పాదాల కింద పచ్చటి గడ్డి, పైన వెల్లడిగా ఉన్న ఆకాశం, చుట్టూ ఆకుపచ్చని చెట్లు, అడవుల గుండా ప్రశాంతంగా ప్రవహించే నీటి ప్రవాహం - ఇలాంటి ప్రదేశం గ్రామీణ మహారాష్ట్రలో ఎక్కడైనా ఉండవచ్చు.
ఒక్క నిముషం, గీత ఏదో చెప్తున్నారు... ప్రవాహాన్ని చూపిస్తూ ఆమె ఇలా చెప్పారు: “మేం స్త్రీలం ఎడమవైపుకు, పురుషులు కుడివైపుకు వెళ్తాం.” కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆమె వస్తీ (బస్తీ) వాసులు చేసుకున్న ఏర్పాటది.
"వర్షాలు కురుస్తున్నప్పుడు గొడుగు పట్టుకొని చీలమండల లోతున ఉన్న నీటిలో కూర్చోవాలి. ఇక (నా) బహిష్టు సమయంలో పరిస్థితి ఎలా వుంటుందో ఏం చెప్పగలను?" 40 ఏళ్ళ గీత చెప్పారు
పుణే జిల్లా, శిరూర్ తాలూకాలోని కురుళీ గ్రామ శివారులో ఆమె నివసించే బస్తీలో 50 ఇళ్ళున్నాయి. ఇది భీల్, పార్ధీ కుటుంబాలు నివాసముండే బస్తీ. మహారాష్ట్రలో షెడ్యూల్డ్ తెగలుగా వర్గీకరించబడిన ఈ రెండు ఆదివాసీ తెగలు రాష్ట్రంలోని అత్యంత పేద, అత్యంత వెనుకబడిన సమూహాలలో భాగంగా ఉన్నాయి.
భీల్ తెగకు చెందిన గీత, ఇలా బహిరంగ ప్రదేశంలో మరుగుదొడ్డికి వెళ్లడం వల్ల తనకు ఎదురయ్యే అసౌకర్యం గురించి నిక్కచ్చిగా చెప్తున్నారు, "కూర్చున్న చోట గడ్డి గుచ్చుకుంటుంది, దోమలు కుడతాయి... ఇక ఎల్లవేళలా పాము కాటు భయం ఉండనే ఉంటుంది."
ఈ బస్తీలో నివసించేవారు అడుగడుగునా సవాళ్లను ఎదుర్కొంటుంటారు - ముఖ్యంగా మహిళలు, అడవుల్లోకి వెళ్లే మార్గంలో ఎవరైనా దాడి చేస్తారేమోననే భయంతో ఉంటారు.




