ఈ ప్యానెల్ కనిపించే పని, కనిపించని మహిళలు అనే ఛాయాచిత్ర ప్రదర్శన (ఫోటో ఎగ్జిబిషన్) లో భాగంగా ఉంది . ఈ ప్రదర్శన గ్రామీణప్రాంతాలలో మహిళలు చేసే ఉన్నతస్థాయి పనిని వర్ణించే ఫోటోల ఎగ్జిబిషన్. ఇందులోని ఛాయాచిత్రాలను పి. సాయినాథ్ 1993 నుండి 2002 మధ్యకాలంలో 10 భారతీయ రాష్ట్రాలలో పర్యటించి, తీశారు. అనేక సంవత్సరాల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రదర్శించబడిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను, PARI సృజనాత్మకంగా డిజిటలైజ్ చేసింది.
జీవితాలను కూడగట్టుకోవడం
ఆమె పొద్దున్నే 4.30కే లేచారు. ఒక గంట తర్వాత, ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా అడవిలో బీడీ (తెందూ) ఆకులను తెంపుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆమెవంటి వేలాదిమంది ఆదివాసీలు ఇదే పని చేస్తున్నారు. బీడీలు తయారుచేసే ఈ ఆకులను సేకరించేందుకు కుటుంబమే ఒక యూనిట్‌గా పనిచేస్తుంటారు.
రోజు బాగుంటే, ఆరుగురు సభ్యులుగల వారి కుటుంబం రూ. 90 వరకు సంపాదించవచ్చు. రానున్న మూడు నెలల్లో సంపాదించేదానికంటే ఈ తెందూ ఆకుల మంచి సీజన్ అయిన రెండువారాలలో వారు ఇంకా ఎక్కువే సంపాదిస్తారు. కాబట్టి ఈ ఆకుల కాలం తీరేవరకూ, వారు దాన్ని ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా ఉపయోగించుకోవాలి. ఈ ఆరు వారాల్లో, వారు మనుగడ కోసం కొత్త వ్యూహాన్ని రూపొందించుకోవాలి. ఈ ప్రాంతంలో నివసించే దాదాపు ప్రతి కుటుంబం ఈ సమయంలో అడవిలోనే కనిపిస్తుంది. ఆదివాసీ ఆర్థిక వ్యవస్థకు తెందూ ఆకులు చాలా ముఖ్యమైనవి.






