"2020 లాక్‌డౌన్ సమయంలో కొంతమంది వ్యక్తులు మా 1.20 ఎకరాల భూమి చుట్టూ సరిహద్దు ఏర్పరచేందుకు వచ్చారు," అన్నారు ఫగువా ఉరాంవ్. ముప్పయ్యేళ్ళు దాటిన ఆదివాసీ రైతు ఫగువా, ఒక బయలు ప్రదేశం చుట్టూ ఉన్న ఇటుక గోడను చూపిస్తున్నారు. మేం ఖూంటీ జిల్లా, డుమారీ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఎక్కువగా ఉరాంవ్ సముదాయంవారు నివసిస్తుంటారు. "వాళ్ళు 'ఈ భూమి వేరేవారికి చెందినది; మీది కాదు' అని చెప్తూ భూమిని కొలవటం మొదలుపెట్టారు. మేం దాన్ని వ్యతిరేకించాం.
"ఈ సంఘటన జరిగిన 15 రోజుల తర్వాత, మేం మా గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖూంటీలోని సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ దగ్గరకు వెళ్ళాం. వెళ్ళిన ప్రతిసారీ మాకు 200 రూపాయల కంటే ఎక్కువే ఖర్చయ్యాయి. అక్కడ మేమొక న్యాయవాది సహాయాన్ని తీసుకోవలసివచ్చింది. ఆయన ఇప్పటికే మా దగ్గర నుంచి 2,500 రూపాయలు తీసుకున్నాడు. కానీ పనేమీ జరగలేదు.
"అంతకంటే ముందు, మేం మా బ్లాక్‌లో ఉన్న జోనల్ కార్యాలయానికి వెళ్ళాం. ఈ విషయంపై ఫిర్యాదు చేయటానికి పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్ళాం. మా భూమిపై హక్కును వదులుకోవాలని మాకు బెదిరింపులు వస్తున్నాయి. ఒక మితవాద తీవ్రవాద సంస్థకు చెందిన జిల్లా స్థాయి అధికారి మమ్మల్ని బెదిరించాడు. కానీ కోర్టులో మాత్రం ఎలాంటి విచారణ జరగలేదు. ఇప్పుడు మా భూమిలోకి ఈ గోడ వచ్చి నిలబడింది. ఔర్ హమ్ దో సాల్ సే ఇసీ తరహ్ దౌడ్-ధూప్ కర్ రహే హైఁ [గత రెండేళ్ళుగా మేమిలా దీని చుట్టూ పరుగులు తీస్తూనే ఉన్నాం].
"మా తాత లూసా ఉరాంవ్ ఈ భూమిని 1930లో భూస్వామి బాల్‌చంద్ సాహు దగ్గర కొన్నాడు. అదే భూమి మీద మేం వ్యవసాయం చేస్తూవస్తున్నాం. మా దగ్గర 1930 నుంచి 2015 వరకూ దీనికి సంబంధించిన పన్ను రసీదులు ఉన్నాయి. ఆ తర్వాత [2016లో] ఆన్‌లైన్ వ్యవస్థ మొదలయింది. అక్కడ ఆన్‌లైన్ రికార్డులలో మా భూమి మునుపటి భూస్వామి వారసుల పేరు మీద ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇదెలా జరిగిందో మాకు తెలియటంలేదు."
ఫగువా ఉరాంవ్, దేశవ్యాప్తంగా అన్ని భూ రికార్డులను డిజిటలైజ్ చేయడానికి, దేశంలో వాటి కోసం కేంద్రం ద్వారా నిర్వహించే డేటాబేస్‌ను రూపొందించే కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా లాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగ్రామ్ (DILRMP) కింద తన భూమిని పోగొట్టుకున్నారు. అటువంటి రికార్డులన్నింటినీ ఆధునికీకరించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం 2016 జనవరిలో జిల్లా వారీగా భూమికి సంబంధించిన సమాచారాన్ని జాబితా చేసే ఒక లాండ్ బ్యాంక్ పోర్టల్‌ను ప్రారంభించింది."భూమి/ఆస్తి వివాదాల పరిధిని తగ్గించడం, భూ రికార్డుల నిర్వహణ వ్యవస్థలలో పారదర్శకతను పెంపొదించడం" దీని లక్ష్యం.
ఫగువాకు, అతనివంటి అనేకమందికి ఇది వ్యతిరేకంగా పనిచేసింది.
"ఆన్‌లైన్‌లో భూమి స్థితిని తెలుసుకోవడానికి మేం ప్రజ్ఞా కేంద్రకు వెళ్ళాం. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా పథకం కింద రూపొందించబడిన ఈ కేంద్ర, ఝార్ఖండ్‌లో సాధారణ సేవా కేంద్రాల విభిన్న సేవలను ఒకే చోట అందించే చోటు, ఇది కొంత రుసుము తీసుకొని గ్రామ పంచాయతీలో ప్రజా సేవలను అందిస్తుంది. "అక్కడున్న ఆన్‌లైన్ రికార్డుల ప్రకారం ఆ భూమి ప్రస్తుత సొంతదారుడు నాగేంద్ర సింగ్. అతని కంటే ముందరి సొంతదారుడైన సంజయ్ సింగ్ ఈ భూమిని బిందు దేవికి అమ్మగా, ఆమె తిరిగి ఈ భూమిని నాగేంద్ర సింగ్‌కు అమ్మింది.
"ఆ భూస్వామి వారసులు అదే భూమిని మాకు తెలియకుండా రెండు మూడు సార్లు అమ్మటం కొనటం చేసినట్టుగా కనిపిస్తోంది. కానీ మా దగ్గర 1930 నుంచి 2015 వరకూ పన్ను రసీదులు ఉన్నప్పుడు ఇదెలా సాధ్యమయింది? మేం ఇప్పటివరకూ 20,000 రూపాయలు ఖర్చుపెట్టాం, ఇప్పటికీ దీని చుట్టూనే తిరుగుతున్నాం. ఈ డబ్బుల కోసం మేం మా ఇంట్లోని తిండిగింజలను అమ్ముకోవాల్సివచ్చింది. ఇప్పుడు మా భూమిలో ఉన్న ఆ గోడను చూస్తుంటే, మాకున్నదంతా పోగొట్టుకున్నట్టుగా నాకు అనిపిస్తోంది. ఈ పోరాటంలో మాకు ఎవరు సహాయం చేయగలరో మాకు తెలియటంలేదు."







