మీనాకి ఇక త్వరలోనే పెళ్ళయిపోతుంది. ఎందుకో ఆమె చెప్పింది. కొన్ని నెలల క్రితమే, “నేను ఒక సమస్య అయిపోయాను.” ఆమె పిన్ని కూతురు సోను కూడా, మీనా వంటి ‘సమస్య’ స్థాయికి వచ్చింది. మీనా ‘సమస్య’ గా మారిన కొన్ని వారాలకు సోను కూడా ‘సమస్య’ అయ్యే అర్హత సంపాదించుకుంది. ‘సమస్య’, అంటే తమ వంటి అమ్మాయిలకు రుతుక్రమం మొదలవడం.
మీనాకు 14 ఏళ్ళు, సోను కి 13 ఏళ్ళు. ఇద్దరూ చార్ పాయ్ మీద పక్కపక్కనే కూర్చున్నారు. మాట్లాడేటప్పుడు ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుతున్నారు, కానీ ఎక్కువగా ఇంటి గచ్చు వైపు కళ్ళుదించి చూస్తూ మాట్లాడుతున్నారు. కొత్త మనిషితో వారి శరీరంలోని ప్రస్తుత మార్పు - వారి నెలసరి గురించి మాట్లాడడం వారికి సిగ్గుగా ఉంది. వారి వెనుక ఉన్న గదిలో ఒక ఒంటరి మేకను తాడుతో కట్టి భూమిలోకి దింపిన ఒక చెక్కముక్కకు తాడు రెండో కొసను కట్టారు. ఉత్తరప్రదేశ్ కొరాన్ బ్లాక్ లోని బైతక్వలో అడవి జంతువులు ఆ మేకను తినేస్తాయని భయం. అందుకే దాన్ని ఇంట్లో ఉంచేస్తారు అని చెప్పారు వాళ్ళు. ఆ మేక, ఈ చిన్న ఇంట్లో మిగిలిన వారితో కలిసిపోయి ఉంటుంది.
నెలసరి అంటే సిగ్గు పడవలసిన విషయంగా ఈ అమ్మాయిలు అర్థం చేసుకున్నారు. భయపడాలని కూడా వారి తల్లిదండ్రుల ద్వారా అర్థం చేసుకున్నారు. అమ్మాయిలలో ఋతుచక్రం మొదలవగానే ఆడపిల్లల భద్రత, వారికి పెళ్లికాకుండానే గర్భం వస్తుందేమోనని ఆందోళన వలన ప్రయాగ్ రాజ్(ఇదివరకు అహ్మదాబాద్) వద్దనున్న ఈ కుగ్రామంలో వారి ఆడపిల్లలకు త్వరగా, అంటే 12 ఏళ్లకు కూడా పెళ్లి చేసేస్తారు.
“మా పిల్లలు గర్భం దాల్చేంత పెద్దయ్యాక, వారిని భద్రంగా ఎలా ఉంచగలము?”, అని అడుగుతుంది 27 ఏళ్ళ మీనా తల్లి రాణి. ఈమెకు కూడా త్వరగా పెళ్ళయిపోయి, 15 ఏళ్లకే తల్లి అయింది. సోను వాళ్ల అమ్మ చంపకి కూడా 27 ఏళ్లే, ఆమెకు కూడా ప్రస్తుతం తన కూతురు వయసులోనే - 13 ఏళ్లకే పెళ్లయిందని గుర్తుచేసుకుంది. మా చుట్టూ కూర్చున్న ఆరుగురు ఆడవారు, ఆడపిల్లలకు 13-14 ఏళ్లకే పెళ్లి అవడం అనేది మామూలు అని, అవకపోతేనే ఈ గ్రామంలో వింత అని చెప్పారు. “హమారా గావ్ ఏక్ దూస్రా జమానా మే రెహతా హై(మా గ్రామం వేరే శకంలో జీవిస్తుంది). మాకు వేరే దారి లేదు, మేము నిస్సహాయులం.” అన్నది రాణి.
బాల్యవివాహాలు ఉత్తరప్రదేశ్ లోని ఉత్తర-మధ్య బెల్ట్ వద్ద, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్గఢ్ లో రివాజుగా జరుగుతున్నాయి. 2015లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ విమెన్, UNICEF కలిసి చేసిన జిల్లా స్థాయి అధ్యయనం ప్రకారం, “మూడింటిలో రెండో వంతు జిల్లాలలో, యాభై శాతం మంది ఆడవారికి, చట్టబద్దమయిన వివాహ వయసుకు ముందే పెళ్లిళ్లు జరిగుతున్నాయి.”
బాల్యవివాహాల నిషేధ చట్టం, 2006 ప్రకారం అమ్మాయికి 18 ఏళ్ళు, అబ్బాయికి ఇంకా 21 ఏళ్లు దాటని వివాహాన్నినిషేధిస్తుంది. అలాంటి వివాహాన్ని ప్రోత్సహించినందుకు లేదా అనుమతించినందుకు రెండు సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష వేయడమే కాక లక్ష రూపాయిల వరకు జరిమానా ఉంటుంది.












