అతను చనిపోయేవరకు 22 ఏళ్ళ గురుప్రీత్ సింగ్ తన గ్రామం లో రైతులతో కలిసి రైతుల నిరసన లో భాగంగా ర్యాలీలు నిర్వహించేవాడు. ఆతని తండ్రి జగ్తార్ కటారియా, వాయువ్య పంజాబ్ లో ఐదు ఎకరాలు ఉన్న రైతు. ఆ తండ్రికి తన కొడుకు ఆఖరి ప్రసంగం గుర్తుంది. దగ్గరగా 15 మంది అతని ప్రసంగాన్ని విన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో జరిగే ఈ నిరసన చరిత్రలో నిలిచి పోతుందని అందుకు అందరూ సహకరించాలని అతను చెప్పాడు. ఈ ప్రసంగం డిసెంబర్ 2020లో అయినాక, వారు ఢిల్లీ వరకు వెళ్లి పోరాడాలని నడుము బిగించారు.
గత ఏడాది డిసెంబర్ 14న పంజాబ్‌లోని షాహిద్ భగత్ సింగ్ నగర్ జిల్లా బాలాచౌర్ తహసీల్‌లోని మకోవాల్ గ్రామం నుండి వీరంతా బయలుదేరారు. కానీ ఆ 300 కిలోమీటర్ల ప్రయాణంలో, హర్యాణాలోని అంబాలా జిల్లాలోని మోహ్రా సమీపంలోని ఒక భారీ వాహనం వారి ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది. "చాలా పెద్ద ప్రమాదమే జరిగింది. గుర్‌ప్రీత్ చనిపోయాడు, ”అని జగ్తార్ సింగ్ తన కొడుకు గురించి చెప్పాడు. గురుప్రీత్ పాటియాలాలోని మోడీ కాలేజీలో బిఎ చదువుతున్నాడు. "ఉద్యమానికి అతని ప్రాణాన్ని ఇవ్వడమే, అతను అందించిన సహకారం."
సెప్టెంబర్ 2020లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొని మరణించిన 700 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులలో గుర్‌ప్రీత్ ఒకరు. ప్రైవేట్ వ్యాపారులు, పెద్ద కార్పొరేట్లు వారి స్వంత ప్రయోజనాల కోసం, పంటల ధరలను నియంత్రించడం మొదలుపెడితే, దేశవ్యాప్తంగా ఉన్న రైతుల కనీస మద్దతు ధర (MSP) ప్రక్రియను నాశనం చేస్తాయని నమ్మిన రైతులు ఈ చట్టాలను వ్యతిరేకించారు. దీని పై నిరసన తెలిపిన రైతులు - ప్రధానంగా పంజాబ్, హర్యానా ఉత్తరప్రదేశ్ నుండి - నవంబర్ 26, 2020న ఢిల్లీ సరిహద్దుల వరకు రావలసి వచ్చింది. ఈ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, వారు ఢిల్లీ- హర్యానా సరిహద్దు అయిన సింగు, ఘజిపూర్, ఢిల్లీ-ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దు అయిన తిక్రిలో క్యాంపులు వేసుకుని ఉన్నారు.
నిరసనలు ప్రారంభమై ఒక సంవత్సరం దాటి కొంతకాలం గడిచాక, ప్రధానమంత్రి నవంబర్ 19, 2021న చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు 2021 నవంబర్ 29న పార్లమెంటులో ఆమోదించబడింది, కానీ ఈ ఆందోళన డిసెంబర్ 11, 2021న ముగిసింది. రైతు సంఘాలు పెట్టిన చాలా డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించింది.
చాలా కాలం పాటు జరిగిన ఈ ఆందోళన సమయంలో ప్రియమైన వ్యక్తులను కోల్పోయిన కొన్ని కుటుంబాలతో - వ్యక్తిగతంగాను, ఫోన్ ద్వారాను - నేను మాట్లాడాను. దుఃఖ్ఖం, విచారం, కోపం కలగలిసిన ఆ కుటుంబ సభ్యులు, లక్ష్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను గుర్తు చేసుకున్నారు.
"మేము రైతుల విజయాన్ని జరుపుకుంటాము, కానీ చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రధాని మోడీ చేసిన ప్రకటన మాకు సంతోషాన్ని కలిగించలేదు" అని జగ్తార్ సింగ్ కటారియా అన్నారు. ‘‘రైతులకు ప్రభుత్వం ఎలాంటి మేలు చేయలేదు. ఇది రైతులను, చనిపోయినవారిని అవమానించింది.”

















