక గట్టి అవగాహన ఉన్న ధారావాహిక - 'ఒక కొత్త రకమైన కరువు'ను చదవవచ్చు.
తమిళనాడులోని విగ్రహాల తయారీదారులు, ట్రాన్స్ నటులు, మత్స్యకారుల వంటి సమాజానికి ఒక వారన జీవించే వ్యక్తుల మరపురాని ఛాయాచిత్రాలను పళని కుమార్ చిత్రీకరించారు. ఋతాయన్ ముఖర్జీ, ముజామిల్ భట్‌లు కశ్మీర్, లదాఖ్ ప్రాంతాలలో పశుపోషకులతో కలిసి ప్రయాణించి, ఎత్తైన పర్వత ప్రాంతాలలో మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకోడానికి వారు చేసే ప్రయత్నాలను, వారి పనినీ ఛాయాచిత్ర సహితంగా నివేదించారు. యువ క్రీడాకారులు, వలసవచ్చిన వారి పిల్లలకు విద్య, రుతుక్రమం సమయంలో ఉండే ఆంక్షలు వంటి మరెన్నో, గ్రామీణ మహారాష్ట్రలో జరుగుతోన్న అనేక అన్యాయాలను గురించి జ్యోతి శినోలి నివేదించారు. బిహార్‌కు చెందిన ముసహర్ సముదాయం గురించి, మద్యపాన సంబంధిత మరణాలపై PARI ఫెలో ఉమేశ్ కె. రే అందించిన కఠిన సత్యాలతో కూడిన నిజాయితీ గల ధారావాహిక ఉంది.
సముదాయాలకు, పరిరక్షణకు సంబంధించిన కథనాలతో మేం కొత్త పుంతలు తొక్కగలిగాం: తూర్పు హిమాలయాల్లో అంతరించిపోతున్న పక్షి బుగున్ లియోచిక్లాకు ముంచుకొస్తున్న ప్రమాదాలను, స్థానికులు ఆ సంక్షోభాన్ని తగ్గించడంలో ఎలా సహాయం చేస్తున్నారో విశాఖ జార్జ్ నివేదించారు; రాజస్థాన్‌లో అంతరించిపోతున్న బట్టమేక పక్షి గురించీ, పునరుత్పాదక ఇంధన కర్మాగారాలు స్వాధీనం చేసుకున్న పవిత్రమైన తోటలు ఇంకెంతమాత్రమూ పవిత్రమైనవి కావంటూ ప్రీతి డేవిడ్ నివేదించారు.
వార్తా కథనాల తీవ్రతను బట్టి మేం వాటికి ప్రాధాన్యం ఇచ్చాం - మహారాష్ట్రలో నిరసన తెలుపుతున్న రైతులతో కలిసి నడిచాం, ఆదివాసీలు తమ హక్కుల కోసం పాదయాత్ర చేస్తున్నప్పుడు వారితో మాట్లాడాం, అలాగే సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను కూడా కలిశాం. డిసెంబర్ 2023లో ఎన్నికలు జరుగుతోన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో పర్యటించిన పార్థ్ ఎమ్.ఎన్., ఈ రాష్ట్రాల్లో అమలవుతోన్న బుల్డోజర్ అన్యాయం గురించి, ఆదివాసులపై జరుగుతోన్న అఘాయిత్యాల గురించి, కస్టడీ మరణాల బారిన పడినవారి జీవిత వాస్తవాల గురించి రాశారు.
స్మితా ఖటోర్ ముర్షిదాబాద్‌లోని బీడీ కార్మికులపై కథనాన్ని చేస్తున్నప్పుడు ఆమెకు స్త్రీల పాటలు, పిల్లల ఆటలు వంటి చిన్నపాటి ముసాఫిర్ కథనాలు పరిచయమయ్యాయి. వ్యక్తిగత అనుభవాల ఆధారంగా కూడా కొన్ని నివేదికలు వచ్చాయి. ఉదాహరణకు, స్వయంగా ఉపాధ్యాయురాలైన మేధా కాళే వికలాంగులకు అవగాహన కల్పించే ప్రత్యేక ఉపాధ్యాయులపై దృష్టి సారించి అద్భుతమైన కథనాన్ని చేశారు. మా రిపోర్టర్లు నిశితంగా పరిశీలించడమే కాకుండా గ్రామీణ భారతదేశంలో జరుపుకునే మా బన్‌బీబీ, సైలా నృత్య, చాదర్ బాఁదినీ, పిలి వేష మొదలైన పండుగలను చూసి, ఆ వేడుకల గురించి నివేదించారు. 'ఇంతకూ ఎవరి ప్రార్థనాస్థలమిది?' వంటి కథనాలను కూడా మేం ప్రచురించాం.
PARI బృందం భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో విస్తరించి ఉన్నందున మేం అనేక అఖిలభారత స్థాయి నివేదికలను - దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్న 'గిగ్ శ్రామికులు’, అనువాదంలోని బాధలూ ఆనందాలు, వలస కార్మికులు, వారితోపాటే వలస వచ్చిన పదాలు, గ్రామీణ మహిళలు తమ 'ఖాళీ' సమయాన్ని ఎలా గడుపుతున్నారు - ప్రచురించాం. వచ్చే ఏడాది ఈ దిశగా మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నాం.






