ఈ ప్యానెల్ కనిపించే పని , కనిపించని మహిళలు అనే ఛాయాచిత్ర ప్రదర్శన (ఫోటో ఎగ్జిబిషన్) లో భాగంగా ఉంది . ఈ ప్రదర్శన గ్రామీణప్రాంతాలలో మహిళలు చేసే ఉన్నతస్థాయి పనిని వర్ణించే ఫోటోల ఎగ్జిబిషన్ . ఇందులోని ఛాయాచిత్రాలను పి . సాయినాథ్ 1993 నుండి 2002 మధ్యకాలంలో 10 భారతీయ రాష్ట్రాలలో పర్యటించి , తీశారు . అనేక సంవత్సరాల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రదర్శించబడిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను , PARI సృజనాత్మకంగా డిజిటలైజ్ చేసింది.
పశువులు ఇంటికి వచ్చేంత వరకూ…
బిహార్ మహిళలు, వారి పిడకల తయారీ ద్వారా దేశ ఆర్థికవ్యవస్ధలో బ్రహ్మాండంగా పాల్గొంటున్నారు. కాకపోతే దానికి జీడీపీ అంకెల్లో చోటు దక్కదు. పశువుల పేడను ఇంధనంగా వాడుతున్న లక్షలాది కుటుంబాలు శిలాజ ఇంధనాలవైపు గనక మళ్లితే, అదొక మహా విపత్తే. భారతదేశం విదేశీ మారకద్రవ్యాన్ని, అన్ని దిగుమతుల కన్నా ఎక్కువగా పెట్రోలియం, తదితర ఉత్పత్తుల దిగుమతుల కోసం ఖర్చు చేస్తుంది. 1991-2000 సంవత్సరంలో ఈ ఖర్చు మొత్తం రూ. 47,421 కోట్లు.
మనం ఆహారం, వంటనూనెలు, ఔషధాలు, ఫార్మా ఉత్పత్తులు, రసాయనాలు, ఇనుము, ఉక్కు దిగుమతులకు ఖర్చు చేసే మొత్తంకన్నా ఇది మూడింతలు ఎక్కువ. మనం పెట్రోలియం, తదితర ఉత్పత్తుల కోసం ఖర్చు చేసే డబ్బు మొత్తం దిగుమతుల బిల్లులో నాలుగో వంతు ఉంటుంది.
మనం ఎరువుల దిగుమతుల కోసం ఖర్చు చేసే 1.4 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యానికి ఇది దాదాపు ఎనిమిది రెట్లు. కోట్లాది మంది పంటల సాగులో వాడే పేడ ఓ ప్రధానమైన ఆర్గానిక్ ఎరువు. కాబట్టి అలా కూడా ఇది మనకు బోలెడంత డబ్బును ఆదా చేస్తుంది. అది కీటనివారిణిలా కూడా ఉపయోగపడుతుంది. ఎలా చూసినా పేడతో చాలా ఉపయోగాలే ఉన్నాయి. పేడ సేకరణ కూడా ‘మహిళల పనే.’ ఈ పని ద్వారా మహిళలు దేశానికి ఏటా కోట్లాది రూపాయల్ని, బహుశా కొన్ని బిలియన్ల డాలర్లను ఆదా చేస్తున్నారు. కానీ పేడ స్టాక్ మార్కెట్లో నమోదు కాలేదు కాబట్టి, అలాగే దీన్ని సేకరించే మహిళల జీవితాల గురించి వారికి ఏమీ తెలియకపోవడం వల్లనో లేదా పట్టించుకోకపోవడం వల్లనో, ప్రధానస్రవంతి ఆర్థికవేత్తలు దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి శ్రమను వారు చూడరు లేదా గౌరవించరని అనుకోవచ్చు.




