“మద్య నిషేధం ఎక్కడ ఉంది?” ఘాటుగా ప్రశ్నిస్తున్న గౌరి పర్మార్ స్వరంలో వ్యంగ్యం కూడా ప్రస్ఫుటమవుతోంది.
“ఇది కేవలం వంచన, లేదా నా ఊరు బహుశా గుజరాత్‌లో లేనట్టుంది! మా గ్రామంలోని పురుషులు చాలా సంవత్సరాలుగా తాగుతున్నారు,” అని ఆవిడ అన్నారు. ఆమె నివసించే రోజిద్ గ్రామం గుజరాత్‌లోని బోటాద్ జిల్లాలో ఉంది.
భారతదేశంలో, సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న మూడు రాష్ట్రాలలో గుజరాత్ ఒకటి. ఇక్కడ ప్రజలు మద్యం కొనుగోలు చేయడం లేదా సేవించడం నిషేధం. దాన్ని తయారుచేసినా లేదా అమ్మినా, గుజరాత్ నిషేధ (సవరణ) చట్టం-2017 ప్రకారం, 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
కానీ 30 ఏళ్ళ క్రితం, వధువుగా రోజిద్‌కు వచ్చినప్పటి నుండి, ఆ నియమాన్ని ఉల్లంఘించడం చూశారు 50 ఏళ్ళ గౌరి. స్థానికంగా మద్యం తయారు చేసి, వినియోగదారులకు పాలిథిన్ కవర్లలో విక్రయించడాన్ని ఆమె చూశారు.
కల్తీ మద్యం తయారు చేయడం వల్ల కలిగే ప్రమాదాలు చాలా విస్తృతమైనవీ, ప్రాణాంతకమైనవీ కూడా. కల్తీ మద్యం తయారు చేసేటప్పుడు, సదరు ప్రక్రియను వేగవంతం చేయడానికి కొన్నిసార్లు విషపూరిత పదార్థాలను ఉపయోగిస్తారు వ్యాపారస్తులు. “వారు లిక్విడ్ శానిటైజర్, యూరియా, మిథనాల్‌లను కలుపుతారు,” గౌరి వివరించారు.
జులై 2022లో, గుజరాత్‌లో నకిలీ మద్యం తాగి 42 మంది చనిపోయారు; అహ్మదాబాద్, భావ్‌నగర్, బోటాద్ జిల్లాల్లో దాదాపు 100 మంది ఆసుపత్రి పాలయ్యారు. మరణించిన వారిలో, బోటాద్ లోని బర్వాలా తాలూకా రోజిద్ గ్రామానికి చెందిన వారు 11 మంది ఉన్నారు.








